ప్రముఖ దేశీ వరి వంగడాల పరిరక్షకులు, సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ దేబల్ దేవ్‌కు ప్రతిష్టాత్మక అంతర్జాతీయ ‘ఐఫోమ్ ఆసియా ఆర్గానిక్ మెడల్ ఆఫ్ ఆనర్’ లభించింది. వంద దేశాల్లో సేంద్రియ వ్యవసాయదారుల సంఘాల సమాఖ్య (ఐఫోమ్) ఆర్గానిక్స్ ఆసియా విభాగం, చైనాలోని క్సిచాంగ్ కౌంటీ సంయుక్తంగా 2023వ సంవత్సరపు ఆర్గానిక్ మెడల్ ఆఫ్ ఆనర్ పురస్కారానికి డా. దేబల్ దేవ్‌ను ఎంపిక చేశాయి.
వైవిధ్యభరితమైన 1,440కు పైగా అపురూపమైన భారతీయ వరి వంగడాలను సేకరించడంతో పాటు.. ఒడిషాలోని తన చిన్న పరిశోధనా క్షేత్రంలో ప్రతి ఏటా సాగు చేస్తూ పరిరక్షిస్తున్న డా. దేబల్ దేవ్ దశాబ్దాలుగా నిస్వార్థ సేవ చేస్తున్నారు. 5 వేల డాలర్ల నగదు పురస్కారంతో పాటు ప్రశంసాపత్రం ప్రదానం చేస్తారు. డా. దేబల్ దేవ్ పరిరక్షిస్తున్న దేశీ వరి వంగడాల్లో వాతావరణ మార్పుల్ని తట్టుకొని నిలిచే వరి రకాలతో పాటు అత్యంత అరుదైన పౌష్టిక విలువలు కలిగిన రకాలు కూడా ఉండటం విశేషం.
జీన్ బ్యాంకుల్లో ఉండే పురాతన వంగడాలు శాస్త్రవేత్తల పరిశోధనలకు మాత్రమే ఉపయోగపడతాయి. అయితే, రైతుల పొలాల్లో ఏటేటా సాగవుతూ దేశీ వరి వంగడాలు వాతావరణ మార్పులకు, సరికొత్త చీడపీడలకు దీటుగా తట్టుకుంటూ రాటుదేలుతూ రైతులకు అందుబాటులో ఉంటాయి. అందువల్లనే, ఆధునిక వంగడాలెన్ని వచ్చినా ఈ అపురూపమైన పురాతన వంగడాలను సాగు చేస్తూ పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ప్రకృతి సేద్యానికి అనువైన ఈ వంగడాల ద్వారానే మన ఆహార సార్వభౌమత్వం నిలుస్తుందని డా. దేబల్ దేవ్ ‘సాక్షి సాగుబడి’తో అన్నారు.
- సాక్షి సాగుబడి డెస్క్
Comments
Please login to add a commentAdd a comment