‘గోరక్షణ’ హత్యలను సహించం
ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరిక
► గాంధీ, వినోబా భావే కన్నా గొప్ప గోరక్షకులు లేరు
► గోభక్తి పేరుతో హింసకు పాల్పడటం సరికాదు
► ‘సబర్మతి’ శతాబ్ది ఉత్సవాల ప్రారంభోత్సవంలో ప్రధాని
అహ్మదాబాద్: గోరక్షణ, మూక దాడుల పేరుతో జరిగే హత్యలను ఆమోదించే ప్రసక్తే లేదని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే హక్కు ఎవరికీ లేదని హెచ్చరించారు. గాంధీజీ సబర్మతి ఆశ్రమాన్ని నిర్మించి వందేళ్లు అయిన సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమాలను మోదీ గురువారం ఇక్కడ ప్రారంభించారు. ‘గోభక్తి పేరుతో హింసను ప్రేరేపించటం.. మహాత్మాగాంధీ ఆలోచనకు పూర్తి వ్యతిరేకం’ అని తర్వాత బహిరంగసభలో అన్నారు.
ఇటీవలి కాలంలో దేశవ్యాప్తంగా పెరుగుతున్న హింసాత్మక ఘటనలపై ప్రధాని తీవ్రంగా స్పందించారు. ఇలాంటి ఘటనల వల్ల సాధించేదేమీ ఉండదని స్పష్టం చేశారు. ‘నేడు సబర్మతి ఆశ్రమంలో ఉండి ఈ విషయంపై మాట్లాడటం బాధగా ఉంది. చీమలు, వీధికుక్కలు, చేపలకు ఆహారం వేసే గొప్ప సంస్కృతి ఉన్న దేశం మనది. ఈ గడ్డపైనే మహాత్ముడు మనకు అహింసా పాఠాలు నేర్పారు. కానీ ఇప్పుడేమైంది? ఆపరేషన్ విఫలం కావటంతో రోగి చనిపోతే.. బంధువులు ఆసుపత్రిని తగలబెడుతున్నారు. డాక్టర్లను చితగ్గొడుతున్నారు. ప్రమాదాన్ని ప్రమాదంగానే చూడాలి. ప్రమాదంలో ఎవరో చనిపోతేనో గాయపడితేనో కొందరు కలిసి వాహనాలు తగులబెడుతున్నారు’ అని మోదీ ఆవేదన వ్యక్తం చేశారు.
చంపే హక్కు ఎవరికీ లేదు!
‘గోరక్ష, గోపూజలో మహాత్మాగాంధీ, ఆయన అనుచరుడు వినోబా భావేను మించినవారు లేరు. గోరక్ష ఎలా చేయాలో వారే మనకు నేర్పించారు. దేశమంతా వీరి మార్గాన్నే అనుసరించింది. భారత రాజ్యాంగం కూడా గోరక్ష గురించి చెబుతోంది. కానీ దీన్ని అడ్డం పెట్టుకుని ఓ వ్యక్తిని చంపే హక్కుందా? ఇదేనా గోభక్తి? ఇదేనా గోరక్ష?’ అని ప్రశ్నించారు. గోభక్తి పేరుతో మనుషులను చంపటం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదన్నారాయన.
‘గాంధీ కలలుగన్న భారతాన్ని నిర్మించేందుకు అందరం కలిసి పనిచేద్దాం. మన స్వాతంత్య్ర సమరయోధులు గర్వపడేలా భారతదేశాన్ని మార్చుకుందాం’ అని మోదీ పిలుపునిచ్చారు. గోవుకు సంబంధించి తన జీవితంలో జరిగిన ఓ ఘటనను మోదీ గుర్తుచేశారు. గోరక్ష విషయంలో చనిపోయేందుకైనా చనిపోవాలని వినోబా భావే సూచించారన్నారు. సబర్మతి శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఆశ్రమం మొత్తం పరిశీలించిన మోదీ.. మహాత్ముడి గొప్పదనాన్ని, అహింసా వాదాన్ని సూచించే పోస్టల్ స్టాంపును విడుదల చేశారు. తర్వాత రాజ్‌కోట్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో 18,500 మంది దివ్యాంగులకు సహాయక పరికరాలందించారు.