రియాద్: మిస్సైల్స్ దాడులతో ఆదివారం అర్థరాత్రి సౌదీ అరేబియా గడగడలాడిపోయింది. పొరుగున ఉన్న యెమెన్ నుంచి బాలిస్టిక్ మిస్సైళ్ల ప్రయోగంతో అంతా వణికిపోయారు. అయితే సౌదీ ఎయిర్ ఫోర్స్ వాటిని గాల్లోనే అడ్డగించటంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ క్రమంలో గాల్లోనే క్షిపణులు పేలిపోగా.. ప్రజలు మాత్రం వణికిపోయారు. ‘హౌతీ రెబల్స్ వర్గం గత రాత్రి రియాద్ నగరంపై రెండు బాలిస్టిక్ మిస్సైళ్లను ప్రయోగించింది. అయితే సైన్యం ఆ దాడులకు ధీటుగా తిప్పి కొట్టింది’ అని అధికారిక టెలివిజన్ ఛానెల్ ‘అల్ ఎఖాబారియా’ కథనాలు ప్రసారం చేసింది. అయితే ప్రాణ, ఆస్తినష్ట వివరాలను మాత్రం వెల్లడించలేదు. మరోవైపు ఏఎఫ్‌పీ జర్నలిస్ట్ నాలుగు భారీ పేలుళ్ల శబ్ధాలను విన్నట్లు చెబుతుండగా, స్థానికులు మాత్రం ఆ సంఖ్య ఎక్కువే అని అంటున్నారు.
అయితే రియాద్ సైన్యం తమ మిస్సైళ్లను కూల్చలేదని, తాము ప్రయోగించిన మిస్సైళ్లు లక్ష్యాలను చేరుకోలేకపోయాయని రెబల్ గ్రూప్ ప్రతినిధి ఒకరు ప్రకటించారు. ఇదిలా ఉంటే సౌదీ అరేబియా, యూఏఈ, ఇతర మిత్ర పక్షాలు.. ఉత్తర యెమన్‌ను దిగ్బంధించిన హౌతీ మిలిటెంట్లు ఆయుధాలను అప్పగించేంత వరకూ దాడులు కొనసాగిస్తామని అరబ్ లీగ్ శిఖరాగ్ర సదస్సులో నిర్ణయించిన విషయం తెలిసిందే. అమెరికా కూడా మిత్రపక్షాల వైపు నిలిచి దాడులకు ఎగదోస్తోంది కూడా. అసలే అంతర్యుద్ధంతో(రాజకీయ సంక్షోభం) సతమతమవుతున్న యెమెన్‌కు ఈ దాడులు మరింత ఇబ్బందికరంగా మారాయి.
అయినప్పటికీ హౌతీ రెబల్స్ మాత్రం సౌదీపై ఎదురు దాడి చేస్తూ వస్తోంది. పరస్సరం క్షిపణుల దాడులతో ఇరు దేశాలు దాడులు చేసుకుంటున్నాయి. మరోవైపు సౌదీ అరేబియాపై దాడులకు యెమెన్‌కు ఇరాన్ సహకరిస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే హౌతీ తిరుగుబాటుదారులకు ఆయుధాలను, ఖండాంతర క్షిపణులను సరఫరా చేయాల్సిన అవసరం తమకు లేదని, హౌతీలు సొంతంగా అభివృద్ధి చేసుకునే స్థాయికి ఎదిగారని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ (ఐఆర్జీ) స్పష్టం చేసింది. యెమెన్, ఇరాన్ దేశాల సరిహద్దు ఇప్పటికే మూతపడ్డ విషయాన్ని ఐఆర్జీ ఈ సందర్భంగా గుర్తు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment