
ఈనెల రెండో తేదీన ఎంబసీలోకి వెళ్తున్న ఖషొగ్గీ (ఎడమ), పదో తేదీన బయటికొస్తున్న నకిలీ వ్యక్తి (కుడి)
టర్కీలోని సౌదీ అరేబియా దౌత్య కార్యాలయంలో వాషింగ్టన్ టైమ్స్ జర్నలిస్ట్ జమాల్ ఖషోగ్గీ అనుమానాస్పద మరణం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఖషోగ్గీ మృతితో తమకు సంబంధం లేదని మొదట ప్రకటించిన సౌదీ.. ఆ తరువాత మాటమార్చి ఎంబసీలోనే ఓ గొడవలో ఆయన మరణించాడంది. అయితే, తనపై విమర్శనాత్మక కథనాలు రాసినందున ఖషోగ్గీని సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ చంపించాడని ప్రపంచమంతా కోడై కూస్తోంది. ఈ నేపథ్యంలో ఖషోగ్గీ మరణంపై పలు వివరాలు..
ముడి చమురుపై ప్రభావం
ప్రఖ్యాత జర్నలిస్ట్ జమాల్ ఖషోగ్గీ మరణం ప్రభావం అంతర్జాతీయ స్థాయిలో ముడిచమురు ధరలపై కూడా పడనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అగ్రరాజ్యం అమెరికా ఇరాన్‌పై పలు ఆంక్షలు విధించిన నేపథ్యంలో ఆ దేశం చమురు ఉత్పత్తులకు ఇప్పటికే డిమాండ్ భారీగా తగ్గిపోయింది.
రోజుకు ఏడు లక్షల బ్యారెళ్ల చమురు ఉత్పత్తి ఇప్పటికే తగ్గిపోగా.. వచ్చేనెల 4 నుంచి అమెరికా రెండో విడత ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. దీంతో వచ్చే ఏడాదికల్లా ఇరాన్ చమురు ఉత్పత్తి మరో 9 లక్షల బ్యారెళ్లు (రోజుకు) తగ్గిపోనుంది. అత్యధిక చమురు నిల్వలు ఉన్న సౌదీ అరేబియా ఉత్పత్తి పెంచకపోతే ధరలు కొండె క్కుతాయి. ఈ నేపథ్యంలో సౌదీ తను చెప్పినట్లు నడుచుకునేలా చేసేందుకు అమెరికా ఖషోగ్గీ ఉదంతాన్ని వాడుకుంటోందని భావిస్తున్నారు.
టర్కీ రాజకీయం
ఖషోగ్గీ హత్యకు సౌదీ అరేబియా ప్రణాళికలు రచించిందని టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ ప్రకటించడం మధ్యప్రాచ్య రాజకీయాలకు నిలువు టద్దమని విశ్లేషకులు అంటున్నారు. ముస్లిం బ్రదర్‌హుడ్‌కు చెందిన ఈజిప్ట్ మాజీ అధ్యక్షుడు మహమ్మద్ మోర్సీ మరణం నేపథ్యంలో టర్కీ సౌదీ అరేబియాకు వ్యతిరేకంగా నిలబడిన విషయం తెలిసిందే.
సౌదీ విరోధి ఖతార్‌తో నెయ్యం.. మోర్సీ మరణానంతరం అతడి అనుచరులకు ఆశ్రయం కల్పించడం టర్కీ ఎత్తుగడలకు అద్దం పడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఖషోగ్గీ మరణం టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్‌కు అనుకోని అవకాశంగా కలిసివచ్చింది. అందువల్లనే ఎర్డోగాన్ స్వయంగా సౌదీ యువరాజుపై హత్యారోపణలకు సిద్ధమయ్యారని.. తద్వారా మధ్యప్రాచ్యంలో సౌదీ ఆధిపత్యాన్ని తోసిరాజని టర్కీని ముస్లిం రాజ్యానికి కేంద్ర బిందువుగా మార్చాలని యత్నిస్తున్నారని అంచనా.
టైగర్ స్క్వాడ్
తనకు వ్యతిరేకంగా గొంతెత్తే ఎవరినైనా మట్టుబెట్టేందుకు సౌదీ అరేబియా యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ ఓ ప్రత్యేక సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నట్లు వార్తలున్నాయి. ‘ఫిర్కత్ – ఏ– నెమ్ర్’ లేదా టైగర్ స్క్వాడ్ అని దీనికి పేరు. నిఘా, మిలటరీ వర్గాల్లో అత్యున్నత సామర్థ్యం చూపిన 50 మందితో ఈ ప్రైవేట్ సైన్యం ఏర్పడిందని, ‘మిడిల్ ఈస్ట్ ఐ’ అనే పత్రిక వెల్లడించింది. ఖషోగ్గీని చంపేందుకు ఈ బృందంలోని 15 మంది టర్కీ వెళ్లారని తెలిపింది.
మాహెర్ అబ్దుల్ అజీజ్ ముత్రిబ్ టైగర్‌స్క్వాడ్‌కు వెన్నెముకలాంటి వాడని.. నిఘా వర్గానికి చెందిన మేజర్ జనరల్ అహ్మద్ అల్ అస్సిరీ ఆదేశాల మేరకు ప్రత్యేక బృందం ఖషోగ్గీని అంతమొందించిందని వార్తలున్నాయి. తనను విమర్శించే వారి చేతులు తెగనరుకుతానని మహమ్మద్ బిన్ సల్మాన్ తరచూ చెప్పేవాడని.. అందుకు తగ్గట్టుగానే ఖషోగ్గీ మృతిని ధ్రువీకరించేందుకు టైగర్‌స్క్వాడ్ అతడి చేతి వేళ్లను యువరాజుకు చూపిందని ‘మిడిల్ ఈస్ట్ ఐ’ పేర్కొంది.
టర్కీకి సీఐఏ డైరెక్టర్
వాషింగ్టన్: ఖషోగ్గీ అనుమానాస్పద మృతిపై సమాచారం సేకరించేందుకు అమెరికా కేంద్ర నిఘా సంస్థ(సీఐఏ) డైరెక్టర్ గినా హాస్పెల్‌ను అధ్యక్షుడు ట్రంప్ టర్కీకి పంపారు. టర్కీ నుంచి పూర్తి సమాచారం లభించిన తరువాతే ఈ వ్యవహారంలో అధికారికంగా స్పందిస్తానని ట్రంప్ చెప్పారు. సౌదీ అరేబియాతో కుదుర్చుకున్న భారీ ఆయుధ ఒప్పందాన్ని రద్దుచేసుకోబోమని వెల్లడించారు.
ఇస్తాన్‌బుల్‌లోని సౌదీ అరేబియా దౌత్య కార్యాలయంలో అక్టోబర్ 2న ఖషోగ్గి హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా, ఖషోగ్గి హత్యకు సౌదీ అరేబియా చాన్నాళ్ల క్రితమే ప్రణాళికలు రచించిందని టర్కీ అధ్యక్షుడు రీసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ మంగళవారం ఆరోపించారు. ఈ హత్యతో సంబంధమున్న వారి వివరాల్ని బయటపెట్టాలని డిమాండ్ చేశారు. మరోవైపు, సౌదీ రాజు సల్మాన్, యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్‌లు రియాద్‌లో ఖషోగ్గీ కుటుంబ సభ్యులను కలుసుకున్నట్లు వార్తలు వచ్చాయి.
Comments
Please login to add a commentAdd a comment