సకాలంలో కాలేయాన్నికాపాడుకోండి! | Story About Fatty Liver Problems And Solutions | Sakshi
Sakshi News home page

సకాలంలో కాలేయాన్నికాపాడుకోండి!

Published Thu, Jan 21 2021 9:31 AM | Last Updated on Thu, Jan 21 2021 9:31 AM

Story About Fatty Liver Problems And Solutions - Sakshi

మారుతున్న జీవనశైలిలో భాగంగా ఒకేచోట కూర్చుని చేసే వృత్తుల కారణంగానైనా... లేదా మన జీవనశైలిలో ఈ మధ్యకాలంలో విపరీతంగా పెరిగిన ఆల్కహాల్‌ తీసుకోవడం వల్లనైనా ఇటీవల ఫ్యాటీలివర్‌ డిసీజ్‌ బాగా ఎక్కువగా కనిపిస్తోంది. ఇందులోనూ గ్రేడ్‌లో ఉంటాయి. మొదటి లేదా రెండో గ్రేడ్‌ వరకు కేవలం మంచి ఆరోగ్యకరమైన నడవడిక, మన జీవనశైలిలో భాగంగా ఆరోగ్యకరమైన అలవాట్లు, వ్యాయామంతో మొదటి, రెండో దశలోని ‘ఫ్యాటీ లివర్‌’ కండిషన్‌ను తేలిగ్గా అధిగమించవచ్చు. కానీ అంతకు మించి దాటితే మాత్రం కాలేయం పూర్తిగా కొవ్వుతో నిండిపోయి మొదటికే మోసం రావచ్చు. అప్పుడు కాలేయ మార్పిడి తప్ప మరో మార్గ ఉండకపోవచ్చు. అందుకే సకాలంలోనే గుర్తించి మొదటి లేదా రెండో దశలోనే ‘ఫ్యాటీ లివర్‌’ను నిలువరించాలి. ఫ్యాటీ లివర్‌ అంటే ఏమిటి, దానికి కారణాలేమిటి, దానితో వచ్చే అనర్థాలేమిటి వంటి అనేక అంశాపై అవగాహనను కలిగించేదే ఈ కథనం. 

ఈ మధ్యకాలంలో మన జీవనశైలిలో నగరీకరణ /పట్టణీకరణ జరుగుతున్న కొద్దీ మనం తీసుకునే ఆహారంలో క్యాలరీ లు చాలా ఎక్కువగా ఉండటం, చక్కెరలు ఎక్కువగా ఉండే ఆహారాలు పెరుగుతున్నాయి. దానికి తోడు శారీరక శ్రమ ఎంతమాత్రమూ లేని వృత్తులే అన్నిచోట్లా ఉన్నాయి. ఫలితంగా స్థూలకాయం, డయాబెటిస్‌తో పాటు ఫ్యాటీలివర్‌ అనే కండిషన్‌ చాలామందిలో చాలా ఎక్కువగా కనిపిస్తుంది. 

ఫ్యాటీ లివర్‌ అంటే...
మన పొట్టలో కుడిపైపున కాలేయం ఉంటుంది. మనం తీసుకుంటున్న ఆహారంలో క్యాలరీలు, చక్కెరలు పెరుగుతున్న కొద్దీ శరీర శ్రమకు వినియోగమైనవి పోగా... మిగతావన్నీ కాలేయంలో కొవ్వు రూపంలో నిల్వ అవుతాయి. దాంతో క్రమంగా కాలేయం కణాలు తమ సహజ గుణాన్నికోల్పోయి కొవ్వు పేరుకున్నట్లుగా అయిపోతుంటాయి. ఇలాంటి కండిషన్‌నే ఫ్యాటీలివర్‌ అంటారు. 

ఫ్యాటీలివర్‌... దశలు...
ఫ్యాటీలివర్‌లో మూడు దశలు ఉంటాయి. 

  1. మొదటి దశ : ఇది సాధారణ ఫ్యాటీ లివర్‌ వ్యాధి. ఇందులో కాలేయ కణాల మధ్య కొద్దిగా మాత్రమే కొవ్వు పేరుకుంటుంది. 
  2. రెండో దశ: ఈ దశను నాష్‌ (ఎన్‌ఏఎస్‌హెచ్‌) అంటారు. ఇందులో కాలేయం కొద్దిగా దెబ్బతింటుంది. కొన్ని కాలేయ కణాలు సైతం నశిస్తాయి. కొవ్వుల పాళ్లు ఎక్కువగా ఉంటాయి. 
  3. మూడో దశ : ఈ దశలో సిర్రోసిస్‌ వస్తుంది. అంటే కాలేయం పూర్తిగా తన స్వరూపాన్ని కోల్పోతుంద. పూర్తిగా కొవ్వులు నిండినట్లుగా అయిపోతుంది. ఈ దశలో  కాలేయ మార్పిడి తప్ప వేరే ప్రత్యామ్నాయం ఉండదు. ఇది జరగకపోతే రోగి మనుగడే అసాధ్యం అవుతుంది. 

కారణాలివి... 
ఫ్యాటీలివర్‌లో మన ప్రమేయంతో నివారించుకోగలిగే కారణాలతో పాటు మనం నివారించలేని కారణాలూ ఉంటాయి. 

నివారించగల కారణాలు 
ఉదాహరణకు మద్యం అలవాటు ఉన్నవారిలో ఫ్యాటీ లివర్‌ కండిషన్‌ ఎక్కువ. మద్యం అలవాటును మానుకోవడం అన్నది మనం నివారించుకోగలిగే అంశం. అలాగే బరువు తగ్గించుకోవడం కూడా కొంతవరకు మన చేతుల్లో ఉన్నదే. ఇక మనం తీసుకునే ఆహారంలో కార్బోహైడ్రేట్స్‌ (పిండిపదార్థాలు) తీసుకోవడం కూడా మనం నివారించుకోగలిగే అంశమే.  

నివారించుకోలేని కారణాలు 
మంచి జీవనశైలి మార్గాలతో వాటిని కొంతవరకు మాత్రమే నివారించగలిగినప్పటికీ డయాబెటిస్, నివారించుకోలేనంత బరువు పెరగడం అన్నవి మనం ప్రయత్నపూర్వకంగా నివారించలేని కారణాలు. శరీరం బరువు పెరుగుతున్న కొద్దీ కాలేయానికి నష్టం వాటిల్లుతుందని అనేక అధ్యయనాల్లో తేలింది. స్థూలకాయం ఉన్న 90 శాతం మందిలో మొదటి దశ ఫ్యాటీలివర్‌ కనిపించడం చాలా సాధారణ అంశం. అలాగే స్థూలకాయం ఉన్న 20 శాతం వ్యక్తుల్లో మనం రెండో దశగా పేర్కొనే ఎన్‌ఏఎస్‌హెచ్‌ దశ ఉంటోంది. ఫ్యాటీ లివర్‌ వచ్చిన వ్యక్తుల్లో దాదాపు 50 శాతం మందిలో డయాబెటిస్‌ ఉంటుంది. ఇక సిర్రోసిస్‌ దశకు చేరినవారిలో 95% మంది డయాబెటిస్, స్థూలకాయం ఉన్నవారే. 

ఫ్యాటీలివర్‌ వల్ల పరిణామాలు  
ఫ్యాటీ లివర్‌ వ్యాధి వచ్చాక తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే కాలేయం పూర్తిగా దెబ్బతినిపోయే సిర్రోసిస్‌ లేదా లివర్‌ క్యాన్సర్‌ వంటి ప్రమాదకరమైన పరిస్థితులకు దారితీయవచ్చు. 
ఫ్యాటీ లివర్‌ దశల్లో మొదటిదశ నుంచి క్రమంగా రెండో దశ అయిన ఎన్‌ఏఎస్‌హెచ్‌కూ, అక్కడి నుంచే మూడో దశ అయిన సిర్రోసిస్‌కు దారి తీస్తుందని అనుకోడానికి లేదు. చాలా సందర్భాలలో పరిస్థితులు మొదటి దశ నుంచి నేరుగా మూడో దశ అయిన సిర్రోసిస్‌కు దారితీయవచ్చు. అందుకే ఫ్యాటీలివర్‌ కనిపించినప్పుడే జాగ్రత్తగా ఉండాలి. 

ఫ్యాటీ లివర్‌ నివారణ మార్గాలు  

  • బరువు నియంత్రించుకోండి: మీరు ఉండాల్సిన దాని కంటే ఎక్కువగా బరువు ఉంటే మీ ఆహారంలో పిండి పదార్థాలను తగ్గించుకోవాలి. 
  • ఆరోగ్యకరమైన ఆహారం: ఆహారంలో విధిగా తాజా ఆకుకూరలూ, కూరగాయలు, పండ్లు ఉండేలా జాగ్రత్త తీసుకోండి. నెయ్యి వంటి కొవ్వు పదార్థాలకు దూరంగా ఉండండి. మాంసాహారంలో రెడ్‌మీట్‌కు బదులు స్కిన్‌ లేని చికెన్, చేపలు వంటివి తీసుకోండి. నూనెల్లో మంచినూనెకు బదులు ఆలివ్‌ ఆయిల్‌ వాడడం మేలు. పొట్టుతీయని తృణధాన్యాలు ఎక్కువగా వాడాలి. పాలిష్‌ చేసిన వాటికి బదులుగా పొట్టు తీయని బియ్యం, గోధుమలు ఎక్కువగా తీసుకోండి. 
  • డయాబెటిస్‌ను తప్పకుండా అదుపులో ఉంచుకోవాలి. 
  • కొలెస్ట్రాల్‌ తగ్గించుకోండి. ఇందుకోసం వ్యాయామంతో పాటు ఒకవేళ అవసరమైతే మందులు కూడా వాడాల్సి ఉంటుంది. 
  • దురలవాట్ల నుంచి దూరంగా ఉండండి: ఆల్కహాల్‌కు తప్పనిసరిగా దూరంగా ఉండాలి. 
  • వ్యాయామం
  • ప్రతిరోజూ కనీసం 30 నిమిషాలకు తక్కువ కాకుండా వ్యాయామం చేయండి. శారీరక శ్రమ చేయడానికి అవకాశం ఉన్న చోట్ల ఒంటికి పని చెప్పండి. అంటే లిఫ్ట్‌కు బదులు మెట్లు ఉపయోగించడం, కొద్దిపాటి దూరాలకు వాహనం ఉపయోగించకపోవడం మంచిది.  

ఫ్యాటీలివర్‌ డిసీజ్‌ లక్షణాలు 

  • ∙తొలిదశల్లో సాధారణంగా ఫ్యాటీలివర్‌ రోగుల్లో ఎలాంటి లక్షణాలు కనిపించవు. అయితే అల్ట్రా సౌండ్‌ స్కానింగ్‌ చేయించుకున్నవారిలో ఇది ఉన్నట్లు తెలుస్తుంది. 
  • ∙కొందరికి కుడివైపు పొట్ట పైభాగంలో (రిబ్‌కేజ్‌ కింద) పొడుస్తున్నట్లుగా నొప్పి వస్తుంటుంది. కాలేయం క్రమంగా పెరుగుతుండటం వల్ల కనిపించే పరిణామం ఇది. 

ఫ్యాటీలివర్‌ నిర్ధారణ పరీక్షలు 
అల్ట్రాసౌండ్‌ అబ్డామిన్‌ స్కానింగ్‌తో చాలావరకు ఫ్యాటీలివర్‌ డిసీజ్‌ తెలుస్తుంది. దానితోపాటు లివర్‌ ఫంక్షన్‌ పరీక్ష చేయించాలి. దానితో ఏవైనా ఎంజైములు స్రవించడం వల్ల కాలేయం దెబ్బతిన్నదా అన్న సంగతీ తెలుస్తుంది. డయాబెటిస్, కొలెస్ట్రాల్‌ స్థాయులు, ట్రైగ్లిజరైడ్‌ పెరుగుదలనూ పరిశీలించే పరీక్షలు చేయించాలి. కొందరిలో లివర్‌ బయాప్సీ అవసరం. 

ఫ్యాటీ లివర్‌ వ్యాధికి చికిత్స 

  • ఆల్కహాల్‌ అలవాటు ఉన్నట్లయితే అది పూర్తిగా మానేయాలి. ఒకవేళ ఆల్కహాల్‌ లేనివారిలో కనిపిస్తే వారి జీవనశైలిలో మార్పులు, ఆహారంలో మార్పులు, వ్యాయామం వంటి మార్గాలను తప్పక అనసరించాలి. 
  • చాలా కొద్దిమందిలో మందులు, శస్త్రచికిత్స అవసరం కావచ్చు. ∙రోగి వాడుతున్న ఏవైనా మందుల వల్ల ఫ్యాటీ లివర్‌ వ్యాధి వచ్చిందేమో అని పరిశీలించి దానికి అనుగుణంగా మందులను మార్చడం వంటి జాగ్రత్తలు తీసుకుంటారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement