మూత్రపిండాల ఆరోగ్యాన్ని దెబ్బతీసే వాటిల్లో ప్రధానమైనవి కొందరు తాము రోజూ అలవాటుగా తీసుకునే మద్యం. దాంతో పాటు మనం డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ లేకుండా తీసుకునే ఆన్ కౌంటర్ మందులు కూడా. ఈ రెండిటిలోనూ చీప్‌లిక్కర్ అన్నది కిడ్నీలను దెబ్బతీస్తుందని మనం చాలాసార్లు వింటూనే ఉంటాం. చాలా మంది కిడ్నీ బాధితుల్లో ఇదో ప్రధానమైన కారణం. సాధారణంగా మన రక్తంలోని మలినాలను శుభ్రపరచడం అన్నది కిడ్నీల పని కదా. చీప్‌లిక్కర్‌లో మత్తును సమకూర్చడానికి వేసే వివిధ రకాల రసాయనాలు, యూరియా వంటి వాటిని రక్తం నుంచి ఒంట్లోంచి తొలగించడానికి కిడ్నీలు తమ సామర్థ్యానికి మించి కష్టపడతాయి.
అవెంతగా కష్టపడతాయంటే... అలా మలినాలనూ, కాలుష్యాలనూ తొలగిస్తూ, తొలగిస్తూ, తమ సామర్థ్యాన్ని క్రమంగా కోల్పోతుంటాయి. దాంతో ఒక దశలో అవి కాలుష్యాలనే తొలగించలేని స్థితికి చేరుకుంటాయి. దీన్నే కిడ్నీ ఫెయిల్యూర్‌గా చెబుతుంటారు. ఇదే పరిణామం మద్యం వల్ల కూడా వస్తుంది. వాస్తవానికి మద్యం అంటేనే కూడా బాటిలెత్తు కాలుష్యం. దాంతో ఆ కలుషిత పదార్థాలను తొలగించే ప్రక్రియను నిరంతరాయం చేస్తూ చేస్తూ కిడ్నీలు అలసిపోతాయి. ఇక ఆన్ కౌంటర్ డ్రగ్స్‌గా మనం పేర్కొనే మందులతోనూ ఇదే అనర్థం కలుగుతుంది. ఆ మందులలోని మలినాలను తొలగించడానికి కిడ్నీలు కష్టపడతాయి. మందులలోని ఆ మాలిన్యాలను తొలగించేలోపే మళ్లీ వేసుకున్న మందులలోని కాలుష్యాలు మూత్రపిండాలను దెబ్బతీస్తాయి. గంటకు 12 లీటర్లను మాత్రమే శుభ్రపరచగలిగే ఈ కిడ్నీలు మరి అంతటి కాలుష్యాల పోగులను
శుభ్రం చేయాలంటే ఎంత కష్టం?
అందుకే అంతటి కష్టాన్ని భరించలేనంతటి భారం వాటిమీద పడుతున్నప్పుడు మూత్రపిండాలకు ‘క్రానిక్ కిడ్నీ డిసీజ్’ (సీకేడీ) లాంటి జబ్బులు వస్తాయి. అవి కిడ్నీ ఫెయిల్యూర్ లాంటి కండిషన్‌లకు దారితీస్తాయి. అలాంటప్పుడు కృత్రిమంగా కేవలం కొద్దిమేరకు అంటే మనిషి జీవించి ఉండగలిగే మేరకు మాత్రమే ఒంట్లోని కాలుష్యాలను యంత్రాల సహాయంతో తొలగించే ప్రక్రియ అయిన ‘డయాలసిస్’తో నిత్యం నరకబాధలను చూస్తూ రోజులు రోజుల ప్రాతిపదికన రోగులు తమ ప్రాణాలను దక్కించుకుంటూ ఉంటారు. ఇలాంటి బాధలేమీ పడకుండా నిండా ఆరోగ్యంతో నిండు నూరేళ్లు జీవితం గడపాలంటే మద్యం అలవాటు మానేయాలి. అలా రెండంటే రెండు కిడ్నీలను పదిలంగా చూసుకోవాలి. ఇక నొప్పి భరించలేనంతగా ఉండటమో లేదా మర్నాడు డాక్టర్ దగ్గరికి వెళ్లేలోపు కాస్త ఉపశమనంగానో తప్ప... అలవాటుగా ఆన్ కౌంటర్ డ్రగ్స్ వాడనేకూడదని గుర్తుంచుకోండి.
Comments
Please login to add a commentAdd a comment