‘అసలే కోతి.. ఆపై కల్లు తాగింది’ అని ఓ సామెత. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కు చెందిన ఓ వ్యక్తి తీరు అచ్చం అలాగే ఉంది. జిల్లాలో ఉన్న బెరాసియా తహసీల్‌లో బర్‌ఖేడీ గ్రామానికి చెందిన 33 ఏళ్ల వివేక్ అనే వ్యక్తి పీకల దాకా తాగాడు. ఇంకేముంది వెయ్యేనుగుల బలం వచ్చింది. ఆ మత్తులో 80 అడుగుల మొబైల్ టవర్ ఎక్కాలనుకున్నాడు. స్థానికులు అడ్డుకుంటున్నా సరే.. పక్కకు నెట్టిమరీ సునాయాసంగా ఎక్కాడు. టవర్ మీదకు ఎక్కనయితే ఎక్కాడు కానీ.. ఎట్లా దిగాలో అర్థం కాలేదు. ఏం చేస్తున్నాడో కూడా అర్థం కాలేదు.
దీంతో స్థానికులు జహంగీరాబాద్ పోలీసులకు, మున్సిపల్ అధికారులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు అతడిని 20 నిమిషాలపాటు మాటల్లో పెట్టి.. అగ్నిమాపక క్రేన్ సహాయంతో కిందకు దించారు. కథ సుఖాంతం కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కిందకు దిగిన వివేక్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనంతా స్థానికులు తమ సెల్‌ఫోనులో బంధించిన స్థానికులు సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయగా.. వీడియో వైరల్ అవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment