నేడు ప్రపంచ క్యాన్సర్ డే
సందర్భం
ఒక నూతన ఆరోగ్య హెచ్చరికతో ఈ నూతన సంవత్సరం మొదలైంది. మద్యం సేవించడం, క్యాన్సర్ ప్రమాదం పెరగడం మధ్య ప్రత్యక్ష సంబంధం ఉందంటూ అమె రికా సర్జన్ జనరల్ వివేక్ మూర్తి ఒక ప్రకటనను విడుదల చేశారు. అమెరికాలో క్యాన్సర్‌ను ప్రేరేపించగల మూడో ప్రధాన కారణం ఆల్కహాల్ వినియోగం. ఏ రకమైన ఆల్కహాల్ తీసుకున్నా, అది కనీసం ఏడు రకాల క్యాన్సర్లు (రొమ్ము, పెద్దపేగు, అన్నవాహిక, కాలేయం, నోటి కుహరం, గొంతు, స్వరపేటిక) వచ్చే ప్రమాదాన్ని పెంచుతుందని ఆ ప్రకటన తెలిపింది.
అమెరికాలో 16.4 శాతం రొమ్ము క్యాన్సర్ కేసులు ఆల్కహాల్ వినియోగం వల్లే సంభవిస్తున్నాయి. రొమ్ము, నోరు,గొంతు వంటి కొన్ని క్యాన్సర్ల విషయంలో, ‘రోజుకు ఒకటి లేదా అంతకంటే తక్కువసార్లు మద్యం సేవించడం వల్ల కూడా క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరగవచ్చు’ అని సలహాదారు హెచ్చరిస్తున్నారు. తక్కువ మొత్తంలో మద్యం సేవించడం కూడా కాలేయ మచ్చలు (లివర్ సిర్రోసిస్) వంటి దీర్ఘకాలిక వ్యాధులకు దోహదం చేస్తుంది. అయితే, మద్యం సేవించడం వల్ల ఒక వ్యక్తికి క్యాన్సర్ వచ్చే ప్రమాదం అనేక జీవ, పర్యావరణ, సామాజిక అంశాలపై ఆధారపడి ఉంటుంది.
ఎంత తక్కువైనా రిస్కే!
శాస్త్రీయ ఆధారాలకు సంబంధించిన క్రమబద్ధమైన మూల్యాంకనం ఆధారంగా, మద్యం సేవించడం వల్ల కలిగే ప్రమాదాలు, హానిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) 2023 ప్రకటనను అనుసరించి ఈ సలహా ఇవ్వడమైంది. మద్యం నేరుగా ప్రమాద కరమైన వ్యాధిని కలిగిస్తుంది. మద్యం గణనీయంగా రోడ్డు ప్రమాదాలకు కారణమవుతుంది. ‘ద లాన్సెట్ పబ్లిక్ హెల్త్’లో ప్రచురితమైన ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటన, ‘మద్యం వినియోగం విషయానికి వస్తే, ఆరోగ్యాన్ని ప్రభావితం చేయనంతటి తక్కువ మోతాదు అనేది లేనే లేదు’ అని పేర్కొంది.
‘ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్’ సంస్థ, ఆల్కహాల్‌ను ‘గ్రూప్ 1 కార్సినోజెన్’గా 1980లలో వర్గీకరించింది. ఇది పొగాకు, రేడియేషన్, ఆస్బెస్టాస్ వంటి క్యాన్సర్ కలిగించే పదా ర్థాలలో అత్యంత ప్రమాదకరమైన కేటగిరీ. ఇథనాల్ శరీరంలో ఇంకిపోవడం వల్ల జీవసంబంధమైన విధానాలు క్యాన్సర్‌కు కారణమవుతాయి. అందువల్ల, ఆల్కహాల్ కలిగిన ఏ పానీయం... అది బీర్, వైన్ లేదా విస్కీ ఏదయినా ఆరోగ్యానికి హాని చేస్తుంది.
ఏ రకమైనా హానికరమే!
కొన్ని ఆల్కహాల్ పానీయాలను, ముఖ్యంగా రెడ్ వైన్‌ను మితంగా తీసుకుంటే ఆరోగ్యానికి మేలు జరుగుతుందనే అపోహను ఈ ఆధారాలు బద్దలు కొడుతున్నాయి. దశాబ్దాలుగా, మద్య పరిశ్రమ కార్డియాలజిస్టులను ప్రోత్సహించి, మితంగా వైన్ తీసుకోవడం గుండె ఆరోగ్యానికి మంచిదనే భావనను ప్రచారం చేస్తోంది.
అలాంటి వాదనలకు ఎటువంటి విశ్వసనీయ శాస్త్రీయ అధ్యయ నమూ లేదని గ్రహించాలి. మరోవైపు, డబ్ల్యూహెచ్‌ఓ యూరోపియన్ ప్రాంతం నుండి వచ్చిన డేటా ప్రకారం, ఆల్కహాల్ వల్ల వచ్చే క్యాన్సర్లలో సగం వరకు, సాధారణంగా వారానికి ఒక బాటిల్ వైన్ లేదా రెండు బాటిళ్ల బీర్ వంటి ‘తేలికపాటి’, ‘మితమైన’ వినియోగం వల్ల సంభవిస్తు న్నాయి.
ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, గుండె జబ్బులు లేదా మధుమేహంపై తేలికపాటి, మితమైన మద్యపానం వల్ల కలిగే ప్రయోజనకరమైన ప్రభావాలను గురించి తెలిపే అధ్యయనాలు లేవు.‘మీరు ఎంత ఎక్కువ తాగితే అంత హానికరం అని మేము కచ్చితంగా చెప్పగలం. మరో మాటలో చెప్పాలంటే, మీరు ఎంత తక్కువ తాగితే అంత సురక్షితం’ అని ప్రపంచ ఆరోగ్య సంస్థలోని ఆల్కహాల్, అక్రమ మాదకద్రవ్యాల నిపుణురాలు కరీనా ఫెర్రీరా –బోర్జెస్ అన్నారు.
హెచ్చరికలు మేలు చేస్తాయా?
ఒక వస్తువు వల్ల ప్రభుత్వాలకు గణనీయమైన ఆదాయం వస్తుందని శాస్త్రీయ ఆధారాలు ఉన్నప్పుడు, ఆ వస్తువు ద్వారా కలిగే హానిని తగ్గించడానికి ఉన్న ఎంపికలు ఏమిటి? డబ్ల్యూహెచ్‌ఓ చేసిన ఆల్కహాల్ ప్రకటన అందుబాటులో ఉన్న శాస్త్రీయ ఆధారాలను ఎత్తిపడుతోంది. అలాగే అందుబాటులో ఉన్న విధాన ఎంపికలను కూడా ప్రభుత్వాలకు అందిస్తోంది. ప్రభుత్వాలు వాటిపై చర్య తీసుకో వలసి ఉంటుంది.
మద్యం వినియోగాన్ని తగ్గించడానికి అత్యంత స్పష్టమైన మార్గాలలో ఒకటి ఏమిటంటే, మద్యం సీసాలపై హెచ్చరిక లేబుళ్ల ద్వారా, కలగనున్న హాని గురించి జనానికి అవగా హన కల్పించడం. అమెరికా, కొన్ని యూరోపియన్ దేశాలు ఏమి చేయాలని వివేక్ మూర్తి సూచించిన చర్యలలో ఇది ఒకటి. క్యాన్సర్ ప్రమాదాన్ని లెక్కించడానికి మద్యం వినియోగంపై మార్గ దర్శకాల పరిమితులను తిరిగి నిర్వచించాలని కూడా మూర్తి పిలుపునిచ్చారు.
వివిధ దేశాలు పరిశీలిస్తున్న హెచ్చరిక లేబుల్స్ అనేక రకాలుగా ఉన్నాయి. ఆరోగ్యానికి సాధారణ హాని; అధిక వినియోగం, దుర్వి నియోగం వల్ల కలిగే హాని; నిర్దిష్ట సమూహాలకు అంటే తక్కువ వయస్సు గలవారు, గర్భిణులు మొదలైన వారికి వ్యతిరేకంగా సందేశాలు వీటిలో కొన్ని. ఉదాహరణకు, 2026లో ఐర్లాండ్ ప్రవేశ పెట్టాలని భావిస్తున్న హెచ్చరికలో, ‘మద్యం తాగడం వల్ల కాలేయ క్యాన్సర్ వస్తుంది’ అని ఉంది. 2019లో, భారతదేశం హార్డ్ లిక్కర్‌కు ‘మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం’ అనీ, తక్కువ ఆల్క హాల్ పానీయాలకు ‘సురక్షితంగా ఉండండి, తాగి వాహనం నడపవద్దు’ అని చెప్పే సాధారణ హెచ్చరికలను తప్పనిసరి చేసింది.
ఇండియా ఇంకా చేయాల్సిందేమిటి?
భారతదేశంలో హెచ్చరిక లేబుళ్లతో పాటు, ఆల్కహాల్ మార్కెటింగ్‌పై పరిమితులు కూడా అమలులో ఉన్నాయి. వార్తా పత్రికలు, రేడియో, టీవీల్లో ఆల్కహాల్ ప్రకటనలను నిషేధించారు. అయితే ప్రకటనల నిబంధనలలోని లొసుగులను వాడుకుంటూ వాటిపై ప్రకటనలు మరో రూపంలో కొనసాగుతున్నాయి. ఇటీవలి సంవత్సరాలలో, సోషల్ మీడియా, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా రహస్య ప్రకటనలు కొత్త సవాళ్లను కలిగిస్తున్నాయి.
పొగాకు లేబుళ్లపై హెచ్చరికల మాదిరిగానే, మద్య పరిశ్రమ, పరిశ్రమ అనుకూల సమూహాలు ఆరోగ్య హెచ్చరిక లేబుళ్లు మద్య వినియోగాన్ని తగ్గించడంలో పెద్దగా ఉపయోగపడవని వాదిస్తు న్నాయి. కానీ, ‘ద లాన్సెట్’లో ప్రచురితమైన ఇటీవలి సమీక్షలో నివేదించినట్లుగా, మద్య ఉత్పత్తులపై హెచ్చరిక లేబుళ్లు అనేక విధాలుగా ఉపయోగకరంగా ఉన్నాయని ఆధారాలు ఎత్తి చూపు తున్నాయి.
అవి మద్య సంబంధిత హానిపై అవగాహన పెంచు తాయి, మద్యం వాడకాన్ని సాధారణీకరించకుండా దోహదం చేస్తాయి. పైగా ప్రజలు సరైన నిర్ణయాలు తీసుకోవడంలో సహాయ పడతాయి. తద్వారా ప్రజారోగ్యాన్ని ప్రోత్సహిస్తాయి. హెల్త్ లేబుల్స్ ప్రభావం వాటి రూపకల్పనపై, కంటెంట్‌పై ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతానికైతే, ఆరోగ్య హెచ్చరిక లేబుల్స్‌కు ప్రామాణీకరణ లేదు. అంతేకాకుండా వాటి కంటెంట్ చాలా సాధారణమైనది. ఇది వినియో గదారులు ఒక అవగాహనకు రావడానికి ఉపయోగపడకపోవచ్చు.
దాదాపు ఐదేళ్లుగా భారతదేశం మద్యం ఉత్పత్తులకు సంబంధించిన హెచ్చరిక లేబుళ్లపై నిబంధనలను అమలు చేస్తోంది. ఇది ఎంత ప్రభావవంతంగా ఉందో మనకు ఇంకా తెలియదు. హెచ్చరిక సందే శాల రూపకల్పన, కంటెంట్, వాటిపై వినియోగదారుల అభిప్రా యానికి సంబంధించి మనకు నిరంతర పరిశోధన అవసరం. పొగాకు ఉత్పత్తుల్లో ఆరోగ్య హెచ్చరికలు ప్యాకేజింగ్‌లో మంచి జాగాతో వివర ణాత్మకంగా ఉంటాయి. దీనికి భిన్నంగా మద్యం సీసాలపై హెచ్చరికలు చిన్న స్థలాన్ని ఆక్రమిస్తాయి, అస్పష్టంగా ఉంటాయి. ఆరోగ్య హెచ్చరికలతో పాటు, హైవేలపై మద్యం అమ్మకాల నియంత్రణ, తక్కువ వయస్సు గల వినియోగదారులకు అమ్మకాలను అరికట్టడం, తాగి వాహనం నడపడం వంటి అదనపు చర్యలను మరింత కఠినంగా అమలు చేయాలి.
భారతదేశంలో ఆరోగ్య సంబంధమైన, ఇతర నిబంధనలను నిలిపివేయడానికి నిరంతరం ప్రయత్నిస్తున్న పరిశ్రమ లాబీల నుండి జాగ్రత్త వహించడం చాలా ముఖ్యం. మద్యం వల్ల కలిగే ఆరోగ్య సంరక్షణ పెను భారాన్ని తగ్గించడానికి వివేక్ మూర్తి వంటి మరింత మంది ప్రజారోగ్య ఛాంపియన్లు అవసరం. క్యాన్సర్‌కీ పొగాకుకీ ఉన్న సంబంధంపై మొదటి హెచ్చరిక కూడా 1964లో ఒక సర్జన్ జనరల్ నుండే వచ్చిందని గుర్తుంచుకోండి.
దినేశ్ సి. శర్మ
వ్యాసకర్త సైన్స్ అంశాల వ్యాఖ్యాత
(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో)
Comments
Please login to add a commentAdd a comment