శ్రీహరి ఇక లేరు | Actor srihari passes away | Sakshi
Sakshi News home page

శ్రీహరి ఇక లేరు

Published Thu, Oct 10 2013 2:13 AM | Last Updated on Fri, Sep 1 2017 11:29 PM

శ్రీహరి ఇక లేరు

శ్రీహరి ఇక లేరు

ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో గుండెపోటుతో కన్నుమూత
 సాక్షి, హైదరాబాద్: టాలీవుడ్ ప్రముఖ నటుడు రఘుముద్రి శ్రీహరి (49) హఠాన్మరణం పొందారు. గత కొంత కాలంగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న శ్రీహరి ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో బుధవారం సాయంత్రం 4 గంటల 20 నిమిషాలకు కన్నుమూశారు. ముంబైలో హిందీ చిత్రం ‘రాంబో రాజ్‌కుమార్’ షూటింగ్‌లో పాల్గొంటున్న శ్రీహరి మంగళవారం అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆయనను అక్కడి లీలావతి ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ శ్రీహరి తుది శ్వాస విడిచారు. కాగా, ఛాతి నొప్పి రావడంతో మధ్యాహ్నం 1. 14 గంటలకు శ్రీహరిని ఆస్పత్రికి తరలించారని బాంద్రా పోలీస్ స్టేషన్ అధికారి ధోర్కర్ చెప్పారు. మంగళవారం షూటింగ్‌లో పాల్గొన్న ఆయన బుధవారం కూడా కొనసాగించాల్సి ఉంది.
 
 అయితే ఉదయం 11 గంటల ప్రాంతంలో గుండె నొప్పి రావడంలో షూటింగ్ కేన్సిల్ చేశారని ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ సాక్షితో చెప్పారు. ఆయనతో పాటు భార్య శాంతి కూడా ఉన్నారు.హైదరాబాద్‌లోని బాలానగర్‌లో ఓ మధ్య తరగతి కుటుంబంలో 1964 ఆగస్టు 15న శ్రీహరి జన్మించారు. మొదట్నుంచీ కూడా ఆయనకు జిమ్నాస్టిక్స్‌పై ఆసక్తి. బాడీ బిల్డర్‌గా పేరు తెచ్చుకున్నారు. జూబ్లీ హిల్స్‌లో స్థిరపడినా కూడా, ఇప్పటికీ బాలానగర్ ప్రాంతంతో అనుబంధాన్ని కొనసాగిస్తున్నారు. ఇప్పటివరకూ 97 సినిమాల్లో నటించిన శ్రీహరి ‘రియల్ స్టార్’గా పేరు తెచ్చుకున్నారు. ఆయనకు భార్య శాంతి, ఇద్దరు కుమారులు మేఘాంశ్, శశాంక్ ఉన్నారు. ఆయన మరణవార్త సినీ, రాజకీయ రంగాలను దిగ్భ్రాంతికి గురి చేసింది. శ్రీహరి మరణం పట్ల నటీనటుల సంఘం, నిర్మాతల మండలి, దర్శకుల సంఘం తమ సంతాపాన్ని తెలియజేశాయి.
 
 మంచి నటుడిని కోల్పోయాం: సీఎం కిరణ్
 శ్రీహరి మృతితో తెలుగు సినీ పరిశ్రమ ఒక గొప్ప నటుడిని కోల్పోయిందని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. పలు విభిన్న పాత్రల్లో నటించి తెలుగువారి మెప్పు పొందిన శ్రీహరి హఠాన్మరణం చెందడం సినీ పరిశ్రమకు తీరని లోటు అన్నారు. శ్రీహరి కుటుంబానికి సానుభూతి తెలిపారు.
 
 శ్రీహరి హఠాన్మరణం బాధాకరం...వైఎస్ విజయమ్మ
 తెలుగు సినీ లోకంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్న శ్రీహరి హఠాన్మరణం అత్యంత బాధాకరమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. శ్రీహరి మృతిపై ఆమె తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. స్వశక్తితో ఎదిగి, తెలుగు సినిమాల్లో మంచి పాత్రలు పోషించి అభిమానులను సొంతం చేసుకోవడమే కాకుండా, పలు సామాజిక కార్యక్రమాల్లోనూ పాలుపంచుకుని తన ఉదారత చాటుకున్నారని అన్నారు. తెలుగు సినీ పరిశ్రమ ఒక మంచి నటుణ్ణి కోల్పోయిందని విజయమ్మ అన్నారు. శ్రీహరి కుటుంబానికి ఆమె ప్రగాఢ సానుభూతి తెలిపారు.
 
 తీరని లోటు: డీకే అరుణ
 ప్రముఖ నటుడు శ్రీహరి మృతి  తెలుగు సినిమా రంగానికి తీరని లోటు అని సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి డీకే అరుణ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. శ్రీహరి మృతికి ఆమె సంతాపం తెలిపారు. యుక్త వయసులోనే సినీరంగంలో ప్రవేశించి ఎన్నో ఉత్తమ చిత్రాల్లో నటించి అభిమానులతో రియల్‌స్టార్ అనిపించుకున్నారని అన్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
 
 అద్భుత నటుడు: దత్తాత్రేయ
 సినీనటుడు శ్రీహరి ఆకస్మిక మృతికి బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తంచేశారు. క్యారెక్టర్ నటుడిగా, విలన్‌గా, హీరోగా అద్భుతంగా రాణించిన శ్రీహరి పిన్నవయస్సులో మరణించడం సినీరంగానికి లోటేనని పేర్కొన్నారు.
 
 కళారంగానికే లోటు: కేసీఆర్
 సినీ నటుడు శ్రీహరి మృతి పట్ల టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. శ్రీహరి మృతి సినీరంగానికి, కళారంగానికి తీరని లోటు అని పేర్కొన్నారు. కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. శ్రీహరి మృతి కళారంగానికే కాకుండా తనకు వ్యక్తిగతంగా కూడా తీరని లోటు అని పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు డాక్టర్ దాసోజు శ్రవణ్ ఒక ప్రకటనలో సంతాపాన్ని వ్యక్తం చేశారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement