కాలేయ వాపుతో జాగ్రత్త.. లక్షణాలు లేకుండానే ముంచేస్తుంది! | World Hepatitis Day: All You Need To Know About Symptoms, Types | Sakshi
Sakshi News home page

World Hepatitis Day: కాలేయ వాపుతో జాగ్రత్త.. లక్షణాలు లేకుండానే ముంచేస్తుంది!

Published Wed, Jul 28 2021 7:53 PM | Last Updated on Wed, Jul 28 2021 8:34 PM

World Hepatitis Day: All You Need To Know About Symptoms, Types - Sakshi

ఆరోగ్యవంతంగా ఉన్న కాలేయం, లివర్‌ సిరోసిస్‌

శరీరంలో కీలకమైన భాగం కాలేయం (లివర్‌). ఈ అవయవం మనకు తెలియకుండానే ‘హెపటైటీస్‌’ (లివర్‌ వాపు)కు గురి అవుతోంది. దీంతో చాలా మంది అనారోగ్యానికి గురి అవుతున్నారు. ఈ వ్యాధిపై అవగాహన పెంచుకోవాలి.  కాలేయంను కాపాడుకుంటే పది కాలాల పాటు ఆరోగ్యవంతులుగా జీవించవచ్చు.  

సాక్షి, కడప: ‘హెపటైటీస్‌’ వ్యాధి సోకిందని తెలియక చాలా మంది అనారోగ్యానికి గురవుతున్నారు. కొంతమందిలో వ్యాధి తీవ్రత పెరగడంతో మృత్యువాత పడుతున్నారు. ఈ వ్యాధి నివారణకు.. ప్రజల్లో అవగాహన కల్పించడానికి ప్రభుత్వాలు చర్యలు చేపడుతున్నాయి. ప్రతి ఏటా జూలై 28వ తేదీన ప్రపంచ హెపటైటీస్‌–బి  నివారణ దినోత్సవంను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ‘సాక్షి’ అందిస్తున్న ప్రత్యేక కథనం.     

‘హెపటైటీస్‌’ అంటే...  
‘హెపటైటీస్‌’ ఇది కాలేయంకు సంబంధించిన వ్యాధి. వైద్య భాషలో ‘హెప’ అంటే లివర్, టైటీస్‌ లేదా ఐటస్‌ అంటే వాపు అని అర్ధం. ఎ, బి, సి, డి, ఇ అనే ఐదు రకాల వైరస్‌ల సమూహమే ‘హెపటైటీస్‌’. అందులో ఎ, ఈ వైరస్‌ కలుషిత నీరును తాగడం, కలుషిత ఆహరంను తీసుకోవడం వలను వస్తుంది. ‘డి’ అంటే డెల్టా వైరస్‌. ఇది హెపటైటీస్‌కు చెందిన ఒక వైరస్‌. ఈ వైరస్‌లు ప్రమాదకరమైనవి కావు. బి, సి వైరస్‌లే అనారోగ్యానికి దారి తీస్తాయి.    

చాప కింద నీరులా... 
ఈ వ్యాధి చాప కింద నీరులా ప్రవేశిస్తుంది. అసలు ఈ వ్యాధి ఉందని చాలా మందికి తెలియదు.  వ్యాధి ఉందని తెలిసేలోపు ‘లివర్‌’ తీవ్ర ఇన్‌ఫెక్షన్‌కు గురి అవుతోంది. దీంతో వ్యాధి సోకిన వ్యక్తి తీవ్ర అనారోగ్యానికి లోనవుతున్నారు. బాధితుల్లో దాదాపు 70 శాతం మందికి ఇన్‌ఫెక్షన్‌ బాగా ముదిరిన తరువాతనే అసలు విషయం తెలుసుకుంటున్నారు.  ఈ వైరస్‌ల కారణంగా దశల వారీగా కాలేయ వాపు, లివర్‌ సిర్రోసిస్, లివర్‌ క్యాన్సర్‌కు దారి తీస్తుంది. ఇందుకు ‘హెపటైటీస్‌’. కారణం.   

ఎందుకు వస్తుందంటే... 
► సురక్షితంకాని ఇంజక్షన్లు వాడటం.   
► శుధ్ధి లేని రక్త మారి్పడి.. 
► హెపటైటీస్‌ వ్యాధి సోకిన తల్లి నుంచి బిడ్డకు.. 
► అవాంచిత సెక్స్‌ వలన. 
► ఒకరు ఉపయోగించిన బ్లేడ్లు, రేజర్లు, టూత్‌ బ్రెష్‌లు వాడటం వలన. 
► కలుషితమైన నీరు, ఆహరం తీసుకోవడం వలన.   

లక్షణాలు.. 
► కామెర్లు, జ్వరం తదితర అనారోగ్య సమస్యలు ఉంటాయి. 
► చాలా మందిలో వ్యాధి లక్షణాలు కనిపించవు.  
► వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంటే కడపు నొప్పితో పాటు కడుపు ఉబ్బరం ఉంటుంది. రక్తపు వాంతులు అవుతాయి.  

తీసుకోవలసిన జాగ్రత్తలు... 
► హెపటైటీస్‌ నిర్ధారణ రక్త పరీక్ష చేసుకోవాలి. 
► ముందస్తు టీకా వేయించుకోవాలి. 
► ఈ వ్యాధి సోకిన వారు క్రమం తప్పకుండా చికిత్స చేసుకోవడం వలన హెపటైటీస్‌ను నివారించవచ్చు.

క్రమం తప్పకుండా టీకా వేయాలి
హెపటైటీస్‌ నివారణకు అన్ని చర్యలు చేపడుతున్నాం. ఈ వైరస్‌కు అడ్డుకట్ట వేయడానికి బిడ్డ జన్మించిన 24 గంటల్లోపు టీకాను వేస్తున్నాం. తరువాత ఐదు టీకాల మిశ్రమం కలిగిన ‘పెంటావాలెంట్‌’ టీకాను  ఆరు వారాలకు, 10 వారాలకు, 14 వారాలకు ఒక సారి ఒక డోసు చొప్పున వ్యాక్సిన్‌ వేస్తున్నాం. ఈ పెంటావాలంట్‌ టీకా హెపటైటీస్‌–బితో అంటే కామెర్లతో పాటు కోరింత దగ్గు, ధనుర్వాతం,   న్యుమోనియా నివారణకు పనిచేస్తుంది. ఈ టీకా 10 సంవత్సరాల వరకు పని చేస్తుంది. తరువాత ఒక బూస్టర్‌ డోస్‌ను వేయాలి. ప్రతి బూస్టర్‌ డోసు ఐదేళ్ల పాటు పనిచేస్తుంది. ఈ  వైరస్‌ నివారణకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతోంది. వైద్యుల సూచనల ప్రకారం టీకా వేయాలి. 
– డాక్టర్‌ అనిల్‌కుమార్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement