Jaundice
-
హెచ్ఐవీ కంటే హెపటైటిస్ ప్రమాదకరమా? అందులో నిజమెంత?
హెపటైటిస్ అనేది జబ్బు కాదు.. కొన్ని ఇన్ఫెక్షన్ల సమాహారం. హెపటైటిస్‌లో ఏ, బీ, సీ, డీ, ఈ అనే ఐదు రకాలు ఉన్నాయి. హెపటైటిస్ చాలా మందిలో ఉన్నప్పటికీ అది తమకు ఉన్నట్టే తెలియదు. సాధారణంగా 2, 3 వారాల్లో తగ్గిపోతుంది. కొద్ది మందిలో మాత్రం దీర్ఘకాలికంగా ఉండిపోతుంది. మొత్తం జనాభాలో 3 నుంచి 5 శాతం మంది హెపటైటిస్ బారిన పడుతున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. హెపటైటిస్ ముదిరితే లివర్ గట్టి బడి లివర్ సిర్రోసిస్, మరికొందరిలో లివర్ క్యాన్సర్‌కు దారితీయవచ్చు. ఇంతటి ప్రమాదకరమైన హెపటైటిస్ నుంచి ముందు జాగ్రత్త చర్యలు పాటించడం, వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా రక్షణ పొందవచ్చని 40 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం ఉన్న ప్రముఖ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ ఇ.పెదవీర్రాజు సూచిస్తున్నారు. వరల్డ్ హెపటైటిస్ డే సందర్భంగా ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. – సీతంపేట(విశాఖ ఉత్తర) సాక్షి: హెపటైటిస్ అంటే ఏమిటి, ఎన్ని రకాలు, ఏ విధంగా వస్తుంది? డాక్టర్ పెదవీర్రాజు: హెపటైటిస్ నాలుగైదు రకాల వైరస్ల వల్ల వ్యాపిస్తుంది. హెపటైటిస్ ఏ, బీ, సీ,డీ, ఈ ఇలా ఐదు రకాల వైరస్ల వల్ల వ్యాధి బారిన పడతారు. ఇందులో హెపటైటిస్ బీ, సీ రకాలు కలుషితమైన రక్తం ఎక్కించుకోవడం, స్టెరిలైజ్ చేయని ఇంజక్షన్ సూదుల వల్ల, ఎక్కువ సార్లు శస్త్ర చికిత్సలు చేయించుకోవడం వల్ల వస్తుంది. ఏ, ఈ రకాలు కలుషితమైన నీరు, పాడైపోయిన ఆహారం వల్ల వ్యాపిస్తుంది. ముందు జాగ్రత్త చర్యలు పాటించం ద్వారా హెపటైటిస్ బారిన పడకుండా ఉండవచ్చు. సాక్షి: హెపటైటిస్ లక్షణాలు ఏమిటి? డాక్టర్ : హెపటైటిస్‌కు గురైన వారిలో జ్వరం, ఆకలి లేకపోవడం, నీళ్ల విరేచనాలు, తెలుపు రంగులో మోషన్, కడుపులో ఇబ్బంది, దురదలు, మూత్రం పచ్చగా రావడం, చర్మం, కంటిలోని తెల్లభాగం పసుపుగా మారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. రెండు నుంచి ఆరు వారాల లోపు వ్యాధి లక్షణాలు బయటపడతాయి. సాక్షి: హెపటైటిస్ బీ బారిన పడకుండా ఉండాలంటే ఏం చేయాలి? డాక్టర్ : హెపటైటిస్ బీని నివారించడానికి వ్యాక్సిన్ అందుబాటులో ఉంది. హెపటైటిస్ బీ వ్యాక్సిన్ మూడు డోసులు తీసుకుంటే రక్షణ ఉంటుంది. ఈ వ్యాక్సిన్ లివర్ క్యాన్సర్ బారిన పడకుండా కూడా రక్షణ కల్పిస్తుంది. భర్తకు హెపటైటిస్ బీ వస్తే భార్య.. ఇంటిలో ఒకరికి వస్తే మిగిలిన వారందరూ వ్యాక్సిన్ కచ్చితంగా తీసుకోవాలి. సాక్షి: హెపటైటిస్ సీ వైరస్ నుంచి రక్షణ పొందాలంటే..? డాక్టర్ : హెపటైటిస్ సీ కి గతంలో మందులు ఉండేవి కాదు. నాలుగేళ్ల నుంచి అద్భుతమైన మందులు అందుబాటులోకి వచ్చాయి. ఈ మందులు మూడు నెలలు వాడినట్లయితే హెపటైటిస్ సీ 95 శాతం నయం అవుతుంది. సాక్షి: హెపటైటిస్ ఏ, ఈ బారిన పడకుండా ఉండాలంటే..? డాక్టర్ : కలుషితం కాని ఆహారం, నీరు తీసుకోవడం వంటి ముందు జాగ్రత్త చర్యలు ద్వారా హెపటైటిస్ ఏ, ఈ బారిన పడుకుండా ఉండొచ్చు. హెపటైటిస్ ఏకు వ్యాక్సిన్ అందుబాటులో ఉన్నప్పటికీ అభివృద్ధి చెందిన దేశాల్లో మాత్రమే వినియోగిస్తున్నారు. మనదేశంలో వ్యాక్సిన్ వినియోగించడం లేదు. హెపటైటిస్ ‘ఈ’కి వ్యాక్సిన్ లేదు. పరిసరాల పరిశుభ్రత, ఆహార నియమాలు పాటించడం ద్వారా ఏ, ఈ వైరస్ వ్యాప్తికి గురికాకుండా ఉండొచ్చు. సాక్షి: గర్భిణికి హెపటైటిస్ వస్తే పుట్టే శిశువుకు సంక్రమిస్తుందా? డాక్టర్ : గర్భిణికి హెపటైటిస్ బి ఉంటే పుట్టే శిశువుకు వచ్చే అవకాశం ఉంది. తల్లి గర్భంతో ఉన్నపుడు చేసే రక్త పరీక్షలో వ్యాధి నిర్ధారణ అయితే, బిడ్డ పుట్టగానే వ్యాక్సిన్‌తో పాటు హెచ్‌బీఐజీ ఇంజక్షన్ చేస్తారు. దీనివల్ల తల్లి నుంచి బిడ్డకు వ్యాధి సంక్రమించకుండా కాపాడవచ్చు. ఇటీవల టెనోఫెవర్ మాత్రలు అందుబాటులోకి వచ్చాయి. గర్భిణికి హెపటైటిస్‘బి’ వ్యాధి సోకి ఉండి, వైరస్ శాతం బాగా ఎక్కువగా ఉంటే.. ఆమెకు చివరి మూడు నెలలు ఈ మాత్రలు ఇవ్వాలి. దీని వల్ల ఆమె నుంచి శిశువుకు వ్యాధి వ్యాప్తి చెందకుండా ఆపొచ్చు. సాక్షి: ప్రస్తుతం ఈ వ్యాధి తీవ్రత ఏ మేరకు ఉంది? డాక్టర్ : డాక్టర్ బ్లూమ్ బెర్గ్ తన బృందంతో విస్తృత పరిశోధనల ఫలితంగా 1967లో హెపటైటిస్ బీ వైరస్‌ను గుర్తించారు. ఆ తర్వాత 1969లో హెపటైటిస్ బీ వ్యాక్సిన్ కనిపెట్టారు. అప్పటి వరకు జాండిస్ ఎందుకు వస్తుందో తెలిసేది కాదు. పరిశోధనల వల్ల రక్తం ద్వారా వస్తుందని తెలిసింది. ఇప్పుడు రక్తం ఎక్కించే ముందు స్క్రీనింగ్ పరీక్షలు చేస్తున్నారు. అందువల్ల రక్తం ద్వారా హెపటైటిస్ బీ, సీ కూడా వచ్చే అవకాశాలు బాగా తగ్గిపోయాయనే చెప్పాలి. సాక్షి: ఈ వ్యాధి బారిన పడకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? డాక్టర్ : కలుషితం కాని ఆహారం, నీరు తీసుకోవడం ద్వారా హెపటైటిస్ ఏ, ఈ బారిన పడకుండా ఉండొచ్చు. వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా హెపటైటిస్ బీ రాకుండా రక్షణ పొందవచ్చు. హెపటైటిస్ బీ నివారణకు వ్యాక్సినే బెస్ట్ ప్రీవెన్షన్. రక్తం ఎక్కించే ముందు సరైన స్క్రీనింగ్ పరీక్షలు చేయడం ద్వారా హెపటైటిస్ బీ, సీ బారిన పడకుండా ఉండొచ్చు. హెపటైటిస్ డీ మన దేశంలో చాలా అరుదుగా వస్తుంది. ఇటలీలో కనిపిస్తుంది. ఒకప్పుడు హెపటైటిస్ వల్ల లివర్ సమస్యలు ఎక్కువగా వచ్చేవి. ప్రస్తుతం ఆల్కాహాల్, ఊబకాయం వల్ల ఎక్కువగా లివర్ సమస్యలు వస్తున్నాయి. ఢిల్లీ, బెనారస్ ప్రాంతాల్లో హెపటైటిస్ ఎక్కువగా ఉంది. ఆయా ప్రాంతాలకు వెళ్లి వచ్చిన వారు హెపటైటిస్ పరీక్ష చేయించు కోవడం మంచిది. సాక్షి: హెచ్ఐవీ కంటే హెపటైటిస్ ప్రమాదకరమా? డాక్టర్ : హెపటైటిస్ హెచ్ఐవీ కంటే ప్రమాదమన్న అపోహ ఉంది. అది నిజం కాదు. ఎందుకంటే చెమట ద్వారా, ముట్టుకోవడం, ముద్దు పెట్టుకోవడం వల్ల హెపటైటిస్ వ్యాపించదు. ఇంజక్షన్, శరీరంలోకి రక్తం ఎక్కించడం ద్వారా వ్యాపిస్తుంది. వ్యాధిగ్రస్తుడు వాడే రేజర్, బ్రష్, నెయిల్ కట్టర్ వేరుగా ఉంచాలి. భర్తకు హెపటైటిస్ బీ వస్తే భార్య వ్యాక్సిన్ తీసుకోవాలి. ఆ వ్యాక్సిన్ పని చేసే వరకు అంటే.. ఆరు నెలల వరకు కండోమ్ వాడాలి. సాక్షి: జాండిస్ తగ్గడానికి అల్లోపతి వైద్యం పనికిరాదనే అపోహ ఉంది. నిజమేనా? డాక్టర్ : జాండిస్ రాగానే అల్లోపతిలో మందు లేదని చాలా మందిలో అపోహ ఉంది. నాటు వైద్యానికి వెళ్లిపోతున్నారు. హైపటైటిస్ ఏ, బీ, సీ వచ్చినా సాధారణంగా రెండు మూడు వారాల్లో తగ్గిపోతుంది. అందువల్ల పసరు మందు రెండు మూడు వారాలు వాడగానే తగ్గిపోతుంది. అప్పటికీ తగ్గకపోతే వైద్యుడిని సంప్రదిస్తారు. ఈ లోగా వ్యాధి ముదిరిపోతుంది. జాండిస్ చాలా కారణాల వల్ల వస్తుంది. మలేరియా, లివర్‌లో స్టోన్, ట్యూమర్ వల్ల జాండిస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. హెపటైసిస్ వల్ల వచ్చే జాండిస్ 2, 3 వారాల్లో తగ్గిపోతుంది. 3 నుంచి 5 శాతం మందికి దీర్ఘకాలికంగా శరీరంలో ఉండిపోతుంది. దీని వల్ల లివర్ గట్టిపడి లివర్ సిర్రోసిస్‌కు దారితీస్తుంది. పొట్టలో నీరు చేరడం, కళ్లు పచ్చబడటం, కాళ్లు పొంగడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. 2030 నాటికి హెపటైటిస్ నిర్మూలనే లక్ష్యం ఢిల్లీ ఎయిమ్స్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డాక్టర్ గౌతమ్ హెపటైటిస్‌కు కారణమయ్యే వైరస్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని, లేకపోతే ప్రాణాలకే ప్రమాదం వాటిల్లుతుందని ఢిల్లీ ఎయిమ్స్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ బుడిమూరి గౌతమ్ అన్నారు. హెపటైటిస్ దినోత్సవం పురస్కరించుకుని విశాఖ ప్రజల అవగాహన కోసం ఓ ప్రకటన విడుదల చేశారు. వైరల్ హెపటైటిస్ గురించి అవగాహన కల్పించాలన్న థీమ్‌ను ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన నేపథ్యంలో ఆ దిశగా తాను కృషి చేస్తున్నట్టు తెలిపారు. లివర్ హెపటైటిస్ వ్యాధి తీవ్రత గణాంకాల ప్రకారం పరిశీలిస్తే.. భారతదేశంలో 4 శాతంగా ఉందన్నారు. ఒకసారి లివర్ పూర్తిగా పాడైన తర్వాత కాలేయ మార్పిడి ద్వారా మాత్రమే శాశ్వత పరిష్కారం ఉంటుందన్నారు. తీవ్రమైన ఇన్ఫెక్షన్ ఉన్న రోగుల్లో ఫ్లూ వంటి జ్వరం, ఆకలి తగ్గడం, వికారం, పొత్తి కడుపులో నొప్పి, పచ్చ కామెర్లకు దారి తీస్తుందని, వ్యాధి అత్యంత తీవ్రమైన సందర్భాల్లో కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉందన్నారు. వ్యాధి సోకిన వెంటనే వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకుని మందులు సక్రమంగా వాడితే.. ఆదిలోనే నివారించడంతో పాటు లివర్ వ్యాధుల నుంచి తప్పించుకోవచ్చని వివరించారు. 2030 నాటికి హెపటైటిస్ నిర్మూలనే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు. -
పిత్తాశయంలో రాళ్లెందుకు వస్తాయి? పరిష్కారాలేమిటి?
Why Do Stones Form In Gallbladder: గాల్‌బ్లాడర్‌ను తెలుగులో పిత్తాశయం అంటారు. ఇది కాలేయం (లివర్)తో పాటు ఉండే కీలకమైన అవయవం. కొందరిలో పిత్తాశయంలో రాళ్లు వస్తాయి. ఇవి ఎందుకు వస్తాయో, అలా వచ్చినప్పుడు పరిష్కారాలేమిటో తెలుసుకుందాం. నిజానికి పైత్యరసం (బైల్ జ్యూస్) కాలేయంలోనే ఉత్పత్తి అవుతుంది. ఇలా లివర్‌లో పుట్టిన ఈ పైత్యరసాన్ని గాల్‌బ్లాడర్ నిల్వ ఉంచుతుంది. అక్కడి నుంచి బైల్ డక్ట్ అనే పైప్ ద్వారా చిన్న పేగుకు సరఫరా అయ్యేలా చూస్తుంది. అక్కడ కొవ్వులు జీర్ణం కావడం కోసం ఈ బైల్ జ్యూస్ ఉపయోగపడుతుంది. మనం తీసుకునే ఆహారంలో కొవ్వులూ, కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే, వాటిని చిన్న చిన్న ముక్కలైపోయి జీర్ణమయ్యేలా ఈ బైల్‌జ్యూస్ చూస్తుంది. ఇలా జరిగే క్రమంలో ఒకవేళ ఆహారంలో కరగకుండా మిగిలిపోయిన కొవ్వులు ఉంటే... వాటిని గాల్‌బ్లాడర్ మళ్లీ స్వీకరించి, తనలో స్టోర్ చేసుకుంటుంది. కొన్నిసార్లు ఆ కొవ్వులు అక్కడే, అలాగే పేరుకుపోయే ప్రమాదం ఉంది. ఇవన్నీ ఒకేచోట పోగుబడి రాళ్లలా మారవచ్చు. ఇలా ఏర్పడే ఈ రాళ్లు పిత్తాశయం నిర్వహించే విధులకు ఆటంకంగా మారవచ్చు. అంటే బైల్‌జ్యూస్ స్రావాలకు అడ్డుపడే ప్రమాదం ఉందన్నమాట. ఇలా ఎందుకు జరుగుతుందంటే... మనం తీసుకునే ఆహారంలో ఎక్కువగా కొవ్వులు, కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండటం అనేది మొదటి ప్రధాన కారణం. అలాగే మన జన్యువులు (జీన్స్), ఊబకాయం, పెయిన్‌కిల్లర్స్ ఎక్కువగా వాడటం, ప్రెగ్నెన్సీ రాకుండా మహిళలు వాడే పిల్స్ కూడా గాల్‌స్టోన్స్‌కు కొంతవరకు కారణాలే. డయాబెటిస్, జీర్ణ సమస్యలతో బాధపడేవాళ్లు ఈ గాల్‌బ్లాడర్ స్టోన్స్ సమస్యకు లోనయ్యే అవకాశాలు ఎక్కువ. ఇక్కడ గుర్తించాల్సిన అంశం ఏమిటంటే... కిడ్నీలో మాదిరిగా ఇవి పూర్తిగా రాళ్లలాంటివి కావు. ఆహారంలో కరగకుండా మిగిలిపోయిన చిన్న చిన్న ఘనపదార్థాలన్నీ ఒక ఉండగా మారి రాళ్లను తలపిస్తుంటాయి. కొందరిలో ఇవి పైత్యరసం ప్రవహించే డక్ట్ (పైత్యవాహిక)కు అడ్డు తగిలి నొప్పిని కలగజేయవచ్చు. మరికొందరిలో ఇవి ఏర్పడినా ఎలాంటి నొప్పీ ఉండకపోవచ్చు. అలా నొప్పి అనిపిస్తేగానీ... ఇవి ఏర్పడ్డ విషయం తెలియదు. కొందరిలో ఇంకేదైనా సమస్య కోసం వైద్య పరీక్షలు చేయించినప్పుడు ఈ సమస్య బయటపడవచ్చు. చికిత్స ఏమిటి? నిజానికి గాల్‌బ్లాడర్‌లో స్టోన్స్ వచ్చిన వాళ్లలో ఎలాంటి నొప్పీ లేకపోతే వారికి చికిత్స కూడా ఏమీ అవసరం లేదు. కానీ నొప్పి వచ్చినప్పుడు మాత్రం తప్పనిసరిగా శస్త్రచికిత్స చేసి వీటిని తొలగించాల్సి ఉంటుంది. మందులతో తగ్గడం జరగదు. నొప్పి తీవ్రంగా వచ్చేవారు డాక్టర్ సలహా మేరకు వీలైనంత త్వరగా శస్త్రచికిత్స చేయించుకోవడం అవసరం. అశ్రద్ధ చేస్తే గాల్‌బ్లాడర్‌లో ఇన్ఫెక్షన్ ఏర్పడటం, కామెర్లు (జాండిస్) రావడం, పాంక్రియాస్ వాపునకు గురికావడం లేదా కడుపులో తీవ్రమైన నొప్పి రావచ్చు. శస్త్రచికిత్స అవసరమనే నిర్ధారణ ఎలా? తొలుత నిర్వహించిన వైద్య పరీక్షల్లో పిత్తాశయంలో రాళ్లు ఉన్నాయని తెలిసినప్పుడు, మరోసారి అల్ట్రాసౌండ్ లేదా ఎమ్‌ఆర్‌సీపీ స్కాన్ చేసి లివర్, గాల్బ్లాడర్లలో వాటి తీరుతెన్నులను పరిశీలిస్తారు. అలాగే గాల్‌బ్లాడర్ పనితీరును తెలుసుకునేందుకు ‘హెచ్ఐడిఏ’ పరీక్షను కూడా చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు అందుబాటులో ఉన్న ఆధునిక వైద్య పరిజ్ఞానంతో చేసే శస్త్రచికిత్స ద్వారా ఈ సమస్యకు శాశ్వతమైన పరిష్కారాన్ని అందించవచ్చు. ఇది మేజర్ శస్త్రచికిత్స కూడా కాదు. కేవలం ఒక్కరోజు మాత్రమే ఆసుపత్రిలో ఉంటే చాలు. -డాక్టర్ భవానీరాజు, సీనియర్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ -
విషాదం: తెల్లవారితే పెళ్లి అంతలోనే ఆస్పత్రి పాలై..
సాక్షి, పెదకూరపాడు: అతను గ్రామ వలంటీర్.. పెళ్లి నిశ్చయమైంది. కుటుంబ సభ్యులు పెళ్లి పనుల్లో బిజిగా ఉన్నారు.. ఒకసారిగా జ్వరం, వాంతులు మొదలయ్యాయి. కుటుంబ సభ్యులు గుంటూరులోని ప్రైవేట్ వైద్యశాలకు తరలించారు. ఇరువైపుల పెద్దలు పెళ్లిని ఈనెల 20వ తేదీకి వాయిదా వేసుకున్నారు. చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున మృతి చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. లింగంగుంట్ల గ్రామానికి చెందిన రావెల నాగచైతన్య(26) గ్రామ వలంటీర్‌గా పనిచేస్తున్నాడు. అతనికి నరసరావుపేటకు చెందిన యువతితో పెళ్లి నిశ్చయమైంది. ఈ నెల 14న పెళ్లి ముహూర్తం. రెండు రోజులుగా చైతన్య జ్వరంతో బాధపడుతున్నాడు. సాధారణ జ్వరంగా భావించిన అతను పెళ్లికి సిద్ధమయ్యాడు. పెళ్లి ముందు రోజు ఒకసారిగా జ్వరం తీవ్రం కావడంతోపాటు వాంతులు అవుతుండడంతో గుంటూరు ప్రైవేట్ వైద్యశాలకు తరలించారు. డెంగీతోపాటు కామెర్ల లక్షణాలు ఉండటంతో మెరుగైన వైద్యం కోసం మరో ప్రైవేట్ వైద్యశాలకు తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున మృతి చెందాడు. చదవండి: (16 రోజుల కిందట వివాహం.. నవ వధువు చైతన్య ఆత్మహత్య) పెళ్లి ఇంట విషాదఛాయలు అలముకున్నాయి. మృతుడు తండ్రి శివయ్య కూడా పదిరోజుల నుంచి డెంగీ లక్షణాలతో బాధపడుతూ గుంటూరులోని ప్రైవేట్ వైద్యశాల నందు చికిత్స పొంది పెళ్లికి నాలుగు రోజుల ముందుగా డిశ్చార్జీ అయి ఇంటికి వచ్చారని కుటుంబ సభ్యులు తెలిపారు. నాగచైతన్య తల్లి వెంకాయమ్మ అంగవైకల్యంతో ఇబ్బందులు పడుతుంది. ఒక కుమారుడు కావడంతో పెళ్లిని ఘనంగా నిర్వహించాలనుకున్నారు. పలు శాఖల ప్రభుత్వ అధికారులు, రాజకీయపార్టీ నేతలు నాగచైతన్యకు నివాళులర్పించారు. -
షాకింగ్: పసుపు రంగులోకి మారిన శరీరం!
బీజింగ్ : దీర్ఘకాలంగా పొగ తాగుతున్న ఓ వ్యక్తి తీవ్ర అనారోగ్యం బారిన పడ్డాడు. స్మోకింగ్ వల్ల ఏర్పడిన ట్యూమర్ కారణంగా ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. పాంక్రియాస్లో ఏర్పడిన కణతి దుష్ప్రభావం కారణంగా కామెర్లు వచ్చి శరీరం మొత్తం ముదురు పసుపు పచ్చ రంగులోకి మారిపోయింది. ఈ ఘటన చైనాలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం చైనీస్ సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలలో చక్కర్లు కొడుతున్నాయి. (నకిలీ వ్యాక్సిన్లు అమ్ముతున్న చైనా ముఠా) వివరాలు... డూ అనే ఇంటిపేరు గల 60 ఏళ్ల వ్యక్తి స్మోకింగ్‌కు బానిసగా మారాడు. గత ముప్పై సంవత్సరాలుగా ప్రతిరోజూ సిగరెట్లు కాలుస్తున్న అతడికి ఇటీవల ఆరోగ్యం పాడైంది. దీంతో జనవరి 27న ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో అతడికి కామెర్లు సోకినట్లు వైద్యులు గుర్తించారు. పొగతాగడం వల్ల ఏర్పడిన కారణంగా కణితి కారణంగా చిన్నపేగు, కాలేయం గుండా వెళ్లే నాళాలు మూసుకుపోయినట్లు పరీక్షల్లో తేలింది. ఈ క్రమంలో రక్తంలో బిలిరూబిన్(పసుపు రంగులో ఉండే పైత్యరసం) స్థాయి పెరిగి కామెర్లు వచ్చాయి. ఈ విషయం గురించి వైద్యులు మాట్లాడుతూ.. దీర్ఘకాలంగా పొగ తాగడం, మద్యం సేవించడం వల్ల ట్యూమర్ ఏర్పడిందని, దాని ప్రభావం అనారోగ్యానికి దారి తీసిందని తెలిపారు. అతడి శరీరంలో ఉన్న కాన్సన్ కణితిని తొలగించామని, ఈ క్రమంలో చర్మం రంగు తిరిగి సాధారణ రంగులోకి మారిందని తెలిపారు. దురలవాట్లు మానుకోకపోతే డూ ఆరోగ్యం క్షీణించే అవకాశాలు మెండుగా ఉన్నాయని, ఈసారి ఆయనను కాపాడటం కష్టమేనని పేర్కొన్నారు. -
మృత్యువుతో పోరాడి ఓడిన శృతి
పొదలకూరు: ఐసీయూలో మృత్యువుతో పోరాడుతున్న పొదలకూరు వ్యవసాయ పరిశోధనా స్థానంలోని సోమశిల ఏజీ పాలిటెక్నిక్ విద్యార్థిని ఎన్.శృతి శుక్రవారం రాత్రి మృతి చెందింది. ఇక్కడి కళాశాలలో అగ్రికల్చర్ పాలిటెక్నిక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న ప్రకాశం జిల్లా కనిగిరికి చెందిన శృతికి కామెర్ల వ్యాధి ముదరడంతో ఆరోగ్యం విషమించింది. ఫలితంగా ఈనెల 7న ఆమె సొంతూరుకు వెళ్లి నెల్లూరు, ఒంగోలు ప్రైవేటు ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకుంది. అయితే డాక్టర్లు మెరుగైన చికిత్స అవసరమని సూచించడంతో ఆమె తల్లిదండ్రులు హైదరాబాద్‌కు తరలించారు. కాలేయం పూర్తిగా దెబ్బతినడంతో కాలేయమార్పిడి చేయాలని, అందుకు సుమారు రూ.40 లక్షల వరకు ఖర్చు అవుతుందని అక్కడి వైద్యనిపుణులు శృతి తండ్రి కొండరావుకు వివరించారు. ఆయన అంతస్తోమత లేక దాతల సహకారం తీసుకునేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో శృతి ఆరోగ్యం మరింత విషమించి తుదిశ్వాస విడిచింది. ఈ నెల 5వతేదీ వరకు ఆమె కళాశాల్లో సెమిస్టర్ పరీక్షలు రాసి వెళ్లింది. శృతికి వచ్చిన కామెర్ల వ్యాధి గుర్తించకపోవడం, అందరు విద్యార్థులతో పాటు సాధారణంగా ఉంటూ, వ్యవసాయ పనులు చేయడం వల్లనే వ్యాధి ముదిరినట్టుగా తెలుస్తోంది. కడసారి చూపులకు వెళ్లిన విద్యార్థులు శృతి మరణాన్ని జీర్ణించుకోలేని సహచర విద్యార్థులు తమ స్నేహితురాలిని కడసారి చూసి నివాళులర్పించేందుకు ఏజీ పాలిటెక్నిక్ విద్యార్థులు శనివారం కనిగిరి వెళ్లారు. విద్యార్థులు వెళ్లేందుకు ప్రిన్స్‌పల్ ప్రత్యేకవాహనం ఏర్పాటుచేసినట్టు వెల్లడించారు. ముందుగా అనుమతి లేదని కాలేజీ నిర్వాహకులు వెల్లడించడంతో విద్యార్థులు తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో యూనివర్సీటీ అనుమతి పొంది విద్యార్థులను శృతి భౌతికకాయం వద్దకు తీసుకుని వెళ్లారు. -
దానివల్ల బిడ్డకు ప్రమాదమా?
నా వయసు 40, నేను ఈ మధ్యకాలంలో చాలా బరువు తగ్గిపోయాను. కారణమేమిటో అర్థం కావట్లేదు. సిస్ట్ క్యాన్సర్ లక్షణాల్లో బరువు తగ్గిపోవడం ఉంటుందని ఓ పుస్తకంలో చదివాను. అసలు ఎలాంటి లక్షణాల ద్వారా సిస్ట్ క్యాన్సర్ వచ్చిందని తెలుసుకోవచ్చు? సిస్ట్ క్యాన్సర్ ఏ కారణాల వల్ల వస్తుంది. నివారణ చర్యలను వివరంగా తెలియజేయగలరు. – జి.బిందు, హైదరాబాద్ సిస్ట్ క్యాన్సర్ అన్నారు కానీ అది ఎక్కడ అనేది వివరంగా రాయలేదు. సిస్ట్ క్యాన్సర్ అని ప్రత్యేకంగా ఏమీ ఉండదు. శరీరంలో ఎక్కడైనా కూడా సిస్ట్లు తయారు అవుతాయి. మరీ గట్టి పదార్థాలు కాకుండా ఏదైనా ద్రవంతో నిండిన తిత్తులను సిస్ట్లు అంటారు. ఇవి చర్మంపైన రావచ్చు. అన్ని అవయవాలలో ఎక్కడైనా ఏర్పడవచ్చు. ఇది ఎందుకు..? ఎలా ఏర్పడతాయి..? అనే విషయాలు కచ్చితంగా చెప్పలేము. చాలావరకు సిస్ట్లు అపాయం కానివే ఉంటాయి. కొన్ని మట్టుకే క్యాన్సర్‌గా మారే అవకాశాలుంటాయి. సెబేసియస్ సిస్ట్, ఒవేరియన్ సిస్ట్, ఎండోమెట్రియల్ సిస్ట్, చాక్లెట్ సిస్ట్ వంటివి ఎన్నో మన శరీరంలో ఏర్పడుతుంటాయి. ఇవన్నీ క్యాన్సర్లు అవ్వాలని ఏమి లేదు. క్యాన్సర్ సిస్ట్ లక్షణాలు ప్రాధమిక స్టేజీలో పెద్దగా కనిపించవు. అవి మెల్లగా పెరుగుతూ ఉండి మిగితా అవయవాలకు పాకేటప్పుడు ఇవి ఏ అవయవంలో వచ్చాయనేదాని బట్టి లక్షణాలు ఉంటాయి. కడుపులో నొప్పి, కడుపు బరువుగా ఉండటం, ఆకలిలేకపోవడం, నీరసం, బరువు తగ్గటం, ఒళ్లు నొప్పులు వంటి లక్షణాలు క్యాన్సర్ పాకే కొద్ది.. ఏర్పడతాయి. ఇవి అనేక వేరే కారణాల వల్ల కూడా రావచ్చు. కాబట్టి చాలావరకు వీటిని అశ్రద్ధ చెయ్యడం, లేదా నిర్ధారణ ఆలస్యం కావచ్చు. సిస్ట్ క్యాన్సర్లు అన్నింటికి నివారణ మార్గాలు చెప్పలేము. చెడు అలవాట్లు లేకుండా.. పౌష్టిక ఆహారం తీసుకుంటూ.. వ్యాయామాలు చేసుకుంటూ, ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించినప్పుడు కొంతవరకు కొన్ని రకాల క్యాన్సర్లకు నివారణ మార్గం అవుతుంది. నా వయసు 27 సంవత్సరాలు. నేను ప్రస్తుతం ప్రెగ్నెంట్. నాకు కామెర్లు వచ్చాయి. దీనివల్ల కడుపులో బిడ్డకు ప్రమాదం ఉంటుందా? ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలి? అలాగే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి వివరంగా తెలియజేయగలరు. – జి.సృజన, కరీంనగర్ గర్భంలో ఉన్నప్పుడు అనేక రకాల కారణాల వల్ల.. లివర్ పనితీరులో మార్పుల వల్ల.. బైలురూబిన్ పదార్థం రక్తంలో ఎక్కువగా చేరుకుని జాండిస్ అంటే పచ్చకామెర్లు ఏర్పడతాయి. వీటిలో ముఖ్యంగా హెపటైటిస్ ఇన్ఫెక్షన్ వల్ల, రక్తంలో మార్పులవల్ల, హీమోలైటిక్ జాండిస్, జ్వరాలు, గాల్‌బ్లాడర్ స్టోన్స్, బీపీ పెరగడం వల్ల, కొన్ని మందుల వల్ల, హార్మొన్లలో మార్పుల వల్ల జాండిస్ రావచ్చు. మాములు వారిలో కంటే గర్భిణిలలో జాండిస్ వస్తే అది చాలా ప్రమాదకరం. కొన్నిసార్లు ప్రాణాంతకం కూడా అవుతుంది. ప్రెగ్నెన్సీలో జాండీస్ వల్ల తల్లిలో లివర్ పనితీరు సరిగా ఉండదు. అంతే కాకుండా ఇతర అవయవాల పనితీరు దెబ్బతింటాయి. రక్తం గడ్డ కట్టడానికి ఉపయోగపడే క్లాటింగ్ ఫ్యాక్టర్స్ సరిగా పనిచేయవు. దానివల్ల గర్భిణీలలో అధిక బ్లీడింగ్, బిడ్డ కడుపులో చనిపోవడం, కిడ్నీలపై ప్రభావం, అవి దెబ్బతినటం, తల్లి కోమాలోకి వెళ్లిపోవటం, ప్రాణాపాయం వంటి ప్రమాదకర పరిస్థితులు ఏర్పడవచ్చు. నీకు కామెర్లు ఏ కారణం చేత వచ్చాయి అని తెలుసుకోవటానికి డాక్టర్ పర్యవేక్షణలో అనేక రక్తపరీక్షలు చెయ్యించుకుని నిర్ధారణ చెయ్యించుకోవాలి. కారణాన్ని బట్టి చికిత్స తీసుకోవలసి ఉంటుంది. ఆహారంలో ఎక్కువగా ద్రవాలు, నీరు, మజ్జిగ, కొబ్బరి నీళ్లు, పండ్లరసాలు, ప్రొటీన్ కలిగిన పోషకపదార్ధాలు తీసుకోవటం అన్నివిధాలా మంచిది. డాక్టర్ దగ్గరికి రెగ్యులర్ చెకప్స్‌కి వెళ్లటం, రక్తపరీక్షలు క్రమం తప్పకుండా చెయ్యించుకుంటూ ఉండటం ముఖ్యం. జాండిస్ తీవ్రతను బట్టి చికిత్స తీసుకుంటూ కాన్పును అన్ని వసతులు ఉన్న హాస్పిటల్లో చేయించుకోవడం మంచిది. అశ్రద్ధ చేస్తే పెను ప్రమాదం తప్పదు. నా వయసు 25, నాకు ఈ మధ్యకాలంలో అవాంఛిత రోమాలు తీవ్రంగా పెరుగుతున్నాయి. ఈ విషయం నా ఫ్రెండ్‌కి చెబితే.. ‘నువ్వు ఈ మధ్యకాలంలో లావు కూడా అయ్యావు కదా! నీకు పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ వచ్చి ఉంటుంది’ అని చెప్పింది. పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ గురించి వివరంగా తెలియజేయగలరు. దీనివల్ల పురుషలక్షణాలు వస్తాయట నిజమే? వివాహం చేసుకుంటే ఇబ్బందులు ఎదురవుతాయా?– కె.ఎన్, పిడుగురాళ్ల గర్భాశయం ఇరువైపుల ఉండే అండాశయాలలో అండాలు పెరిగే చిన్న ఫాలికల్స్ ఉంటాయి. కొందరిలో ఈ ఫాలికల్స్ ఉండవలసిన సంఖ్య కంటే ఎక్కువగా చిన్న చిన్న నీటి బుడగలు లాగా ఉంటాయి. వీటినే పాలిసిస్టిక్ ఓవరీస్ అంటారు. ఇది హార్మొన్ల అసమతుల్యత వల్ల, ఇన్సులిన్ రెసిస్టెన్సీ వల్ల, జన్యుపరమైన కారణాల వల్ల, అధిక బరువు, జీవనశైలిలో మార్పులు, మానసిక ఒత్తిడి వంటివి ఇంకా ఎన్నో తెలియని కారణాల వల్ల ఏర్పడతాయి. ఇవి ఉన్నవారిలో టెస్టోస్టిరాన్ అనే పురుష హార్మోన్ ఆడవారిలో ఉండవలసినదానికంటే ఎక్కువగా విడుదల అవుతుంది. దీని ప్రభావం వల్ల అవాంఛిత రోమాలు, (పై పెదవిపైన, చెంపలపైన, గడ్డాలపైన, ఇతర శరీరభాగాలపైన) మొటిమలు, మెడచుట్టూ చర్మం నల్లగా మందంగా తయారుకావడం తలపైన జుట్టు రాలడం, పీరియడ్స్ క్రమం తప్పడం వంటి ఎన్నో లక్షణాలు ఏర్పడవచ్చు. దీనినే పాలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్ అంటారు. వివాహం తర్వాత హార్మొన్ల సమతుల్యత సరిగా లేకపోవడంత వల్ల, పీరియడ్స్ సక్రమంగా రాకపోవడం, అండం తయారు కాకపోవడం, దాని వల్ల పిల్లలు పుట్టడానికి ఇబ్బందులు ఏర్పడవచ్చు. గర్భందాల్చిన తర్వాత, అబార్షన్లు, షుగర్ రావటం వంటి సమస్యలు రావచ్చు. అశ్రద్ధ చేస్తే, తర్వాత కాలంలో షుగర్, బీపీ వంటి సమస్యలు చిన్న వయసులోనే వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి పాలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్ ఉన్నవారు వాకింగ్‌తో పాటు వ్యాయామాలు చెయ్యడం, బరువు పెరగకుండా చూసుకోవడం, ఆహారంలో నియమాలను పాటించడం వంటి జీవనశైలిలో మార్పులు చేసుకోవడం వల్ల పాలిసిస్టిక్ సిండ్రోమ్ యొక్క లక్షణాలు ఇంకా ఎక్కువ పెరగకుండా చూసుకోవచ్చు. డాక్టర్ పర్యవేక్షణలో లక్షణాల తీవ్రతను బట్టి మందులు వాడుకోవడం అన్నివిధాలా మంచిది. డా‘‘ వేనాటి శోభ బర్త్‌రైట్ బై రెయిన్‌బోహైదర్‌నగర్ హైదరాబాద్\ -
‘దశమూలారిష్టం’తో అరిష్టం కూడా!
సాక్షి, న్యూఢిల్లీ: ‘నా రోగి ఓ రైతు. ఆయనకు 40 ఏళ్లు. పచ్చ కామర్లతో (క్రానిక్ జాండీస్)తో బాధ పడుతున్న ఆయన ఓ రోజు చికిత్స కోసం నా వద్దకు వచ్చారు. ఆయనకు రక్త పరీక్షలు నిర్వహించగా బైల్‌రూబిన్ లెవల్స్ ఉండాల్సిన దానికన్నా చాలా ఎక్కువ ఉన్నాయి. ఇక కాలేయం ఎంజైమ్స్ ఉండాల్సిన దానికన్నా ఎనిమిది రెట్లు ఎక్కువగా ఉన్నాయి. అన్నీ పరీక్షలు ఆయన మద్యం ఎక్కువగా సేవిస్తున్నాడనే తెలిపాయి. అయితే ఆ రోగి మాత్రం ఆ విషయాన్ని ఖండించారు. తాను జీవితం ఒక్క చుక్క కూడా మద్యం ముట్టుకోలేదని వాదించారు. ఆయన మరీ లావుగానీ, బక్కగాగానీ లేకుండా దృఢంగా ఉన్నారు. కాలేయ వ్యాధి ఎందుకు వచ్చిందో తెలుసుకునేందుకు ఆయనపై వివిధ రకాల వైరస్లు, బయాటిక్ పరీక్షలు నిర్వహించాం. అన్నీ నెగటివ్ ఫలితాలు వచ్చాయి. డెంగ్యూ, టైఫాయిడ్, అరుదైన క్యాన్సర్ పరీక్షలూ నిర్వహించాం. అయినా నెగటివ్ ఫలితాలే వచ్చాయి. రోజు రోజుకు రోగికి జాండీస్ జబ్బు పెరుగుతోంది. బయాప్సీ చేయాలని నిర్ణయించాను. ఒక్క క్యాన్సర్లకే కాకుండా జబ్బుకు అసలు కారణం ఏమిటో తెలుసుకోవడానికి కూడా ఈ బయాప్సీ ఉపయోగ పడుతుంది. రోగి అంగీకారంతో బయాప్సీ పరీక్ష నిర్వహించాం. అతిగా మద్యం తాగడం వల్ల వచ్చే ‘సీవియర్ ఆల్కహాలిక్ హెపటైటీస్’ ఉందని ఆ పరీక్షలో తేలింది. దాదాపు ప్రతిరోజు అతిగా తాగేవాళ్లకే ఈ జబ్బు వస్తుంది. రోగిని పిలిచి తిట్టాను నిజం చెప్పమని. తాను నిజమే చెబుతున్నానని, అబద్ధం చెప్పడం లేదని అన్నారు. లాభం లేదనుకొని ఆయన భార్య, కూతుళ్లను పిలిపించి వారిని ప్రశ్నించాను. రోగికి ఎప్పుడు కూడా మద్యం అలవాటు లేదని, తామంతా మూడు పూటలా కలిసే తింటామని, రాత్రిపూట కలిసే ఉంటామని వారు చెప్పారు. ఇంకా ఏమీ అలవాట్లు ఉన్నాయిని ప్రశ్నించాను. తిన్నాక రెండు పూటల తిన్నది అరిగేందుకు ఆయుర్వేదం మందు తాగుతారని ఆయన భార్య తెలిపింది. ‘దశమూలారిష్టం’ తీసుకుంటానని రోగి చెప్పారు. నాకు ఆశ్చర్యం వేసింది. అది కేరళలో ప్రతి రెండు ఇళ్లలో ఒకరి ఇంట్లో ఉంటుంది. ఎక్కువ మంది అన్నం జీర్ణం అయ్యేందుకే దాన్ని వాడుతుంటారు. దాన్ని 30 వన మూలికలతో తయారు చేస్తారు. అందులో ‘వుడ్ఫోర్డియా ఫ్రూటికోసా’ అని పువ్వులు కూడా కలుపుతారు. వాటిని మురగబెడితే ద్రాక్షలాగా ఆల్కహాల్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఆ ఆల్కహాలే జీర్ణ వ్యవస్థకు ఎక్కువగా తోడ్పడుతుంది. కొంత మంది వైద్యులు ఆ పువ్వులు త్వరగా కుళ్లడానికి బ్రెడ్డులో వాడే బేకింగ్ పౌడర్‌ను వాడుతారు. మరికొందరు వైద్యులు నేరుగా ఆల్కహాలును కలిపి ఔషధాన్ని తయారు చేస్తున్నారు. కేరళలో మద్యపానంపై నిషేధం ఉండడం వల్ల ‘దశమమూలారిష్టం’ను ఎక్కువగా వాడుతున్నారని తోటి వైద్యుల ద్వారా తెల్సింది. అన్నం జీర్ణం కోసం వాడే వాళ్లు దీన్ని రోజుకు నాలుగుసార్లు వాడుతుండగా, మద్యం అలవాటున్నవాళ్లు ఎక్కువగా తాగుతున్నారని తెల్సింది. నాలుగు సార్లు తీసుకునే మందులో 35 గ్రాముల ఆల్కహాలు ఉంటుంది. ఆ మందులో మొత్తం ఆల్కహాలు శాతం ఎనిమిది నుంచి పది శాతం ఉంటుంది. కాలేయ వ్యాధి రావడానికి ఆ మాత్రం ఆల్కహాలు చాలు కనుక ఈ ఔషధం కారణంగా నా రోగికి కాలేయ వ్యాధి వచ్చిందని తెల్సి ట్రీట్మెంట్ మొదలుపెట్టాను. నా రోగిలో ఆల్కహాలిక్స్‌లో ఉండని లివర్‌ను దెబ్బతీసే ‘నెక్రోసిస్’ కూడా ఉందని మా ల్యాబ్ అసిస్టెంట్ ద్వారా తెల్సింది. నా రోగిని పిలిపించి ఇంకా ఏమేమి తాగుతావని అడిగాను. తన తోటలో పండించే పైనాపిల్ జ్యూస్ రోజు తాగుతానని చెప్పారు. ఆయన తినే పైనాపిల్స్‌ను తెప్పించి వాటిని ల్యాబ్‌లో పరీక్షించాం. వాటిల్లో ‘నికల్ టెట్రాకార్బనిల్’, అసెటిల్ పెంటాకార్బనిల్, కార్బామిక్ ఆసిడ్స్’ ఉన్నాయని తేలింది. ఎరువులు ఎక్కువగా వాడడంలో అవి అందులోకి వచ్చాయి. నా రోగికి ‘టాక్సిక్ హెపటైటీస్’ కూడా ఉంది కనుక, అది పైనాపిల్స్ వల్ల వచ్చిందని తేలింది. ట్రీట్మెంట్తో రోగి పూర్తిగా కోలుకున్నాడు. (కొచ్చీలోని ఈఎంసీ హాస్పిటల్‌కు అనుబంధమైన ‘గ్యాస్ట్రో ఎంట్రాలజీ యూనిట్’లో స్పెషలిస్ట్‌గా పనిచేస్తున్న డాక్టర్ సిరియాక్ అబీ ఫిలిప్స్ ‘ది అమెరికన్ జనరల్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ’ తాజా సంచికలో రాసిన వ్యాసానికి అనువాదం) -
కామెర్లు ఎందుకు వస్తాయి? అవి ప్రమాదకరమా?
లివర్ కౌన్సెలింగ్ మా బాబాయ్ వయసు 60 ఏళ్లు. పదవీ విరమణ తర్వాత దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్తున్నారు. ఏడాది కిందట ఒకసారి వేరే రాష్ట్రానికి వెళ్లినప్పుడు బస్సు ప్రమాదంలో తీవ్రంగా గాయపడితే అక్కడి ఆసుపత్రిలో రక్తం ఎక్కించారు. మా ఊరికి తిరిగివచ్చిన తర్వాత మూడు–నాలుగు నెలల తర్వాత కామెర్లు వస్తే స్థానికంగా పసరు మందు వేయించాం. మళ్లీ పరిస్థితి దిగజారడంతో మళ్లీ హాస్పిటల్లో చేర్చాం. హెపటైటిస్–బి వైరల్ ఇన్ఫెక్షన్ అని చెప్పి చికిత్స చేశారు. అయినప్పటికీ పూర్తిగా కోలుకోలేకపోయారు. వ్యాధి బాగా ముదిరి ఉంటుందని ఇక్కడి మా స్థానిక ఆసుపత్రిలోని డాక్టర్లు అనుమానిస్తున్నారు. హెపటైటిస్ వైరల్ ఇన్ఫెక్షన్ వస్తే కాలేయం పనిచేయదా? అసలు కామెర్లు ఎందుకు వస్తాయి? కామెర్లు వచ్చి తగ్గాక కాలేయం మళ్లీ మామూలుగా పనిచేయగల అవకాశం ఉండదా? దయచేసి వివరంగా చెప్పండి. – సీహెచ్ దివాకర్, నిజామాబాద్ బస్సు ప్రమాదంలో గాయపడినప్పుడు మీ బాబాయిగారికి ఎక్కించిన రక్తం హెపటైటిస్–బి వైరస్‌తో కలుషితమైనది కావడం వల్ల ఇన్ఫెక్షన్ సోకి ఉంటుంది. హెపటైటిస్–ఏ, బి, సీ, ఈ వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల ఎక్కువ మంది మొదట కామెర్ల వ్యాధికి గురవుతుంటారు. హెపటైటిస్ వైరసుల వల్ల వచ్చే కామెర్లు చాలా ప్రమాదకరం. హెపటైటిస్ ఏ, ఈ వైరసుల వల్ల హఠాత్తుగా కామెర్ల వ్యాధి సోకి మరణించే ప్రమాదం ఉంటుంది. ఇక కామెర్ల వ్యాధికి గురై, దానిని గుర్తించడంలో ఆలస్యం జరగడం, నాటు మందుల వాడకం కాలేయానికి తీరని నష్టాన్ని కలగజేస్తుంది. దీర్ఘకాలంలో వ్యక్తి ఆరోగ్యస్థితిని ప్రమాదంలోకి నెడుతుంది. ఈ రకమైన నిర్లక్ష్యం కాలేయ క్యాన్సర్‌కు దారితీసే ప్రమాదం ఉంది. ఇక చికిత్స విషయానికి వస్తే హెపటైటిస్, దానివల్ల తలెత్తే ఇతర పరిణామాలను అదుపు చేయడానికి ఇప్పుడు మంచి ఫలితాలు ఇవ్వగల మందులు అందుబాటులోకి వచ్చాయి. హెపటైటిస్ బి, సి వ్యాధులు సోకినప్పుడు మందులతో చికిత్స చేసి నయం చేయడానికి వీలువుతుంది. హెపటైటిస్ సోకినా కొంతమందిలో చాలాఏళ్ల వరకు దానివల్ల జరుగుతున్న నష్టం సూచనప్రాయంగా కూడా గుర్తించలేకపోతారు. ఇలా జరగడం వల్ల వ్యాధిని గుర్తించక, వెంటనే చికిత్స చేయించుకోని పక్షంలో అది ముదిరి కాలేయం పనితీరు తీవ్రంగా దెబ్బతింటుంది. ఒకవేళ చికిత్స విషయంలో దీర్ఘకాలం నిర్లక్ష్యం చేస్తే పరిస్థితి చేజారిపోయే అవకాశం ఉంటుంది. కాలేయం పూర్తిగా పనిచేయలేని స్థితికి చేరుకుంటుంది. అలాంటి పరిస్థితే వస్తే... ఇక కాలేయం మార్పిడి మాత్రమే దీనికి నమ్మకమైన చికిత్స. అయితే హెపటైటిస్ వ్యాధిని కలిగించే వైరస్ల బారిన పడకుండా జాగ్రత్తపడే అవకాశం ఉంది. వీటిలో మొట్టమొదటివి పరిసరాల, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం; ఆహారం, తాగునీరు కలుషితం కాకుండా చూసుకోవడం. హెపటైటిస్ వ్యాధి రాకుండా తీసుకోగల జాగ్రత్తలో వ్యాక్సినేషన్ ముఖ్యమైనది. ఇదివరకటితో పోలిస్తే ఈ వ్యాక్సిన్లు బాగా లభ్యమవుతున్నాయి. అప్పటితో పోలిస్తే ఇప్పుడవి తక్కువ ధరకే లభ్యమవుతున్నాయి. కారణం ఏదైనా సరే కామెర్లు కనిపించగానే తగిన పరీక్షలు చేయించుకొని, డాక్టర్లతో చికిత్స చేయించుకోవడం ద్వారా కాలేయం దెబ్బతినకుండా చూసుకోవచ్చు. తద్వారా భవిష్యత్తులో ప్రాణాపాయకరమైన కాలేయ క్యాన్సర్‌ను నివారించుకోవచ్చు. మద్యంతో మావారి కాలేయం చెడిపోయింది... ఏం చేయాలి? మావారి వయసు 57 ఏళ్లు. గత పాతికేళ్లుగా మద్యం తాగుతున్నారు. రెండేళ్ల కిందట తీవ్ర అనారోగ్యానికి గురైతే ఆసుపత్రిలో చేర్పించాం. లివర్ దెబ్బతిన్నదని చెప్పారు. తాగడం మానేయమన్నారు. లేదంటే లివర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీకి వెళ్లాల్సి ఉంటుందని చెప్పారు. కానీ ఆయన మానలేకపోయారు. ఇటీవల తరచూ చాలా నీరసంగా ఉంటుందంటున్నారు. ఎక్కువగా నిద్రపోతున్నారు. తిండి బాగా తగ్గించారు. ఇప్పటికీ సర్జరీ చేయించుకోవచ్చా? దీనితో సమస్యలు ఏవైనా ఉన్నాయా? దయచేసి వివరంగా తెలపండి. – లక్ష్మీప్రసన్న, కోదాడ మితిమీరిన మద్యపానం వల్ల మీ భర్త కాలేయం తీవ్రంగా దెబ్బతిన్నది. కాలేయం తనకు నష్టం కలిగిస్తున్న అలవాట్లు, వ్యాధులను గుర్తించి, వాటిని సరిచేసుకోడానికి రోగికి చాలా అవకాశం ఇస్తుంది. మద్యపానం వంటి అలవాట్ల వల్ల దెబ్బతిన్నా, తొలిదశలో యధావిధిగా పనిచేస్తుంది. కానీ నిర్లక్ష్యం చేసినా, నష్టం కలిగించే అలవాటును మానకపోయినా హఠాత్తుగా కుప్పకూలిపోతుంది. వ్యాధుల వల్ల కాలేయానికి జరిగిన నష్టాన్ని బట్టి దానిని మూడు స్థాయులుగా గుర్తిస్తారు. వాటిని ఏ, బి, సి ‘చైల్డ్ పగ్ స్టేజెస్’ అంటారు. ‘ఎ’ ఛైల్డ్ స్థాయిలోనే డాక్టర్ వద్దకు రాగలిగితే మందులతో, అలవాట్లలో మార్పులతో చికిత్స చేసి, కాలేయ పనితీరును పూర్తి సాధారణ స్థాయికి పునరుద్ధరించవచ్చు. మొదటి రెండు (ఏ, బీ ఛైల్డ్ స్టేజెస్) స్థాయుల్లోనూ చాలావరకు తిరిగి కోలుకోవడానికి కాలేయం అవకాశం ఇస్తుంది. బీ, సీ స్థాయులలోకి వస్తే వ్యాధి తీవ్రత, వ్యక్తి తట్టుకోగల శక్తిని అంచనావేసి, కాలేయమార్పిడి చికిత్సను సిఫార్సు చేస్తారు. మీరు తెలిపిన వివరాలు, లక్షణాల ప్రకారం రెండేళ్ల క్రితమే మీ భర్త కాలేయ వ్యాధి ‘బి’ స్థాయికి చేరుకున్నది. మద్యం మానలేకపోవడం వల్ల అది చివరిదశ ప్రారంభంలోకి ప్రవేశించినట్లుగా ఉంది. ఇప్పుడు మద్యం పూర్తిగా మానివేయడంతో పాటు కాలేయ మార్పిడి ఒక్కటే ఆయనను కాపాడగలదు. లివర్ ట్రాన్స్‌ప్లాంట్ గూర్చి మీరు ఆందోళన పడాల్సిన పనిలేదు. ఆధునిక వైద్యచికిత్సల్లో ఇటీవల వచ్చిన పురోగతి, వ్యాధి నిర్ధారణ పరీక్షలు, శక్తిమంతమైన మందులు, కచ్చితమైన శస్త్రచికిత్సలు, కాలేయ మార్పిడి శస్త్రచికిత్సలు అత్యధిక శాతం విజయవంతమవుతుండటం అనే అంశాలు ఇప్పుడు కాలేయ వ్యాధుల సక్సెస్రేట్పై నమ్మకాన్ని పెంపొందిస్తున్నాయి. కాబట్టి మీరు ఆందోళన పడకుండా మరోసారి మీ డాక్టర్‌ను కలిసి కాలేయ మార్పిడి శస్త్రచికిత్సకు సిద్ధపడండి. డాక్టర్ బాలచంద్ర మీనన్, సీనియర్ లివర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్, డిపార్ట్మెంట్ ఆఫ్ హెపటాలజీ అండ్ లివర్ డిసీజెస్, యశోద హాస్పిటల్స్, సికింద్రాబాద్ -
నన్ను కాదని వెళ్తే జాండీస్ సోకుతుంది
లక్నో: యూపీ మంత్రి, వివాదాల పుట్ట ఓం ప్రకాశ్ రాజ్‌భర్ మరోసారి తన నోటికి పని చెప్పారు. రాజకీయ ప్రత్యర్థులకు ఆయన విచిత్రమైన శాపనార్థాలు పెట్టారు. తనకు వ్యతిరేకంగా ఎవరైనా ర్యాలీలు నిర్వహించినా, లేదా ఎవరైనా ఆ ర్యాలీలో ఎవరైనా పాల్గొన్న... వారు జాండీస్ సోకుతుందంటూ వ్యాఖ్యలు చేశారు. ఆదివారం బల్లియాలో నిర్వహించిన మద్యపాన నిషేధ ర్యాలీలో ఆయన పాల్గొని మాట్లాడారు. ‘నా తరపు మనుషులు వచ్చి పిలిస్తేనే మీరు మా ర్యాలీల్లో పాల్గొనాలి. అలా కాదని నా రాజకీయ ప్రత్యర్థుల ర్యాలీలో వెళ్లారో జాగ్రత్త. మీకు జాండీస్ సోకుతుంది. ఇదే నా శాపం. పైగా దానికి నేను మందిస్తేనే మీకు నయం అవుతుంది.’ అని వ్యాఖ్యానించారు. కాగా, యూపీ ఎన్నికల సందర్భంగా ప్రధాని మోదీ గుజరాత్ మోడల్‌ను ఇక్కడ ప్రవేశపెడతా అని చెప్పారని, కానీ, ఇంత వరకు అది నెరవేర్చలేదని రాజ్‌భర్ ప్రస్తావించారు. మద్యపాన నిషేధంతోపాటు మిగతా హామీలను కూడా మోదీ నెరవేరిస్తే మంచిదని రాజ్‌భర్ వ్యాఖ్యానించారు. కాగా, ‘సుహెల్దేవ్ భారతీయ సమాజ్’ పార్టీ చీఫ్ అయిన ఓం ప్రకాశ్ రాజ్‌భర్ ప్రస్తుతం యూపీ సంకీర్ణ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు. గత కొంత కాలంగా బీజేపీ విధానాలపై, యోగి సర్కార్‌పై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆయన విమర్శలు చేస్తూ వస్తున్నారు. ముఖ్యంగా ఎస్సీ/ఎస్టీ రిజర్వేషన్ల అంశంలో బీజేపీ మోసం చేసిందంటూ ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో త్వరలో ఆయన కూటమి నుంచి వైదొలిగే సంకేతాలు ఉన్నట్లు ఆయన అనుచరులు చెబుతున్నారు. -
కాలేయం సైజు పెరిగింది. ఎందుకిలా?
గ్యాస్ట్రోఎంటరాలజీ కౌన్సెలింగ్ నా వయసు 35 ఏళ్లు. నేను నిద్రపోయే సమయంలో ఛాతీ కింద ఎడమవైపున గత వారం నుంచి నొప్పి వస్తోంది. డాక్టర్‌ను సంప్రదిస్తే లివర్ సైజు పెరిగిందని చెప్పారు. లివర్ సైజు ఎందుకు పెరుగుతుందో దయచేసి తెలియజేయండి. – హేమంత్‌కుమార్, శ్రీకాకుళం కాలేయం పెరగడానికి వివిధ రకాల కారణాలు ఉండవచ్చు. ఆల్కహాల్ ఎక్కువ మోతాదులో తీసుకునేవారిలో, స్థూలకాయం ఉన్నవారిలో కాలేయంలో కొవ్వు పేరుకుపోయి లివర్ సైజ్ పెరిగే అవకాశం ఉంది. మీ లేఖలో మీరు స్థూలకాయులా లేదా మీకు ఆల్కహాల్ అలవాటు ఉందా లేదా తెలియజేయలేదు. కొన్ని రకాల వైరల్ ఇన్ఫెక్షన్లు, హైపటైటిస్–బి, హెపటైటిస్–సి వంటి ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా లివర్ పెరిగే అవకాశం ఉంది. కానీ మీరు రాసిన కాలేయం పరీక్షలో అన్నీ నార్మల్‌గా ఉన్నాయి కాబట్టి అలాంటివి ఉండే అవకాశం తక్కువ. ముందుగా మీలో లివర్ పరిమాణం ఎంత పెరిగిందో తెలుసుకోడానికి అల్ట్రా సౌండ్ స్కానింగ్ పరీక్ష చేయించండి. మీకు వస్తున్న కడుపులో నొప్పి ఎడమవైపు ఛాతీ కింది భాగంలో వస్తోంది కాబట్టి ఒకసారి ఎండోస్కోపీ కూడా చేయించగలరు. ఈ రెండు పరీక్షల వల్ల మీలో కాలేయం పరిమాణం పెరగడానికి కారణంతో పాటు నొప్పి ఎందుకు వస్తోంది అన్న విషయం కూడా తెలిసే అవకాశం ఉంది. మీకు మద్యం తాగడం, పొగతాగడం వంటి అలవాట్లు ఉంటే వాటిని వెంటనే మానేయండి. లివర్కూ, కిడ్నీకీ సంబంధం ఏమిటి? నా వయసు 58 ఏళ్లు. నేను ‘సిర్రోసిస్ ఆఫ్ లివర్’ అనే వ్యాధితో బాధపడుతున్నాను. కడుపులో నీరు వచ్చి చేరుతోంది. డాక్టర్‌కు చూపించుకుంటే ‘మీ కిడ్నీ సరిగా పనిచేయడం లేద’న్నారు. కిడ్నీ పనితీరుకూ కడుపులో నీరు చేరడానికి సంబంధం ఏమిటో అర్థం కాలేదు. కడుపులో నీరు తగ్గేదెలా? – డి. రామమూర్తి, ఒంగోలు మీరు చెబుతున్న లక్షణాలు బట్టి చూస్తే మీ కాలేయం పూర్తిగా చెడిపోయిన దశలో ఉన్నారు. కాలేయం చెడిపోవడం వల్ల కడుపులో నీరు చేరడం, కాళ్లల్లో వాపు రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ సమస్యకు తొలిదశలో ఉప్పు తక్కువగా వాడటం, మూత్రం ఎక్కువగా వచ్చేటట్లు చేసే మందులు వాడాలి. కానీ మీ డిడ్నీ వ్యవస్థ సరిగా లేనందున ఆ మందులు వాడటం కుదరదు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి రెండువారాలకు ఒకసారి కడుపులో నీరు తీయించుకోవడమే గాక... కొన్ని ఇంజెక్షన్స్ చేయించుకోవాలి. దీనివల్ల మీరు కొంతవరకు ఉపశమనం పొందవచ్చు. దీంతోపాటు ఉప్పును పూర్తిగా తగ్గించుకోవాలి. నీరు కూడా జాగ్రత్తగా తక్కువగా తాగడం మంచిది. ఈ సమస్యకు కాలేయమార్పిడి శస్త్రచికిత్సే మంచి పరిష్కారం. కాలేయ మార్పిడి వల్ల మీకు ఉన్న సమస్యను పూర్తిగా తొలగించవచ్చు. కాబట్టి మీరు కాలేయ మార్పిడి వైద్యుడిని కలిసి మాట్లాడి తగిన నిర్ణయం తీసుకోండి. అప్పటి వ్యాధి ఇప్పుడు తిరగబెట్టిందా? నా వయసు 47 ఏళ్లు. కొన్నేళ్ల కిందట నాకు ఆపరేషన్ చేసి ఎడమవైపు రొమ్ము తొలగించారు. ఇంతకాలంగా నాకు ఎలాంటి సమస్యా లేదు. కానీ నెల రోజుల నుంచి కళ్లు పచ్చగా కనిపిస్తున్నాయి. ఆకలి తగ్గింది. నీరసంగా ఉంటోంది. అప్పుడప్పుడూ కడుపులో నొప్పి వస్తోంది. గతంలో రొమ్ముకు వచ్చిన వ్యాధి ఇప్పుడు కడుపులోకి పాకిందంటారా? నాకు తగిన సలహా ఇవ్వండి. – ఒక సోదరి, హైదరాబాద్ మీరు రాసిన విషయాలను బట్టి చూస్తే క్యాన్సర్ కారణంగా గతంలో మీకు రొమ్ము తొలగించారని అర్థమవుతోంది. ప్రస్తుతం మీరు కామెర్లతో బాధపడుతున్నారు. గతంలో ఉన్న రొమ్ముక్యాన్సర్ ప్రభావం కాలేయంపైన కూడా పడే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఒకసారి అల్ట్రాసౌండ్ స్కానింగ్, కాలేయానికి సంబంధించిన రక్తపరీక్షలు చేయించుకోండి. ఈ పరీక్షల్లో మీ సమస్య బయటపడుతుంది. ఒకవేళ క్యాన్సర్ వల్ల మీ లివర్ ప్రభావితమైతే, దీన్ని వీలైనంత త్వరగా గుర్తించి, వెంటనే చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మీరు వీలైనంత త్వరగా దగ్గర్లోని గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్‌ను సంప్రదించి, పరీక్షలు చేయించి, అవసరమైన చికిత్స తీసుకోగలరు. బాబు కళ్లు పచ్చ బారుతున్నాయి... ఏం చేయాలి? మా బాబు వయసు పదకొండేళ్లు. ఎనిమిదేళ్ల వయసప్పుడు అతడికి పచ్చకామెర్లు వచ్చాయి. అవి నెలలోపు వాటంతట అవే తగ్గిపోయాయి. మళ్లీ రెండు వారాల క్రితం నుంచి కళ్లు పచ్చగా కనిపిసర్తున్నాయి. దయచేసి సలహా ఇవ్వగలరు. – ప్రకాశ్‌రావు, నిజామాబాద్ మీ అబ్బాయి వయసులోని వారికి ప్రధానంగా హైపటైటిస్ ఎ, హెపటైటిస్ ఈ అనే వైరస్ల వల్ల కామెర్లు రావడానికి అవకాశం ఉంటుంది. మీవాడికి ఇంతకుముందు కూడా ఒకసారి కామెర్లు వచ్చాయంటున్నారు. కాబట్టి ఈ వైరస్ వల్ల మళ్లీ మళ్లీ ఇన్ఫెక్షన్ సోకే అవకాశం చాలా అరుదు. ఒకసారి పై ఇన్ఫెక్షన్లు సోకితే వాటి పట్ల వ్యాధి నిరోధకశక్తి అభివృద్ధి అయ్యే అవకాశం ఉంది. దీన్ని బట్టి చూస్తే మీ బాబు కామెర్లకు ఇతర కారణాలు అంటే... విల్సన్ డిసీజ్ వంటివి ఉండవచ్చు. మీ బాబుకు దురద, రక్తహీనత వంటి లక్షణాలు ఉన్నాయా, లేవా అన్న విషయం మీరు రాయలేదు. మీరు ఆందోళన చెందకుండా దగ్గర్లోని గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్‌కు చూపించుకుని అవసరమైన పరీక్షలు చేయించండి. డాక్టర్ భవానీరాజు సీనియర్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్ -
సెల్ఫీతో కామెర్లను గుర్తించవచ్చు!
రక్తంలోకి బైలిరూబిన్ అనే పదార్థం ఎక్కువగా విడుదల కావడం వల్ల వచ్చే కామెర్ల వ్యాధిని ముందుగా గుర్తించడం కష్టం. రక్త పరీక్ష చేస్తేగానీ గుర్తించలేని ఈ వ్యాధిని.. కేవలం ఓ సెల్ఫీతో గుర్తించవచ్చట. అదీ ముందుగానే. వాషింగ్టన్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు ఇందుకు సంబంధించి ఓ యాప్‌ను అభివృద్ధి చేశారు. ఈ యాప్‌లోని కెమెరాతో సెల్ఫీ దిగితే.. మనకు కామెర్ల(జాండీస్) వ్యాధి వచ్చే అవకాశముందా? లేదా? అనే విషయాన్ని ముందుగానే గుర్తించి చెబుతుందట. ఈ విషయమై యూనివర్సిటీ శాస్త్రవేత్త ఒకరు మాట్లాడుతూ.. ‘జాండీస్ రావడానికి ముందు మనిషి కళ్లలో అనేక మార్పులు సంభవిస్తాయి. వాటిని గుర్తించి, విశ్లేషించి వందశాతం సరైన సమాచారం అందించేలా ఈ యాప్‌ను అభివృద్ధి చేశాం. అంతేకాదు పాంక్రియాటిక్ కేన్సర్‌ను కూడా ముందుగానే గుర్తించవచ్చు. గుర్తించిన వెంటనే చికిత్స చేయించుకుంటే ప్రాణహాని తప్పుతుంది’ అని ఆయన అన్నారు. -
మడిపల్లి గ్రామానికి కామెర్లు
⇒ ఇప్పటికే ఇద్దరు యువకులు మృతి ⇒ ఆస్పత్రిలో మరో 60 మంది బాధితులు హసన్‌పర్తి: వరంగల్ అర్బన్ జిల్లా హసన్‌పర్తి మండలం మడిపల్లి గ్రామం పచ్చకామెర్ల వ్యాధితో బాధపడుతోంది. ఈ వ్యాధికి గురైన ఇద్దరు యువకులు ఆస్పత్రిలో బుధవారం వేకువజామున మృతిచెందారు. ఒకరు వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రిలో ప్రాణాలు వదలగా, మరొకరు హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆస్పత్రిలో మృతిచెందాడు. గ్రామానికి చెందిన ఉపాధి హామీ పథకం కంప్యూటర్ ఆపరేటర్ కాందారి సురేందర్(30) మూడు రోజుల క్రితం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో బుధవారం చనిపోయాడు. కామెర్ల వ్యాధి సోకడం వల్ల కిడ్నీ, కాలేయం దెబ్బతిని మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. ఇదే ప్రాంతానికి చెందిన ఆటో డ్రైవర్ బొనగాని శ్రీమంత్ (18) వరంగల్ ఎంజీఎంలో చికిత్స పొందుతూ మంగళవారం మరణించాడు. ఆస్పత్రిలో మరో 60 మంది మడిపల్లిలో కామెర్ల వ్యాధి సోకి మరో 60 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని స్థానికులు తెలిపారు. మరికొంత మంది ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లే ఆర్థిక స్తోమత లేక స్థానికంగా వైద్యం చేయిం చుకుంటున్నారని గ్రామస్తులు చెప్పారు. అర్బన్ జిల్లా జాయింట్ కలెక్టర్ దయానంద్ బుధవారం గ్రామాన్ని సందర్శించారు. పారి శుద్ధ్యం, తాగునీటి వ్యవస్థను పరిశీలించారు. కామెర్ల వ్యాధితో బాధపడుతున్న వారి ఇళ్లకు వెళ్లి పరామర్శించారు. -
కామెర్లకు, ఎర్ర రక్తకణాలకు గల సంబంధం ఏమిటి?
హెమటాలజీ కౌన్సెలింగ్ మా బాబుకు పన్నెండేళ్లు. అతడికి ఈ మధ్య పచ్చకామెర్లు వచ్చాయి. అంటే ఏమిటి? దానికి కారణాలు, జాగ్రత్తలు చెప్పండి. కామెర్లకు, ఎర్ర రక్తకణాలకు మధ్య సంబంధం ఏమిటి? - సురేశ్, వరంగల్ రక్తంలోని ఎర్రరక్తకణాల విచ్ఛిత్తి జరుగుతూ బిలురుబిన్ అనే రంగు పదార్థం తయారవుతుంటుంది. రక్తంలో ఈ బిలురుబిన్ పరిమాణం రెట్టింపు అవ్వడం వల్ల వచ్చేవే పచ్చకామెర్లు. వీటినే జాండిస్ అని కూడా అంటారు. కామెర్లు వచ్చిన వారి చర్మం, కళ్లు పసుపుపచ్చ రంగులో కనిపిస్తాయి. పచ్చకామెర్లు వ్యాధి కాదు. ఇది వ్యాధి తాలూకు ఒక లక్షణం. ఇది రావడానికి మూడు ముఖ్య కారణాలు. అవి... 1) రక్తంలో ఎర్రరక్తకణాలు అత్యధికంగా విచ్ఛిత్తికావడం. దీన్ని హీమోలిటిక్ జాండీస్ అంటారు. 2) ఎర్రరక్తకణాల విచ్ఛిత్తి వల్ల చోటుచేసుకున్న బిలురుబిన్ లివర్ కణాలలోకి చేరలేకపోవడం. దీన్ని ‘హెపాటిక్ జాండీస్’ అంటారు. 3) లివర్‌లో ఉత్పత్తి అయిన పైత్యరసం (బైల్) ప్రవాహమార్గంలో అవరోధం ఏర్పడి, అది పేగులలోకి చేరలేకపోవడం. దీన్ని ‘అబ్స్ట్రక్టివ్ జాండిస్’ అంటారు. లివర్ ఇన్ఫెక్షన్కు గురైనట్లయితే ‘హెపటైటిస్’ అని వ్యవహరిస్తారు. హెపటైటిస్ కేసుల్లో హెపాటిక్ జాండిస్ చోటుచేసుకుంటుంది. హెపటైటిస్‌కు ప్రధాన కారణాలు: ఇన్ఫెక్షన్ ఆల్కహాల్ పౌష్టికాహార లోపం. ఇన్ఫెక్షన్ పరంగా ఐదు రకాల వైరస్‌లను గుర్తించారు. ఇవి.. హెపటైటిస్ ఎ, బి, సి, డి, ఈ. నివారణ : కామెర్ల నివారణకు ఆహారంలో కొన్ని నియమాలు పాటించాలి ఏ ప్రాంతంలో ఉన్నా, తాగే నీటిని కాచి, వడబోసి, చల్లార్చి వాడటం మంచిది. లేదా ఫిల్టర్ చేసిన నీటిని మరగబెట్టయినా వాడవచ్చు పచ్చకామెర్లు సోకితే దుంపలు వాడకూడదు. అలాగే సరిగా జీర్ణం కానివి ఏవీ వాడకూడదు మజ్జిగ బాగా వాడాలి. కొబ్బరినీళ్లు తాగాలి. అరటిపండ్లు బాగా తినాలి మాంసాహారులు మాంసానికీ, చేపలకు దూరంగా ఉండాలి గోంగూర ప్రియులు విధిగా దానికి దూరంగా ఉండాలి ఆవకాయ, మాగాయ వాడకపోతే భోజనం పూర్తయినట్లు కాదని భావించేవాళ్లు కొన్నాళ్లు వాటికి గుడ్‌బై చెప్పాలి కారం, పులుపు, ఉప్పు తగ్గించక తప్పదు. - డా॥శైలేశ్ ఆర్ సింగీ సీనియర్ హిమటో ఆంకాలజిస్ట్, బీఎమ్‌టీ స్పెషలిస్ట్, సెంచరీ హాస్సిటల్స్, హైదరాబాద్ పీడియాట్రిక్ కౌన్సెలింగ్ మా బాబుకు రెండున్నర నెలల వయసు. అదేపనిగా ఏడుస్తున్నాడు. మా బాబు సమస్య ఏమిటి? తగిన సలహా చెప్పండి. - నాగరాజు, ఆదిలాబాద్ పిల్లలు తమ బాధలను ఏడుపు ద్వారానే వ్యక్తపరుస్తుంటారు. వాళ్లు కమ్యూనికేట్ చేసే ఒక విధానం ఏడుపు. అందుకే పిల్లలు ఏడుస్తున్నప్పుడు వాళ్లకు ఏదైనా సమస్య ఉందేమోనని తల్లిదండ్రులు అనుమానించాలి. పిల్లల్లో ఏడుపుకు కొన్ని ముఖ్య కారణాలు: ఒ ఆకలి వేసినప్పుడు ఒ భయపడినప్పుడు ఒ దాహం వేసినప్పుడు ఒ పక్క తడిగా అయినప్పుడు ఒ పళ్ళు వస్తున్నప్పుడు ఒ ఇన్ఫెక్షన్లు ముఖ్యంగా యూరినరీ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు ఒ కడుపు నొప్పి (ఇన్‌ఫ్యాంటైల్ కోలిక్) ఒ జ్వరం ఒ జలుబు ఒ చెవినొప్పి ఒ మెదడువాపు జ్వరం ఒ గుండె సమస్యలు ఒ కొన్ని జన్యుపరమైన సమస్యలు వంటి తీవ్రమైన వాటిని కూడా పిల్లలు ఏడుపు ద్వారానే తెలియపరుస్తారు. కొన్ని సందర్భాల్లో ఫిట్స్ సమస్యను కూడా ఏడుపు రూపంలోనే వ్యక్తపరుస్తుండవచ్చు. ఇన్‌ఫ్యాంటైల్ కోలిక్: చిన్న పిల్లల్లో ఏడుపుకు సాధారణ కారణం కడుపునొప్పి. దీన్నే ఇన్‌ఫ్యాంటైల్ కోలిక్ అంటారు. సాధారణంగా మూడు నెలలలోపు పిల్లల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. ఒ ఆకలి, గాలి ఎక్కువగా మింగడం వల్ల, ఓవర్ ఫీడింగ్, పాలలో చక్కెరపాళ్లు ఎక్కువగా ఉండటం ఇన్‌ఫ్యాన్‌టైల్ కోలిక్‌కు కొన్ని కారణాలని చెప్పుకోవచ్చు. ఇటువంటి పిల్లలను ఎత్తుకోవడం (అప్ రైట్ పొజీషన్), ప్రాపర్ ఫీడింగ్ టెక్నిక్ (ఎఫెక్టివ్ బర్పింగ్ - తేన్పు వచ్చేలా చేయడం)తో ఏడుపు మాన్పవచ్చు. కొందరికి యాంటీస్పాస్మోడిక్స్తో పాటు మైల్డ్ సెడేషన్ ఇవ్వడం వల్ల ప్రయోజనం ఉంటుంది. అయితే యాంటీస్పాస్మోడిక్, మైల్డ్ సెడేషన్ అనే ఈ రెండు మందులు ఏడుపు చాలా తీవ్రంగా ఉన్నప్పుడు మాత్రమే ఇవ్వాలి. చిన్న పిల్లలు మరీ ఎక్కువగా ఏడుస్తుంటే అంటే పదే పదే ఏడవటం, ఆపకుండా ఏడవటం చేస్తుంటే తక్షణం పిల్లల డాక్టర్‌కు చూపించాలి. మీరు కూడా ఒకసారి మీ బాబును పీడియాట్రీషియన్‌కు చూపించండి. వారు తగిన కారణాన్ని కనుగొని, దానికి తగినట్లుగా చికిత్స అందిస్తారు. - డా. రమేశ్‌బాబు దాసరి సీనియర్ పీడియాట్రీషియన్,రోహన్ హాస్పిటల్స్, విజయనగర్ కాలనీ,హైదరాబాద్ హోమియో కౌన్సెలింగ్ నా వయసు 42 ఏళ్లు. నేను మార్కెటింగ్ వృత్తిలో కొనసాగుతున్నాను. నాకు కొంతకాలంగా కడుపులో విపరీతమైన మంటతోనూ, నొప్పి, అజీర్ణం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలతో బాధపడతున్నాను. డాక్టర్‌ను సంప్రదిస్తే గ్యాస్ట్రైటిస్ అన్నారు. మందులు వాడుతున్నంత సేపు బాగానే ఉన్నా, అవి మానేస్తే మళ్లీ మామూలే. అసలు ఈ సమస్య ఎందుకు వస్తుంది. హోమియో చికిత్స ద్వారా నయమవుతుందా? - నాగేశ్వరరావు, హైదరాబాద్ ప్రస్తుత ఆధునిక ప్రపంచంలో అధిక పని ఒత్తిడి వల్ల ఉరుకులు పరుగుల జీవితం గడుపుతున్న నేపథ్యంలో చాలామంది సరైన ఆహార నియమాలు పాటించకపోవడం, తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురికావడం, శారీరక శ్రమ పెద్దగా లేకపోవడం వంటి కారణాలతో చాలామంది గ్యాస్ట్రైటిస్ సమస్యతో బాధపడుతున్నారు. జీర్ణకోశం లోపల ఉండే మ్యూకస్ పొర ఇన్ఫ్లమేషన్ లేదా వాపునకు గురికావడాన్ని గ్యాస్ట్రైటిస్ అంటారు. మనం తీవ్రమైన ఒత్తిడికి గురైనప్పుడు మన మెదడు లాగే జీర్ణ వ్యవస్థ మీద కూడా ప్రభావం పడుతుంది. గ్యాస్ట్రిక్ సమస్యలు ఆకస్మికంగా మొదలై కొన్ని రోజుల వరకు ఉండి తగ్గిపోతే అక్యూట్ గ్యాస్ట్రైటిస్ అంటారు. దీర్ఘకాలికంగా ఇదే సమస్య ఉంటే దాన్ని క్రానిక్ గ్యాస్ట్రైటిస్ అంటారు. కొందరిలో గ్యాస్ట్రిక్ సమస్య ముదిరితే అవి కడుపులో అల్సర్స్ లేదా పుండ్లుగా ఏర్పడతాయి. కారణాలు: 20 నుంచి 50 శాతం అక్యూట్ గ్యాస్ట్రైటిస్‌లకు వైరస్, బ్యాక్టీరియా (ముఖ్యంగా హెలికోబ్యాక్టర్ పైలోరీ అనే బ్యాక్టీరియా) కారణమవుతుంది తీవ్రమైన మానసిక ఒత్తిడి, మద్యం ఎక్కువగా తీసుకోవడం, సమయానికి ఆహారం తీసుకోకపోవడం కొన్ని రకాల మందులు... ముఖ్యంగా పెయిన్ కిల్లర్స్ వాడటం పైత్య రసం వెనక్కి ప్రవహించడం కొన్ని జీర్ణకోశ వ్యాధులు, కొన్ని ఆటో ఇమ్యూన్ వ్యాధులు శస్త్రచికిత్స లేదా వంశపారంపర్య చరిత్ర ఉన్నవారిలో ఆహారంలో వేపుళ్లు, మసాలాలు, కారం, పులుపు వంటివి ఎక్కువగా తీసుకునే వారిలో గ్యాస్ట్రైటిస్ సమస్య కనిపిస్తుంది. లక్షణాలు: కడుపు నొప్పి, మంట కడుపు ఉబ్బరం, కొంచెం తిన్నా కడుపు నిండుగా అనిపించడం అజీర్ణం, వికారం, రక్తంతో కూడిన వాంతులు ఆకలి తగ్గిపోవడం కొందరిలో గ్యాస్ట్రిక్ సమస్య వల్ల మలం రంగు మారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. నివారణ కోసం పాటించాల్సిన జాగ్రత్తలు: సమయానికి ఆహారం తీసుకోవాలి కొద్దికొద్ది మోతాదుల్లో ఎక్కువ సార్లు తినాలి పొగతాగడం, మద్యపానం వంటి దురలవాట్లు పూర్తిగా మానేయాలి ఆహారంలో మసాలాలు, కారం, వేపుళ్లు తగ్గించాలి తిన్న వెంటనే పడుకోకూడదు. కనీసం రెండు గంటల తర్వాత నిద్రించాలి. చికిత్స: హోమియో వైద్య విధానం ద్వారా గ్యాస్ట్రిక్ సమస్యలకు చక్కటి పరిష్కారం లభిస్తుంది. ఈ సమస్యలకు మూలకారణమైన ఆమ్లాలు, తీవ్ర రసాయనాల సమతౌల్యతను చక్కదిద్దడం వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించవచ్చు. - డాక్టర్ శ్రీకాంత్ మోర్లావర్ ఫౌండర్ చైర్మన్ హోమియోకేర్ ఇంటర్నేషనల్,హైదరాబాద్ -
కురుపులు తగ్గినా బాధించే నొప్పి!
ఆయుర్వేద కౌన్సెలింగ్ పచ్చకామెర్లకు ఆయుర్వేదంలో చికిత్స, నివారణ వివరించండి. - పద్మజాలక్ష్మి, సికింద్రాబాద్ ఈ వ్యాధిని ఆయుర్వేదశాస్త్రకారులు ‘కామలా’ అని వివరించారు. ఆధునికంగా ‘జాండిస్ లేక ఇక్టెరస్’ అంటారు. లక్షణాలు: కళ్లు, మూత్రం పసుపుపచ్చగా ఉంటాయి. వ్యాధి ముదురుతున్న కొద్దీ గోళ్లు, చర్మం, ముఖం పసుపుపచ్చగా మారతాయి. ఆకలి సన్నగిల్లడం, అరుచి, మందజ్వరం, వాంతి, వికారం వంటి లక్షణాలు ఉంటాయి. దీనిని ‘కోష్ఠాశ్రీతకామలా’ అని చెప్పారు. దీనికి తోడు పొట్ట ఉబ్బరించినట్లయితే ‘కుంభకామలా’ అని పేర్కొంటారు. మలం తెలుపునలుపు మిశ్రమవర్ణంలో, అంటే పిండిలా ఉండి, కామలా లక్షణాలు తీవ్రంగా ఉంటే దానిని ‘శాఖాశ్రీతకామలా’ అని చెప్పారు. దీనికి కారణం ‘పిత్తం’ (బైల్) కోష్ఠంలోకి చేరడం. దీన్ని ఆధునికంగా అబ్స్ట్రక్టివ్ జాండీస్ అంటారు. మరో రకం జాండిస్... రక్తకణాలు ఎక్కువగా ధ్వంసం కావడం వల్ల సంభవిస్తుంది. ఈ భేదాల్ని బట్టి చికిత్స మారుతుంది. కారణాలు: ఆహార పదార్థాలు కలుషితం కావడం. చికిత్స: ఆయుర్వేదంలో కొన్నిరకాల మూలికలను సూచించినా అవి చికిత్సలో ఒక భాగం మాత్రమే. ఇది కేవలం ఇన్ఫెక్షన్ల వల్ల వచ్చే కామల చికిత్సకు మాత్రమే ఉపకరిస్తుంది. భూమ్యామలకి (నేర ఉసిరిక), భృంగరాజ (గుంటగలగర), గుడూచి (తిప్పతీగె), కాలమేఘ (మురుపిండి ) మొదలైన వాటిల్లో ఏదైనా ఒకదాని ఆకుల రసం తీసి వయసును బట్టి పావుచెంచా నుంచి మూడు చెంచాల వరకు తేనెతో కలిపి, రోజుకి రెండుపూటలా ఓ పదిరోజుల పాటు సేవించాలి. చూర్ణాలు: కటుకరోహిణ, పసుపు, ఉసిరికాయ మొదలైనవి అరగ్రాము నుంచి రెండు గ్రాముల వరకు తేనెతో రోజుకి రెండుసార్లు. మాత్రలు: ఆరోగ్యవర్ధనీవటి ఉదయం 1, రాత్రి 1, నిరోసిల్: ఉదయం1, రాత్రి 1. పథ్యం: వ్యాధి ఆరంభమైన ఓ వారం, పదిరోజుల వరకు నూనెపదార్థాలు, మసాలాలు, పులుపు, కారం, ఉప్పు నిషిద్ధం. కేవలం పెరుగు లేదా మజ్జిగ అన్నం మాత్రమే తినాలి. ద్రవపదార్థాలు ఎక్కువగా తాగాలి. అనగా మరిగించి చల్లార్చిన నీరు, మజ్జిగ, బార్లీ, కొబ్బరినీళ్లు, పరిశుభ్రమైన చెరకుసరం, గ్లూకోజ్ మొదలైనవి. సాఫీగా విరేచనం కావాలి. ‘త్రిఫలాచూర్ణం’ 1 చెంచా రాత్రి వేడినీళ్లలో తాగాలి. జాగ్రత్తలు: బయటి పదార్థాలు తినకూడదు, తాగకూడదు, కల్తీ ఆహారాలను గమనిస్తూ, వాటిని విసర్జించాలి. వ్యాధి కారణాల్ని గుర్తుంచుకొని, వాటిని దూరంగా ఉండటం నివారణకూ ముఖ్యం. ఉదా: మద్యం, పొగతాగడం, కాలేయం చేసే పనులను దెబ్బతీసే ఔషధాలు తీసుకోకపోవడం, ఉప్పు, నూనె పదార్థాలు, కొవ్వు అతిగా తీసుకోకపోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. డాక్టర్ వృద్ధుల లక్ష్మీనరసింహశాస్త్రి ఆయుర్వేద నిపుణులు సౌభాగ్య ఆయుర్వేదిక్ క్లినిక్ హుమాయూన్‌నగర్, హైదరాబాద్ న్యూరాలజీ కౌన్సెలింగ్ నా వయసు 45 ఏళ్లు. నాకు పదిరోజుల కింద నడుముకు ఒక పక్క కురుపులు వచ్చాయి. బాగా నొప్పి వచ్చింది. పదిరోజులకు మాడిపోయాయి. అయితే ఇప్పుడు కూడా బాగా నొప్పి వస్తోంది. నా సమస్యకు తగిన పరిష్కారం చూపండి. - ఈ.ఎస్., కర్నూలు మీరు పోస్ట్ హెర్పెటిక్ న్యూరాల్జియా అనే జబ్బుతో బాధపడుతున్నారు. ఇది వారిసెల్లా జోస్టర్ అనే వైరస్ వల్ల వస్తుంది. షుగర్ వ్యాధి ఉన్నవారిలో, రోగి నిరోధకశక్తి తక్కువగా ఉన్న వారిలో ఇది రావచ్చు. జబ్బు వచ్చినప్పుడు ఎసెక్లోవిర్ అనే ట్యాబ్లెట్లు వాడటంతో కురుపులు తగ్గిపోతాయి. ఇలా వాడని వారిలో కురుపులు వచ్చి మానిపోయాక భరించలేని నొప్పి వస్తుంది. దీనినే వైద్యపరిభాషలో హెర్పెటిక్ న్యూరాల్జియా అంటారు. దీన్ని రెండు, మూడు రకాల మందులతో అదుపు చేయవచ్చు. మీరు డాక్టర్‌కు చూపించుకోండి. వారు మీ వయసును బట్టి, బరువును బట్టి మందులు సూచిస్తారు. వాటిని తీసుకుంటే మీ నొప్పి అదుపులోకి వచ్చే అవకాశం ఉంది. నా వయసు 30 ఏళ్లు. నాకు ఐదేళ్ల క్రితం యాక్సిడెంట్ అయ్యింది. తలకు కుట్లు పడ్డాయి. మెదడు స్కానింగ్ చేయిస్తే, ఎముక ఫ్రాక్చర్ అయినట్లు రిపోర్ట్ వచ్చింది. మెదడులో రక్తస్రావం కూడా జరిగింది. అప్పటి నుంచి ఏడాదికి ఒకసారి ఫిట్స్ కూడా వస్తున్నాయి. ఇవి తగ్గే మార్గం లేదా? - కిశోర్, ఈ-మెయిల్ తలకు దెబ్బ తగిలిన వారిలో రక్తస్రావం వల్ల, ఎముక ఫ్రాక్చర్ కావడం వల్ల మెదడులోని కణాలలో మార్పులు చోటుచేసుకుంటాయయి. ఫలితంగా ఆ కణాల నుంచి అవసరాని కంటే ఎక్కువగా విద్యుత్తు ఉత్పత్తి జరిగి ఫిట్స్ వస్తాయి. ఈ సమస్య వచ్చిన వారు జీవితాంతం మందులు వాడాల్సిన అవసరం ఉంటుంది. కొంతమందికి దెబ్బ తగిలినప్పుడు ఫిట్స్ వచ్చి, స్కానింగ్ నార్మల్‌గా ఉంటుంది. అలాంటివారు కొన్ని నెలలపాటు మందులు వాడితే సరిపోతుంది. మీరు డాక్టర్‌కు చూపించుకొని, స్కానింగ్ రిపోర్టును బట్టి మందులు వాడాల్సి ఉంటుంది. డాక్టర్ మురళీధర్ రెడ్డి కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ కేర్ హాస్పిటల్ బంజారాహిల్స్ హైదరాబాద్ పల్మనాలజీ కౌన్సెలింగ్ నా వయసు 40. గతంలో డస్ట్ అలర్జీ ఉండేది. నా ఫ్రెండ్స్ కొందరు వింటర్లో వ్యాయామాలు చేస్తుంటే నేను వారితో పాటు ఎక్సర్సైజ్ మొదలుపెట్టాను. కానీ వ్యాయామం చేయదలచినప్పుడల్లా ఆయాసం వస్తోంది. నాకు తగిన సలహా ఇవ్వండి. - చంద్రశేఖర్, కోదాడ వ్యాయామం కొన్నిసార్లు ఆస్తమాను ప్రేరేపిస్తుంది అందుకే దీర్ఘకాలిక ఆస్తమాతో బాధపడే చాలామందిలో వ్యాయామం చేసినప్పుడల్లా ఇది కనిపిస్తుంటుంది. మనం శ్వాస తీసుకునే సమయంలోనే బయటిగాలి కాసేపు ముక్కురంధ్రాలలో ఉండి వెచ్చబడి, ఊపిరితిత్తుల్లోకి వెళ్లడానికి అనుకూలమైన ఉష్ణోగ్రతను సమకూర్చుకుంటుంది. కానీ వ్యాయామం చేసే సమయంలో గాలి ఎక్కువగా తీసుకోవడం కోసం నోటితోనూ గాలిపీలుస్తుంటారు. అంటే వారు తేమలేని పొడిగాలినీ, చల్లగాలినీ పీలుస్తుంటారు. దాంతో గాలి వెళ్లే మార్గాలు ఒక్కసారిగా ముడుచుకుపోతాయి. ఫలితంగా గాలిని ఊపిరితిత్తుల్లోని దారులు సన్నబడతాయి. దాంతో కొన్ని లక్షణాలు కనబడతాయి. అవి... పొడి దగ్గు వస్తుండటం ఛాతీ పట్టేసినట్లుగా ఉండటం పిల్లికూతలు వినిపించడం వ్యాయామం తర్వాత తీవ్రమైన అలసట (మామూలుగా వ్యాయామం చేసేవారిలో ఇంత అలసట ఉండదు) వ్యాయామ సమయంలో గాలి తీసుకోవడంలో ఇబ్బంది / ఆయాసం. సాధారణంగా వ్యాయామం మొదలుపెట్టిన 5 నుంచి 20 నిమిషాల్లో ఈ లక్షణాలు కనిపించడం లేదా కొద్దిగా వ్యాయామం చేసి ఆపేశాక 5 నుంచి 10 నిమిషాల తర్వాత ఈ లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి సమయాల్లో డాక్టర్‌ను సంప్రదించాలి. అయితే వ్యాయామంతో వచ్చే ఆయాసం కారణంగా వ్యాయాయాన్ని ఆపాల్సిన పని లేదు. దీన్ని అధిగమించడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. వ్యాయామం మొదలుపెట్టడానికి ముందుగా పీల్చే మందులైన బ్రాంకోడయలేటర్స్ వాడి, వ్యాయామాన్ని కొనసాగించవచ్చు. ఇక తక్షణం పనిచేసే లెవోసాల్‌బ్యుటమాల్ వంటి బీటా-2 ఔషధాలను వ్యాయామానికి 10 నిమిషాల ముందుగా వాడి, వ్యాయామ సమయంలో గాలిగొట్టాలు మూసుకుపోకుండా జాగ్రత్తపడవచ్చు. దీనితో పాటు వ్యాయామానికి ముందర వార్మింగ్ అప్, వ్యాయామం తర్వాత కూలింగ్ డౌన్ ప్రక్రియలను చేయడం వల్ల కూడా ప్రయోజనం ఉంటుంది. తొలుత పరిమితం సమయంలో వ్యాయామం చేస్తూ, ఆ వ్యవధిని పెంచుకుంటూ పోవడం వల్ల మీరు ఈ సమస్యను అధిగమించవచ్చు. డాక్టర్ రమణ ప్రసాద్ కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్ అండ్ స్లీప్ స్పెషలిస్ట్ కిమ్స్ హాస్పిటల్ సికింద్రాబాద్ -
వ్యాయామం చేయలేనప్పుడు బరువు తగ్గేదెలా?
హోమియో కౌన్సెలింగ్ మా బాబుకు ఆరేళ్లు. వాడికి తరచు ముక్కునుంచి రక్తం వస్తుంటుంది. ఇటీవల కొంతకాలంగా మలంలో కూడా రక్తం పడుతోంది. మాకు చాలా ఆందోళనగా ఉంది. దయచేసి తగిన సలహా ఇవ్వగలరు. -పుష్ప, హైదరాబాద్ పిల్లలలో ముక్కు నుంచి రక్తం పడటమనేది తరచు కనిపించేదే. ఈ సమస్య ముఖ్యంగా వేసవి, చలికాలాలలో ఎక్కువగా కనిపిస్తుంది. వాతావరణం వేడిగా లేదా చల్లగా తయారైనప్పుడు ముక్కురంధ్రాలు పొడిబారి చర్మం చిట్లుతుంది. దీనికితోడు చిన్నపిల్లలు ముక్కులో వేళ్లుపెట్టి కెలుక్కుంటూ ఉంటారు. దీనివల్ల ముక్కురంధ్రాలలో ఉన్న సున్నితమైన రక్తనాళాలు చిట్లి, రక్తస్రావం జరగవచ్చు. అందువల్ల తల్లిదండ్రులు పిల్లలు ముక్కురంధ్రాలలో వేళ్లుపెట్టి తిప్పుకుంటూ ఉంటే ఆ అలవాటును మాన్పించడానికి ప్రయత్నించాలి. ఇవిగాక ఇలా ముక్కు నుంచి రక్తం రావడానికి మరికొన్ని కారణాలున్నాయి. అలర్జీలు వచ్చినప్పుడు లేదా జలుబు చేసినప్పుడు గట్టిగా తుమ్మటం, ముక్కు చీదటం, ముక్కుకు బలమైన దెబ్బ తగలటం, ముక్కులో బలపాలు, పెన్సిళ్లు వంటివి పెట్టుకోవడం వల్ల కూడా ఇలా జరగవచ్చు. నివారణ: ముక్కులో గుడ్డలు అవీ పెట్టడం, కదలకుండా పడుకోబెట్టడం వల్ల సమస్య మరింత జటిలమయ్యే ప్రమాదం ఉంది. మాడు మీద చెయ్యి పెట్టి గట్టిగా ఒత్తిపట్టుకోవడం వల్ల కొంత ప్రయోజనం ఉంటుంది. వాతావరణం పొడిగా ఉన్నప్పుడు కొబ్బరినూనె రాయడం మంచిది. మలంలో రక్తం పడటానికి కారణాలు: మలద్వారం వద్ద చీలిక (ఫిషర్): ముఖ్యంగా చిన్నపిల్లల్లోనూ, పెద్దవాళ్లలోనూ ఇలా జరగడానికి కారణం మలబద్ధకం. గట్టిగా ముక్కడం వల్ల కింది భాగంలోని పేగుల నుంచి రక్తస్రావం జరగవచ్చు. అలాగే పిండదశలో ఉన్నప్పుడు తల్లి బొడ్డునుంచి గర్భస్థ శిశువు పేగుల్లోకి వెళ్లే నాళం మూసుకు పోవడం వల్ల పేగుల్లో తిత్తులు ఏర్పడవచ్చు. చిన్నపేగుల్లో అల్సర్స్, పేగు చొచ్చుకురావడం, ఒక పేగులోని కొంత భాగం మరో పేగులోకి చొచ్చుకుపోవడం జరగొచ్చు. పేగుల్లో పిలకలు; రక్తనాళాల్లో లోపాలు, పేగుల్లో వాపు. హోమియో చికిత్స: హోమియోకేర్ ఇంటర్నేషనల్‌లో చిన్నపిల్లల్లో రక్తస్రావ సమస్యలకు చాలా మంచి మందులున్నాయి. వ్యాధి కారణాలు, లక్షణాలు, పిల్లల మానసిక, శారీరక స్థితిగతులను పరిగణనలోకి తీసుకుని కాన్స్టిట్యూషనల్ విధానం ద్వారా చికిత్స చేస్తారు. దీనివల్ల ఎటువంటి దుష్ఫలితాలూ తలెత్తకుండా ఎలాంటి శస్త్రచికిత్సలూ అవసరం లేకుండా వ్యాధి సమూలంగా తగ్గిపోతుంది. మీరు సమీపంలో ఉన్న మంచి అనుభవజ్ఞుడైన హోమియో వైద్యుని సంప్రదించండి. గ్యాస్ట్రోఎంటరాలజీ కౌన్సెలింగ్ నా వయసు 50 ఏళ్లు. నాకు ఏడాది కిందట కడుపులో నొప్పి, కామెర్లు, దురద వస్తే డాక్టర్‌ను కలిసి పరీక్షలు చేయించాను. గాల్‌బ్లాడర్‌లో రాళ్లు ఉన్నాయని చెప్పారు. ఈఆర్సీపీ పరీక్ష చేసి, స్టెంట్ వేశారు. మళ్లీ నెల రోజుల నుంచి కళ్లు పచ్చగా అవుతున్నాయి. నాకు సరైన సలహా ఇవ్వండి. - కృష్ణాజీరావు, అనంతపురం మీరు గాల్‌స్టోన్స్, సీబీడీ స్టోన్స్ అనే వ్యాధితో బాధపడుతున్నారు. మీకు ప్రస్తుతం కడుపులో వేసిన బిలియర్ స్టెంట్ మూసుకుపోయి ఉండవచ్చు. అందువల్ల మీకు కామెర్లతో పాటు జ్వరం వస్తోంది. మీరు మళ్లీ ఈఆర్సీపీ పరీక్ష చేయించుకోండి. దీంతో మీకు సీబీడీలో రాళ్లు ఉన్నా తొలగించవచ్చు. మూసుకుపోయిన స్టెంట్ స్థానంలో కొత్త స్టెంట్ అమర్చవచ్చు. ఈఆర్సీపీ తర్వాత మీరు లాపరోస్కోపీ ద్వారా గాల్‌బ్లాడర్ స్టోన్స్ తొలగించుకోవాల్సి ఉంటుంది. లేకపోతే మళ్లీ మళ్లీ ఇలా అయ్యే అవకాశం ఉంది. నా వయసు 41 ఏళ్లు. నేను అసిడిటీతో బాధపడుతున్నాను. మూడు నెలల క్రితం పాంటసిడ్-హెచ్‌పి ఒక వారం పాటు వాడాను ప్రస్తుతం ఒమేజ్ అనే మందు వాడుతున్నాను. అయినా కడుపునొప్పి, మలబద్దకం, తలనొప్పి వంటి సమస్యలతో బాధపడుతున్నాను. దయచేసి నాకు మంచి సలహా ఇవ్వండి. - సురేశ్‌కుమార్, చీరాల మీరు ఒకసారి గాస్ట్రో ఎంటరాలజిస్ట్‌ను కలిసి ఎండోస్కోపీ చేయించుకోండి. మలబద్దకం, కడుపులో నొప్పి అనే లక్షణాలను బట్టి మీకు ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ ఉండే అవకాశం ఉంది. సాధారణంగా ఇది యాంగ్జైటీతో పాటు ఒత్తిడితో కూడిన జీవనశైలి ఉన్నవారిలో ఎక్కువగా కనిపిస్తుంది. మీరు గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్‌ను కలిసి, ఐబీఎస్ కాంపొనెంట్ ఉందా అని చూపించుకొని, దాన్ని బట్టి చికిత్స పొందండి. నాకు కడుపు నొప్పి వచ్చి పరీక్ష చేయించుకుంటే చిన్నపేగుల్లో టీబీ వచ్చినట్లు తెలిసింది. ఇది మందులతో తగ్గుతుందా? - మనోజ్, విశాఖపట్నం చిన్నపేగుల్లో వచ్చే టీబీతో ఒక్కోసారి పేగుల్లో పుండ్లు వచ్చే అవకాశం ఉంది. ఒక్కోసారి చిన్నపేగు ల్లో స్ట్రిక్చర్స్ (పేగు సన్నబారడం) కూడా జరగవచ్చు. ఇలాంటప్పుడు టీబీ నియంత్రణలోకి వచ్చినా అప్పుడప్పుడూ నొప్పి వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు అందుబాటులో ఉన్న మందుల వల్ల చిన్నపేగుల్లో వచ్చే టీబీ పూర్తిగా తగ్గుతుంది. లైఫ్‌స్టైల్ కౌన్సెలింగ్ నేను గృహిణిని. ఇటీవల బాగా బరువు పెరుగుతున్నాను. వ్యాయామం చేయకుండానే బరువును అదుపులో ఉంచుకునేందుకు జాగ్రత్తలు చెప్పండి. - లక్ష్మీప్రియ, శ్రీకాకుళం చాలామంది గృహిణులు ఇంటిపనుల్లో బిజీగా ఉండి వేళకు తినకపోవడం, వృథా కాకూడదంటూ మిగిలిపోయిన ఆహారపదార్థాలను తినడం వల్ల బరువు పెరుగుతుంటారు. మీరు బరువు పెరగకుండా అదుపు చేసుకునేందుకు ఈ కింద పేర్కొన్న జాగ్రత్తలు పాటించండి. తినకుండా షాపింగ్‌కు వెళ్లకండి... ఏదైనా కొనాల్సిన సమయంలో... వచ్చాక తినవచ్చు అని ఖాళీ కడుపుతోనే చాలామంది షాపింగ్‌కు వెళ్తుంటారు. అలా వెళ్తే ఆకలి పెరిగి, అధిక క్యాలరీలు ఉండే ఆహారాలను తీసుకోవడానికి అవకాశాలు ఎక్కువ. దాంతోపాటు అక్కడ అనారోగ్యకరమైన పదార్థాలను తినే అవకాశం ఉంది. ఒకవేళ తింటే, త్వరగా జీర్ణమయేవి, క్యాలరీలు తక్కువగా ఉండేవి తినండి. షాపింగ్ చేసే సమయంలో వేగంగా నడవడం వల్ల జీవక్రియల వేగం పెరిగి అనుకోకుండానే వ్యాయామం చేకూరుతుంది. ఎక్కువసార్లు తినండి : తక్కువ మోతాదులో ఎక్కువసార్లు తినడం వల్ల బరువు పెరగడానికి అవకాశం తక్కువ. బాగా ఆకలిగా ఉన్నప్పుడు మోతాదుకు మించి ఆహారం తీసుకుంటుంటారు. అందుకే ఎప్పుడూ కరకర ఆకలయ్యే వరకు ఆగవద్దు. ఉదయం టిఫిన్ (బ్రేక్‌ఫాస్ట్)ను ఎప్పుడూ మిస్ చేయకండి. మెల్లగా తినండి : ఆహారాన్ని మెల్లగా ఆస్వాదిస్తూ తినండి. ఆహారం తీసుకునేందుకు కొద్దిసేపటి ముందుగా ఒక కప్పు సలాడ్స్‌తో పాటు నీళ్లు తాగండి. దాంతో కడుపు నిండిపోయి తక్కువగా తింటారు. పగటి నిద్ర వద్దు: మధ్యాహ్నం నిద్రను పూర్తిగా మానేయండి. తిన్న తర్వాత అస్సలు నిద్రపోవద్దు. అయితే రాత్రివేళ కంటికి నిండుగా కనీసం 7-8 గంటలు నిద్రపోండి. అవకాశం ఉన్నప్పుడల్లా నడవండి : వాక్ వెన్ యూ టాక్ అని గుర్తుంచుకోండి. ఫోన్లో మాట్లాడుతున్నప్పుడల్లా అటూ ఇటూ నడుస్తూ మాట్లాడండి. ప్రకటనల టైమ్‌లో: టీవీలో యాడ్స్ వచ్చినప్పుడల్లా కాస్త నడకసాగించండి. ఉన్న చోటే నిలబడి స్పాట్ జాగింగ్ వంటివి చేయవచ్చు. -
ఊరంతా ‘పచ్చ కామెర్లు’
దుబ్బాక: మెదక్ జిల్లా దుబ్బాక మండలం చిన్ననిజాంపేట గ్రామం పచ్చకామెర్లతో బాధపడుతోంది. ఊరు జనమంతా ఈ వ్యాధితో బాధపడుతుంటే పట్టించుకునే నాథుడు కరువయ్యాడు. గ్రామంలో 250 కుటుంబాలు ఉండగా వంద మంది వరకు పచ్చ కామెర్ల వ్యాధి బారిన పడి అస్వసత్థకు గురయ్యారు. ఇంట్లో ఇద్దరు లేదా ముగ్గురు వ్యాధికి గురై బాధపడుతున్నారు. మిరుదొడ్డి మండలం భూంపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లి పరీక్షలు చేయించుకుందామంటే అక్కడ డాక్టర్లు, సిబ్బంది అందుబాటులో ఉండడం లేదని బాధితులు వాపోతున్నారు. -
కలుషిత నీటితో 40 మంది పోలీసులకు కామెర్లు
కలుషిత నీరు తాగి ఒడిశాలోని 40 మంది పోలీసులు కామెర్ల బారిన పడ్డారు. వీరిలో ఐదుగురు కోలుకుని విధుల్లో చేరగా మరో 35 మంది చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై అక్కడి పోలీసు అధికారి ఆర్పీ శర్మ స్పందిస్తూ 350 మంది మాత్రమే ఉండగల పోలీసు నివాసాల్లో దాదాపు వెయ్యిమందికి పైగా ఉంటున్నారని, వీరంతా కేవలం 30 మరుగుదొడ్లనే ఉపయోగించుకోవాల్సిన పరిస్థితి ఉందని తెలిపారు. దీని కారణంగా అక్కడి వాతావరణమంతా కలుషితంగా మారి తాగునీరు దాని భారిన పడి ఈ ఘటన చోటుచేసుకుందని చెప్పారు. దీనికి గల కారణాలను తెలుసుకునేందుకు ప్రత్యేక వైద్యుల బృందం పోలీసులు ఉంటున్న నివాసాలను సందర్శించి అక్కడి పరిశుభ్రత అద్వాన్నంగా ఉందని తేల్చంది. -
ఇంటింటా జ్వరాలే..
మంచం పట్టిన ‘గుడివాడ’ టైఫాయిడ్, మలేరియా, కామెర్లు, కళ్ల కలకలతో సతమతం జ్వరపీడితులతో కిక్కిరిసిపోతున్న ఆస్పత్రులు వాతావరణ మార్పులే కారణమంటున్న వైద్యులు గుడివాడ మంచం పట్టింది. పట్టణంలో వ్యాధులు విజృంభిస్తున్నాయి. విషజ్వరాలు, టైఫాయిడ్, మలేరియా, కామెర్లు, కళ్ల కలక, పొంగు వంటి వ్యాధులతో ప్రజలు సతమతమవుతున్నారు. పట్టణంలోని దాదాపు ప్రతి కుటుంబంలోనూ ఏదో ఒక వ్యాధితో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. వాతావరణంలో వచ్చిన మార్పులే దీనికి కారణమని తెలుస్తోంది. దాదాపు 15 రోజులుగా వ్యాధుల ప్రభావం ఉండగా, వారం రోజుల నుంచి అంటువ్యాధులు విజృంభిస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. గుడివాడ : పట్టణ వాసులు వ్యాధులతో వణికిపోతున్నారు. వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా విషజ్వరాలతో పాటు వ్యాధులు విజృంభించాయి. ఏ ప్రాంతంలో చూసినా వ్యాధులతో బాధపడే కుటుంబాలు కనిపిస్తున్నాయి. అనేక వార్డుల్లో విషజ్వరాల ప్రభావం ఎక్కువగా ఉంది. వాతావరణం ఒక్కసారిగా వేడెక్కి.. వెనువెంటనే చల్లబడిపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని వైద్యులు చెబుతున్నారు. మిక్స్డ్ వైరస్ల కారణంగా వైరల్ జ్వరాలు వస్తున్నాయని పేర్కొంటున్నారు. విషజ్వరాలు, టైఫాయిడ్, మలేరియా, కామెర్లు, కళ్ల కలక, పొంగు వంటి వ్యాధులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పట్టణంలోని పెద ఎరుకపాడులో ప్రతి ఇంట్లో జ్వర బాధితులు ఉన్నారు. ఇంట్లో ఉన్న నలుగురికీ జ్వరాలు రావటంతో జనం ఆర్థికంగా కూడా చితికిపోతున్నారు. ఈ ప్రాంతంలో టైఫాయిడ్ రోగులు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. పెద ఎరుకపాడు దళితవాడలో దాదాపు 20 కుటుంబాల్లో ఇంట్లో ఉన్న వారంతా జ్వరంతో మంచం పట్టారు. దీనికితోడు కళ్ల కలకలు, పొంగు, మలేరియా వంటి వ్యాధులతో సతమతమౌతున్నారు. పట్టణంలోని గుడ్మేన్పేట, అరవ పేట, మందపాడు తదితర ప్రాంతాల్లో జ్వరాలతో బాధపడేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. దాదాపు 15 రోజుల నుంచి ఈ ప్రభావం ఉండగా వారం రోజులుగా అంటువ్యాధుల విజృంభణ మరింత పెరిగిందని వైద్యులు చెబుతున్నారు. ప్రభుత్వాస్పత్రికి వచ్చినవారు 370 మంది... అక్టోబర్‌లో జ్వరాలతో బాధపడుతూ ప్రభుత్వాస్పత్రికి వచ్చినవారు 370 మంది ఉన్నారని వైద్యాధికారులు చెబుతున్నారు. వారిలో టైఫాయిడ్‌కి గురైనవారే 165 మంది ఉన్నారని పేర్కొంటున్నారు. వీరుగాక ప్రైవేటు వైద్యశాలల్లో చికిత్స చేయించుకుంటున్న వారి సంఖ్య ఇంతకు పది రెట్లు అదనంగా ఉండవచ్చని అంచనా. ప్రతిరోజూ గుడివాడలోని ఒక్కో ఆస్పత్రికి నిత్యం వందమందికి పైగా జ్వరపీడితులు వస్తున్నారని చెబుతున్నారు. మారుతున్న వాతావరణం, తాగునీటి కాలుష్యం కారణంగా విషజ్వరాలు వ్యాప్తి చెందుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉంటేనే విషజ్వరాల వ్యాప్తిని తగ్గించగలమని అంటున్నారు. పరిసరాల పరిశుభ్రత సరిగా లేని కారణంగా కూడా వ్యాధులు వస్తున్నాయని పేర్కొంటున్నారు. ఇతర అంటువ్యాధులు ఇంట్లో ఒకరి తరువాత మరొకరికి రావటంతో ప్రజలు ఆర్థికంగా చితికిపోతున్నామని, విషజ్వరాలు వ్యాప్తి చెందకుండా ప్రభుత్వ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. వాతావరణంలో మార్పుల వల్లే వాతావరణంలో వస్తున్న మార్పుల వల్లే వ్యాధులు విజృంభిస్తున్నాయి. 18 ఏళ్ల లోపు వారికి ఎక్కువగా టైఫాయిడ్ వస్తోంది. జ్వరం వచ్చిందని బాలింతలు పిల్లలకు పాలివ్వటం మానరాదు. పాలు ఇచ్చి పిల్లల్ని దూరంగా వేరొకరికి ఇవ్వాలి. లేదంటే పిల్లల్లో వ్యాధి నిరోధక శక్తి తగ్గి రోగాల బారిన పడతారు. తల్లికి జ్వరం వచ్చినా పాలు ఇవ్వవచ్చు. జ్వరం వచ్చిందని పిల్లలకు ఆహారం పెట్టకుండా ఉంచరాదు. అలా చేయటం వల్ల బలహీనత ఏర్పడి రోగనిరోధక శక్తి తగ్గిపోయి ఇన్ఫెక్షన్లు పెరిగిపోతాయి. తినే ఆహారం, వాతావరణ పరిస్థితులు, పరిసరాల పరిశుభ్రత వంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటే వ్యాధుల వ్యాప్తిని అరికట్టవచ్చు. - డాక్టర్ సుదేష్బాబు, ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్, గుడివాడ -
కామెర్లను గుర్తించే ఆప్
వాషింగ్టన్: ప్రస్తుతం శిశువులు పుట్టిన నాలుగైదు రోజుల్లోపు కామెర్ల ప్రమాదం పెరుగుతున్న నేపథ్యంలో వారిలో కామెర్ల వ్యాధిని సులభంగా గుర్తించేందుకు ఉపయోగపడే ‘బైలీక్యామ్’ అనే సరికొత్త మొబైల్ అప్లికేషన్‌ను అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ పరిశోధకులు ఆవిష్కరించారు. మామూలుగా అయితే పిల్లల చర్మం పసుపురంగులోకి మారడాన్ని బట్టి కామెర్లను గుర్తిస్తారు. కానీ కొన్నిసార్లు సరిగా గుర్తించకపోతే శిశువులకు ప్రమాదం ఏర్పడుతుంది. అందుకే స్మార్ట్‌ఫోన్‌తో ఓ ఫొటో తీస్తే చాలు.. శిశువులకు కామెర్ల సమస్య ఉందా? లేదా? అన్నది వెంటనే తెలియజేసే ఈ ఆప్‌ను త్వరలోనే విడుదల చేయనున్నారు. తొలుత ఆప్‌ను ఇన్స్టాల్ చేసుకుని, పిల్లల శరీరంపై ఎక్కడైనా ఓ ప్రామాణిక రంగుల పట్టీని ఉంచి ఫొటో తీస్తే చాలు.. ఆ ఫొటోపై క్లౌడ్ పద్ధతిలో ఆన్లైన్లో విశ్లేషణ జరిగి ఆటోమేటిక్‌గా ఫోన్‌కు కామెర్ల తీవ్రతను తెలియజేస్తూ సమాచారం అందుతుందని వర్సిటీకి చెందిన భారత సంతతి పరిశోధకులు శ్వేతక్ పటేల్ వెల్లడించారు. -
‘సన్’డే
కర్నూలు(హాస్పిటల్), న్యూస్‌లైన్: రాజకీయ వేడి ముగిసింది. భానుడు మాత్రం ఇప్పటికీ పట్టపగలే చుక్కలు చూపుతున్నాడు. ఉష్ణోగ్రత అంతకంతకు పెరుగుతుండటం.. ఉక్కపోత కారణంగా జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ప్రధానంగా పిల్లలు, వృద్ధులు, వ్యాధిగ్రస్తుల అవస్థలు వర్ణనాతీతంగా ఉంటున్నాయి. అత్యవసరమైతే తప్ప ఆరోగ్యవంతులు సైతం బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. వారం రోజులుగా జిల్లాలో ఎండ తీవ్రత ఆందోళన కలిగిస్తోంది. ఉష్ణోగ్రత 41 డిగ్రీల సెంటిగ్రేడ్ దాటిపోవడం ఆందోళన కలిగిస్తోంది. పది రోజుల క్రితం 38 డిగ్రీలు ఉండగా.. ఆదివారం ఒక్కసారిగా 41.2 డిగ్రీలకు చేరుకోవడంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. నాలుగైదు రోజుల్లో రోహిని కార్తె రానుండటంతో ఎండలు మరింత ముదిరే అవకాశం కనిపిస్తోంది. గత ఏడాదితో పోలిస్తే ఈ విడత ఎండల తీవ్రత కాస్త తక్కువే అయినా.. బయట కాలు మోపేందుకు జంకాల్సి వస్తోంది. మాసాంతంలో భానుడు మరింత విజృంభించే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ భావిస్తోంది. ఉదయం 8 గంటల నుంచే ఎండ సుర్రుమంటుండటంతో ప్రధాన రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారిపోతున్నాయి. ఇక రోడ్ల పక్కన వ్యాపారాలు నిర్వహించే సామాన్యులు నీడ లేక ఎదుర్కొంటున్న అవస్థలు అన్నీఇన్నీ కావు. వేసవి ఉష్ణోగ్రతల్లో పెరుగుదల కారణంగా ఏసీలు, కూలర్లకు డిమాండ్ పెరుగుతోంది. గతంతో పోలిస్తే ఈ ఏడాది 10 శాతం అమ్మకాలు పెరిగినట్లు తెలుస్తోంది. ఫ్రిజ్‌ల అమ్మకాలు సైతం అధికమయ్యాయి. మట్టి కుండలు, టోపీలు, స్కార్ఫ్, కూలింగ్ గ్లాసెస్లకు సైతం డిమాండ్ అధికంగానే ఉంటోంది. దాహం తీర్చుకునేందుకు, ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు అధిక శాతం ప్రజలు కొబ్బరి బోండాంలను ఆశ్రయిస్తున్నారు. అయితే ఒక్కో బోండాం ధర రూ.30లు పలుకుతుండటం గమనార్హం. దీంతో పేద, మధ్య తరగతి ప్రజలు కూల్‌డ్రింక్స్, నిమ్మకాయ సోడా, నన్నారితో సరిపెట్టుకుంటున్నారు. వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు సాధ్యమైనంత వరకు ఉదయం 11 గంటల్లోగా పనులు ముగించుకోవాలి. సాయంత్రం 5 గంటల తర్వాత బయటకు వెళ్లే ప్రయత్నం చేయాలి. తప్పనిసరిగా బయటకు వెళ్లాల్సి వస్తే గొడుగు లేదా టోపీ తీసుకెళ్లాలి. వేసవిలో శుభ్రమైన తాగునీటినే తీసుకోవాలి. కలుషిత నీటితో డయేరియా(వాంతులు, విరేచనాలు), టైఫాయిడ్, కామెర్లు వచ్చే ప్రమాదం ఉంది. ఎండకు ఎక్కువగా తిరిగే వారికి వడదెబ్బ సోకే అవకాశం ఉంది. సాధ్యమైనంత వరకు నీడలో ఉండే ప్రయత్నం చేయాలి. ఎక్కువగా నీటిని తాగాలి. వడదెబ్బ సోకినట్లు అనిపిస్తే ఆ వ్యక్తిని నీడకు తీసుకె ళ్లి చల్లని నీటితో తుడవాలి. అనంతరం సమీప ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించాలి. కూల్‌డ్రింక్స్ కంటే కొబ్బరినీళ్లు, మజ్జిగ, నిమ్మకాయ రసం, తాజా పండ్ల రసం వంటి పానీయాలు మేలు. నూనె, కారం ఎక్కువగా ఉండే ఆహారానికి సాధ్యమైనంత వరకు దూరంగా ఉండాలి. లేత రంగు, కాటన్, ఖద్దరు దుస్తులనే ధరించాలి. అవి కూడా వదులుగా ఉండేలా జాగ్రత్త పడాలి.