యూపీ మంత్రి ఓం ప్రకాశ్ రాజ్భర్
లక్నో: యూపీ మంత్రి, వివాదాల పుట్ట ఓం ప్రకాశ్ రాజ్భర్ మరోసారి తన నోటికి పని చెప్పారు. రాజకీయ ప్రత్యర్థులకు ఆయన విచిత్రమైన శాపనార్థాలు పెట్టారు. తనకు వ్యతిరేకంగా ఎవరైనా ర్యాలీలు నిర్వహించినా, లేదా ఎవరైనా ఆ ర్యాలీలో ఎవరైనా పాల్గొన్న... వారు జాండీస్ సోకుతుందంటూ వ్యాఖ్యలు చేశారు.
ఆదివారం బల్లియాలో నిర్వహించిన మద్యపాన నిషేధ ర్యాలీలో ఆయన పాల్గొని మాట్లాడారు. ‘నా తరపు మనుషులు వచ్చి పిలిస్తేనే మీరు మా ర్యాలీల్లో పాల్గొనాలి. అలా కాదని నా రాజకీయ ప్రత్యర్థుల ర్యాలీలో వెళ్లారో జాగ్రత్త. మీకు జాండీస్ సోకుతుంది. ఇదే నా శాపం. పైగా దానికి నేను మందిస్తేనే మీకు నయం అవుతుంది.’ అని వ్యాఖ్యానించారు. కాగా, యూపీ ఎన్నికల సందర్భంగా ప్రధాని మోదీ గుజరాత్ మోడల్‌ను ఇక్కడ ప్రవేశపెడతా అని చెప్పారని, కానీ, ఇంత వరకు అది నెరవేర్చలేదని రాజ్భర్ ప్రస్తావించారు. మద్యపాన నిషేధంతోపాటు మిగతా హామీలను కూడా మోదీ నెరవేరిస్తే మంచిదని రాజ్భర్ వ్యాఖ్యానించారు.
కాగా, ‘సుహెల్‌దేవ్ భారతీయ సమాజ్’ పార్టీ చీఫ్ అయిన ఓం ప్రకాశ్ రాజ్భర్ ప్రస్తుతం యూపీ సంకీర్ణ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు. గత కొంత కాలంగా బీజేపీ విధానాలపై, యోగి సర్కార్‌పై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆయన విమర్శలు చేస్తూ వస్తున్నారు. ముఖ్యంగా ఎస్సీ/ఎస్టీ రిజర్వేషన్ల అంశంలో బీజేపీ మోసం చేసిందంటూ ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో త్వరలో ఆయన కూటమి నుంచి వైదొలిగే సంకేతాలు ఉన్నట్లు ఆయన అనుచరులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment