Om Prakash Rajbhar
-
‘రాజకీయ పరిణితి లేనోడు’.. అఖిలేష్‌కి డబుల్ షాక్
లక్నో: అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఉత్తర ప్రదేశ్ రాజకీయం మరింత మలుపులు తిరుగుతోంది. సీఎం యోగి రాయబారంతో ప్రతిపక్ష కూటమిలో మనస్పర్థలు బయటకు వస్తున్నాయి. ఈ క్రమంలో ఉత్తర ప్రదేశ్ ప్రతిపక్ష నేత, ఎస్సీ చీఫ్ అఖిలేష్ యాదవ్‌కు ఝలక్ తగిలింది. ఇచ్చింది ఎవరో కాదు.. ఆయన సొంత బాబాయ్ శివపాల్ సింగ్ యాదవ్. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిని కాదని.. ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ముకు మద్ధతు ఇస్తున్నట్లు ప్రకటించారు శివపాల్ యాదవ్. శివపాల్ యాదవ్‌తో పాటు ఎస్సీ కూటమి పార్టీ సుహేల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ అధ్యక్షుడు ఓం ప్రకాశ్ రాజ్‌భర్.. శుక్రవారం రాత్రి సీఎం యోగి ఇచ్చిన విందుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ద్రౌపది ముర్ముకు మద్దతు ప్రకటించారు ఇద్దరూ. ‘‘సమాజ్‌వాదీ పార్టీ నన్నేం పిలవలేదు. తాము మద్దతు ఇచ్చే అభ్యర్థికి ఓటేయమనీ అడగలేదు. సీఎం యోగి ఆదిత్యానాథ్ నన్ను ఆహ్వానించి.. రాష్ట్రపతి అభ్యర్థికి మద్దతు తెలపాలని అడిగారు. అందుకే అంగీకరించాం’’ అని బాబాయ్-అబ్బాయ్ మధ్య నెలకొన్న గ్యాప్‌ను మరోసారి బయటపెట్టారు శివపాల్ యాదవ్. అఖిలేష్‌కు సరైన రాజకీయ పరిణితి లేకపోవడం వల్లే.. తనను కీలక సమావేశాలకు ఆహ్వానించడం లేదని, అందుకే కూటమిలోని పార్టీలు తలోదారి చూసుకుంటున్నాయని శివపాల్ యాదవ్ మండిపడ్డారు. అఖిలేష్ గనుక నా సలహాలు గనుక పాటించి ఉంటే.. ఎస్పీ పరిస్థితి యూపీలో ఇవాళ మరోలా ఉండేదన్నారు ఆయన. ఇక ద్రౌపది ముర్ముకు మద్ధతు విషయంపై రాజ్‌భర్ కూడా స్పందించారు. ఎస్పీతో కూటమిలోనే తాము కొనసాగుతామని, ఒకవేళ అఖిలేష్ గనుక బలవంతంగా వెళ్లిపొమ్మంటే బయటకు వచ్చేస్తామని ప్రకటించారాయన. ముర్ముకు మద్దతు విషయం పూర్తిగా తన సొంత నిర్ణయమని పేర్కొన్నారాయన. విపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు మద్దతు ప్రకటించే విషయమై.. గురువారం అఖిలేష్ నేతృత్వంలో సమాజ్‌వాదీ పార్టీ.. కూటమి పార్టీలతో కీలక సమావేశం నిర్వహించింది. ఈ భేటీకి ప్రగతీశీల్ సమాజ్‌వాదీ పార్టీ-లోహియా అధ్యక్షుడు శివపాల్ యాదవ్‌తో పాటు ఎస్బీఎస్పీ అధ్యక్షుడు ఓం ప్రకాశ్ రాజ్‌భర్‌కు సైతం ఆహ్వానం అందలేదు. ఈ క్రమంలోనే ఆగ్రహం, అసంతృప్తితో రగిలిపోతున్న ఈ ఇద్దరికీ ఆహ్వానం పంపి.. తమవైపు తిప్పుకున్నారు యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్. ఇదిలా ఉంటే.. అఖిలేష్ యాదవ్ సొంత బాబాయ్ అయిన శివపాల్ యాదవ్.. 2012-17 అఖిలేష్ యాదవ్ సీఎంగా ఉన్న టైంలో ‘నెంబర్ టూ’గా కొనసాగారు. 2018లో అఖిలేష్‌తో పొసగక బయటకు వచ్చి ప్రగతిశీల్ సమాజ్‌వాదీ పార్టీ-లోహియా పేరిట కొత్త పార్టీ పెట్టారు. అయితే.. 2022 అసెంబ్లీ ఎన్నికల సమయంలో తిరిగి అబ్బాయితో కలిసి చేతులు కలిపారాయన. ఆ ఎన్నికల్లో.. జశ్వంత్ నగర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు శివపాల్ యాదవ్. అయితే ఆయన నెగ్గింది మాత్రం సమాజ్‌వాదీ పార్టీ గుర్తు మీదే కావడం గమనార్హం. మరోవైపు ఓంప్రకాశ్ రాజ్‌భర్ ఎస్బీఎస్పీ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆరు సీట్లు నెగ్గింది. కూటమి నుంచి బయటకు వెళ్లే ప్రసక్తి లేదంటూనే.. అఖిలేష్‌పై ఓంప్రకాశ్ విమర్శలు గుప్పిస్తూ వస్తున్నారు. తాజాగా లోక్‌సభ ఉపఎన్నికల ఫలితాలు బీజేపీకి అనుకూలంగా రావడంతో అఖిలేష్‌యాదవ్‌కు బహిరంగంగానే విమర్శలు గుప్పించారు ఓంప్రకాశ్. 2012 సమయంలో అఖిలేష్ ముఖ్యమంత్రి అయ్యింది కూడా కేవలం తండ్రి ములాయం వల్లేనని, అఖిలేష్ నిజానికి అంత అర్హత ఉన్నోడు కాదంటూ సంచలన వ్యాఖ్యలే చేశారు ఓంప్రకాశ్. -
ముస్లిం మంత్రుల పేర్లు మార్చగలరా..?
లక్నో : దేశవ్యాప్తంగా చారిత్రక నగరాల పేర్లను మార్చే సంప్రాదాయం ప్రారంభమయ్యింది. కొందరు దీన్ని స్వాగతిస్తుండగా.. ఎక్కువ మంది మాత్రం ఈ విషయం గురించి విమర్శలు చేస్తోన్నారు. ఈ క్రమంలో ముస్లిం పాలకుల పేర్ల మీద ఉన్న చారిత్రక నగరాల పేర్లు మారుస్తున్న బీజేపీ నాయకులు.. వారి పార్టీలో ఉన్న ముస్లిం ఎమ్మెల్యేలు, మంత్రుల పేర్లు కూడా మారుస్తారా అంటూ బీజేపీ పార్టీ మిత్రుడు.. యోగి ఆదిత్యనాథ్ క్యాబినేట్లో మంత్రిగా పనిచేస్తోన్న ఓమ్ ప్రకాశ్ రాజ్‌భర్ సవాలు చేశారు. కొన్ని రోజుల క్రితం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అలహాబాద్ పేరును ప్రయాగ్‌రాజ్‌గా, ఫైజాబాద్ పేరును శ్రీ అయోధ్యగా మార్చిన సంగతి తెలిసిందే. ఇవేకాక అహ్మదాబాద్, ఔరంగబాద్, హైదరాబాద్, అగ్రా పేర్లను మార్చే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ సందర్భంగా ఓమ్ ప్రకాశ్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పలు అంశాల గురించి ప్రశ్నించారు. మొఘలుల పేర్లతో ఉన్నాయని చెప్పి మొఘల్‌సరాయి, ఫైజాబాద్ పేర్లను మార్చారు. మరి జాతీయస్థాయిలో ఉన్న కేంద్ర మంత్రులు, యూపీ మంత్రులైన షహ్నవాజ్ హుస్సెన్, ముఖ్తార్ అబ్బాస్ నక్వీ, మొహ్సిన్ రాజాల వంటి ముస్లిం నాయకుల పేర్లను కూడా మార్చగలరా అంటూ సవాల్ విసిరారు. బడుగు, బలహీన వర్గాల ప్రజలు తమకు జరుగుతున్న అన్యాయాల గురించి మాట్లాడకుండా ఉండటానికి.. వారి దృష్టి మరల్చడానికే బీజేపీ ఇలాంటి డ్రామాకు తెరలేపిందంటూ విరుచుకుపడ్డారు. ముస్లింలు మన కోసం కొన్ని మహోన్నతమైన వాటిని వదిలి వెళ్లారు. ఎర్రకోట, తాజ్‌మహల్‌ను నిర్మించిందేవరు? అంటూ ఆయన ప్రశ్నించారు. -
పలుగు, పార చేతపట్టి సామాన్యుడిలా..!
లక్నో : ప్రభుత్వానికి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదని ఉత్తరప్రదేశ్ కేబినెట్ మంత్రి ఓం ప్రకాశ్ రాజ్‌భర్ పలుగు, పార చేతపట్టారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ వివరాలిలా.. వారణాసిలోని సింధోరలో రాజ్‌భర్ పాత (వంశపారంపర్య)ఇళ్లు ఉంది. అయితే ఆ ఏరియాలో వాహనాలు వెళ్లేందుకు సౌకర్యం లేదని, రోడ్డు నిర్మాంచాలని యూపీ ప్రభుత్వాన్ని, అధికారులను బీసీశాఖ మంత్రి రాజ్‌భర్ పలుమార్లు కోరారు అధికారులు ఈ విషయాన్ని పట్టించుకోక పోవడంతో తానే స్వయంగా రంగంలోకి దిగారు. తలకు పసుపు తలపాగా ధరించి, గ్రామస్తుల సాయంతో మరమ్మతులు చేపట్టారు. పలుగు, పార చేతపట్టి సామాన్య కూలీగా రోడ్డు పనులు చేశారు. దీనిపై ఏఎన్ఐ మీడియా రాజ్‌భర్‌ను సంప్రదించగా.. నేడు(ఆదివారం) నా కుమారుడి వివాహ రిసెప్షన్ ఉంది. అయితే మా ఇంటికి వచ్చే అతిథులకు అసౌకర్యం కలుగుతుంది. ఆ ఇబ్బందుల నివారణలో భాగంగా జిల్లా అధికారులు, రాష్ట్ర ప్రభుత్వాన్ని రోడ్డు నిర్మాణం చేపట్టాలని గతంలో పలుమార్లు కోరినా ప్రయోజనం లేకపోయింది. రాష్ట్ర కేబినెట్ మంత్రిపట్ల ఇంత వివక్ష చూపిస్తున్నారు. అందుకే సొంతంగా మా పని మేం చేసుకున్నామని’ మంత్రి ఓం ప్రకాశ్ రాజ్‌భర్ వివరించారు. యోగి అదిత్యనాథ్ సర్కార్ చర్యలను గతంలో పలుమార్లు ఆయన వ్యతిరేకించారు. పలు అంశాల్లో ప్రభుత్వాన్ని విమర్శించారు. గతంలో రాజ్‌భర్ బహ్రైచ్ పట్టణంలోని సర్క్యూట్ హౌస్‌ను సందర్శించినప్పుడు ఇతర మంత్రులకు ఇచ్చే గౌరవాన్ని అధికారులు తనకు ఇవ్వలేదన్నారు. తాను వెనకబడిన కులానికి చెందినవాడిని కావడమే వివక్షకు కారణమని స్వయంగా రాష్ట్ర మంత్రే చెప్పడం చర్చనీయాశంగా మారడం తెలిసిందే. కాగా, సుహెల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ (ఎస్బీఎస్పీ), బీజేపీతో కలిసి కూటమి ప్రభుత్వంలో కొనసాగుతోంది. ఎస్బీఎస్పీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే రాజ్‌భర్‌కు మొదటినుంచీ యోగి ఆదిత్యనాథ్ సర్కార్ నిర్ణయాలు మింగుడు పడటం లేదు. యూపీ బీజేపీ అధ్యక్షుడు మహేంద్రనాథ్ పాండే ఓ కార్యక్రమంలో రాజ్‌భర్ ఓ దొంగ అని తనపై తీవ్ర వ్యాఖ్యలు చేసినట్లు వివరించారు. -
నన్ను కాదని వెళ్తే జాండీస్ సోకుతుంది
లక్నో: యూపీ మంత్రి, వివాదాల పుట్ట ఓం ప్రకాశ్ రాజ్‌భర్ మరోసారి తన నోటికి పని చెప్పారు. రాజకీయ ప్రత్యర్థులకు ఆయన విచిత్రమైన శాపనార్థాలు పెట్టారు. తనకు వ్యతిరేకంగా ఎవరైనా ర్యాలీలు నిర్వహించినా, లేదా ఎవరైనా ఆ ర్యాలీలో ఎవరైనా పాల్గొన్న... వారు జాండీస్ సోకుతుందంటూ వ్యాఖ్యలు చేశారు. ఆదివారం బల్లియాలో నిర్వహించిన మద్యపాన నిషేధ ర్యాలీలో ఆయన పాల్గొని మాట్లాడారు. ‘నా తరపు మనుషులు వచ్చి పిలిస్తేనే మీరు మా ర్యాలీల్లో పాల్గొనాలి. అలా కాదని నా రాజకీయ ప్రత్యర్థుల ర్యాలీలో వెళ్లారో జాగ్రత్త. మీకు జాండీస్ సోకుతుంది. ఇదే నా శాపం. పైగా దానికి నేను మందిస్తేనే మీకు నయం అవుతుంది.’ అని వ్యాఖ్యానించారు. కాగా, యూపీ ఎన్నికల సందర్భంగా ప్రధాని మోదీ గుజరాత్ మోడల్‌ను ఇక్కడ ప్రవేశపెడతా అని చెప్పారని, కానీ, ఇంత వరకు అది నెరవేర్చలేదని రాజ్‌భర్ ప్రస్తావించారు. మద్యపాన నిషేధంతోపాటు మిగతా హామీలను కూడా మోదీ నెరవేరిస్తే మంచిదని రాజ్‌భర్ వ్యాఖ్యానించారు. కాగా, ‘సుహెల్దేవ్ భారతీయ సమాజ్’ పార్టీ చీఫ్ అయిన ఓం ప్రకాశ్ రాజ్‌భర్ ప్రస్తుతం యూపీ సంకీర్ణ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు. గత కొంత కాలంగా బీజేపీ విధానాలపై, యోగి సర్కార్‌పై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆయన విమర్శలు చేస్తూ వస్తున్నారు. ముఖ్యంగా ఎస్సీ/ఎస్టీ రిజర్వేషన్ల అంశంలో బీజేపీ మోసం చేసిందంటూ ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో త్వరలో ఆయన కూటమి నుంచి వైదొలిగే సంకేతాలు ఉన్నట్లు ఆయన అనుచరులు చెబుతున్నారు. -
భారతీయుల డీఎన్ఏలోనే అవినీతి...
లక్నో: ఉత్తర ప్రదేశ్ మంత్రి ఓం ప్రకాశ్ రాజ్‌భర్ వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. అవినీతి అనేది భారతీయుల డీఎన్ఏలోనే ఉందని, దానిని రూపుమాపటం కష్టమైన పని ఆయన ప్రసంగించారు. శుక్రవారం హమీర్పూర్ జిల్లాలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘100 కోట్ల మంది భారతీయుల డీఎన్ఏలో అవినీతి ఉంది. నరనరాల్లో అది ప్రవహిస్తోంది. ఈ మధ్యే ప్రధాని నియోజకవర్గం వారణాసిలో నిర్మాణంలో ఉన్న ఓ ఫ్లైఓవర్ కూలిన ప్రమాదం అందరం చూశాం. ఘటన వెనుక అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. ప్రజల్లో బలంగా నాటుకుపోయిన ఈ జాడ్యాన్ని ఒక్కసారిగా తొలగించటం కష్టం. అందుకే నెమ్మదిగా పెకలించివేయాలి. అవినీతి నిర్మూలనకు ప్రధాని మోదీ స్వయంగా రంగంలోకి దిగి పోరాటం చేస్తున్నారు. అది అభినందించదగ్గ విషయం’ అని రాజ్‌భర్ ప్రసంగించారు. ఇక యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షాలపై రాజ్‌భర్ సంచలన ఆరోపణలు చేశారు. ఎస్సీ/ఎస్టీ న్యాయపరమైన డిమాండ్ల విషయంలో వాళ్లిద్దరూ ఎలాంటి శ్రద్ధ కనబరచటం లేదని రాజ్‌భర్ అన్నారు. రాజ్‌భర్ వ్యాఖ్యలపై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ‘సుహెల్దేవ్ భారతీయ సమాజ్’ పార్టీకి చెందిన ఓం ప్రకాశ్ రాజ్‌భర్ గతేడాది సార్వత్రిక ఎన్నికల్లో గెలిచి బీజేపీతో పొత్తు పెట్టుకుని మంత్రి పదవి అయ్యారు. అయితే గత కొన్ని రోజులుగా ఆయన యోగి ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కొద్దిరోజుల క్రితం ఓ సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ఎస్సీ-బీఎస్పీ హయాంలో కన్నా యోగి ఏడాది పాలన అత్యంత అవినీతిమయమైందని వ్యాఖ్యానించారు. -
బీసీని కాబట్టే పట్టించుకోలేదు: బీజేపీ మంత్రి
లక్నో : ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తమ పార్టీ నాయకులను దళితుల ఇళ్లను సందర్శించమని ఆదేశించగా, మరోవైపు వెనుకబడిన వర్గాలకు చెందిన మంత్రులకు కనీస గౌరవం దక్కడం లేదు. ఈ విషయాన్ని యోగి కేబినెట్లోని మంత్రే స్వయంగా వెల్లడించారు. మంత్రి ఓంప్రకాశ్ రాజ్‌భర్ బహ్రైచ్ పట్టణంలోని సర్క్యూట్ హౌస్‌ను సందర్శించినప్పుడు ఇతర మంత్రులకు ఇచ్చే గౌరవాన్ని అధికారులు తనకు ఇవ్వలేదని తెలిపారు. ఇందుకు కారణం తాను వెనకబడిన కులానికి చెందినవాడిని కావడమే అని ఆయన వాపోయారు. రెండు రోజుల క్రిత్రం బహ్రైచ్‌లో ఓ వివాహ వేడకకు హాజరయిన ఓంప్రకాశ్ అనంతరం పట్టణంలోని సర్క్యూట్ హౌస్‌కు వెళ్లారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎంపీలు, ఎమ్మెల్యేలు, వీఐపీలు ఎవరైనా సర్క్యూట్ హౌజ్‌కు సందర్శించినప్పుడు అధికారులు వారిని ప్రొటోకాల్ ప్రకారం గౌరవంగా ఆహ్వానించాలి. అయితే ఓంప్రకాశ్ సర్క్యూట్ హౌజ్ వద్దకు వెళ్లినప్పుడు అధికారులు ఎవరూ ఆయనకు స్వాగతం పలకలేదు. దీని గురించి ఓం ప్రకాశ్ మాట్లాడుతూ.. ‘మన సమాజంలో కొన్ని వందల ఏళ్లుగా వెనకబడిన వర్గాల వారిని అవమానిస్తూనే ఉన్నారు. నేను వెనుకబడిన వర్గానికి చెందిన వాడిని కావడం వల్లే అధికారులు నన్ను పట్టించుకోలేదు. అదే ఏ ఉన్నత వర్గానికి చెందిన మంత్రో వస్తే వారు పరుగున వెళ్లి అతనికి అధికార లాంఛనాలతో స్వాగతం పలికేవార’ని విమర్శించారు. -
మంత్రి ఇంటిపై కోడిగుడ్లు, టొమాటోలతో దాడి
-
మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు.. దుమారం
లక్నో : బాధ్యతాయుతమైన రాష్ట్ర మంత్రి హోదాలో ఉన్న వ్యక్తి కొన్ని సామాజిక వర్గాలపై చేసిన వ్యాఖ్యలు ఉత్తరప్రదేశ్‌లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. రాజ్‌పుత్, యాదవ సామాజిక వర్గాలకు చెందిన కొందరు వ్యక్తులు రాష్ట్ర మంత్రి ఓం ప్రకాశ్ రాజ్‌భర్ ఇంటిపై శనివారం దాడికి పాల్పడ్డారు. రాళ్లు, కోడిగుడ్లు, టొమాటోలను మంత్రి ఇంటిపై రువ్వుతూ ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. యోగి ఆదిత్యనాథ్ కేబినెట్లో మంత్రి అయిన ఓం ప్రకాశ్ రాజ్‌భర్ శుక్రవారం జరిగిన ఓ సభలో మాట్లాడుతూ.. మద్యం గురించి చెబుతూ.. రాజ్‌పుత్‌లు, యాదవులు అధిక మోతాదులో మద్యం సేవిస్తారని పేర్కొన్నారు. ఇది వారికి పూర్వీకుల నుంచి వారసత్వంగా వస్తున్న వ్యాపారమని అందులో భాగంగా వీళ్లకు మద్యం అలవాటు ఎక్కువగా ఉంటుందని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇతర సామాజిక వర్గాల వారికి అలవాటున్నా.. అంతగా మద్యం సేవించరని అభిప్రాయపడ్డారు. దాంతో పాటుగా కాంగ్రెస్ పాలనతో విసుగెత్తిపోయిన ప్రజలు నరేంద్ర మోదీకి అధికారం కట్టబెట్టారని, ప్రస్తుతం మోదీ పాలనలో ప్రజలు సంతోషంగా లేరని వ్యాఖ్యలు చేయడం బీజేపీ అధిష్టానికి మింగుడు పడటం లేదు.