యూపీ మంత్రి ఓం ప్రకాశ్ రాజ్భర్
లక్నో: ఉత్తర ప్రదేశ్ మంత్రి ఓం ప్రకాశ్ రాజ్భర్ వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. అవినీతి అనేది భారతీయుల డీఎన్‌ఏలోనే ఉందని, దానిని రూపుమాపటం కష్టమైన పని ఆయన ప్రసంగించారు. శుక్రవారం హమీర్‌పూర్ జిల్లాలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
‘100 కోట్ల మంది భారతీయుల డీఎన్‌ఏలో అవినీతి ఉంది. నరనరాల్లో అది ప్రవహిస్తోంది. ఈ మధ్యే ప్రధాని నియోజకవర్గం వారణాసిలో నిర్మాణంలో ఉన్న ఓ ఫ్లైఓవర్ కూలిన ప్రమాదం అందరం చూశాం. ఘటన వెనుక అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. ప్రజల్లో బలంగా నాటుకుపోయిన ఈ జాడ్యాన్ని ఒక్కసారిగా తొలగించటం కష్టం. అందుకే నెమ్మదిగా పెకలించివేయాలి. అవినీతి నిర్మూలనకు ప్రధాని మోదీ స్వయంగా రంగంలోకి దిగి పోరాటం చేస్తున్నారు. అది అభినందించదగ్గ విషయం’ అని రాజ్భర్ ప్రసంగించారు.
ఇక యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షాలపై రాజ్భర్ సంచలన ఆరోపణలు చేశారు. ఎస్సీ/ఎస్టీ న్యాయపరమైన డిమాండ్ల విషయంలో వాళ్లిద్దరూ ఎలాంటి శ్రద్ధ కనబరచటం లేదని రాజ్భర్ అన్నారు. రాజ్భర్ వ్యాఖ్యలపై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ‘సుహెల్‌దేవ్ భారతీయ సమాజ్’ పార్టీకి చెందిన ఓం ప్రకాశ్ రాజ్భర్ గతేడాది సార్వత్రిక ఎన్నికల్లో గెలిచి బీజేపీతో పొత్తు పెట్టుకుని మంత్రి పదవి అయ్యారు. అయితే గత కొన్ని రోజులుగా ఆయన యోగి ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కొద్దిరోజుల క్రితం ఓ సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ఎస్సీ-బీఎస్పీ హయాంలో కన్నా యోగి ఏడాది పాలన అత్యంత అవినీతిమయమైందని వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment