ఎన్‌సీడబ్ల్యు సభ్యురాలి అనుచిత వ్యాఖ్యలు : తాప్సీ ఫైర్‌ | NCW member Chandramukhi lectures women regaaridngBadaun Gangrape | Sakshi
Sakshi News home page

ఎన్‌సీడబ్ల్యు సభ్యురాలి అనుచిత వ్యాఖ్యలు : తాప్సీ ఫైర్‌

Published Thu, Jan 7 2021 7:19 PM | Last Updated on Thu, Jan 7 2021 8:28 PM

NCW member Chandramukhi lectures women regaaridngBadaun Gangrape  - Sakshi

సాక్షి, లక్నో: ఒకవైపు ఉత్తరప్రదేశ్‌ బదాయూ జిల్లాలో 50 ఏళ్ల మహిళపై సామూహిక హత్యాచార ఘటనపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. మరోవైపు  ధితురాలి కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లిన జాతీయ మహిళా కమిషన్‌ (ఎన్‌సిడబ్ల్యు) సభ్యురాలు అనుచిత వ్యాఖ్యలు చేయడం వివాదానికి దారి తీసింది. సాక్షాత్తూ  జాతీయ మహిళా కమిషన్‌ (ఎన్‌సిడబ్ల్యు) సభ్యురాలు చంద్రముఖి మహిళలు, వారి కదలికలపై చేసిన అసంబద్ధ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.  రాత్రిపూట ఆ మహిళ ఒంటరిగా బయటికి వెళ్లి  ఉండకపోతే అత్యాచార ఘటన జరిగి ఉండేది కాదంటూ ఆమె నోరు పారేసుకున్నారు.  ఆమె వెంట ఎవరైనా తోడు ఉండి ఉంటే ఇలాంటి ఘటన జరిగేది కాదని వ్యాఖ్యానించారు.  అంతేకాదు వేళగాని వేళ మహిళలు బయటికి రాకూడదంటూ సలహా ఇచ్చి పారేశారు.

ఈ వ్యవహారంపై ఎన్‌సిడబ్ల్యు చీఫ్ రేఖ శర్మ కూడా స్పందించారు. ఆమె అలా ఎందుకు వ్యాఖ్యానించారో తెలియదుకానీ మహిళలు  ఎక్కడ ఎలా  ఉండాలో వారిష్టం అంటూ చంద్రముఖి వ్యాఖ్యలను తిరస్కరించారు. మహిళలకు భద్రత కల్పించాల్సిన బాధ్యత సమాజానిది, ప్రభుత్వానిది అని పేర్కొన్నారు.  అటు మహిళా సంఘాలతోపాటు పలువురు మండిపడుతున్నారు. ముఖ్యంగా హీరోయిన్‌ తాప్సి స్పందిస్తూ ఇలాంటి రకమైన ఆలోచన ఉన్నవారు ఈ దేశంలో లేకపోతే ఇలాంటి  ఘటనలు జరగవంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాగా ఆదివారం సాయంత్రం మహిళ ఆలయానికి వెళ్లినపుడు స్వయంగా  పూజారి, మరో ఇద్దరితో కలిసి ఆమెపై  దారుణానికి పాల్పడ్డారు. ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేయడంతోపాటు దారుణంగా హింసించారు. ఫలితంగా మృతురాలి ఊపరితిత్తులు దెబ్బతిన్నాయి, పక్కటెముకలు, కాలు విరిగిపోయాయని పోస్టుమార్టం రిపోర్టులో వైద్యులు గుర్తించిన సంగతి తెలిసిందే. ఈ ఘటన సంబంధించి ఆలయ పూజారి, అతడి ఇద్దరు సహచరులపై ఆరోపణలు నమోదు చేశారు. ఈ కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశామని పోలీసులు చెప్పారు. ప్రధాన నిందితుడు ఆలయ పూజారిని ఇంకా  పరారీలో ఉన్నాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement