Badaun
-
కస్టడీలో వ్యక్తికి పోలీసుల కరెంట్ షాక్
బదౌన్: పశువుల దొంగతనం కేసులో ఉత్తరప్రదేశ్ పోలీసులు 20 ఏళ్ల యువకుడిని కరెంట్ షాక్‌తో చిత్రహింసలకు గురిచేశారు. బాధితుడు ఆస్పత్రి పాలయ్యాడు. ఘటనకు సంబంధించి ఐదుగురు పోలీసులను అధికారులు సస్పెండ్ చేశారు. రెహాన్ అనే రోజుకూలీ ఈ నెల 2వ తేదీన సాయంత్రం ఇంటికి వెళ్తుండగా బదౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పశువుల దొంగల ముఠాకు సహకరిస్తున్నాడంటూ అతడిని చిత్రహింసలు పెట్టారు. కరెంట్ షాక్‌కు గురి చేయడంతోపాటు లాఠీతో తీవ్రంగా కొట్టడంతో నడవలేని, కనీసం మాట్లాడలేని పరిస్థితికి చేరుకున్నాడని బాధితుడి కుటుంబసభ్యులు ఆరోపించారు. అతడిని విడిపించేందుకు రూ.5 వేలు లంచం ఇవ్వాల్సి వచ్చిందన్నారు. తీవ్రంగా గాయపడిన అతడికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. -
ఎన్సీడబ్ల్యు సభ్యురాలి అనుచిత వ్యాఖ్యలు : తాప్సీ ఫైర్
సాక్షి, లక్నో: ఒకవైపు ఉత్తరప్రదేశ్ బదాయూ జిల్లాలో 50 ఏళ్ల మహిళపై సామూహిక హత్యాచార ఘటనపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. మరోవైపు ధితురాలి కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లిన జాతీయ మహిళా కమిషన్ (ఎన్‌సిడబ్ల్యు) సభ్యురాలు అనుచిత వ్యాఖ్యలు చేయడం వివాదానికి దారి తీసింది. సాక్షాత్తూ జాతీయ మహిళా కమిషన్ (ఎన్‌సిడబ్ల్యు) సభ్యురాలు చంద్రముఖి మహిళలు, వారి కదలికలపై చేసిన అసంబద్ధ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. రాత్రిపూట ఆ మహిళ ఒంటరిగా బయటికి వెళ్లి ఉండకపోతే అత్యాచార ఘటన జరిగి ఉండేది కాదంటూ ఆమె నోరు పారేసుకున్నారు. ఆమె వెంట ఎవరైనా తోడు ఉండి ఉంటే ఇలాంటి ఘటన జరిగేది కాదని వ్యాఖ్యానించారు. అంతేకాదు వేళగాని వేళ మహిళలు బయటికి రాకూడదంటూ సలహా ఇచ్చి పారేశారు. ఈ వ్యవహారంపై ఎన్‌సిడబ్ల్యు చీఫ్ రేఖ శర్మ కూడా స్పందించారు. ఆమె అలా ఎందుకు వ్యాఖ్యానించారో తెలియదుకానీ మహిళలు ఎక్కడ ఎలా ఉండాలో వారిష్టం అంటూ చంద్రముఖి వ్యాఖ్యలను తిరస్కరించారు. మహిళలకు భద్రత కల్పించాల్సిన బాధ్యత సమాజానిది, ప్రభుత్వానిది అని పేర్కొన్నారు. అటు మహిళా సంఘాలతోపాటు పలువురు మండిపడుతున్నారు. ముఖ్యంగా హీరోయిన్ తాప్సి స్పందిస్తూ ఇలాంటి రకమైన ఆలోచన ఉన్నవారు ఈ దేశంలో లేకపోతే ఇలాంటి ఘటనలు జరగవంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా ఆదివారం సాయంత్రం మహిళ ఆలయానికి వెళ్లినపుడు స్వయంగా పూజారి, మరో ఇద్దరితో కలిసి ఆమెపై దారుణానికి పాల్పడ్డారు. ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేయడంతోపాటు దారుణంగా హింసించారు. ఫలితంగా మృతురాలి ఊపరితిత్తులు దెబ్బతిన్నాయి, పక్కటెముకలు, కాలు విరిగిపోయాయని పోస్టుమార్టం రిపోర్టులో వైద్యులు గుర్తించిన సంగతి తెలిసిందే. ఈ ఘటన సంబంధించి ఆలయ పూజారి, అతడి ఇద్దరు సహచరులపై ఆరోపణలు నమోదు చేశారు. ఈ కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశామని పోలీసులు చెప్పారు. ప్రధాన నిందితుడు ఆలయ పూజారిని ఇంకా పరారీలో ఉన్నాడు. If people with her kind of thinking didn’t exist in this country toh aisi ghatna nahi hoti. #Hopeless #Shame https://t.co/Zcs7iYaWV4 — taapsee pannu (@taapsee) January 7, 2021 -
పెళ్లి జరిగిన రాత్రే షాకిచ్చిన వధువు
లక్నో : లక్షల రూపాయలు ఖర్చపెట్టి అంగరంగ వైభవంగా పెళ్లి చేసిన అత్తింటికి భారీ షాకిచ్చింది ఓ నవ వధువు. పెళ్లి జరిగి కొన్ని గంటలు కూడా గడవక ముందే భారీ డబ్బు, నగలతో ఇంట్లో నుంచి పారిపోయింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బడాన్ జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆజంగఢ్‌కు చెందిన ప్రవీణ్, రియా డిసెంబర్ 9న వివాహం చేసుకున్నారు. టింకూ అనే మధ్యవర్తి ద్వారా ప్రవీణ్‌కు రియా పరిచయం అయింది. రియా పేద కుటుంబానికి చెందిన అమ్మాయి అని, పెళ్లి చేసే స్థోమత లేదని ప్రవీణ్ దగ్గర టింకూ రూ.4లక్షలు తీసుకున్నాడు. పెళ్లి వధువు ఊరైన అజంగఢ్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. పెళ్లి తర్వాత అంతా కలిసి వరుడు ప్రవీణ్ ఇంటికి వచ్చారు. అదే రోజు రాత్రి రియా.. ప్రవీణ్ కుటుంబం మొత్తానికి మత్తుమందు ఇచ్చి ఇంట్లో ఉన్న నగదు, నగలతో పారిపోయింది. ప్రవీణ్ కుటుంబం మరుసటి రోజు ఉదయం నిద్రలేచేసరికి వధువు రియాతో పాటు నగదు మరియు విలువైన వస్తువులు కూడా కనిపించలేదు. దాంతో కంగుతిన్న ప్రవీణ్ కుటుంబం.. అజంగఢ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొత్త పెళ్లి కూతురు రూ .70 వేల నగదు, రూ.నాలుగు లక్షల విలువైన ఆభరణాలతో పారిపోయిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాగే మధ్యవర్తిత్వం వహించిన టింకూ కూడా కనిపించకుండా పోయాడని తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. కాగా, రియా తన కుటుంబ సభ్యుల పరువు తీసిందని, ఆమెను ఎలాగైనా అరెస్ట్ చేసి శిక్షించాలని ప్రవీణ్ కోరారు. -
గుండెలు పిండేసే ఘటన..
బదౌన్: జబ్బుతో బాధపడుతున్న భార్యను ఆస్పత్రికి తీసుకెళ్లాడు.. అక్కడ డాక్టర్ లేడు. ఈలోపే ప్రాణాలు గాల్లోకలిసిపోయాయి! మృతదేహాన్ని తీసుకెళ్లడానికి అంబులెన్స్‌లేదు.. ఆటోవాడూ రానన్నాడు.. చేసేదేమీలేక భార్య శవాన్ని భుజాలపై మోస్తూ కిలోమీటర్ల దూరం నడిచివెళ్లాడు.. గుండెలు పిండేసే ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బదౌన్‌లో చోటుచేసుకుంది. బదౌన్ జిల్లా ఆస్పత్రి నుంచి భార్య మృతదేహంతో బాధితుడు వెళుతున్న దృశ్యాలు మీడియాలో ప్రసారం కావడంతో అధికారులు స్పందించారు. జరిగిన ఘటన దురదృష్టకరమని, ఎందుకు జరిగిందో దర్యాప్తు చేస్తామని బదౌన్ వైద్యాధికారి అన్నారు. కాగా, జిల్లా ఆస్పత్రిలో మృతదేహాలను తీసుకెళ్లేందుకు రెండు వ్యాన్లు ఉన్నాయని తెలిపారు. అయితే బాధితుడు మాత్రం అక్కడ ఏర్పాట్లేవీ లేవని చెప్పాడు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సిఉంది. -
భార్య శవాన్ని భుజాలపై మోస్తూ..!
-
దళితుడితో మూత్రం తాగించారు!
లక్నో : తమ పంటను కోయలేదని అగ్ర కులాలకు చెందిన కొందరు వ్యక్తులు ఓ దళితుడితో మూత్రం తాగించిన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బదౌన్ జిల్లాలో చోటుచేసుకుంది. ఏప్రిల్ 23న జరిగిన ఈ ఘటన అలస్యంగా వెలుగులోకి వచ్చింది. బదౌన్ జిల్లాలోని అజంపూర్ బిసౌరియా గ్రామంలోని వాల్మికీ సామాజిక వర్గానికి చెందిన సీతారాం వాల్మికీ తనకున్న కొద్ది పొలంలో గోధమ సాగు చేశారు. తన పంట కోతకు రావడంతో ఆ పనుల్లో నిమగ్నమై ఉన్నారు. అయితే అదే ఊరిలో అగ్ర కులానికి చెందిన కొందరు రైతులు మాత్రం తమ పొలంలోని పంటను కోసిన తర్వాతే నీ పంటని కోసుకోవాలని సీతారాంని బెదిరించారు. దీనికి అతను ఒప్పుకోకపోవడంతో అతనిపై దౌర్జన్యానికి దిగారు. ఈ ఘటనపై బాధితుడు మాట్లాడుతూ.. వారి మాట విననందుకు తనపై చెప్పులతో దాడి చేశారని తెలిపారు. అంతేకాకుండా మీసాలను బలంగా లాగుతూ.. బలవంతగా తనతో మూత్రం తాగించారని ఆవేదన వ్యక్తం చేశారు. తనపై పాశవికంగా ప్రవర్తించిన వారిపై పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి వెళ్తే స్థానిక ఇన్స్పెక్టర్ కేసు నమోదు చేసేందుకు నిరాకరించాడు. దీంతో ఎస్పీని ఆశ్రయించడంతో ఆయన ఆదేశాల మేరకు స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆ పోలీసు అధికారిని సస్పెండ్ చేయడంతోపాటు అతనిపై శాఖాపరమైన దర్యాప్తుకు ఆదేశించారు. ఈ కేసులో గ్రామానికి చెందిన విజయ్ సింగ్, పింకు సింగ్, శైలేంద్ర సింగ్ ప్రధాన నిందితులుగా ఉన్నారని పోలీసు ఉన్నాతాధికారులు తెలిపారు. వీరిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు వెల్లడించారు. -
నిర్భయ తరహాలో.. మరో దారుణం
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లో ఇద్దరు అక్కాచెల్లెళ్లు శవాల్లా చెట్టుకు వేలాడిన దృశ్యం ఇంకా కళ్ల ముందు చెదిరిపోక ముందే బదయూ జిల్లా మరోసారి వార్తల్లో నిలిచింది. 14 ఏళ్ళ బాలికపై అతి దారుణంగా సామూహిక అత్యాచారం చేసి, బెదిరించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పొద్దున్నే బిస్కట్లు, స్వీట్లు తెచ్చుకుందామని బయటకు వచ్చిన అమ్మాయిని ముగ్గురు వ్యక్తులు అపహరించుకుపోయారు. బలవంతంగా ఏదో తాగించి స్పృహ కోల్పోయిన తర్వాత సమీపంలోని నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. దారుణంగా హింసించారు. ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించారు. ఎట్టకేలకు మూడు రోజుల నరకం తర్వాత బంధువుల సాయంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ''ఎవరో పిలుస్తున్నారని పక్కింటబ్బాయి చెబితే వెళ్లా. అక్కడ ఇంకో ఇద్దరు ఉన్నారు. అందరూ కలిసి బలవంతంగా ఏదో తాగించి, బంధించి తీసుకెళ్లి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు'' అని బాధిత బాలిక పోలీసులకిచ్చిన స్టేట్మెంట్లో తెలిపింది. ఆమెపై సామూహిక అత్యాచారం జరిగిందనే విషయాన్ని వైద్యులు ధ్రువీకరించారు. దీంతోపాటు మరో దిగ్భ్రాంతికర విషయాన్ని కూడా డాక్టర్లు వెల్లడించారు. నిర్భయ గ్యాంగ్ రేప్ తరహాలో అగ్గిపెట్టె, ప్లాస్టిక్, గుడ్డముక్కలు, చిన్న చెక్కముక్కను బాలిక ప్రయివేట్ పార్ట్ పరీక్షలో కనుగొన్నామని తెలిపారు. కేసు నమోదుచేసిన పోలీసులు ముగ్గురు నిందితులలో ఇద్దరిని అరెస్ట్ చేశారు. -
బాలికపై అత్యాచారం.. ఇద్దరు పోలీసుల సస్పెన్షన్
ఉత్తరప్రదేశ్‌లో దారుణం జరిగింది. 14 ఏళ్ల బాలికపై ఇద్దరు పోలీసులు అత్యాచారం చేశారు. దాంతో వారిద్దరినీ సస్పెండ్ చేశారు. బుధవారం రాత్రి ఆమె కాలకృత్యాలు తీర్చుకోడానికి ఇంటి నుంచి బయటకు వెళ్లిన సమయంలో ఇద్దరు కానిస్టేబుళ్లు చూసి ఆమెను అక్కడకు సమీపంలోని ఓ గదిలోకి లాక్కెళ్లి అత్యాచారం చేశారని బాలిక కుటుంబ సభ్యులు ఆరోపించారు. బాలిక తల్లి ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేశారు. నిందితులైన కానిస్టేబుళ్లిద్దరూ ప్రస్తుతం పరారీలో ఉన్నారు. ఆమె ఎంతకూ ఇంటికి తిరిగి రాకపోవడంతో తాము అన్ని చోట్లా చూశామని, చివరకు అర్ధరాత్రి తిరిగొచ్చి జరిగిన విషయం తమకు చెప్పిందని బాలిక తల్లి అన్నారు. యూపీ సీఎం అఖిలేష్ యాదవ్ ఈ ఘటనపై తీవ్రంగా స్పందించారు. వెంటనే ఇద్దరు కానిస్టేబుళ్లపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. -
‘బదౌన్’ సోదరీమణులది ఆత్మహత్యే: సీబీఐ
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని బదౌన్‌కు చెందిన ఇద్దరు బాలికలు ఆత్మహత్యకు పాల్పడ్డారనీ వారిపై సామూహిక అత్యాచారం, హత్య జరగలేదని సీబీఐ గురువారం తేల్చి చెప్పింది. దీనిపై సీబీఐ ప్రతినిధి కాంచన్ ప్రసాద్ మాట్లాడుతూ ఈ ఘటనపై శాస్త్రీయ పద్ధతుల్లో 40 రకాల పరీక్షలు చేయించామన్నారు. మెడికల్ బోర్డు బాలికలపై లైంగిక దాడి జరిగిందన్న అనుమానాలు వ్యక్తం చేయడంతో దీన్ని నిర్ధారించేందుకు హైదరాబాద్‌లోని డీఎన్ఏ నిపుణుల సాయం తీసుకున్నామన్నారు. వారు పరీక్షలు జరిపి అత్యాచారం, హత్య జరిగిందనడానికి ఎలాంటి అధారాలు లేవని తేల్చినట్లు పేర్కొన్నారు. ఈ నివేదికను శుక్రవారం బాదావున్ కోర్టుకు సమర్పించనున్నారు. ఇందులో నిందితులుగా భావి స్తున్న ఐదుగురిని గతంలోనే యూపీ పోలీసులు అరెస్టు చేశారు. వారిపై చార్జిషీటును కూడా దాఖలు చేయరాదని సీబీఐ భావిస్తోంది. దగ్గర బంధువులైన ఈ బాలికలు గత మే నెలలో తమ గ్రామానికి సమీపంలోనే ఉన్న ఓ చెట్టుకు ఉరివేసుకొని అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. కాగా, మృతిచెందిన బాలికల కుటుంబీకులు సీబీపై దర్యాప్తును తప్పుపట్టారు. తమ పిల్లలు ఆత్మహత్యచేసుకోలేదని, దీనిపై సుప్రీం కోర్టును ఆశ్రయిస్తామని తెలిపారు. -
13 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం
ఉత్తరప్రదేశ్‌లోని బదయూ ప్రాంతంలో పదమూడేళ్ల అమ్మాయిని నలుగురు దుండగులు అపహరించి, ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు. ఈ సంఘటన జరీఫ్నగర్ ప్రాంతంలో జరిగింది. నిందితులలో ఇద్దరిని పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. గత రాత్రి బాధితురాలు తమ ఇంట్లో మేడ మీద నిద్రపోతుండగా, దుండగులు వచ్చి ఆమెను అపహరించుకుని వెళ్లి మొత్తం నలుగురూ ఆమెపై అత్యాచారంచేసినట్లు సీనియర్ ఎస్పీ సంతోష్ కుమార్ సింగ్ తెలిపారు. ఈ ఘోరానికి పాల్పడిన దుండగులను అమిత్, ముక్తియార్, భోలా పండిట్, దన్నులుగా గుర్తించామన్నారు. బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అమిత్, ముక్తియార్లను అరెస్టు చేశామని, మిగిలిన ఇద్దరు పరారీలో ఉన్నారని ఆయన చెప్పారు. -
'పొరపాటున అత్యాచారాలు జరుగుతున్నాయి'
మహిళలపై అత్యాచారాలు పొరపాటుగానే జరుగుతున్నాయని తాజాగా ఛత్తీస్‌గఢ్ హోం శాఖ మంత్రి రామ్ సేవక్ పైక్రా తాజాగా సెలవిచ్చారు. ఎవరికి అత్యాచారం చేయాలనే అనుకోరని... ఒక్కోసారి పొరపాటుగా అవి జరుగుతాయని తెలిపారు. శనివారం ఛత్తీస్గడ్ రాజధాని రాయ్‌పూర్‌లో రామ్ సేవక్ విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్బంగా ఉత్తరప్రదేశ్‌లో ఇటీవల చోటుచేసుకున్న అత్యాచార సంఘటనలపై స్పందించాలని ఆయన్ని విలేకర్లు కోరారు. దాంతో ఆయన పై విధంగా స్పందించారు. అయితే రాష్ట్రంలో మహిళలపై ఎక్కడ ఎప్పడు ఎటువంటి దాడులు జరిగిన వెంటనే స్పందించాలని పోలీసు శాఖను ఆదేశించినట్లు చెప్పారు. అయితే రామ్ సేవక్ వ్యాఖ్యలపై ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు భూపేష్ బాగల్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. హోం మంత్రి స్థానంలో ఉండి అత్యాచార ఘటనలపై రామ్ సేవక్ స్పందించిన తీరు సరిగాలేదని భూపేష్ విమర్శించారు. మహిళలను కించపరిచేలా ఆయన మాట్లాడారని ఆరోపించారు. మహిళలకు క్షమాపణలు చెప్పాలని భూపేష్ ఈ సందర్బంగా హోం మంత్రి రామ్ సేవక్‌ను డిమాండ్ చేశారు. -
‘రాష్ట్రం వదిలి వెళ్లిపోతాం’
బదౌన్: బాలికలపై అత్యాచారం,హత్య కేసులో న్యాయం కోసం పోరాడేందుకు ‘బదౌన్’ సామూహిక అత్యాచార ఘటన బాధిత కుటుంబసభ్యులు రాష్ట్రం విడిచివెళ్లిపోవడానికి సిద్ధమవుతున్నారు. తొమ్మిది రోజుల కిందట కదత్‌గంజ్ గ్రామంలో ఇద్దరు బాలికలపై సామూహిక అత్యాచారం, హత్య జరిగిన విషయం తెలిసిందే. దీనిపై ఇప్పటికీ ఆ కుటుంబం భయం నీడన గడుపుతోంది. తమ కుటుంబంపై ఎప్పటికైనా నిందితుల కుటుంబాలు దాడిచేసే అవకాశం ఉందని, పోలీసులు కూడా మొదటినుంచి ఈ కేసును నీరుగార్చేందుకు యత్నిస్తున్నారని బాధిత కుటుంబసభ్యులు శుక్రవారం మీడియా ముందు వాపోయారు. నిందితుల కుటుంబాలు తమను బెదిరిస్తున్నాయని, ఇంకా మేం ఇక్కడే ఉంటే మొత్తం కుటుంబాన్ని వారు అంతం చేసే ప్రమాదముందని బాధితురాలి తండ్రి ఆరోపించారు. ‘మా కేసు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంటేనే న్యాయం జరుగుతుంది. మేం ఈ ఊరునే కాదు.. ఏకంగా రాష్ట్రాన్నే వదిలేసి ఢిల్లీ వెళ్లిపోతున్నాం. నిందితులకు తగిన శిక్ష పడేంతవరకు అక్కడనుంచే మేం న్యాయం కోసం పోరాడతాం..’ అని చెప్పారు. అన్ని పార్టీల నాయకులు తమను కలిసి జరిగిన అన్యాయాన్ని ఖండించారు కాని ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ మాత్రం ఇంతవరకు తమను పలకరించలేదని ఆయన వాపోయాడు. -
అక్కాచెల్లెళ్లపై అత్యాచారం.. ఆపై ఉరి
బాదౌన్: అక్కాచెల్లెళ్లు అయిన ఇద్దరు బాలికలపై కిరాతకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం వారిని చెట్టుకు ఉరేసి ప్రాణాలను బలి తీసుకున్నారు. ఈ దారుణం ఉత్తరప్రదేశ్‌లోని బాదౌన్ సమీపంలో కాట్రా గ్రామంలో జరిగింది. బాలికలు ఇద్దరూ మంగళవారం రాత్రి అదృశ్యమై, బుధవారం ఉదయం గ్రామంలోని ఓ మామిడి చెట్టుకు వేలాడుతూ కనిపించారు. వీరి వయసు 14-15 సంవత్సరాలు. -
సామూహిక అత్యాచారం చేసి చెట్టుకి ఉరేశారు
యుక్తవయస్సులో ఉన్న ఇద్దరు అక్కాచెల్లిళ్లను అపహరించి సామూహిక అత్యాచారం చేసి ఆపై వారిని చెట్టుకు ఉరి వేసిన సంఘటన బుధవారం ఉత్తరప్రదేశ్‌లో తీవ్ర సంచలనం కలిగించింది. ఉత్తరప్రదేశ్ బదాన్ ప్రాంతంలోని కట్రా గ్రామంలో ఆ దారుణమైన ఆ సంఘటన చోటు చేసుకుంది. గతరాత్రి ఇంటి నుంచి అదృశ్యమైన అక్కాచెల్లిళ్లు ఈ రోజు ఉదయం చెట్టుకు వెళ్లాడుతుండటం చూసి గ్రామస్థులు తీవ్ర భయాందోళనకు గురైయ్యారు. అయితే ఆ విషయం గ్రామంతోపాటు చుట్టుపక్కల గ్రామాలలో గుప్పుమంది. బాలికల తల్లిదండ్రులతోపాటు బంధువులు గ్రామస్తులు అధిక సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహలను చెట్టు నుంచి కిందకి దించారు. అనంతరం మృతదేహలను స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించేందుకు పోలీసులు ప్రయత్నించారు. అయితే వారి ప్రయత్నాన్ని గ్రామస్తులు అడ్డుకున్నారు. సామూహిక అత్యాచారం ఘటనలో ఓ పోలీసు కానిస్టేబుల్‌తోపాటు మరో నలుగురు వ్యక్తులు ఈ దారుణానికి ఒడిగట్టారని బాలిక బంధువులు ఆరోపించారు. వారిని వెంటనే అరెస్ట్ చేయాలని పోలీసులను డిమాండ్ చేశారు. అయితే పోస్ట్ మార్టం నివేదిక వస్తేనే కానీ అసలు విషయం తెలియదని పోలీసులు పేర్కొనడంతో గ్రామస్థులు ఆగ్రహాం కట్టలు తెంచుకుంది. దాంతో బంధువులు, గ్రామస్తులు ఆ మృతదేహలతో ఉషాఈట్- లిలావన్ రహదారిపై ఆందోళనకు దిగారు. ఈ ఘటనలో తమను న్యాయం జరిగేవరకు ఇక్కడినుంచి కదిలేది లేదని వారు రహదారిపై భీష్మించుకుని కుర్చున్నారు. రాష్ట్ర సీఎం అఖిలేష్ యాదవ్ ఆ ఘటనపై స్పందించాలని వారు డిమాండ్ చేశారు. దీంతో రహదారిపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. పోలీసులు రంగప్రవేశం చేసి ఆందోళనకారులను అరెస్ట్ చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పోస్ట్ మార్టం నివేదిక అందితేనే కానీ ఆ అక్కాచెల్లిళ్ల మృతి గల కారణాలు వెల్లడికావని పోలీసులు వెల్లడించారు.