సామూహిక అత్యాచారం చేసి చెట్టుకి ఉరేశారు
యుక్తవయస్సులో ఉన్న ఇద్దరు అక్కాచెల్లిళ్లను అపహరించి సామూహిక అత్యాచారం చేసి ఆపై వారిని చెట్టుకు ఉరి వేసిన సంఘటన బుధవారం ఉత్తరప్రదేశ్లో తీవ్ర సంచలనం కలిగించింది. ఉత్తరప్రదేశ్ బదాన్ ప్రాంతంలోని కట్రా గ్రామంలో ఆ దారుణమైన ఆ సంఘటన చోటు చేసుకుంది. గతరాత్రి ఇంటి నుంచి అదృశ్యమైన అక్కాచెల్లిళ్లు ఈ రోజు ఉదయం చెట్టుకు వెళ్లాడుతుండటం చూసి గ్రామస్థులు తీవ్ర భయాందోళనకు గురైయ్యారు. అయితే ఆ విషయం గ్రామంతోపాటు చుట్టుపక్కల గ్రామాలలో గుప్పుమంది. బాలికల తల్లిదండ్రులతోపాటు బంధువులు గ్రామస్తులు అధిక సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహలను చెట్టు నుంచి కిందకి దించారు. అనంతరం మృతదేహలను స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించేందుకు పోలీసులు ప్రయత్నించారు. అయితే వారి ప్రయత్నాన్ని గ్రామస్తులు అడ్డుకున్నారు. సామూహిక అత్యాచారం ఘటనలో ఓ పోలీసు కానిస్టేబుల్తోపాటు మరో నలుగురు వ్యక్తులు ఈ దారుణానికి ఒడిగట్టారని బాలిక బంధువులు ఆరోపించారు. వారిని వెంటనే అరెస్ట్ చేయాలని పోలీసులను డిమాండ్ చేశారు.
అయితే పోస్ట్ మార్టం నివేదిక వస్తేనే కానీ అసలు విషయం తెలియదని పోలీసులు పేర్కొనడంతో గ్రామస్థులు ఆగ్రహాం కట్టలు తెంచుకుంది. దాంతో బంధువులు, గ్రామస్తులు ఆ మృతదేహలతో ఉషాఈట్- లిలావన్ రహదారిపై ఆందోళనకు దిగారు. ఈ ఘటనలో తమను న్యాయం జరిగేవరకు ఇక్కడినుంచి కదిలేది లేదని వారు రహదారిపై భీష్మించుకుని కుర్చున్నారు. రాష్ట్ర సీఎం అఖిలేష్ యాదవ్ ఆ ఘటనపై స్పందించాలని వారు డిమాండ్ చేశారు. దీంతో రహదారిపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. పోలీసులు రంగప్రవేశం చేసి ఆందోళనకారులను అరెస్ట్ చేసి పోలీసు స్టేషన్కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పోస్ట్ మార్టం నివేదిక అందితేనే కానీ ఆ అక్కాచెల్లిళ్ల మృతి గల కారణాలు వెల్లడికావని పోలీసులు వెల్లడించారు.