
లక్నో : తమ పంటను కోయలేదని అగ్ర కులాలకు చెందిన కొందరు వ్యక్తులు ఓ దళితుడితో మూత్రం తాగించిన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బదౌన్ జిల్లాలో చోటుచేసుకుంది. ఏప్రిల్ 23న జరిగిన ఈ ఘటన అలస్యంగా వెలుగులోకి వచ్చింది. బదౌన్ జిల్లాలోని అజంపూర్ బిసౌరియా గ్రామంలోని వాల్మికీ సామాజిక వర్గానికి చెందిన సీతారాం వాల్మికీ తనకున్న కొద్ది పొలంలో గోధమ సాగు చేశారు. తన పంట కోతకు రావడంతో ఆ పనుల్లో నిమగ్నమై ఉన్నారు. అయితే అదే ఊరిలో అగ్ర కులానికి చెందిన కొందరు రైతులు మాత్రం తమ పొలంలోని పంటను కోసిన తర్వాతే నీ పంటని కోసుకోవాలని సీతారాంని బెదిరించారు. దీనికి అతను ఒప్పుకోకపోవడంతో అతనిపై దౌర్జన్యానికి దిగారు. ఈ ఘటనపై బాధితుడు మాట్లాడుతూ.. వారి మాట విననందుకు తనపై చెప్పులతో దాడి చేశారని తెలిపారు. అంతేకాకుండా మీసాలను బలంగా లాగుతూ.. బలవంతగా తనతో మూత్రం తాగించారని ఆవేదన వ్యక్తం చేశారు.
తనపై పాశవికంగా ప్రవర్తించిన వారిపై పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయడానికి వెళ్తే స్థానిక ఇన్‌స్పెక్టర్ కేసు నమోదు చేసేందుకు నిరాకరించాడు. దీంతో ఎస్పీని ఆశ్రయించడంతో ఆయన ఆదేశాల మేరకు స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆ పోలీసు అధికారిని సస్పెండ్ చేయడంతోపాటు అతనిపై శాఖాపరమైన దర్యాప్తుకు ఆదేశించారు. ఈ కేసులో గ్రామానికి చెందిన విజయ్ సింగ్, పింకు సింగ్, శైలేంద్ర సింగ్ ప్రధాన నిందితులుగా ఉన్నారని పోలీసు ఉన్నాతాధికారులు తెలిపారు. వీరిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీతో పాటు పలు సెక్షన్‌ల కింద కేసు నమోదు చేసినట్టు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment