సాక్షి, ముంబై: తన అయోధ్య పర్యటనపై కావాలనే కొందరు పనిగట్టుకుని వాతావరణాన్ని వేడెక్కించే ప్రయత్నం చేశారని, లేదంటే ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఒక బీజేపీ ఎంపీకి ఏకంగా ఆ పార్టీ ముఖ్యమంత్రిని వ్యతిరేకించే ధైర్యం ఎక్కడి నుంచి, ఎలా వచ్చిందని మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎమ్మెన్నెస్) చీఫ్ రాజ్ ఠాక్రే నిలదీశారు. పుణేలో ఆదివారం ఉదయం గణేశ్ కళా క్రీడామంచ్ సభాగృహంలో జరిగిన సభలో ఆయన మహావికాస్ ఆఘాడీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. కాగా, రాజ్ ఠాక్రే సభకు అనుమతిచ్చే ముందు పుణే సిటీ పోలీసులు 13 షరతులు విధించారు.
అందులో ఎన్ని ఉల్లంఘనలు జరిగాయనేది త్వరలో పోలీసులు వెల్లడించనున్నారు. ఈ నెల ఒకటో తేదీన ఔరంగాబాద్‌లో జరిగిన బహిరంగ సభలో త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా సభలు నిర్వహిస్తానని ఎమ్మెన్నెస్ చీఫ్ ప్రకటించారు. ఆ మేరకు ఆదివారం పుణేలో సభ నిర్వహించారు. సభకు ముందు పోలీసులు అనుమతిస్తారా..లేదా.. ముఖ్యంగా ఈ సభలో రాజ్ ఎవరిని లక్ష్యంగా చేసుకుని వ్యంగాస్త్రాలు సంధిస్తారు...? ఎవరిపై ఆరోపణలు చేస్తారనేది ఇటు అధికార పార్టీ మంత్రులు, రాజకీయ నాయకులతోపాటు అటు సామాన్య ప్రజల్లోనూ ఉత్కంఠ నెలకొంది. ఎట్టకేలకు సభ ప్రశాంతంగా ముగియడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
ఎవరు రాజకీయం చేస్తున్నారో నాకుతెలుసు...
ఉత్తర భారతీయులకు క్షమాపణలు చెప్పేవరకు అయోధ్యకు రానివ్వబోమని యూపీలో ఒక బీజేపీ ఎంపీ ఎమ్మెన్నెస్‌కు సవాలు విసరడం ఆశ్చర్యంగా ఉందని రాజ్ ఠాక్రే అన్నారు. వ్యతిరేక గాలులు, విధానాలు మహారాష్ట్ర నుంచి ఎవరో ఆయనకు నూరిపోశారని ఆయన ఆరోపించారు. లేదంటే ఒక ఎంపీకి ఇంత ధైర్యమెక్కడిదని నిలదీశారు. తన అయోధ్య పర్యటనను వ్యతిరేకించడం వెనక రాష్ట్రం నుంచే కొన్ని దుష్టశక్తులు పనిచేసినట్లు తనకు తెలిసిందన్నారు. ముంబై, ఉత్తరప్రదేశ్ నుంచి లభించిన సమాచారం ప్రకారం ఒక వ్యూహం ప్రకారం తనని ట్రాప్ చేశారని తెలిసింది.
ఒకవేళ నేను బలవంతంగా అయోధ్య పర్యటనకు వచ్చినట్‌లైతే నా వెనకాల వచ్చే వేలాది మంది ఎమ్మెన్నెస్ పదాధికారులపై, కార్యకర్తలపై పోలీసులు కేసులు నమోదు చేసేవారని, ఘర్షణలు జరిగితే వారిని జైలులో పెట్టేవారని రాజ్ ఠాక్రే పేర్కొన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రశాంతంగా ఉన్న వాతావరణాన్ని చెడగొట్టే ఉద్దేశం తనకు లేదని స్పష్టం చేశారు. ఒక మాస్టర్ ప్లాన్ ప్రకారమే తన పర్యటనను అడ్డుకునే ప్రయత్నం జరిగిందని ఎవరి పేరూ ఉచ్ఛరించకుండా ఆరోపణలు చేశారు. దాదాపు 15 ఏళ్ల కిందట ఉత్తర భారతీయులపై దాడి చేసినందుకు క్షమాపణలు అడగాలని లేని పక్షంలో అయోధ్యలో అడుగు పెట్టనివ్వబోమని యూపీకి చెందిన బీజేపీ ఎంపీ బ్రిజ్‌భూషణ్ సింగ్ హెచ్చరించారు. దీనిపై రాజ్ ఠాక్రే గుజరాత్‌లో జరిగిన ఒక సంఘటనను సింగ్‌కు గుర్తు చేశారు.
కొద్ది సంవత్సరాల కిందట గుజరాత్‌లో ఓ బాలికపై అత్యాచారం జరిగిన తరువాత వందలాది యూíపీ, బిహార్ కార్మికులను, కూలీలను హతమార్చారు. అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయి వచ్చిన కొందరు ముంబైకి చేరుకున్నారు. మరి ఈ ఘటనపై సింగ్ ఎవరి నుంచి క్షమాపణలు కోరుతారని ప్రశ్నించారు. కాగా ఉత్తరభారతీయులపై 15 ఏళ్ల కిందట జరిగిన దాడి సంఘటన ఆకస్మాత్తుగా ఇప్పుడెలా గుర్తుకు వచ్చిందని నిలదీశారు. దీనివెనకాల ఉన్న రాజకీయమేంటో అర్ధం చేసుకోవాలని కార్యకర్తలకు సూచించారు. తన అయోధ్య పర్యటనలో భాగంగా శ్రీరామున్ని దర్శించుకోవడంతోపాటు అప్పట్లో బాబ్రీ మసీదు కూల్చివేసిన సంఘటనలో అనేక మంది కరసేవకులను హతమార్చారని, ఆ స్థలాన్ని సందర్శించాలని అనుకున్నానన్నారు. అయితే తన పర్యటనను వ్యతిరేకించడం వల్ల హిందుత్వానికే నష్టం జరిగిందని రాజ్ ఠాక్రే వ్యాఖ్యానించారు.
చదవండి: మేము వచ్చాకే రోడ్లపై నమాజ్ చేయడం ఆగిపోయింది: సీఎం యోగి సంచలన వ్యాఖ్యలు
Comments
Please login to add a commentAdd a comment