నితీశ్ రాణా- భువీ(PC: UPCA X)
Ranji Trophy 2023-24- Mumbai vs Uttar Pradesh: రంజీ ట్రోఫీ 2023-24లో ఉత్తరప్రదేశ్ ముంబై జట్టుపై గెలుపొందింది. నువ్వా- నేనా అన్నట్లుగా సాగిన మ్యాచ్‌లో ఆఖరికి 2 వికెట్ల తేడాతో విజయం నమోదు చేసింది. ముంబైతో మ్యాచ్‌లో యూపీ కెప్టెన్ నితీశ్ రాణా శతక్కొట్టగా.. పేసర్ భువనేశ్వర్ కుమార్ మొత్తం ఐదు వికెట్లు పడగొట్టాడు.
మరో యువ పేసర్ ఆకిబ్ ఖాన్ సైతం అద్భుతంగా రాణించి జట్టు విజయానికి తానూ కారణమయ్యాడు. కాగా ముంబైలోని ప్రఖ్యాత వాంఖడే వేదికగా జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన యూపీ తొలుత బౌలింగ్ చేసింది.
కొనసాగుతున్న రహానే వైఫల్యం
ముంబై కెప్టెన్ అజింక్య రహానే వైఫల్యం కొనసాగగా.. వికెట్ కీపర్ ప్రసాద్ పవార్(36), షమ్స్ ములానీ చెప్పుకోదగ్గ(57)ప్రదర్శన చేశారు. మిగతా వాళ్లు నామమాత్రపు స్కోరుకే పరిమితం కావడంతో ముంబై తొలి ఇన్నింగ్స్‌లో 198 పరుగులకే ఆలౌట్ అయింది.
రాణా శతకం
యూపీ బౌలర్లలో భువీ రెండు, అంకిత్ రాజ్‌పుత్ మూడు, ఆకిబ్ ఖాన్ మూడు, శివం శర్మ రెండు వికెట్లు తీశారు. ఈ క్రమంలో బ్యాటింగ్ మొదలుపెట్టిన ఉత్తరప్రదేశ్‌కు ఓపెనర్ సమర్థ్ సింగ్(63) శుభారంభం అందించగా.. కెప్టెన్ నితీశ్ రాణా(106) శతక్కొట్టాడు.
దూబే సెంచరీ కొట్టినా
దీంతో 324 పరుగులకు తొలి ఇన్నింగ్స్ ముగించిన యూపీ 126 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ముంబై శివం దూబే(117) మెరుపు శతకం కారణంగా.. 320 పరుగులు చేయగలిగింది.
కాగా ముంబై రెండో ఇన్నింగ్స్‌లో టాపార్డర్, మిడిలార్డర్‌ను ఆకిబ్ ఖాన్, భువీ కుప్పకూల్చారు. ఆకిబ్ టాప్-3 వికెట్లు పడగొట్టగా.. భువీ మొత్తం మూడు వికెట్లు తీశాడు. దూబే రూపంలో కరణ్ శర్మ కీలక వికెట్ దక్కించుకున్నాడు.
రెండు వికెట్ల తేడాతో విజయం
ఈ క్రమంలో ముంబై విధించిన 195 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన యూపీ 8 వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను ఛేదించింది. యూపీ కెప్టెన్ నితీశ్ రాణాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
ఇక ఈ మ్యాచ్‌లోనూ ముంబై సారథి అజింక్య రహానే బ్యాటింగ్ వైఫల్యం కొనసాగింది. రెండు ఇన్నింగ్స్‌లో కలిపి కేవలం 17 (8, 9) పరుగులు మాత్రమే చేశాడు. టీమిండియాలో రీఎంట్రీ ఇవ్వాలని భావిస్తున్న అతడు ఇప్పటి వరకు రంజీ-2024లో ఒక్కటైనా చెప్పుకోదగ్గ స్కోరు చేయలేదు. మరోవైపు టీమిండియా తరఫున రీ ఎంట్రీలో టీ20లలో సత్తా చాటిన శివం దూబే అద్భుత బ్యాటింగ్ తీరుతో టెస్టు రేసులోకి దూసుకురావడం విశేషం.
చదవండి: Ind Vs Eng 2nd Test: విశాఖ టెస్టు.. విద్యార్థులతో పాటు వాళ్లకూ ఫ్రీ ఎంట్రీ
Comments
Please login to add a commentAdd a comment