టీమిండియా స్టార్ల రాకతో రంజీ ట్రోఫీ(Ranji Trophy)కి కొత్త కళ వస్తుందనుకుంటే... దాదాపుగా అందరూ ఉసూరుమనిపించారు. భారత టెస్టు కెప్టెన్ రోహిత్ శర్మ, వికెట్ కీపర్ రిషభ్ పంత్(Rishabh Pant), శుభ్‌మన్ గిల్, రవీంద్ర జడేజా(Ravindra Jadeja), యశస్వి జైస్వాల్ గురువారం మొదలైన రంజీ రెండో దశ బరిలో దిగిన విషయం తెలిసిందే.
తొలిరోజు జడ్డూ ఒక్కడే హిట్
ముంబై తరఫున ఓపెనింగ్ చేసిన టీమిండియా ఓపెనర్ల జోడీ రోహిత్ శర్మ(3)- జైస్వాల్(4) పూర్తిగా విఫలమయ్యారు. మిగతా వాళ్లలో ఢిల్లీ స్టార్ రిషభ్ పంత్(1), పంజాబ్ ఓపెనర్ శుబ్‌మన్ గిల్(4) కూడా నిరాశపరిచారు. అయితే, సౌరాష్ట్ర స్పిన్నర్ రవీంద్ర జడేజా మాత్రం ఐదు వికెట్లతో చెలరేగాడు.
ఆరడుగుల బుల్లెట్.. ఎవరీ ఉమర్ నజీర్?
అయితే, ఈ అందరు స్టార్ల నడుమ ఈనాటి మ్యాచ్‌లో ఓ ఆరడుగుల బౌలర్ హైలైట్‌గా నిలిచాడు. అతడి పేరు ఉమర్ నజీర్ మీర్. జమ్మూ కశ్మీర్ ఫాస్ట్ బౌలర్. ముంబై బ్యాటర్లకు చుక్కలు చూపించిన ఈ స్పీడ్‌స్టర్ రోహిత్ శర్మ వికెట్ తీయడం ద్వారా క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాడు.
ముంబైలోని శరద్ పవార్ క్రికెట అకాడమీ బీకేసీ మైదానంలో ముంబై- జమ్మూ కశ్మీర్ మధ్య గురువారం మొదలైన రంజీ మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు టాస్ గెలిచింది. తొలుత బ్యాటింగ్‌కు దిగి కశ్మీర్ జట్టును బౌలింగ్‌కు ఆహ్వానించింది. అయితే, ఊహించని రీతిలో పట్టుమని పది పరుగులు కూడా చేయకుండానే ఓపెనర్లు వెనుదిరిగారు.
రోహిత్‌నే బోల్తా కొట్టించాడు
జైస్వాల్‌ను ఆకిబ్ నబీ అవుట్ చేస్తే.. రోహిత్ శర్మ ఉమర్ నజీర్ బౌలింగ్‌లో కెప్టెన్ పారస్ డోగ్రాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఇక టీమిండియా కెప్టెన్‌ను అవుట్ చేయడం ద్వారా వికెట్ల వేట మొదలుపెట్టిన నజీర్.. హార్దిక్ తామోర్(40 బంతుల్లో 7), ముంబై సారథి అజింక్య రహానే(12), ఆల్‌రౌండర్ శివం దూబే(0) రూపంలో మరో మూడు కీలక వికెట్లు కూల్చాడు.
అలా మొత్తంగా నాలుగు వికెట్లు కూల్చి ముంబై బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని నజీర్ శాసించాడు. దీంతో అతడి వివరాలపై టీమిండియా అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. జమ్మూ కశ్మీర్లోని పుల్వామా సమీపంలో ఉన్న మాలిక్‌పొరాలో నజీర్ జన్మించాడు. అతడి ఎత్తు ఆరడుగుల నాలుగు అంగుళాలకు పైమాటే. అదే అతడికి సానుకూలాంశం అయింది.
ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో భేష్
ఈ పొడగరి స్పీడ్‌స్టర్ తనదైన బౌలింగ్ శైలితో దేశవాళీ క్రికెట్‌లో ఎంతో మంది బ్యాటర్లకు పీడకలలు మిగిల్చాడు. 31 ఏళ్ల ఈ రైటార్మ్ పేసర్‌కు.. టీమిండియాకు ఆడాలనేది చిరకాల కోరిక. అయితే, ఇంత వరకు నజీర్‌కు ఆ అవకాశం రాలేదు.
అయితే, ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో మాత్రం నజీర్ గణాంకాలు మెరుగ్గానే ఉన్నాయి. మొత్తంగా 57 మ్యాచ్‌లలో అతడు 138 వికెట్లు పడగొట్టాడు. గతేడాది రంజీ ట్రోఫీ సందర్భంగా సర్వీసెస్ జట్టుపై అత్యుత్తమంగా 6/53తో రాణించాడు. తాజా రంజీ ఎడిషన్‌లో సూపర్ ఫామ్‌లో ఉన్న నజీర్... గత మూడు మ్యాచ్‌లలో కలిపి పదకొండు వికెట్లు తీశాడు. అతడి ఎకానమీ రేటు 2.64గా నమోదు కావడం గమనార్హం.
కుప్పకూలిన ముంబై టాప్, మిడిల్ ఆర్డర్
ఇక మ్యాచ్ విషయానికొస్తే.. జైస్వాల్(4), రోహిత్ శర్మ(3), హార్దిక్ తామోర్(7), అజింక్య రహానే(12), శ్రేయస్ అయ్యర్(11), శివం దూబే(0), షామ్స్ ములానీ(0) వెంటవెంటనే పెవిలియన్ చేరడంతో ముంబై కష్టాల్లో కూరుకుపోయింది.
బ్యాట్ ఝులిపించిన శార్దూల్
అయితే, పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ బ్యాట్ ఝులిపించడంతో కాస్త ఊపిరి పీల్చుకుంది. 57 బంతుల్లో శార్దూల్ ఏకంగా 51 పరుగులు సాధించాడు. అతడికి తోడుగా తనూష్ కొటియాన్(26) రాణించాడు. వీరిద్దరి కారణంగా ముంబై గౌరవప్రదమైన స్కోరు చేసింది. 33.2 ఓవర్లలో 120 పరుగులకు ఆలౌట్ అయింది.
జమ్మూ కశ్మీర్ బౌలర్లలో ఉమర్ నజీర్, యుధ్‌వీర్ సింగ్ నాలుగేసి వికెట్లు కూల్చగా... ఆకిబ్ నబీ రెండు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక గురువారం నాటి తొలిరోజు ఆట ముగిసే సరికి జమ్మూ కశ్మీర్ 42 ఓవర్లలో ఏడు వికెట్లు నష్టపోయి 174 పరుగులు చేసింది. ముంబై కంటే 54 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.
Comments
Please login to add a commentAdd a comment