
ముంబై: ప్రఖ్యాత వాంఖడే స్టేడియంలోని ఒక స్టాండ్‌కు భారత వన్డే, టెస్టు జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ పేరు పెట్టారు. దేశానికి రెండు ఐసీసీ ట్రోఫీలు అందించిన రోహిత్ శర్మకు ఇది తామిచ్చే గౌరవమని ముంబై క్రికెట్ సంఘం (ఎంసీఏ) వెల్లడించింది. రోహిత్ శర్మతో పాటు భారత మాజీ కెప్టెన్ అజిత్ వాడేకర్, భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మాజీ అధ్యక్షుడు శరద్ పవర్ పేరిట కూడా స్టాండ్‌లు ఏర్పాటు చేసింది. మంగళవారం ఎంసీఏ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఈ మేరకు నిర్ణయాలు తీసుకున్నారు.
దివెచా పెవిలియన్‌లోని మూడో లెవల్‌కు రోహిత్ శర్మ పేరు పెట్టారు. గ్రాండ్ స్టాండ్ మూడో లెవల్‌కు శరద్ పవార్ పేరు, నాలుగో లెవల్‌కు వాడేకర్ ప్లేర్లు పెట్టారు. అజిత్ వాడేకర్ 1966 నుంచి 1974 మధ్య భారత జట్టు తరఫున 37 టెస్టులు, 2 వన్డేలు ఆడాడు. 1971 వెస్టిండీస్, ఇంగ్లండ్‌పై టెస్టు సిరీస్‌లు గెలిచిన భారత జట్టులో అతడు సభ్యుడు. 77 ఏళ్ల వయసులో 2018లో అజిత్ మృతిచెందారు.
ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఇప్పటికే దిగ్గజ ఆటగాళ్లు సచిన్ టెండూల్కర్, దిలీప్ వెంగ్‌సర్కార్, సునీల్ గవాస్కర్, విజయ్ మర్చంట్ పేరుతో స్టాండ్స్ ఉన్నాయి. ఇప్పుడు వాటి సరసన రోహిత్ పేరు చేరింది. 2013లో టీమిండియా తరఫున టెస్టు అరంగేట్రం చేసిన రోహిత్ శర్మ 2022లో జట్టు పగ్గాలు చేపట్టాడు. 2023 వన్డే ప్రపంచకప్‌లో టీమిండియాను ఫైనల్‌కు తీసుకెళ్లిన రోహిత్, 2024లో టి20 ప్రపంచకప్, 2025లో ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ అందించాడు.