50వ వార్షికోత్సవ వేడుకల్లో రోహిత్ శర్మ వ్యాఖ్య
‘వాంఖడే’తో అనుబంధాన్ని గుర్తుచేసుకున్న సచిన్, గావస్కర్, రవిశాస్త్రి
ముంబై: ప్రఖ్యాత వాంఖడే క్రికెట్ మైదానానికి భారత క్రికెట్‌తో ప్రత్యేక అనుబంధం ఉందని... టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. గతేడాది టి20 ప్రపంచకప్ అనంతరం వాంఖడే మైదానంలో జరిగిన వేడుకలను తానెప్పటికీ మరవలేనని... ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ నెగ్గి మరోసారి అలాంటి సంబరాలు చేసుకోవాలనుందని రోహిత్ శర్మ వెల్లడించాడు. వాంఖడే స్టేడియం నిర్మించి 50 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా ఆదివారం ముంబై క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో పలువురు స్టార్ క్రికెటర్లు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా భారత కెప్టెన్ రోహిత్ మాట్లాడుతూ... ‘2024లో టి20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత తిరిగి ముంబైకి చేరుకున్న రోజు వచ్చిన స్పందన అనూహ్యం. సాగరతీరం మొత్తం అభిమానులతో నిండిపోవడాన్ని చూసి ఆశ్చర్యపోయా. మనవాళ్లతో కలిసి సంబరాలు చేసుకోవడంలో ఉన్న ఆనందమే వేరు. అది ఎలా ఉంటుందో ఒకటికి రెండుసార్లు చూశాను. 2007లో తొలిసారి టి20 ప్రపంచకప్ గెలిచినప్పుడు కూడా వాంఖడే స్టేడియంలో వేడుకలు నిర్వహించారు. అప్పుడు కూడా అభిమానులు బ్రహ్మరథం పట్టారు.
2011 వన్డే ప్రపంచకప్ గెలిచినప్పుడు కూడా అదే జరిగింది. త్వరలో చాంపియన్స్ ట్రోఫీ జరగనుంది. ఈ మెగా టోర్నీ ఆడే సమయంలో 140 కోట్ల మంది భారతీయుల ఆశలు మా మీద ఉంటాయని తెలుసు. మరో ఐసీసీ ట్రోఫీని తీసుకువచ్చి ఇక్కడ సంబరాలు చేసుకునేందుకు ప్రయత్నిస్తాం’ అని పేర్కొన్నాడు. క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ మాట్లాడుతూ... వాంఖడేకు వస్తే ఇంటికి వచ్చినట్లే ఉంటుందని అన్నాడు.
వాంఖడేలో ఎన్నో చిరస్మరణీయ ఇన్నింగ్స్‌లు ఆడిన సచిన్ టెండూల్కర్ మాట్లాడుతూ... ‘2013లో కెరీర్‌కు రిటైర్మెంట్ ప్రకటించాలని నిర్ణయించుకున్నప్పుడు అప్పటి బీసీసీఐ అధ్యక్షుడు శ్రీనివాసన్‌తో చివరి టెస్టు వాంఖడేలో ఆడాలని ఉందని చెప్పా. నా అభ్యర్థనను అంగీకరించిన బోర్డు అందుకు అనుమతిచ్చింది. అప్పటి వరకు నేను మైదానంలో ఆడుతున్నప్పుడు మా అమ్మ ప్రత్యక్షంగా ఎప్పుడూ చూడలేదు. దీంతో కుటుంబ సభ్యుల సమక్షంలో ఇక్కడ కెరీర్ చివరి మ్యాచ్ ఆడా.
ఆరోజు మైదానంలో అడుగు పెట్టినప్పుడు ఎలాంటి భావన కలిగిందో ఇప్పటికీ అదే అనిపిస్తుంది. ఇక నా జీవితంలో అత్యంత మధుర క్షణాలకు కూడా వాంఖడే వేదికగా నిలిచింది. 1983లో కపిల్‌దేవ్ సారథ్యంలోని టీమిండియా వన్డే ప్రపంచకప్ గెలిచినప్పుడు ఎంతో సంతోషించా. ఆ స్ఫూర్తితోనే ఆటపై మరింత దృష్టి పెట్టా. అయితే ఆ తర్వాత ఎన్నో ప్రయత్నాలు చేసినా వరల్డ్‌కప్ చేతికి చిక్కలేదు. ఎట్టకేలకు 2011లో నా కల వాంఖడే మైదానంలోనే నెరవేరింది’ అని అన్నాడు.
తాను ఇదే మైదానంలో 6 బంతులకు 6 సిక్స్‌లు కొట్టిన విషయాన్ని భారత మాజీ ఆటగాడు, మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి గుర్తు చేసుకున్నాడు. వాంఖడే 50వ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక పోస్టల్ స్టాంప్‌ను విడుదల చేశారు.
Comments
Please login to add a commentAdd a comment