మళ్లీ ఫెయిలైన సూర్యకుమార్‌.. ఇప్పట్లో రీఎంట్రీ కష్టమే! | Ranji Trophy QF Mumbai vs Haryana: Suryakumar Yadav Fails Again Fans Reacts | Sakshi
Sakshi News home page

Suryakumar Yadav: మరోసారి విఫలం.. ఇప్పట్లో టీమిండియాలో చోటు కష్టమే!

Published Sat, Feb 8 2025 10:15 AM | Last Updated on Sat, Feb 8 2025 11:19 AM

Ranji Trophy QF Mumbai vs Haryana: Suryakumar Yadav Fails Again Fans Reacts

భారత పురుషుల టీ20 క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌(Suryakumar Yadav) బ్యాటింగ్‌ వైఫల్యాల పరంపర కొనసాగుతోంది. ఫార్మాట్‌ మారినా అతడి ఆట తీరులో మాత్రం మార్పరాలేదు. ఇటీవల ఇంగ్లండ్‌(India vs England)తో స్వదేశంలో పొట్టి సిరీస్‌లో సారథిగా అదరగొట్టిన ఈ ముంబైకర్‌.. బ్యాటర్‌గా మాత్రం పూర్తిగా విఫలమైన విషయం తెలిసిందే. తాజాగా రంజీ ట్రోఫీ(Ranji Trophy) మ్యాచ్‌లోనూ సూర్య నిరాశపరిచాడు.

ఫోర్‌తో మొదలుపెట్టి
హర్యానాతో మ్యాచ్‌లో క్రీజులోకి రాగానే ఫోర్‌ బాది దూకుడుగా ఇన్నింగ్స్‌ ఆరంభించిన సూర్యకుమార్‌.. మరుసటి ఓవర్లోనే వెనుదిరిగాడు. కేవలం తొమ్మిది పరుగులు చేసి నిష్క్రమించాడు. 

కాగా సూర్య చివరగా ఈ రంజీ సీజన్‌లో భాగంగా మహారాష్ట్రతో మ్యాచ్‌ సందర్భంగా బరిలోకి దిగాడు. అయితే, ఆ మ్యాచ్‌లో కేవలం ఏడు పరుగులే చేసి అవుటయ్యాడు. ఈ నేపథ్యంలో టీ20 కెప్టెన్‌ ఇక టెస్టుల గురించి మర్చిపోవాల్సిందేనంటూ టీమిండియా అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

కాగా దేశీ ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌ ప్రతిష్టాత్మక  టోర్నమెంట్‌ రంజీ ట్రోఫీ(Ranji Trophy) క్వార్టర్‌ ఫైనల్స్‌ శనివారం ఆరంభమయ్యాయి. ఇందులో భాగంగా.. కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా ముంబై- హర్యానా మధ్య క్వార్టర్‌ ఫైనల్‌-3 మొదలైంది. ఇందులో టాస్‌ గెలిచిన ముంబై తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. అయితే, హర్యానా పేసర్ల ధాటికి అజింక్య రహానే సేనకు ఆరంభంలోనే ఎదురుదెబ్బలు తగిలాయి.

సుమిత్‌ దెబ్బకు బౌల్డ్‌
ఓపెనర్‌ ఆయుశ్‌ మాత్రే(0)ను అన్షుల్‌ కాంబోజ్‌ డకౌట్‌ చేయగా.. మరో ఓపెనర్‌, వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ ఆకాశ్‌ ఆనంద్‌ను పది పరుగుల వద్ద సుమిత్‌ కుమార్‌ బౌల్డ్‌ చేశాడు. ఇక వన్‌డౌన్‌లో వచ్చిన సిద్ధేశ్‌ లాడ్‌(4) అన్షుల్‌ వేసిన బంతికి బౌల్డ్‌కాగా.. ఐదో స్థానంలో బ్యాటింగ్‌ చేసిన సూర్యకుమార్‌ యాదవ్‌ సుమిత్‌ దెబ్బకు క్లీన్‌బౌల్డ్‌ అయ్యాడు.

ముంబై ఇన్నింగ్స్‌ ఏడో ఓవర్‌ మొదటి బంతికి సిద్ధేశ్‌ అవుట్‌ కాగా.. సూర్య క్రీజులోకి వచ్చాడు. అన్షుల్‌ బౌలింగ్‌లో ఫోర్‌ కొట్టి ఘనంగా ఆరంభించాడు. ఎనిమిదో ఓవర్లో సుమిత్‌ బౌలింగ్‌లోనూ తొలి బంతినే బౌండరీకి తరలించిన సూర్య.. ఆ మరుసటి రెండో బంతికి పెవిలియన్‌ చేరాడు. మొత్తంగా ఐదు బంతులు ఎదుర్కొని రెండు ఫోర్ల సాయంతో తొమ్మిది పరుగులు చేసి ఈ కుడిచేతి వాటం బ్యాటర్‌ అవుటయ్యాడు.

ఈ క్రమంలో 29 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాలో పడిన ముంబై జట్టును కెప్టెన్‌ అజింక్య రహానే, ఆల్‌రౌండర్‌ శివం దూబే ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఇటీవల ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌లో సూర్యకుమర్‌ యాదవ్‌ తొలి మ్యాచ్‌లోనే డకౌట్‌ అయిన విషయం తెలిసిందే.

ఇప్పట్లో టీమిండియా రీఎంట్రీ కష్టమే
ఆ తర్వాత కూడా వరుస మ్యాచ్‌లలో సూర్య నిరాశపరిచాడు. రెండో టీ20లో 12, మూడో టీ20లో 14 పరుగులు చేసిన అతడు.. నాలుగో టీ20లో మళ్లీ సున్నా చుట్టాడు. ఆఖరిదైన ఐదో టీ20లోనూ రెండు పరుగులే చేసి వెనుదిరిగాడు. 

అయితే, కెప్టెన్‌గా మాత్రం ఈ ఐదు టీ20ల సిరీస్‌లో 4-1తో సూర్య ఘన విజయం అందుకున్నాడు. ఇక ఇప్పటికే ఫామ్‌లేమి కారణంగా వన్డే జట్టులో ఎప్పుడో స్థానం కోల్పోయిన సూర్య.. రంజీల్లో వరుస వైఫల్యాలతో ఇప్పట్లో టెస్టుల్లోకి వచ్చే అవకాశం కూడా లేకుండా చేసుకుంటున్నాడు.  

కాగా 2023లో బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీ సందర్భంగా నాగ్‌పూర్‌ వేదికగా టెస్టుల్లో అరంగేట్రం చేసిన సూర్య.. దారుణంగా విఫలమయ్యాడు. ఆస్ట్రేలియాతో తొలి టెస్టులో 8 పరుగులు మాత్రమే చేశాడు.

చదవండి: Ind vs Eng: అద్భుతమైన ఆటగాడు.. అతడినే పక్కనపెడతారా?: ఆసీస్‌ దిగ్గజం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement