టీమిండియా స్టార్ శ్రేయస్ అయ్యర్(Shreyas Iyer)పై ఆస్ట్రేలియా దిగ్గజ కెప్టెన్ రిక్కీ పాంటింగ్(Ricky Ponting) ప్రశంసలు కురిపించాడు. మిడిలార్డర్‌లో చక్కగా రాణించగల నైపుణ్యాలు అతడి సొంతమని కొనియాడాడు. అయితే, గత రెండేళ్లుగా టీమిండియా యాజమాన్యం అయ్యర్‌కు అడపాదడపా మాత్రమే అవకాశాలు ఇవ్వడం తనకు విస్మయం కలిగిస్తోందని పేర్కొన్నాడు.
కాగా స్వదేశంలో గతేడాది ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ సందర్భంగా వెన్నునొప్పితో జట్టుకు దూరమైన శ్రేయస్ అయ్యర్.. ఆ తర్వాత కఠిన పరిస్థితులు ఎదుర్కొన్నాడు. రంజీల్లో ఆడాలన్న భారత క్రికెట్ నియంత్రణ మండలి(BCCI) ఆదేశాలను తొలుత బేఖాతరు చేసిన ఈ ముంబైకర్.. తర్వాత గాయాన్ని సాకుగా చూపి తప్పించుకున్నాడు.
ఈ క్రమంలో బీసీసీఐ అయ్యర్‌పై కఠిన చర్యలు తీసుకుంది. అతడి సెంట్రల్ కాంట్రాక్టు రద్దు చేస్తూ వేటు వేసింది. ఈ తర్వాత అతడు దేశవాళీ క్రికెట్ బరిలోకి దిగి తనను తాను నిరూపించుకున్నాడు. అంతేకాదు.. ఐపీఎల్-2024లో కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్‌గా టైటిల్ గెలిచాడు.
టీ20 జట్టులో మాత్రం చోటు కరువు
ఈ నేపథ్యంలో గతేడాది శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్‌లో ఆడే అవకాశం దక్కించుకున్న శ్రేయస్ అయ్యర్.. టీ20 జట్టులో మాత్రం చోటు సంపాదించలేకపోయాడు. యాజమాన్యం అతడిని ఎప్పటికప్పుడు పక్కనపెట్టి.. కొత్త ఆటగాళ్లకు అవకాశాలు ఇచ్చింది. టీ20 ప్రపంచకప్-2024 జట్టులోనూ అతడికి చాన్స్ ఇవ్వలేదు.
ఇక తాజాగా ఇంగ్లండ్‌తో స్వదేశంలో వన్డే సిరీస్ సందర్భంగా పునరాగమనం చేసిన శ్రేయస్ అయ్యర్.. నాగ్‌పూర్‌లో జరిగిన తొలి వన్డేలో అదరగొట్టాడు. కేవలం 36 బంతుల్లోనే 59 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లో తొమ్మిది ఫోర్లతో పాటు రెండు సిక్సర్లు ఉండటం విశేషం.
అయితే, ఈ మ్యాచ్‌లో తనకు తొలుత తుదిజట్టులో స్థానం లేదని.. విరాట్ కోహ్లి గాయపడ్డ కారణంగానే తనను పిలిపించారని శ్రేయస్ అయ్యర్ స్వయంగా వెల్లడించాడు. ఈ నేపథ్యంలో మేనేజ్‌మెంట్ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఫామ్‌లో ఉన్న ఆటగాడిని బెంచ్‌కే పరిమితం చేయాలని చూడటం సరికాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అద్భుతమైన ఆటగాడు.. అతడినే పక్కనపెడతారా?
ఈ నేపథ్యంలో లెజెండరీ బ్యాటర్ రిక్కీ పాంటింగ్ ఐసీసీ రివ్యూ షోలో మాట్లాడుతూ.. ‘‘గత రెండేళ్లుగా అతడి సేవలను ఎందుకు సరిగ్గా ఉపయోగించుకోవడం లేదో అర్థం కావడం లేదు. వన్డే ప్రపంచకప్-2023లోనూ శతకాలతో చెలరేగి భీకరమైన ఫామ్ కనబరిచాడు.
మిడిలార్డర్‌లో సొగసైన బ్యాటింగ్‌తో అలరించాడు. దీంతో జట్టులో అతడి స్థానం సుస్థిరమైందని నేను అనుకున్నా. కానీ అలా జరుగలేదు. వెన్నునొప్పి కారణంగా అతడు జట్టులో స్థానం కోల్పోయాడు. ఆ తర్వాత దేశవాళీ క్రికెట్‌లో అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు.
అయినా.. అతడిని పక్కనపెట్టాలని చూడటం సరికాదు’’ అని అభిప్రాయపడ్డాడు. కాగా ఐపీఎల్-2025లో పంజాబ్ కింగ్స్ హెడ్‌కోచ్‌గా పాంటింగ్ నియమితుడైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వేలంలో భాగంగా శ్రేయస్ అయ్యర్‌ను పంజాబ్ రూ. 26.75 కోట్లకు కొనుగోలు చేయడంలో పాంటింగ్ కీలక పాత్ర పోషించాడు. వీరిద్దరు కలిసి గతంలో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున పనిచేశారు కూడా!
ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్‌తో గురువారం నాటి తొలి వన్డేలో టీమిండియా నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. తద్వారా మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ఆధిక్యం సంపాదించింది. ఇరుజట్ల మధ్య ఆదివారం కటక్‌లో రెండో వన్డే జరుగుతుంది.
చదవండి: సెంచరీకి చేరువలో ఉన్నాడని.. ఇలా చేస్తావా?: మండిపడ్డ గావస్కర్
Comments
Please login to add a commentAdd a comment