
రోహిత్ శర్మతో అగార్కర్ (ఫైల్ ఫొటో)
టీమిండియా స్టార్ క్రికెటర్ల తీరుపై ముంబై క్రికెట్ అసోసియేషన్(MCA) చీఫ్ సెలక్టర్ సంజయ్ పాటిల్(Sanhay Patil) ఆగ్రహం వ్యక్తం చేశాడు. మొక్కుబడిగా రంజీల్లో ఆడటం వల్ల ముంబై జట్టుకు తీరని అన్యాయం జరిగిందన్నాడు. ‘స్టార్ల’ కోసం ఉత్తమంగా రాణిస్తున్న వర్ధమాన క్రికెటర్లను పక్కనపెట్టడం వల్ల భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చిందన్నాడు.
దేశవాళీ క్రికెట్ ఆడాల్సిందే
కాగా జాతీయ జట్టు తరఫున విధుల్లో లేనప్పుడు సెంట్రల్ కాంట్రాక్టు ఆటగాళ్లంతా దేశవాళీ క్రికెట్ ఆడాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) నిబంధన విధించిన విషయం తెలిసిందే. ఈ ఆదేశాలను అతిక్రమించిన ఇషాన్ కిషన్(Ishan Kishan), శ్రేయస్ అయ్యర్‌లను వార్షిక కాంట్రాక్టు జాబితా నుంచి తప్పించి వేటు వేసింది. తద్వారా ఆటగాళ్లంతా డొమెస్టిక్ క్రికెట్ బరిలో దిగాలనే కచ్చితమైన సంకేతాలు ఇచ్చింది.
కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు
ఈ నేపథ్యంలో టెస్టుల్లో ఫామ్‌లేమితో సతమతమైన కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు రికార్డుల రారాజు విరాట్ కోహ్లి కూడా రంజీ బరిలో దిగారు. ఇక రోహిత్‌తో పాటు అతడి ఓపెనింగ్ జోడీ యశస్వి జైస్వాల్, టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, శార్దూల్ ఠాకూర్, శివం దూబే తదితరులు ముంబై తరఫున మ్యాచ్‌లు ఆడారు.
అయితే, రోహిత్‌తో పాటు జైస్వాల్ తాము ఆడిన ఒకే ఒక్క మ్యాచ్‌లో విఫలమయ్యారు. ఇదిలా ఉంటే.. ఈ సీజన్‌లో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన ముంబై.. ఈసారి సెమీస్‌లోనే ఇంటిబాట పట్టింది. ఈ నేపథ్యంలో చీఫ్ సెలక్టర్ సంజయ్ పాటిల్ తమ జట్టు వైఫల్యానికి టీమిండియా ఆటగాళ్లే పరోక్ష కారణమనేలా వ్యాఖ్యలు చేశాడు.
అగార్కర్‌కు విన్నపం
‘‘ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న ఆటగాళ్లకు అంతర్జాతీయ క్రికెటర్ల వల్ల అన్యాయం జరిగే ప్రమాదం ఉంది. అంతేకాదు.. ఆసక్తిలేకుండా దేశీ జట్టు తరఫున బరిలోకి దిగి వారు బాగా ఆడకపోతే నష్టం మనకే వస్తుంది. కాబట్టి అసోసియేషన్ ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
బీసీసీఐ ఆదేశాల వల్ల మనం వారికి జట్టులో చోటు ఇస్తున్నామన్న మాట వాస్తవం. టీమిండియా చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్, సెలక్షన్ కమిటీ మొత్తానికి నాదొక విన్నపం. కేవలం మీరు చెప్పారన్న కారణంగానే ఇంటర్నేషనల్ స్టార్లు దేశీ మ్యాచ్‌లు ఆడుతున్నారు.
బోర్డు కఠినంగా వ్యవహరిస్తుందనే ఉద్దేశంతో తమను తాము కాపాడుకునేందుకు మాత్రమే ఇలా చేస్తున్నారు. కానీ ఇకపై దేశవాళీ మ్యాచ్‌లలో కూడా వారి ప్రదర్శనను పరిగణనలోకి తీసుకుంటామని మీరు హెచ్చరించండి.
టీమిండియాకు ఎంపిక చేసే సమయంలో ఈ ప్రదర్శనను పరిశీలిస్తామని చెప్పండి. అలా కాకుండా కేవలం ఆడి రండి అని చెబితే మాత్రం దేశీ జట్ల మీద ప్రతికూల ప్రభావం పడుతుంది’’ అని స్పోర్ట్‌స్టార్‌తో సంజయ్ పాటిల్ వ్యాఖ్యానించాడు.
సెమీస్‌లో విదర్భ చేతిలో ఓటమి
కాగా రంజీ ట్రోఫీ 2024-25 సీజన్‌లో పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ శార్దూళ్ ఒక్కడే మెరుగ్గా రాణించాడు. ఇక కెప్టెన్ అజింక్య రహానే సహా సూర్యకుమార్ యాదవ్ విదర్భతో సెమీ ఫైనల్లో పూర్తిగా నిరాశపరిచారు.
రహానే 18, 12 పరుగులు చేయగా.. సూర్య 0, 23 రన్స్ మాత్రమే చేశాడు. మరోవైపు.. శివం దూబే 0, 12 పరుగులకే పరిమితమయ్యాడు. ఇక శార్దూల్ 33 ఓవర్లలో 133 పరుగులు ఇచ్చి కేవలం రెండు వికెట్లు తీశాడు. రెండు ఇన్నింగ్‌స్లో 37, 66 పరుగులు చేశాడు.
చదవండి: NZ vs BAN: చర్రిత సృష్టించిన రచిన్ రవీంద్ర.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా
Comments
Please login to add a commentAdd a comment