శివమ్‌ దూబే విజృంభణ.. కీలక మ్యాచ్‌లో ఐదు వికెట్లు | FIVE WICKET HAUL FOR SHIVAM DUBE IN RANJI TROPHY SEMI FINAL | Sakshi
Sakshi News home page

శివమ్‌ దూబే విజృంభణ.. కీలక మ్యాచ్‌లో ఐదు వికెట్లు

Published Tue, Feb 18 2025 12:05 PM | Last Updated on Tue, Feb 18 2025 12:20 PM

FIVE WICKET HAUL FOR SHIVAM DUBE IN RANJI TROPHY SEMI FINAL

భారత స్టార్‌ ఆల్‌రౌండర్‌ శివమ్‌ దూబే (Shivam Dube) రంజీ ట్రోఫీ సెమీ ఫైనల్లో (Ranji Semi Finals) చెలరేగిపోయాడు. విదర్భతో జరుగుతున్న మ్యాచ్‌లో దూబే  (ముంబై) ఐదు వికెట్ల ప్రదర్శనతో మెరిశాడు. తరుచూ బ్యాట్‌తో సత్తా చాటే దూబే ఈ మ్యాచ్‌లో బంతితో చెలరేగాడు. దూబే ధాటికి విదర్భ తొలి ఇన్నింగ్స్‌లో 383 పరుగులకు ఆలౌటైంది.

ఓవర్‌నైట్‌ స్కోర్‌ 308/5 వద్ద రెండో రోజు ఆటను ప్రారంభించిన విదర్భ మరో 75 పరుగులు మాత్రమే జోడించి మిగతా ఐదు వికెట్లు కోల్పోయింది. తొలి రోజు ఆటలో 2 వికెట్లు తీసిన దూబే.. రెండో రోజు చెలరేగిపోయి మరో 3 వికెట్లు తీశాడు. ఈ మ్యాచ్‌లో దూబే.. పార్థ్‌ రేఖడే, కీలకమైన కరుణ్‌ నాయర్‌, హర్ష్‌ దూబే, భూటే, యశ్‌ ఠాకూర్‌ వికెట్లు తీశాడు. ముంబై బౌలర్లలో షమ్స్‌ములానీ, రాయ్‌స్టన్‌ డయాస్‌ తలో రెండు, శార్దూల్‌ ఠాకూర్‌ ఓ వికెట్‌ తీశారు.

విదర్భ ఇన్నింగ్స్‌లో దృవ్‌ షోరే (74), దినిశ్‌ మాలేవార్‌ (79), యశ్‌ రాథోడ్‌ (54) అర్ద సెంచరీలతో రాణించగా.. కరుణ్‌ నాయర్‌ (45), కెప్టెన్‌ అక్షయ్‌ వాద్కర్‌ (34) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. అథర్వ తైడే 4, పార్థ్‌ రేఖడే 23, హర్ష్‌ దూబే 18, భూటే 11, యశ్‌ ఠాకూర్‌ 3 పరుగులు చేసి ఔట్‌ కాగా.. దర్శన్‌ నల్కండే 12 పరుగులతో అజేయంగా నిలిచాడు.

అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ముంబై.. 18 పరుగుల వద్దే తొలి వికెట్‌ కోల్పోయింది. దర్శన్‌ నల్కండే బౌలింగ్‌లో దనిశ్‌ మలేవార్‌కు క్యాచ్‌ ఇచ్చి ఆయుశ్‌ మాత్రే (9) ఔటయ్యాడు. ప్రస్తుతం ఆకాశ్‌ ఆనంద్‌ (7), సిద్దేశ్‌ లాడ్‌ (0) క్రీజ్‌లో ఉన్నారు. 4.4 ఓవర్ల అనంతరం ముంబై తొలి ఇన్నింగ్స్‌ స్కోర్‌ 18/1గా ఉంది. విదర్భ తొలి ఇన్నింగ్స్‌ స్కోర్‌కు ముంబై ఇంకా 365 పరుగులు వెనుకపడి ఉంది.

మరో సెమీఫైనల్లో గుజరాత్‌, కేరళ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేస్తున్న కేరళ భారీ స్కోర్‌ దిశగా పయనిస్తుంది. రెండో రోజు తొలి సెషన్‌ సమయానికి ఆ జట్టు 5 వికెట్ల నష్టానికి 293 పరుగులు చేసింది.మొహమ్మద్‌ అజహారుద్దీన్‌ (85), సల్మాన్‌ నిజర్‌ (28) క్రీజ్‌లో ఉన్నారు. 

కేరళ ఇన్నింగ్స్‌లో కెప్టెన్‌ సచిన్‌ బేబి (69) అ‍ర్ద సెంచరీతో రాణించగా.. అక్షయ్‌ చంద్రన్‌, రోహన్‌ కున్నుమ్మల్‌, జలజ్‌ సక్సేనా తలో 30 పరుగులు చేశారు. వరుణ్‌ నయనార్‌ 10 పరుగులకు ఔటయ్యాడు. గుజరాత్‌ బౌలర్లలో అర్జన్‌ నగస్వల్లా 2, పి జడేజా, రవి బిష్ణోయ్‌ తలో వికెట్‌ పడగొట్టారు.  

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement