‘సన్’డే
కర్నూలు(హాస్పిటల్), న్యూస్‌లైన్: రాజకీయ వేడి ముగిసింది. భానుడు మాత్రం ఇప్పటికీ పట్టపగలే చుక్కలు చూపుతున్నాడు. ఉష్ణోగ్రత అంతకంతకు పెరుగుతుండటం.. ఉక్కపోత కారణంగా జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ప్రధానంగా పిల్లలు, వృద్ధులు, వ్యాధిగ్రస్తుల అవస్థలు వర్ణనాతీతంగా ఉంటున్నాయి. అత్యవసరమైతే తప్ప ఆరోగ్యవంతులు సైతం బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. వారం రోజులుగా జిల్లాలో ఎండ తీవ్రత ఆందోళన కలిగిస్తోంది. ఉష్ణోగ్రత 41 డిగ్రీల సెంటిగ్రేడ్ దాటిపోవడం ఆందోళన కలిగిస్తోంది. పది రోజుల క్రితం 38 డిగ్రీలు ఉండగా.. ఆదివారం ఒక్కసారిగా 41.2 డిగ్రీలకు చేరుకోవడంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు.
నాలుగైదు రోజుల్లో రోహిని కార్తె రానుండటంతో ఎండలు మరింత ముదిరే అవకాశం కనిపిస్తోంది. గత ఏడాదితో పోలిస్తే ఈ విడత ఎండల తీవ్రత కాస్త తక్కువే అయినా.. బయట కాలు మోపేందుకు జంకాల్సి వస్తోంది. మాసాంతంలో భానుడు మరింత విజృంభించే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ భావిస్తోంది. ఉదయం 8 గంటల నుంచే ఎండ సుర్రుమంటుండటంతో ప్రధాన రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారిపోతున్నాయి. ఇక రోడ్ల పక్కన వ్యాపారాలు నిర్వహించే సామాన్యులు నీడ లేక ఎదుర్కొంటున్న అవస్థలు అన్నీఇన్నీ కావు. వేసవి ఉష్ణోగ్రతల్లో పెరుగుదల కారణంగా ఏసీలు, కూలర్లకు డిమాండ్ పెరుగుతోంది.
గతంతో పోలిస్తే ఈ ఏడాది 10 శాతం అమ్మకాలు పెరిగినట్లు తెలుస్తోంది. ఫ్రిజ్‌ల అమ్మకాలు సైతం అధికమయ్యాయి. మట్టి కుండలు, టోపీలు, స్కార్ఫ్, కూలింగ్ గ్లాసెస్‌లకు సైతం డిమాండ్ అధికంగానే ఉంటోంది. దాహం తీర్చుకునేందుకు, ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు అధిక శాతం ప్రజలు కొబ్బరి బోండాంలను ఆశ్రయిస్తున్నారు. అయితే ఒక్కో బోండాం ధర రూ.30లు పలుకుతుండటం గమనార్హం. దీంతో పేద, మధ్య తరగతి ప్రజలు కూల్‌డ్రింక్స్, నిమ్మకాయ సోడా, నన్నారితో సరిపెట్టుకుంటున్నారు.
వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు
సాధ్యమైనంత వరకు ఉదయం 11 గంటల్లోగా పనులు ముగించుకోవాలి. సాయంత్రం 5 గంటల తర్వాత బయటకు వెళ్లే ప్రయత్నం చేయాలి. తప్పనిసరిగా బయటకు వెళ్లాల్సి వస్తే గొడుగు లేదా టోపీ తీసుకెళ్లాలి.
వేసవిలో శుభ్రమైన తాగునీటినే తీసుకోవాలి. కలుషిత నీటితో డయేరియా(వాంతులు, విరేచనాలు), టైఫాయిడ్, కామెర్లు వచ్చే ప్రమాదం ఉంది.
ఎండకు ఎక్కువగా తిరిగే వారికి వడదెబ్బ సోకే అవకాశం ఉంది. సాధ్యమైనంత వరకు నీడలో ఉండే ప్రయత్నం చేయాలి. ఎక్కువగా నీటిని తాగాలి. వడదెబ్బ సోకినట్లు అనిపిస్తే ఆ వ్యక్తిని నీడకు తీసుకె ళ్లి చల్లని నీటితో తుడవాలి. అనంతరం సమీప ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించాలి.
కూల్‌డ్రింక్స్ కంటే కొబ్బరినీళ్లు, మజ్జిగ, నిమ్మకాయ రసం, తాజా పండ్ల రసం వంటి పానీయాలు మేలు.
నూనె, కారం ఎక్కువగా ఉండే ఆహారానికి సాధ్యమైనంత వరకు దూరంగా ఉండాలి.
లేత రంగు, కాటన్, ఖద్దరు దుస్తులనే ధరించాలి. అవి కూడా వదులుగా ఉండేలా జాగ్రత్త పడాలి.