typhoid
-
టైఫాయిడ్లోనూ వైద్య సేవలందిస్తూ..
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: టైఫాయిడ్ జ్వరంతో బాధ పడుతూ చేతికి సెలైన్‌తోనే విధులు నిర్వహిస్తూ ఆదర్శంగా నిలిచారు వైద్యురాలు కృష్ణశ్రీ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు 100 పడకల ప్రభ్వుత్వాస్పత్రిలో వైద్యురాలిగా విధులు నిర్వహిస్తున్న కృష్ణశ్రీ కొద్దిరోజులుగా టైఫాయిడ్ జ్వరంతో బాధపడుతున్నారు. మంగళవారం అయితే చేతికి సెలైన్ కూడా పెట్టుకున్నారు. అంత అనారోగ్యంలో కూడా మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకూ 24 గంటలపాటు నిర్విరామంగా విధులు నిర్వర్తించారు. ఇన్ పేషంట్ల ఆరోగ్య పరిస్థితిని సమీక్షిస్తూ వారి రికార్డులను పరిశీలించారు. కృష్ణశ్రీ గతంలో వరదల సమయంలో కూడా పేషంట్లకు విశేషమైన సేవలందించిన ఆదర్శంగా నిలుస్తున్నారు. చదవండి: ఊడిపోయిన యాదాద్రి గోపుర కలశం.. ఆలస్యంగా వెలుగులోకి -
ఇది చినుకు కాలం, జనం వణుకు కాలం.. 3-4 వారాలు బాధించే జ్వరం..
ఇది చినుకుల కాలం. వర్షాకాలంలో డ్రైనేజీలు పొంగుతూ... మానవ విసర్జకాలు మంచినీళ్లతో కలవడం మామూలే. ఆ నీళ్లు తాగడం, అలా కలుషితమైన నీళ్లతో వండిన ఆహారాలతో టైఫాయిడ్ రావడం సా«ధారణం. మురికివాడలూ, పారిశుద్ధ్యవసతి అంతగా లేని ప్రాంతాల్లో ఇది ఇంకా ఎక్కువ. సాల్మొనెల్లా టైఫీ అనే బ్యాక్టీరియమ్ టైఫాయిడ్ జ్వరానికి కారణం. ఇదే జాతికి చెందిన సాల్మొనెల్లా పారాటైఫీ అనే మరో రకం బ్యాక్టీరియా కూడా ఉంది. కాకపోతే దీంతో తీవ్రత కాస్తంత తక్కువ. ఈ సీజన్లో టైఫాయిడ్ వచ్చేందుకు అవకాశాలు ఉండటంతో ఈ జ్వరంపై అవగాహన కోసం ఈ కథనం. టైఫాయిడ్ బ్యాక్టీరియా మనుగడ సాగించేది కేవలం మానవ శరీరంలోనే. కొంతమందిలో దీని లక్షణాలేమీ బయటకు కనిపించవు. కానీ వారి నుంచి ఇతరులకు బ్యాక్టీరియా వ్యాపించినప్పుడు ఇతరుల్లో టైఫాయిడ్ బయటపడవచ్చు. ఇలా లక్షణాలు లేకుండా వ్యాప్తి చేసేవారిని క్యారియర్స్ అంటారు. మురికిగా ఉండే మెస్‌లూ, క్యాంటీన్లు, అపరిశుభ్రమైన హోటళ్లలో పనిచేసేవారిలో ఇది నిద్రాణంగా ఏళ్లతరబడి ఉండే అవకాశం ఉంది. వీళ్ల విసర్జకాలతో ఆహారం కలుషితమై... ఇతరులకు వ్యాధిని వ్యాప్తి చేసే అవకాశాలు ఎక్కువ. వీళ్లను క్రానిక్ క్యారియర్స్‌గా చెబుతారు. దేహంలోకి బ్యాక్టీరియా ప్రవేశించిన వారం లేదా రెండు వారాలలో లక్షణాలు బయటపడతాయి. టైఫాయిడ్ జ్వరమొచ్చాక అది దాదాపు 3 – 4 వారాల పాటు బాధిస్తుంది. లక్షణాలు: ► తీవ్రమైన జ్వరం (ఒక్కోసారి 104 డిగ్రీల ఫారెన్‌హీట్‌కు మించి) ► ఆకలి మందగించడం ► తలనొప్పి ► గుండె స్పందనలు తగ్గడం (బ్రాడీకార్డియా) ► రక్తంలో తెల్లరక్తకణాల సంఖ్య తగ్గడం (ల్యూకోపీనియా) ► కొందరిలో నీళ్ల విరేచనాలు, పొట్టనొప్పి ► ఒంటి నొప్పులు ∙తీవ్రమైన అలసట, నిస్సత్తువ, నీరసం ► కొందరిలో ఛాతీ పట్టేసినట్లుగా ఉండటం ► చాలా అరుదుగా కొందరిలో ర్యాష్‌తో పాటు మెడ, పొట్ట మీద గులాబీరంగు మచ్చలు కనిపించవచ్చు. ► జ్వరం కారణంగా దుష్ప్రభావాలు కనిపించకపోతే మూడు నుంచి నాలుగు వారాల్లో జ్వరం దానంతట అదే తగ్గుతుంది. నిర్ధారణ: మొదటివారంలో రక్తపరీక్షతో (బ్లడ్ కల్చర్) కచ్చితంగా కనుగొనవచ్చు. అందుకే మొదటివారంలో చేసే రక్తపరీక్షను గోల్డ్‌స్టాండర్డ్ పరీక్షగా పేర్కొనవచ్చు. రెండోవారంలో వైడాల్ టెస్ట్ అనే రక్తపరీక్షతో నిర్ధారణ చేస్తారు. మూడో వారంలో ఎముక మజ్జ (బోన్‌మ్యారో) కల్చర్ పరీక్షతో నిర్ధారణ చేస్తారు. ఈ పరీక్షలతో పాటు బయటకు కనిపించే టైఫాయిడ్ సాధారణ లక్షణాలను బట్టి దీన్ని నిర్ధారణ చేయవచ్చు గానీ... ఇలాంటి లక్షణాలే చాలా జ్వరాల్లో కనిపిస్తాయి కాబట్టి కేవలం లక్షణాలను బట్టే నిర్ధారణ అంత తేలిక కాదు. వైద్యపరీక్షలతో దీన్ని కచ్చితంగా నిర్ధారణ చేయవచ్చు. డ్రగ్ రెసిస్టెంట్ టైఫాయిడ్... ఇటీవల మందులకు లొంగని టైఫాయిడ్ ఎక్కువగా కనిపిస్తోంది. చిన్న చిన్న సమస్యలకూ విచక్షణరహితంగా యాంటీబయాటిక్స్ వాడటం, అది కూడా సరైన మోతాదులో కాకుండా ఇష్టం వచ్చిన మోతాదుల్లో వాడుతూ తుండటంతో డ్రగ్ రెసిస్టెంట్ టైఫాయిడ్ ఎక్కువగా కనిపిస్తోంది. పైగా దీని లక్షణాలు కూడా టైఫాయిడ్లా కనిపించవు. ఇలాంటి కేసుల్లో రోగికి చాలా జాగ్రత్తగా, శ్రద్ధగా వైద్యం అందించాలి. గతంలో చాలా సాధారణ మందులతోనే అంటే క్లోరో క్వినలోన్స్ వంటి చాలా ప్రాథమికమైన మందులతోనే టైఫాయిడ్ త్వరగా తగ్గిపోయేది. కానీ డ్రగ్ రెసిస్టెంట్ టైఫాయిడ్ వచ్చిందంటే అది ఒక పట్టాన తగ్గక చాలా రకాల ఇబ్బందులను తెచ్చిపెడుతోంది. మందులు కూడా పనిచేయకపోవడంతో వైద్యులు మరింత శక్తిమంతమైన మందులు వాడాల్సిన పరిస్థితి. అందుకే ఆన్ కౌంటర్ మందులు వద్దని డాక్టర్లు సూచిస్తుంటారు. టీకా అందుబాటులో... టైఫాయిడ్ నివారణకు టీకా అందుబాటులో ఉన్నందున... వచ్చాక మందుల వాడకం కంటే ముందుగా టీకాతోనే నివారించుకునే అవకాశం ఇప్పుడు ఉంది. ఈ సీజన్లో దూర ప్రయాణాలు చేసేవారికి ఇదెంతో మంచిది. నివారణ చర్యలతో, టీకాతో నివారణ తేలికే కాబట్టి దీన్ని నివారించుకోవడమే మేలు. చికిత్స : టైఫాయిడ్ విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే... దీని కారణంగా ఇది సోకిన ప్రతి ఐదుగురిలో ఒకరు మరణించే అవకాశముంటుంది. అలా చూసినప్పుడు ఇది కొంచెం ప్రమాదకరమైన వ్యాధి. అందుకే చికిత్స తప్పనిసరి. పైగా 104 డిగ్రీలకు పైగా జ్వరం కారణంగా మరికొన్ని దుష్ప్రభావాలు కనిపించవచ్చు. చికిత్స అందకపోయినా లేదా తీవ్రత ఎక్కువగా ఉన్నా మెదడును దెబ్బతీసేలా మెనింజైటిస్, గుండెకు నష్టం చేకూరేలా మయోకారై్డటిస్, ప్యాంక్రియాస్‌ను దెబ్బతీస్తూ ప్యాంక్రియాటైటిస్, కొందరిలో పేగుల్లో రంధ్రం పడటం (పెర్ఫొరేషన్), పేగుల్లో రక్తస్రావం కావడం, కిడ్నీలు దెబ్బతినడం వంటి అనర్థాలు రావచ్చు. కొన్నిసార్లు చాలా అవయవాలు విఫలం కావడం (మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్) జరగవచ్చు. అందుకే టైఫాయిడ్ రోగులు సరైన చికిత్స తీసుకోవడం చాలా అవసరం. ఫ్లూరోక్వినలోన్స్ / సెఫాలోస్పోరిన్స్ వంటి యాంటీబయాటిక్స్‌తో సాల్మొనెల్లా బ్యాక్టీరియా పూర్తిగా చనిపోతుంది. అయితే ఈ యాంటీబయాటిక్స్ పూర్తికోర్స్ వాడటం చాలా అవసరం. లేదంటే జబ్బు తిరగబెట్టవచ్చు. అది మరింత తీవ్రరూపం దాల్చవచ్చు. నివారణ : ఈగలతో దీని వ్యాప్తి చాలా ఎక్కువ. మలం మీద వాలి, అవే మళ్లీ ఆహారపదార్థాల మీద వాలే అవకాశం ఉన్నందున ఈగలను ముసరనివ్వకూడదు. ఈ సీజన్లో కుండల్లో చాలాకాలం నిల్వ ఉన్న నీటిని ఏమాత్రం తాగకూడదు. ఎప్పటికప్పుడు ఫ్రెష్‌గా పట్టిన నీళ్లే తాగాలి. వీలైనంతవరకు నీటిని కాచి, వడపోసి చల్లార్చి తాగడం మంచిది. చేతులు కడుక్కునే అలవాటు లేనివారిలో ఇది ఎక్కువగా రావడం కనిపిస్తుంది. అందుకే తినేముందు లేదా తాగే ముందర చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. ఇక మల విసర్జన తర్వాత తప్పనిసరిగా చేతులు సబ్బుతో కడుక్కోవాలి. అన్నం, కూరలు వేడివేడిగా ఉండగానే తినెయ్యాలి. వేడి చేయకుండా... నేరుగా నీళ్లను ఉపయోగించే చేసే తినుబండారాలతో టైఫాయిడ్ వ్యాప్తికి అవకాశాలు చాలా ఎక్కువ. అందుకే ఈ సీజన్లో వేడిచేయకుండా నేరుగా నీళ్లను వాడే పానీపూరీ వంటి ఆహారాలకు దూరంగా ఉండాలి. వీలైనంతవరకు ఈ సీజన్ అంతా బయటి ఆహారాలకు దూరంగా ఉండటమే మంచిది. ఒకవేళ బయటి పదార్థాలు తినాల్సి వస్తే చల్లారిపోయాక అస్సలు తినకూడదు. కలుషిత జలాలతో తయారు చేసే ఐస్‌తో కూడా ఇది వ్యాపించే అవకాశం ఉన్నందున, అలాంటి ఐస్ వాడే చెరుకు రసం వంటి పానీయాలకు దూరంగా ఉండటం చాలా అవసరం. డాక్టర్ లింగయ్య మిర్యాల సీనియర్ ఫిజీషియన్ అండ్ డయాబెటాలజిస్ట్ (చదవండి: వర్షాలలో ఎలుకలతో వచ్చే జబ్బు! ) -
అసలే వర్షాకాలం.. లొట్టలేసుకుని పానీపూరి తింటున్నారా?.. జాగ్రత్త!
సాక్షి, మెదక్: చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకూ అందరూ పానీపూరిని ఇష్టపడతారు. స్పైసీగా ఉండటంతో దీన్ని తినడానికి ఎక్కువ ఆసక్తి చూపుతుంటారు. అయితే చాలా బండ్ల యజమానులు కలుషిత నీటిని వినియోగిస్తుండటంతో ప్రజలు టైఫాయిడ్, ఉదర సంబంధిత వ్యాధులకు గురవుతూ విషజ్వరాలతో మంచం ఎక్కుతున్నారు. పట్టణాలు, గ్రామాల్లో వెలసిన పానీపూరి బండ్లపై అధికారుల తనిఖీలు లేకపోవడంతో యజమానులు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. జిల్లాలో కురుస్తున్న వర్షాలకు టైఫాయిడ్ వంటి జ్వరాలు వస్తుండటంతో పలువురు ఆస్పత్రులకు పరుగులు తీస్తున్నారు. వర్షాకాలంలో పానీపూరీ తినవద్దని గతంలో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ సంచాలకులు శ్రీనివాస్ ప్రకటన ఇవ్వడంతో అందరి దృష్టి పానీపూరిపై పడింది. ఊసేలేని అధికారుల తనిఖీలు ►ఆహారభద్రత చట్టం కింద జిల్లాలో ఫుడ్ సేప్టీ అధికారులు హోటళ్లు, ఇతర తినుబండారాలు అందించే ఏ దుకాణాన్ని అయినా తనిఖీ చేసే అధికారం ఉంది. పురపాలికల్లో వైద్యాధికారులు, గ్రామాల్లో పంచాయతీ అధికారులు తనిఖీ చేయొచ్చు. పెద్దపెద్ద హోటళ్లపై అధికారులు క్రమం తప్పకుండా తనిఖీలు చేస్తున్నప్పటికీ తోపుడు బండ్లపై తనిఖీలు చేసిన దాఖలాలు కనిపించడం లేదు. ►సిబ్బంది కొరత.. చిరు వ్యాపారుల పొట్టగొట్టడం ఎందుకన్న మానవతా దృక్పథంతో అధికారులు పానీపూరీ, చాట్ బండారాల దుకాణాల వైపు కన్నెత్తి చూడడం లేదు. దీంతో పలు దుకాణాల వారు, తోపుడు బండ్ల వారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ప్రజల ప్రాణాల మీదకు తెస్తున్నారు. ►జిల్లా వైద్య ఆరోగ్యశాఖ, ఫుడ్ సేప్టీ అధికారులు పానీపూరి బండ్లతో పాటు వీధుల్లో తినుబండారాల దుకాణాల్లో క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించాలని ప్రజలు కోరుతున్నారు. అప్రమత్తంగా ఉండాలి యువత, చిన్నపిల్లలకు పానీపూరీ తినడం పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. దుకాణం వద్ద అపరిశుభ్రంగా ఉన్నా రోజూ సాయంత్రం తినడం రివాజుగా మారింది. వర్షాకాలంలో పానీపూరి తినకపోవడమే మంచిది. యజమానులు షాపుల వద్ద పరిశుభ్రంగా ఉంచాలి. శుద్ధమైన నీటినే వినియోగించాలి. ప్రజలు సైతం వారి ఆరోగ్యంపై వారే బాధ్యత తీసుకొని మెలగాలి. – సత్యనారాయణ, ఆస్పత్రి సూపరింటెండెంట్, సదాశివపేట -
దోపిడి దోమ
రాయదుర్గంలోని నేసేపేటకు చెందిన సిద్ధన్న అనారోగ్యానికి గురై ఓ ఆర్ఎంపీ వద్దకు వెళ్లాడు. అతడి సలహా మేరకు ఓ సీనియర్ వైద్యుడి దగ్గరకు వెళితే.... రోగి చెబుతున్నది వినకుండానే రక్తపరీక్షలు చేయించుకుని రమ్మంటూ ఓ చీటి రాసి చేతిలో పెట్టాడు. దీంతో సిద్ధన్న ఓ ప్రైవేట్ ల్యాబ్‌కు వెళితే.. రోగ నిర్ధారణ పరీక్షకు అక్షరాల రూ.950 బిల్లు అయింది. ల్యాబ్ నిర్వాహకుడు ఇచ్చిన రిపోర్టు తీసుకుని తిరిగి సదరు డాక్టర్ వద్దకు వెళితే... సాధారణ జ్వరంతో బాధపడుతున్నట్లు తెలిపి మందులు రాసిచ్చాడు. ఈ తరహా దోపిడీతో వైద్యులు, ల్యాబ్ నిర్వాహకులు కలిసి రోగుల జేబులు గుల్ల చేస్తున్నారు. రాయదుర్గం: జిల్లాల్లో సీజనల్ వ్యాధులు మొదలయ్యాయి. దోమ కాటుతో మలేరియా, టైఫాయిడ్, డెంగీ వంటి జ్వరాలతో ప్రజలు విలవిల్లాడుతున్నారు. దీనికి తోడు రోగ నిర్ధారణకు సంబంధించి ప్రైవేట్ ల్యాబ్ నిర్వాహకుల వైఖరి మరీ దారుణంగా మారింది. రక్తాన్ని పీల్చే దోమ కాటుతో కోలుకోవచ్చు కానీ, నగదు కొల్లగొడుతున్న దోపిడీ దోమల దెబ్బకు రోగులు ఆర్థికంగా కుదేలవుతున్నారు. భయాన్ని సొమ్ము చేసుకుంటూ.. సాధారణ జ్వరం, ఒళ్లునొప్పులతో బాధపడుతూ వైద్యుడి దగ్గరకు వెళ్లినా.. రోగ నిర్ధారణ పరీక్ష తప్పనిసరి అంటున్నారు. రోగ నిర్ధారణ పరీక్షకు సంబంధించి రిపోర్టులు లేకుంటే వైద్యం చేయలేని అసహాయ స్థితికి వైద్యులు చేరుకున్నారంటే పొరబడినట్లే. కన్సల్టెంట్ ఫీజు రూపంలో కొంత దండుకునే వైద్యుడు... రోగ నిర్ధారణ పరీక్షలకు రెఫర్ చేయడం ద్వారా మరికొంత కమీషన్ దక్కుతుండడమే ఇందుకు కారణం. విష జ్వరాలపై ప్రజల్లో ఉన్న భయాన్ని తెలివిగా దోపిడీ చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా అనుమతి పొందిన ల్యాబ్‌లు 79 ఉండగా... అనధికారికంగా నిర్వహిస్తున్నవి దీనికి రెట్టింపుగానే ఉన్నాయి. ఉచితంగా అందుబాటులో ఉన్నా.. మలేరియా, టైఫాయిడ్‌తో పాటు గర్భిణులకు బ్లడ్ గ్రూపింగ్, హెచ్ఐవీ, బ్లడ్ షుగర్, హైపటైటిస్–బీ, యూరిన్, టీబీ పరీక్షలతో పాటు డెంగీ, ప్లేట్లేట్ కౌంట్, కిడ్నీ, లివర్ ఫంక్షన్ లాంటి ఇతర కీలక వ్యాధుల నిర్ధారణకు అవసరమైన పరీక్షలు ప్రాథమిక, అర్బన్ ప్రైమరీ ఆరోగ్య కేంద్రాల్లోనే నిర్వహిస్తుంటారు. డెంగీ పరీక్ష కోసం పీహెచ్‌సీల్లోనే రక్త నమూనాలు సేకరించి ‘ఎలిసా’ పరీక్ష కోసం జిల్లా కేంద్రంలోని సర్వజనాస్పత్రికి పంపిస్తారు. 24 గంటల్లోపు పరీక్ష చేసి రోగికి సమాచారం అందేలా చర్యలూ తీసుకున్నారు. ఇష్టారీతిన ఫీజుల వసూళ్లు.. ఉమ్మడి జిల్లాలో గడిచిన ఆరేళ్లు పరిశీలిస్తే 1,538 డెంగీ, 816 మలేరియా, 670 టైఫాయిడ్ కేసులు నమోదయ్యాయి. 2017–19 మధ్య డెంగీ, మలేరియా, టైఫాయిడ్‌కు సంబంధించి 80 శాతం కేసులు నమోదు కావడం విశేషం. ప్రాణాంతకమైన ఈ రోగాలకు సంబంధించి విధిగా వైద్య పరీక్షలు నిర్వహిస్తుంటారు. ఇది కూడా ప్రభుత్వ నిబంధనలకు లోబడి బిల్లు వసూలు చేయాల్సి ఉంది. ఇందుకు సంబంధించిన ధరల పట్టికను సంబంధిత ప్రైవేట్ ల్యాబ్‌ల్లో తప్పనిసరిగా ప్రదర్శనకు ఉంచాలి. అయితే అధికారిక పర్యవేక్షణ కొరవడడంతో ఈ నిబంధనలేవీ అమలు కావడం లేదు. పైగా ప్రశ్నించిన రోగుల పట్ల దురుసుగా వ్యవహరించడం, గంటల తరబడి వేచి ఉండేలా చేసి ఇబ్బందులు గురి చేస్తుంటారు. టైఫాయిడ్, మలేరియా లాంటి పరీక్షలకు రూ.180 నుంచి రూ.200ల వరకు వసూలు చేస్తారు. అయితే ఈ పరీక్షలకు రూ.500 నుంచి రూ.600 వరకూ తీసుకుంటూ రోగుల జేబులు కొల్లగొట్టడం విమర్శలకు దారి తీస్తోంది. అనుమతి లేని ల్యాబ్‌లపై చర్యలు ప్రభుత్వ అనుమతులు లేకుండా ల్యాబ్‌లు నిర్వహిస్తున్న వారిపై చర్యలు తీసుకుంటాం. నిబంధనలకు విరుద్ధంగా ఇష్టారీతిన వసూళ్లకు పాల్పడినట్లు తేలితే అనుమతులున్నా ల్యాబ్‌లను సీజ్ చేస్తాం. – డాక్టర్ ఓబులు, జిల్లా మలేరియా అధికారి, అనంతపురం ఉచిత సేవలు సద్వినియోగం చేసుకోవాలి ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే డెంగీ, మలేరియా, టైఫాయిడ్ ఇతర విష జ్వరాల నిర్ధారణ పరీక్షలు ఉచితంగా చేస్తారు. ఈ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. ప్రైవేటు ల్యాబ్‌ల దోపిడీని ఉపేక్షించబోం. – డాక్టర్ విశ్వనాథయ్య, డీఎంహెచ్ఓ (చదవండి: ఇదే చివరి అవకాశం.. ఇలా చేయకపోతే డబ్బులు పడవు ) -
Telangana: టైఫాయిడ్ విజృంభిస్తోంది.. జాగ్రత్త!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంపై టైఫాయిడ్ పంజా విసురుతోంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా టైఫాయిడ్ కేసులు పెరుగుతుండటంతో వైద్య, ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ప్రతీ జిల్లాలోనూ కేసులు వెలుగుచూడటంతో స్థానిక అధికారులను అప్రమత్తం చేసింది. ఈ ఏడాది మే, జూన్, జూలైల్లో ఇప్పటివరకు 5,549 కేసులు నమోదైనట్లు వెల్లడించింది. అందులో అత్యధికంగా నిర్మల్ జిల్లాలో 908, మంచిర్యాల జిల్లాలో 658 కేసులు నమోదయ్యాయి. డెంగీ కంటే ఐదురెట్లు ఎక్కువగా టైఫాయిడ్ కేసులు నమోదవుతున్నాయి. కలుషిత ఆహారం, నీరు కారణంగా టైఫాయిడ్ పెరుగుతున్నట్లు వైద్య, ఆరోగ్యశాఖ గుర్తించింది. మరోవైపు ఇదేకాలంలో నీళ్ల విరేచనాల కేసులు(అక్యూట్ డయేరియా) 12,620 మేర నమోదయ్యాయి. అందులో ఒక్క హైదరాబాద్‌లోనే 2,089 కేసులు ఉన్నాయి. టైఫాయిడ్ జ్వరం లక్షణాలు టైఫాయిడ్‌ను కలిగించే బ్యాక్టీరియా పేగునాళాల ద్వారా వ్యాపించి పేగు గోడలలోకి చొచ్చుకొని పోయి రక్తంలో కలుస్తుందని, మలం, రక్త నమూనాల ద్వారా రోగనిర్ధారణ చేయవచ్చని వైద్యులు అంటున్నారు. పిల్లలు ఎక్కువగా దీనికి ప్రభావితమవుతుంటారని, మెరుగైన పారిశుధ్యం, వ్యాధికి యాంటీబయాటిక్స్ తప్పనిసరి అని పేర్కొంటున్నారు. ఇది అంటువ్యాధి అయినందున అందరూ జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. టైఫాయిడ్ వచ్చినప్పుడు జ్వరం 104 డిగ్రీల ఫారిన్‌హీట్ వరకూ చేరుకుంటుందని, విపరీతమైన చమటలు, గాస్ట్రో ఎంటిరైటిస్, విరేచనాలు కూడా సంభవిస్తాయని చెబుతున్నారు. రెండు వారాల తర్వాత శరీరంపై ఒక్కోసారి దద్దుర్లు, గులాబీ రంగు మచ్చలు కనిపిస్తాయని, కడుపునొప్పి కూడా రావచ్చని, ఈ వ్యాధి సోకినవారు ఎక్కువగా మగతగా ఉంటారని, మూడోవంతు రోగులకు ఛాతీ కింద, పొట్ట మీద గులాబీ రంగు మచ్చలు కనిపిస్తాయని చెబుతున్నారు. అరుదైన సందర్భాల్లో సరైన సమయంలో చికిత్స పొందకపోతే టైఫాయిడ్ జ్వరం వల్ల మరణం కూడా సంభవించవచ్చని వైద్య నిపుణులు అంటున్నారు. అప్రమత్తం చేశాం రాష్ట్రంలో డెంగీ కంటే అధికంగా టైఫాయిడ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో వైద్య యంత్రాంగాన్ని అప్రమత్తం చేశాం. టైఫా యిడ్ ప్రధానంగా కలుషిత ఆహారం, నీరు వల్లే వస్తుంది. వీధుల్లో తోపుడుబండ్లపై ఉండే ఆహార పదార్థాలు, పానీపూరీ తినడం వల్ల టైఫాయిడ్ సంభవించే అవకాశం ఉంది. రాష్ట్రంలో ఎక్కువగా నమోదయ్యే టైఫా యిడ్ కేసులన్నీ పానీపూరీ కేసులే. టైఫాయి డ్ రాకుండా ఉండాలంటే ఆహారం వేడిగా తినాలి. మంచినీళ్లను కాచి వడపోసిన తర్వా తే తాగాలి. పానీపూరీ బండ్లు, తోపుడుబండ్లపై అమ్మే ఆరుబయట ఆహార పదార్థాల ను తినకూడదు. టైఫాయిడ్ లక్షణాలుంటే తక్షణమే వైద్యం తీసుకోవాలి. –డాక్టర్ శ్రీనివాసరావు, ప్రజారోగ్య సంచాలకుడు -
యాంటీ బయాటిక్స్ ఎక్కువగా వాడుతున్నారా..? పొంచి ఉన్న మరో ముప్పు..!
యాంటీబయాటిక్స్ మన శరీరంలోని హానికరమైన బ్యాక్టీరియాను చంపేందుకు ఉపయోగపడే మందు. వీటి సహాయంతో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ను తగ్గించి, రోగి ప్రాణాలు కాపాడవచ్చన్న విషయం తెలిసిందే. అయితే... ఈ యాంటీబయాటిక్స్‌ను విచ్చలవిడిగా, విచక్షణరహితంగా వాడటం వల్ల ఎన్నో అనర్థాలు చోటు చేసుకుంటున్నాయని వైద్యనిపుణులు, శాస్త్రవేత్తలు ఎంతోకాలంగా హెచ్చరిస్తునే ఉన్నారు. అయినా ఇప్పటికీ వాటి దురుపయోగం ఆగడం లేదు. దాంతో తాజాగా ఇప్పుడు ఎంతకూ తగ్గని టైఫాయిడ్ రూపంలో మరో ముప్పు పొంచి ఉందంటూ శాస్త్రవేత్తలు ఆధారాలతో సహా నివేదిస్తున్నారు. ఈ ముప్పును గుర్తెరిగి అప్రమత్తం అయ్యేందుకు ఉపయోగపడే కథనమిది. గతంలో కొన్ని జబ్బులు చాలా తేలిగ్గా... అంటే కేవలం ఓ చిన్న యాంటీబయాటిక్ వాడగానే తగ్గిపోయేవి. అసలు కొన్ని జబ్బులైతే ఎలాంటి మందులూ / యాంటీబయాటిక్స్ వాడకపోయినా తగ్గుతాయి. కాకపోతే కొద్దిగా ఆలస్యం కావచ్చు. చాలా వ్యాధులను వ్యాప్తి చేసే వ్యాధికారక క్రిములు... ఆ మందుల పట్ల తమ నిరోధకతను పెంచుకుంటున్నాయి. తాజాగా టైఫాయిడ్‌ను వ్యాప్తి చేసే క్రిమి కూడా అలా నిరోధకత పెంచుకుంటోందని కొన్ని అధ్యయనాల్లో aతేలింది. ఆసియాలో పెరుగుతూ.. అంతర్జాతీయంగా వ్యాప్తి టైఫాయిడ్ చాలా పురాతనమైన జబ్బు. దాదాపు వెయ్యేళ్ల నుంచి మానవాళిని బాధిస్తోందన్న దాఖలాలున్నాయి. ఇలా చాలాకాలం నుంచి వేధించిన మరోపురాతనమైన జబ్బు టీబీలాగే... టైఫాయిడ్ కూడా యాంటీబయాటిక్స్ తర్వాత పూర్తిగా అదుపులోకి వచ్చింది. అభివృద్ధి చెందిన దేశాల్లో ఆనవాళ్లు లేకుండా మటుమాయమైంది. ఇది సాల్మొనెల్లా ఎంటరికా లేదా సాల్మొనెల్లా టైఫీ అనే రకాల క్రిము కారణంగా వ్యాప్తి చెందుతుంది. మనదేశంతో పాటు పొరుగు దేశాలైన నేపాల్, పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లలో నిర్వహించిన పరిశోధనల్లో ఆందోళన కలిగించే అనేక అంశాలు వెల్లడయ్యాయి. శాస్త్రవేత్తలు మనదేశంతో పాటు ఆయా దేశాల్లోని 3,489 రకాల టైఫీ స్ట్రెయిన్ల జీనోమ్ సీక్వెన్సింగ్‌ను పరిశీలించారు. దాంతో ఇప్పుడు తాజాగా యాంటీబయాటిక్స్‌కు ఓ పట్టాన లొంగని కొత్త స్ట్రెయిన్ టైఫాయిడ్ జబ్బును కలిగించే బ్యాక్టీరియా వృద్ధి చెందినట్లు తేలింది. నిపుణులు దీన్ని డ్రగ్ రెసిస్టెన్స్ టైఫాయిడ్ లేదా ‘ఎక్స్‌డీఆర్’టైఫాయిడ్‌గా పేర్కొంటున్నారు. టైఫాయిడ్ కొత్త స్ట్రెయిన్స్... ‘‘ఉత్పరివర్తనం చెందిన ‘ఎక్స్‌డీఆర్ టైఫాయిడ్’ 2016లో తొలిసారి పాకిస్తాన్లో వెలుగుచూసింది. ఆ తర్వాత ప్రపంచం మొత్తం వ్యాప్తి చెందుతున్న ఈ ‘ఎక్స్ఆర్డీ’ టైఫీ స్రెయిన్స్ వ్యాప్తి... భారత్, పాక్, నేపాల్, బంగ్లాదేశ్... ఈ నాలుగు ఆసియా దేశాలనుంచే జరుగుతోంది. ఈ సూపర్‌బగ్స్ యునైటెడ్ కింగ్డమ్ (బ్రిటన్), యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, కెనడాల్లోనూ కనిపిస్తున్నాయి. ఈ పరిణామం ఎంతో ఆందోళనకరం. అందుకే వీలైనంత త్వరగా ఈ అనర్థానికి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంది’’ అని స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీకి చెంది జేసన్ ఆండ్రూస్ ప్రపంచానికి హితవు చెబుతున్నారు. ప్రతి ఏడాదీ దాదాపు కోటీ 10 లక్షల టైఫాయిడ్ కేసులు వస్తుండటం... ప్రస్తుతం ఆ వ్యాధి దాఖలాలే లేని ప్రాంతాల్లో కూడా విస్తరిస్తుండటం... అది మందులకు ఓ పట్టాన లొంగకుండా వ్యాధిగ్రస్తుల్లో 20 శాతం మంది మృత్యువాతపడుతుండటం అన్నది ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన కలిగించే ఓ ఆరోగ్యాంశం అవుతుందని కూడా ఆండ్రూ హెచ్చరిస్తున్నారు. డ్రగ్ రెసిస్టెన్స్ పెంచుకుంటున్న మరికొన్ని జబ్బులు ►క్లాస్ట్రీడియమ్ డిఫిసైల్ అనే పెద్ద పేగుల్లో పెరిగే బ్యాక్టీరియా వల్ల వచ్చే నీళ్ల విరేచనాలు ఇప్పుడు పెద్దవయసు వారి ప్రాణాలకే ముప్పుగా పరిణమించేలా తయారయ్యాయి. ఈ క్లాస్ట్రీడియమ్ బ్యాక్టిరియా ఇటీవల యాంటీబయాటిక్స్‌కు నిరోధకత పెంచుకున్నట్లుగా తెలుసోది. ►గతంలో చిన్న పిల్లల్లో, పెద్దల్లో తరచూ వచ్చే సెగగడ్డలు అప్పట్లో చిన్న డోస్‌తో కేవలం మామూలు యాంటీబయాటిక్స్ తగ్గిపోయేవి. కానీ ఇప్పుడవి ఒక పట్టాన తగ్గడం లేదు. ►అప్పట్లో ట్యూబర్క్యులోసిస్ బ్యాసిల్లస్ (టీబీ), క్లెబిసిలియా నిమోనియా, సూడోమొనాస్ వంటి సూక్ష్మక్రిములు యాంటీబయాటిక్స్‌కు తేలిగ్గానే లొంగిపోయేవి. కానీ ఇప్పుడవి మరింత మొండిగా మారాయి. ► ఈ వేసవిలో మామిడిపండ్లు కాస్త ఎక్కువగానే తిన్నప్పుడు కొందరిలో విరేచనాలు అయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఇలా జరగగానే కొందరు ఆన్‌కౌంటర్ మెడిసిన్ వాడుతుంటారు. ఎలాంటి మందులు వాడకపోయినా అవి మర్నాటికల్లా తగ్గిపోతాయి. ఇలా ఆన్‌కౌంటర్ మెడిసిన్స్ వాడటం వల్ల విరేచనాలే కాదు... మరెన్నో సమస్యలు మొండిగా మారుతున్నాయి. అందుకే ఆన్‌కౌంటర్ మెడిసిన్స్‌ను వాడకపోవడమే మంచిది. అందుబాటులో టైఫాయిడ్ వ్యాక్సిన్ టైఫాయిడ్‌కు వ్యాక్సిన్ అందుబాటులో ఉంది. అంతేకాదు... మనదేశంలో పిల్లలందరికీ ఇది తప్పనిసరిగా ఇవ్వాల్సిన (మ్యాండేటరీ) వ్యాక్సినేషన్ షెడ్యూల్ జాబితాలో ఉంది. టీసీవీ వ్యాక్సిన్ రూపంలో దీన్ని 9 – 12 నెలల పిల్లలకు ఇస్తుంటారు. ఒకవేళ ఇవ్వకపోతే... రెండేళ్లు దాటిన పిల్లలకు దీన్ని ఇప్పించడం ద్వారా టైఫాయిడ్ నుంచి అనేక మంది చిన్నారుల ప్రాణాలు కాపాడవచ్చు. ఏ జబ్బుకు ఏ యాంటీ బయాటిక్... ఏ మోతాదులోనంటే? బాధితులకు వచ్చిన వైద్య సమస్య ఆధారంగా, దాని తీవ్రతను బట్టి... దానికి ఏ తర్చహా యాంటీబయాటిక్స్ వాడాలి, అది కూడా ఎంత మోతాదులో వాడాలి, దాన్ని ఎంతకాలం పాటు వాడాలన్న విషయాలు వైద్యులకే తెలుస్తాయి. ఒకవేళ మందుల మోతాదును తక్కువగా ఇస్తుంటే... రోగకారక క్రిములు క్రమంగా యాంటీబయాటిక్స్ తమపై పనిచేయని విధంగా నిరోధకత (రెసిస్టెన్స్)ను పెంచుకోవచ్చు. అందుకే డాక్టర్లు నిర్దేశించిన మేరకు మాత్రమే, వారు చెప్పిన కాల వ్యవధి వరకే వాటిని వాడాలి. దురుపయోగం చేయవద్దు... మన ప్రాణాలను రక్షించే ఈ యాంటీబయాటిక్స్ మందులను అదేపనిగా వాడటం వల్ల లేదా అవసరమైనదాని కంటే చాలా ఎక్కువ మోతాదుల్లో వాడటం వల్ల ఎన్నో దుష్పరిణామాలు ఉన్నాయి. మనకు చెడు చేసే సూక్ష్మజీవులు ఈ మందులకు నిరోధకత (రెసిస్టెన్స్) సాధిస్తే... ఆ తర్వాత మనల్ని రక్షించుకోవడం చాలా కష్టమవుతుంది. అందుకే యాంటీబయాటిక్స్‌ను దురుపయోగం చేసుకుని, వాటిని నిరుపయోగం చేసుకోకుండా, యాంటీబయాటిక్స్ పట్ల అవగాహన పెంపొందించుకోవాలి. చదవండి: Green Tea- Weight Loss: గ్రీన్ టీ ఎంత మంచిది? నిజంగానే బరువు తగ్గుతారా? -
విజృంభిస్తున్న విషజ్వరాలు: డెంగీ..మలేరియా..టైఫాయిడ్!
అంబర్‌పేట: సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. దీంతో నియోజకవర్గంలో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఓపీకి వచ్చే రోగుల సంఖ్య పెరిగింది. నిత్యం 40 నుంచి 50 ఉండే ఓపీ.. ప్రస్తుత సీజన్లో 70 నుంచి 80కి పెరిగింది. నియోజకవర్గంలోని ఐదు ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో పాటు నాలుగు బస్తీ దవాఖానాలకు సామాన్య రోగుల సంఖ్య తాకిడి ఎక్కువైంది. ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు జ్వరాల భారిన పడిన ప్రజలు ప్రైవేట్ ఆసుపత్రులకూ పరుగులు తీస్తున్నారు. ఈ సీజన్లో డెంగీ, మలేరియా, చికున్‌గున్యా, టైఫాయిడ్ జ్వరాలు విజృంభిస్తున్నాయి. గత 20 రోజులుగా విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. దోమల నివారణ, పారిశుధ్య నిర్వహణలో జరుగుతున్న వైఫల్యంతోనే ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సీజనల్ వ్యాధులను అరికట్టేందుకు ప్రభుత్వ యంత్రాంగం సమన్వయంతో పని చేయాలని ప్రజలు కోరుతున్నారు. అండగా బస్తీ దవాఖానాలు సీజన్ వ్యాధులు ప్రబలుతుండటంతో బస్తీ దవాఖానాలు పేదలకు ఎంతో ఊరటనిస్తున్నాయి. ఉదయం 9 గంటల నుంచి 4 గంటల వరకు బస్తీ దవాఖానాల్లో వైద్యులు ఓపీ చూస్తున్నారు. సాధారణ జనంతో పాటు ఇతర జ్వరాలను గుర్తించి చికిత్స అందించడంతో పాటు మెరుగైన చికిత్సకు సిఫార్సు చేస్తున్నారు. నియోజకవర్గంలో అంబర్‌పేట మున్సిపల్ కాలనీ, బాగ్ అంబర్‌పేట అయ్యప్ప కాలనీ సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, నెహ్రూనగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ఫీవర్ ఆసుపత్రిలో వెనుకాల ఉన్న తిలక్‌నగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, విద్యానగర్ డీడీ ఆసుపత్రి ప్రాంగణంలో ఉన్న ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో ఓపీతో పాటు వైద్య పరీక్షల శాంపిళ్లు సేకరించి చికిత్స నిర్వహిస్తున్నారు. ఆయా డివిజన్లలో ఉన్న బస్తీ దవాఖానాల్లో సైతం వైద్య పరీక్షల కోసం రక్త నమూనాలు సేకరించి తెలంగాణ డయాగ్నోస్టిక్స్ కేంద్రానికి పంపిస్తున్నారు. వైద్య పరీక్షల్లో తేలిన ఫలితాన్ని బట్టి కోవిడ్‌కు చికిత్సను అందిస్తున్నారు. దోమల నియంత్రణలో విఫలం సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని తెలిసినా దోమలను నియంత్రించడంలో జీహెచ్ఎంసీ ఎంటమాలజీ విభాగం విఫలమవుతున్నది. దోమల లార్వా, దోమల విజృంభణలను నివారించడంలో ఎంటమాలజీ విభాగం నిర్లక్ష్యం చేస్తున్నదని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తూ.. తూ.. మంత్రంగా ఫాగింగ్ చేపట్టి చేతులు దులుపు కుంటున్నారే తప్ప వాటి నియంత్రణకు చర్యలు తీసుకోవడం లేదని మండిపడుతున్నారు. లార్వా నిర్మూలనలో సైతం పై పై చర్యలు తీసుకొని మిన్నకుండి పోతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. వైద్య విభాగాన్ని సమాయత్తం చేశాం సీజనల్ వ్యాధులను నియంత్రించేందుకు కృషి చేస్తున్నాం. నియోజకవర్గంలో ఉన్న అన్ని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, బస్తీ దవాఖానాల్లో సరిపడా మందులను అందుబాటులో ఉంచాం. సీజనల్ వ్యాధులను అరికడుతూనే విస్తృతంగా వ్యాక్సిన్ ప్రక్రియను చేపడుతున్నాం. సీజనల్ వ్యాధులపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య పరీక్షలు, చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. – డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ హేమలత -
కరోనానా? సీజనల్ జ్వరమా?
సాక్షి,విజయవాడ: ఏడాదిన్నరగా కరోనా ప్రపంచాన్ని వణికిస్తోంది. దీంతో ప్రజల్లో ఫోబియో నెలకొంది. ఏ జ్వరం వచ్చినా.. జలుబు, చిన్నపాటి దగ్గు వచ్చినా నిర్ధారణ పరీక్షలు కూడా లేకుండా కరోనాగా భావించి మందులు వాడేస్తున్నారు. అవి ఒక్కోసారి ప్రాణాల మీదకి తెస్తున్నాయి. తెలియని వారు చేస్తే ఏదో అనుకోవచ్చు.. విద్యావంతులు సైతం ఇదే విధంగా మందులు వాడుతూ ప్రమాదాలను కొనితెచ్చుకొంటుండటం ఆందోళనకర పరిణామం. ఇవే నిదర్శనాలు.. ∙నగరానికి చెందిన ఒక సూపర్‌స్పెషాలిటీ వైద్యురాలికి తీవ్రమైన జ్వరం వచ్చింది. స్వయాన వైద్యురాలు అయినప్పటికీ ఎలాంటి నిర్ధారణ పరీక్షలు చేయించకుండానే కరోనాగా భావించి మందులు వాడేశారు. యాంటీ కోయాగ్యులేషన్(రక్తం పలుచన చేసేవి) మందులు కూడా వినియోగించారు. వారం రోజుల తర్వాత ఓ రోజు వేకువజామున ఆరోగ్యం క్షీణించడంతో ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరీక్షలు చేయగా డెంగీగా నిర్ధారణయ్యింది. సహజంగా డెంగీ జ్వరంలో ప్లేట్లెట్స్ తగ్గి రక్తం గడ్డకట్టే గుణం కోల్పోతారు. దానికి తోడు ఆమె రక్తం పలుచన చేసే మందులు కూడా వాడటంతో పరిస్థితి విషమించి కన్నుమూశారు. ∙నగరానికి చెందిన విద్యావంతుడైన ఓ ప్రైవేటు ఉద్యోగికి ఇటీవల జ్వరం వచ్చింది. ఎంతకీ తగ్గక పోవడంతో, కరోనాగా భావించి మందులు వాడేశారు. మూడు రోజులకు జ్వరం తీవ్రం కావడంతో వైద్యుని వద్దకు వెళ్లి పరీక్షలు చేయించుకోగా, టైఫాయిడ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో వైద్యుడు టైఫాయిడ్‌కు మందులు ఇవ్వడంతో ప్రాణాపాయం నుంచి బయట పడ్డారు. డ్రగ్ రెసిస్టెన్స్ పెరుగుతోంది.. ఇప్పుడు సమాజంలో చాలా మంది చిన్న పాటి జ్వరం వచ్చినా, జలుబు, దగ్గు వచ్చినా, లక్షణాలను బట్టి కరోనాగా భావించి మందులు వాడేస్తున్నారు. అది సరైన విధానం కాదని వైద్యులు సూచిస్తున్నారు. ఏ మందు అయినా అవసరం వచ్చినప్పుడు, ఆ మేరకు మాత్రమే వాడాలంటున్నారు. అనవసరంగా మందులు వాడటం ద్వారా శరీరంలో డ్రగ్ రెసిస్టెన్స్ పెరిగి, అవసరమైనప్పుడు పనిచేయకుండా పోతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇదీ ‘సీజనల్’ సమయం.. ప్రస్తుతం సీజనల్ జ్వరాలు ఎక్కువగా వస్తున్నాయి. అయితే జ్వరం వచ్చిన వెంటనే కోవిడ్ నిర్ధారణ కోసం ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయించుకోవాలి. దానిలో పాజిటివ్ వస్తేనే కరోనాకు మందులు వాడాలి. ఒకవేళ ఆర్టీపీసీఆర్ నెగిటివ్ వచ్చినా జ్వరం తగ్గకుంటే, అప్పుడు సీజనల్ వ్యాధులైన మలేరియా, డెంగీ, టైఫాయిడ్ పరీక్షలు చేయించుకోవాలి. మలేరియా, డెంగీ నిర్ధారణకు జ్వరం వచ్చిన ఒకటీ, రెండు రోజుల్లో పరీక్ష చేయొచ్చు. కానీ టైఫాయిడ్ నిర్ధారణకు వారం రోజుల తర్వాత చేయాల్సి ఉంటుంది. లక్షణాలు ఇవీ.. కోవిడ్: జ్వరం, ఒళ్లు నొప్పులు, పొడిదగ్గు, విరేచనాలు, తలనొప్పి వంటి లక్షణాలు ఉంటాయి. టైఫాయిడ్: జ్వరం వచ్చిన రోజు నుంచి రోజు రోజుకు పెరుగుతూ ఉంటుంది. ఉదయం, సాయంత్రం వేళల్లోనే అధికమవుతుంటుంది, జ్వరం వచ్చినప్పుడు చలి, వణుకు రావడం, విరేచనాలు కూడా అయ్యే అవకాశం ఉంది. డెంగీ: అధిక జ్వరం, ఒళ్లు నొప్పులు, విపరీతమైన న డుం నొప్పితో పాటు, కీళ్ల నొప్పులు ఉంటాయి. మలేరియా: విపరీతమైన జ్వరం, చలి ఎక్కువగా ఉంటుంది, తీవ్రమైన తలనొప్పి, వాంతులు, ఆకలి మందగిస్తుంది. చదవండి:జర జాగ్రత్త!.. ఆహారం.. విరామం.. అతి చేస్తే హానికరం -
జనం లేని దీవిలో 30 ఏళ్లు నిర్భంధించారు
నేరమైనా, న్యాయమైనా కొన్నిసార్లు బలం ఎటు తూగితే అటు సాగుతుంది సమాజం. నిజానిజాలను నిర్ధారించే సాహసం చేయకుండానే! ఓ పోరాటం ఒంటరిగా నిస్సహాయతకు గురవుతుంటే.. వ్యతిరేక సాక్ష్యాలు కోకొల్లలై బలపడుతుంటే.. బహుశా అల్పమైన బతుకులు ఆయువు తీరేవరకూ తలవంచక తప్పదేమో?! అస్పష్టమైన నేరానికి నిర్బంధమనే శిక్షను చట్టం ఎప్పుడూ వ్యతిరేకిస్తుంది. కానీ నిర్దోషినని నిరూపించుకోగలగాలి కదా? అదే జరగలేదు ఆమె జీవితంలో! తనకే తెలియని ఓ ఉచ్చులో చిక్కుకుని ఓ విషాదాంతంగా ముగిసిపోయింది. చరిత్రలో ఓ మిస్టరీగా మిగిలిపోయింది. ఆమె అసలు పేరు మేరీ మల్లాన్. అయితే నేటికీ ఆమెను ‘టైఫాయిడ్ మేరీ’గానే గుర్తిస్తారంతా. 1869లో సెప్టెంబర్ 23న ఉత్తర ఐర్లాండ్‌లోని కూక్స్ టౌన్లో పుట్టింది. 1883లో తన 15వ ఏట బంధువులతో కలసి అమెరికాకు వలస వచ్చింది. అప్పట్లో ఇంటి, వంట పనులకు అక్కడ మంచి వేతనం ఉండడంతో వంట మనిషిగా కొలువులో చేరింది. ఆఖరికి అదేSఆమె తలరాతను మార్చింది. మేరీ చేతి వంట తిన్నవారెవరైనా సరే అమృతాన్ని రుచి చూసినట్టే. అంత అద్భుతమైన పాక ప్రావీణ్యంతో వంట మనిషిగా మేరీ జీవితం బాగానే సాగింది కొన్నేళ్ల పాటు. 1900లో అప్పటికే ఉనికిలోకి వచ్చిన టైఫాయిడ్ వ్యాప్తికి అపరిశుభ్రతే కారణమని కనిపెట్టారు శాస్త్రవేత్తలు. టైఫాయిడ్ సోకిన రోగి ద్వారానే అది ఇతరులకు వ్యాప్తి చెందుతుందని గుర్తించారు. ఈ పరిశీలన, పరిశోధన పర్యవసానం.. మేరీ.. టైఫాయిడ్ మేరీ కావడం. మేరీకి.. టైఫాయిడ్‌కి ఏంటి సంబంధం? అది తెలుసుకోవాలంటే ఆమెకు ఏమాత్రం సంబంధం లేని జార్జ్ సాపర్ అనే సివిల్ ఇంజినీర్ గురించి చెప్పుకోవాలి. 1906లో చార్లెస్ హెన్రీ వారెన్ అనే ధనికుడి ఇంట్లో ఒకేసారి ఆరుగురికి టైఫాయిడ్ వచ్చింది. వారంతా పరిశుభ్రతను పాటించే వ్యక్తులే. ఆ చుట్టుపక్కల టైఫాయిడ్ బాధితులు లేకపోవడంతో తమ కుటుంబానికి ఈ వ్యాధి ఎలా వ్యాపించిందో తెలుసుకోవాలని టైఫాయిడ్ వ్యాప్తిపై అనుభవం ఉన్న జార్జ్ సాపర్ని కోరాడు హెన్రీ. దాంతో మేరీ జీవితంలోకి ఆమె ప్రమేయం లేకుండా ఎంటర్ అయ్యాడు సాపర్. అప్పటికే హెన్రీ వారెన్ ఇంట్లో వంట మనిషిగా ఉన్న మేరీ.. ఆ కుటుంబంలో వారికి టైఫాయిడ్ సోకిన వారానికి చెప్పాపెట్టకుండా మానేసిందనే పాయింట్ పట్టుకున్నాడు సాపర్. ఆరా తియ్యడం మొదలుపెట్టాడు. మేరీ ఎవరి ఇంట్లోనూ ఎక్కువ కాలం పనిచేయదని, ఎప్పుడూ మారుతూ ఉంటుందని, ఆమె పనిచేసి వెళ్లిన ప్రాంతాల్లో టైఫాయిడ్ వ్యాపిస్తుందని తెలుసుకున్నాడు. అతడి అనుమానం బలపడింది. వివరాలతో సహా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వెంటనే పోలీసులు జనహితార్థం మేరీని న్యూయార్క్ దగ్గరలోని నార్త్ బ్రదర్ దీవిలో బంధించారు. మేరీకి వైద్య పరీక్షలు చేయించారు. అయితే ఆమెలో ఎలాంటి బ్యాక్టీరియా, వైరస్లు లేవని వైద్యులు తేల్చారు. దాంతో ఆ నిర్బంధాన్ని మేరీ వ్యతిరేకించింది. తన హెల్త్ రిపోర్ట్స్ సాక్ష్యంగా 1910లో న్యూయార్క్ స్టేట్ బోర్డ్ ఆఫ్ హెల్త్‌కు ఫిర్యాదు చేసి.. విడుదలైంది.. ఇకపై వంట చెయ్యకూడదనే షరతులకు ఒగ్గి! బయటకు వచ్చాక లాండ్రీ పని చేసుకుని బతికింది. కానీ చాలీచాలని జీతం జీవనానికి ఇబ్బందిగా మారడంతో.. మారు పేరు పెట్టుకుని మళ్లీ వంట చెయ్యడం మొదలు పెట్టింది. అదే ఆమె పాలిట శాపమైంది. 1915లో స్లోనే మహిళా ఆసుపత్రిలో వంట మనిషిగా చేరింది మేరీ. అక్కడ 22 మంది వైద్యసిబ్బందికి ఒకేసారి టైఫాయిడ్ వ్యాపించడం, అందులో ఇద్దరు చనిపోవడంతో.. మళ్లీ పోలీసులు రంగంలోకి దిగారు. ఈసారి మేరీని మనుషులు లేని దీవికి తరలించారు. ఆ దీవిలో మేరీ ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా 30 ఏళ్లు నిర్బంధంలో గడిపింది. పక్షవాతం బారిన పడి ఆరేళ్లు కష్టపడింది. తన 69 ఏట (1938) న్యుమోనియాతో చనిపోయింది. శరీరంలో బ్యాక్టీరియా లేకుండా వ్యాధిని ఎలా వ్యాప్తి చేసిందనేది తేలకుండానే ఆమె కథ ముగిసింది. వైద్య పరిజ్ఞానం అంతగా అభివృద్ధి చెందని ఆ రోజుల్లో మేరీ పరిస్థితిపై పరిశోధనలు, విశ్లేషణలే కాదు.. ఆమె తరపున నిలబడి పోరాడిన మనుషులూ లేరు. అయితే ఈ ట్రాజెడీ స్టోరీ తెలుసుకున్న వారు మాత్రం.. ఆమె వంట చేసేటప్పుడు చేతులు శుభ్రం చేసుకునేది కాదేమోనని అభిప్రాయపడుతుంటారు. ∙సంహిత నిమ్మన -
చుట్టూ టైఫాయిడ్ ఉంది
మనం సురక్షితం అనుకునే ఆహారం శుభ్రత లేని కారణంగా టైఫాయిడ్‌ను వ్యాప్తి చేయవచ్చు. ప్లాస్టిక్ తొడుగు ధరించి ఆహారాన్ని అందజేయాలని డిమాండ్ చేద్దాం. వీలైతే మన బ్యాగ్‌లో ఎప్పుడూ ఒక గ్లౌవ్స్ జత ఉంచుకుని బండి దగ్గరికి వెళ్లినప్పుడు మనమే వాళ్లకు ఇద్దాం. ఏం తెలుసు... మనకు టిఫిన్ కట్టిచ్చే వ్యక్తి చేతుల నుంచి మనకు టైఫాయిడ్ రావచ్చని. ఏం తెలుసు... వీధిలో పొంగుతున్న డ్రైనేజీలో తడిసిన మన చెప్పులు ఇంట్లోకి టైఫాయిడ్ తేవచ్చునని. ఏం తెలుసు... బహిరంగ మలవిసర్జన మనకు టైఫాయిడ్ వ్యాప్తి చేస్తుందని. ఏం తెలుసు.. చేతులు శుభ్రంగా కడుక్కుంటూ ఉంటే టైఫాయిడ్ రాదని. ఏం తెలుసు... దూరప్రయాణాలు చేసేటప్పుడు టైఫాయిడ్ వ్యాక్సిన్ వేయించుకుంటే సురక్షితమని. తెలియకుండానే జీవితం గడిపేస్తున్నాం. చుట్టూ టైఫాయిడ్ ఉంది. జాగ్రత్త.టైఫాయిడ్ ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తున్న చాలా సాధారణ జ్వరం. పారిశుధ్ధ్య వసతులు సరిగా లేని చోట చాలా ఎక్కువగా ఇది వ్యాప్తి చెందుతుంది. పారిశుద్ధ్య పరిస్థితులు నెలకొన్న పాశ్చాత్య దేశాల్లో దీని ఉనికి బాగా తక్కువేగానీ మన దేశం లాంటి ఆసియా దేశాల్లో చాలా ఎక్కువగా కనిపిస్తోంది. మురికివాడల్లో, చెత్త నిండిన నివాస ప్రాంతాల్లో టైఫాయిడ్ చాలా ఎక్కువగా బాధిస్తోంది. జబ్బు కనిపించడం ఇలా... ఒక వ్యక్తి శరీరంలోకి ఈ బ్యాక్టీరియా ప్రవేశించినప్పుడు వారం నుంచి రెండు వారాలలో లక్షణాలు కనిపిస్తూ బయటపడుతుంది. అంటే దీని ఇంక్యుబేషన్ పీరియడ్ (బ్యాక్టీరియా ఒంటిలోనికి ప్రవేశించి లక్షణాలు బయటపడటానికి మధ్య వ్యవధి) ఒకటి నుంచి రెండు వారాలన్నమాట. ఒకసారి టైఫాయిడ్ జ్వరం వస్తే అది 3 – 4 వారాల పాటు బాధిస్తుంది. లక్షణాలు... ∙ఆకలి బాగా మందగించడం ∙తలనొప్పి ∙గుండె స్పందనల రేటు బాగా తగ్గడం (బ్రాడీకార్డియా) ∙రక్తంలో తెల్లరక్తకణాల సంఖ్య తగ్గడం (ల్యూకోపీనియా) ∙నీళ్ల విరేచనాలు (డయేరియా), పొట్టనొప్పి ∙ఒళ్లంతా నొప్పులు ∙తీవ్రమైన జ్వరం (ఒక్కోసారి 104 డిగ్రీల ఫారెన్‌హీట్‌కు మించి జ్వరం ఉండవచ్చు) ∙తీవ్రమైన అలసట, నిస్సత్తువ, నీరసం ∙చాలామందిలో ఛాతీ పట్టేసినట్లుగా ఉండటం ∙చాలా అరుదుగా ర్యాష్‌తో పాటు మెడ, పొట్ట మీద గులాబిరంగు మచ్చలు కనిపించవచ్చు. ఎలాంటి దుష్ప్రభావాలు రాకపోతే మూడు నాలుగు వారాల తర్వాత జ్వరం అదే తగ్గుముఖం పడుతుంది. నిర్థారణ ∙మొదటివారంలో అయితే రక్త పరీక్షతో (బ్లడ్ కల్చర్) నిర్దిష్టంగా దీన్ని కనుగొనవచ్చు. అందుకే మొదటివారంలో నిర్వహించే రక్తపరీక్షను గోల్డ్‌స్టాండర్డ్ పరీక్షగా పేర్కొనవచ్చు. ∙ఇక రెండో వారంలో వైడాల్ టెస్ట్ అని పిలిచే సిరొలాజికల్ పరీక్ష (రక్తపరీక్ష)తో నిర్ధారణ చేయవచ్చు. (కొన్ని సందర్భాల్లో కొంతమంది డాక్టర్లు మొదటివారమే వైడాల్ పరీక్ష చేయిస్తుంటారు. అలా చేస్తే ఉపయోగం ఉండదు. ఎందుకంటే రోగకారక క్రిమి ఒంట్లోకి ప్రవేశించాక ఒంట్లోని రక్తంలో వాటి యాంటీబాడీస్ పుడతాయి. అందుకు ఒక వారం రోజులు పట్టవచ్చు. అలాంటి సందర్భాల్లో మొదటివారమే పరీక్ష చేయించి తద్వారా వచ్చిన టైటర్ ఫలితాలను తప్పుగా వ్యాఖ్యానించడం వల్ల రోగికి నష్టం చేకూరుతుంది. అందుకే ఏదైనా జ్వరం వచ్చి, వారం రోజులు దాటి, రెండో వారంలోకి ప్రవేశించి, దాన్ని టైఫాయిడ్‌గా అనుమానించినప్పుడే వైడాల్ టెస్ట్ ఉపయోగపడుతుంది. ఈ విషయాన్ని గ్రామీణ ప్రాంతపు వైద్యులు సైతం గుర్తించాలన్నది నిపుణుల మాట). ∙మూడో వారంలో అయితే ఎముక మజ్జ (బోన్‌మ్యారో) కల్చర్ పరీక్షతో నిర్థారణ చేస్తారు. ఈ పరీక్షలతో పాటు బయటకు కనిపించే టైఫాయిడ్ సాధారణ లక్షణాల సాయంతో దీన్ని నిర్ధారణ చేయవచ్చు. అయితే ఇలాంటి లక్షణాలే చాలా సందర్భాల్లో కనిపిస్తాయి కాబట్టి కేవలం లక్షణాలను బట్టే నిర్ధారణ అంత సులభం కాదు. వైద్యపరీక్షల సాయంతో దీన్ని నూరుపాళ్లు కచ్చితంగా నిర్ధారణ చేయవచ్చు. చికిత్స టైఫాయిడ్ జ్వరానికి చికిత్స తీసుకోని వారిలో ప్రతి ఐదుగురిలో ఒకరు మరణించే అవకాశాలుంటాయి. అందుకే చికిత్స తప్పనిసరి. పైగా 104 డిగ్రీలకు పైగా జ్వరం వచ్చినప్పుడు మరికొన్ని దుష్ప్రభావాలు కూడా కనిపించవచ్చు. అందుకే టైఫాయిడ్ రోగులు సరైన చికిత్స తీసుకోవడం చాలా అవసరం. పూర్తి కోర్స్ వాడటం కూడా అత్యావశ్యకం. అలా జరగనప్పుడు మళ్లీ మళ్లీ జబ్బు తిరగబెట్టవచ్చు. అది తీవ్రంగా కూడా పరిణమించవచ్చు. మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ టైఫాయిడ్ ఇటీవల మందులకు లొంగని టైఫాయిడ్ కూడా వస్తోంది. మనం చిన్న చిన్న సమస్యలకు కూడా విచ్చలవిడిగా యాంటీబయాటిక్స్ వాడుతుండటం, అది కూడా సరైన మోతాదులో కాకుండా ఇష్టం వచ్చిన మోతాదుల్లో ఉపయోగిస్తుండటంతో పాటు ఒక్కోసారి వాడాల్సిన వ్యవధి కంటే చాలా ఎక్కువ రోజుల పాటు ఆ మందుల్ని వేసుకుంటూ ఉండటం వల్ల డ్రగ్ రెసిస్టెంట్ టైఫాయిడ్ విస్తరిస్తోంది. దీని లక్షణాలు టైఫాయిడ్ లక్షణాల్లా కనిపించవు. ఇలాంటి కేసుల్లో రోగికి చాలా జాగ్రత్తగా, శ్రద్ధగా వైద్యం అందించాల్సి ఉంటుంది. విచక్షణ రహితంగా యాంటీబయాటిక్స్ వాడే వారిలో టైఫాయిడ్ వచ్చిందంటే అది ఒక పట్టాన తగ్గక చాలా ఇక్కట్లకు గురిచేస్తోంది. టీకా అందుబాటులో... టైఫాయిడ్‌కు టీకా అందుబాటులో ఉంది. ఈ టీకా వల్ల 60 నుంచి 70 శాతం వరకు నివారణ సాధ్యమవుతుంది. టైఫాయిడ్ టీకాల్లో రకాలు: ∙ఇన్‌యాక్టివేటెడ్ టైఫాయిడ్ వ్యాక్సిన్ : ఇందులో టైఫాయిడ్‌ను వ్యాప్తి చేసే బ్యాక్టీరియాను నిర్వీర్యం (ఇన్‌యాక్టివేట్) చేసి, ఇంజెక్షన్ రూపంలో ఇస్తారు. ∙లైవ్ టైఫాయిడ్ వ్యాక్సిన్ : ఇందులో బలహీన పరచిన టైఫాయిడ్ టీకాను నోటి ద్వారా (ఓరల్‌గా) ఇస్తారు. దూరప్రయాణాలు చేస్తూ బయటి ఆహారం తీసుకునేవాళ్లు టీకా తీసుకోవడం చాలా మంచిది. లేకపోతే ఒక్కోసారి టైఫాయిడ్ జ్వరం కిడ్నీ ఫెయిల్యూర్, పొట్టలోని అంతర్గత అవయవాల్లో రక్తస్రావం, మెదడు పనితీరును ప్రభావితం చేయడం వంటి తీవ్రమైన లక్షణాలతో మరణానికి కూడా దారితీసే అవకాశం ఉంది. తమ ప్రయాణాలకు కనీసం రెండు మూడు వారాలకు ముందుగా వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. పిల్లలు, పెద్దలు అందరూ ఈ వ్యాక్సిన్ తీసుకోవచ్చు. ఈ టీకాతో కొద్దిమందిలో కాస్తంత జ్వరం, వికారం వంటివి కనిపించినా టైఫాయిడ్ టీకా నూరు శాతం సురక్షితమే. రూ. 150 నుంచి రూ. 525 వరకు ధరలతో ఇవి అందుబాటులో ఉన్నాయి. ఎలా వ్యాప్తి చెందుతుందంటే... టైఫాయిడ్ జ్వరం కలుషితాహారం వల్ల ఒకరి నుంచి మరొకరికి వస్తుంది. ఇది ‘సాల్మొనెల్లా టైఫీ’ అనే గ్రామ్‌నెగెటివ్ బ్యాక్టీరియా కారణంగా వస్తుంది. మానవ మలం వంటి విసర్జకాలు మంచినీళ్లలో కలిసినప్పుడు లేదా వాటితో తయారైన ఆహారపదార్థాలతో ఈ బ్యాక్టీరియా వ్యాప్తి చెందుతుంది. దీనిలోనే కాస్తంత తక్కువ తీవ్రత ఉన్న సాల్మొనెల్లా పారాటైఫీ అనే మరో రకం బ్యాక్టీరియా కూడా ఉంది. అయితే అది అంత సాధారణం కాదు. చాలా తక్కువ మందిలోనే కనిపిస్తుంది. అయితే ఇది వచ్చినా దీనికి కూడా టైఫాయిడ్ మాదిరిగానే నిర్ధారణ పరీక్షలు చేయించి, చికిత్స అందించాల్సి ఉంటుంది. మరికొంతమందిలో ఈ బ్యాక్టీరియా ఎలాంటి లక్షణాలు కలగజేయకుండా నిద్రాణంగా ఉంటుంది. వారి నుంచి ఇతరులకు ఈ జ్వరం వ్యాపించవచ్చు. ఇలాంటి వారిని వైద్యపరిభాషలో క్యారియర్స్ అంటారు. అన్నట్టు ఈ జీవికి ఆశ్రయం ఇచ్చే ఒకే ఒక జీవి మానవుడు మాత్రమే. మానవ విసర్జితాలతో తాగు నీరుగానీ, తినే తిండిగానీ కలుషితం కాగానే మళ్లీ బ్యాక్టీరియా మరో వ్యక్తి శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఇలా అది వ్యాప్తి చెందుతుంది. క్రానిక్ క్యారియర్స్ ముందే చెప్పినట్లుగా సాల్మొనెల్లా టైఫీ అనేది మానవుల్లోనే ఆవాసం ఉండే బ్యాక్టీరియా. అయితే లక్షణాలు బయటపడకుండా ఎలాంటి జబ్బూ లేకుండా ఉండే వారిలో అపరిశుభ్రమైన క్యాంటీన్లు, మురికిగా ఉండే హోటళ్లలో పనిచేసేవారిలో ఇది దీర్ఘకాలం పాటు అంటే దాదాపు ఏడాదికిపైగా వాళ్ల గాల్‌బ్లాడర్‌లో నివాసం ఉంటుంది. వారు విసర్జించే విసర్జకాలు ఆహారంతో కలుషితమయ్యే అవకాశాలు ఎక్కువ. కాబట్టి వీళ్లను క్రానిక్ క్యారియర్స్‌గా అభివర్ణించవచ్చు. మేరీ టైఫాయిడ్ క్రానిక్ క్యారియర్స్ విషయంలో ఒక అద్భుతమైన ఉదాహరణ ‘మేరీ మెలాన్’ అనే ఒక హాస్పిటల్ వంటగత్తె (కుక్). ఆమె ఐర్లాండ్‌లో పుట్టి అమెరికాలో స్థిరపడ్డ ఐరిష్–అమెరికన్. టీనేజ్‌లో ఉన్నప్పుడు మేరీ మెలాన్ ఐర్లాండ్ నుంచి అమెరికాలోని న్యూయార్క్‌కు చేరింది. ఎలాంటి లక్షణాలు కనిపించని మొట్టమొదటి అమెరికన్ అసింప్టమేటిక్ క్యారియర్‌గా ఆమెకు గుర్తింపు వచ్చింది. ఆమె ఓ టైఫాయిడ్ క్యారియర్ అని గుర్తించాక కూడా తనలో ఎలాంటి లక్షణాలూ కనిపించనందున మేరీ ఒంటరిగా ఉండటం (ఐసోలేషన్లోకి వెళ్లడం)గానీ, లేదా చికిత్స తీసుకోవడం గానీ చేయలేదు. దాంతో ఆమె ఒకేసారి 51 మందికి తన ద్వారా టైఫాయిడ్‌ను వ్యాప్తిచేసింది. అందులో ముగ్గురు మరణించారు. అలా ఆమె వ్యాప్తి చేసిన టైఫాయిడ్‌కు ఆమె పేరిట ‘మేరీ టైఫాయిడ్’ అని పేరు రావడం ద్వారా కొంత అపకీర్తిని మూటగట్టుకుంది పాపం మేరీ మెలాన్. నివారణ ∙చేతులు కడుక్కునే అలవాటు లేనివారిలో ఇది ఎక్కువగా రావడం కనిపిస్తుంది. అందుకే తినేముందు లేదా తాగే ముందర చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. ఇక మల విసర్జన తర్వాత తప్పనిసరిగా సబ్బుతో చేతులు కడుక్కోవాలి. ∙నీటిని వడపోసి కాచి చల్లార్చి తాగడం మంచిది. ∙నేరుగా పట్టే నీటితో వేడి చేయకుండా తయారు చేసుకునే పదార్థాలతో టైఫాయిడ్ వ్యాపించే అవకాశాలు ఎక్కువ. అందుకే పానీపూరీ వంటి బయటి ఆహారాలకు ఎప్పుడూ దూరంగా ఉండాలి. ∙అన్నం, కూరలు వేడివేడిగా ఉండగానే తినెయ్యాలి. ఒకవేళ బయటి పదార్థాలు తినాల్సి వస్తే చల్లారిపోయాక అస్సలు తినకూడదు. అలాగే ఈగలు వాలడంతో కలుషితమయ్యే ఆహారాల వల్ల కూడా టైఫాయిడ్ వచ్చే అవకాశాలు ఎక్కువ. మలం మీద వాలిన ఈగలు మళ్లీ ఆహారపదార్థాల మీద వాలడం వల్ల ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది. అందుకే ఈగలు ముసిరే ఆహారాలు, బయటి పదార్థాలను తినకపోవడం మేలు. అలాగే కలుషిత జలాలతో తయారు చేసే ఐస్‌తో కూడా ఇది వ్యాపించే అవకాశం ఉన్నందున అది కూడా వాడకపోవడం చాలా మంచిది. -
విషజ్వరాలతో విలవిల!
సాక్షి, నెట్వర్క్: రాష్ట్రాన్ని వైరల్ జ్వరాలు వణికిస్తున్నాయి. మలేరియా, డెంగీ, టైఫాయిడ్ వంటి వాటితో ఒక్క సెప్టెంబరు నెలలోనే 1,853 మంది మృత్యువాత పడ్డారంటే రాష్ట్రంలో జ్వరాల తీవ్రత ఎంత ఎక్కువగా ఉందో తెలుస్తోంది. సగటున రోజుకు 62మంది మరణిస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు అనే తేడా లేకుండా అన్ని జిల్లాల్లోని ఆస్పత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. వ్యాధుల తీవ్రత ఈ స్థాయిలో ఉన్నా ప్రభుత్వం మాత్రం విష జ్వరాలు లేనేలేవంటోంది. సాధారణ జ్వరాలు మాత్రమే ఉన్నాయని.. మరణించిన వారు కూడా ఇతర కారణాలతో చనిపోయిన వారేనని బుకాయిస్తోంది. ఓ వైపు వేధిస్తున్న వ్యాధులు.. మరోవైపు సర్కార్ నిర్లక్ష్యం వెరసి.. పేద రోగులకు ప్రాణసంకటంగా మారుతోంది. పరీక్షలు చేయించుకుని, మందుబిళ్లలు తెచ్చుకుని ఉపశమనం పొందుదామని ప్రభుత్వాస్పత్రులకు వెళ్తున్న రోగులకు నిరాశే ఎదురవుతోంది. వైద్యులు ఎప్పుడొస్తారో, మందుబిళ్లలు దొరుకుతాయో లేదో తెలియక కొట్టుమిట్టాడుతున్నారు. ఇక కొన్ని కార్పొరేట్ ఆస్పత్రుల తీరయితే సరేసరి. వచ్చిన వారిని బెంబేలెత్తిస్తూ జేబులు గుల్లచేసి వదిలిపెడుతున్నారు. సమన్వయలోపం.. బాధితులకు శాపం వాతావరణ మార్పులు, ఇటీవల కురిసిన భారీ వర్షాలు.. అధ్వాన్న పారిశుధ్యంతో రాష్ట్రవ్యాప్తంగా ఈ కేసులు భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి. ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు అన్ని జిల్లాల్లో ఇవే పరిస్థితులు నెలకొన్నాయి. జ్వరాల నివారణ ఆరోగ్య శాఖదేనని.. కాదు, స్థానిక యంత్రాంగం పారిశుధ్యాన్ని మెరుగుపర్చుకోకపోవడం వల్లే ఇదంతానని ఎవరికి వారు బాధ్యతల నుంచి తప్పుకునేలా వ్యవహరిస్తుండడంతో శాఖల మధ్య సమన్వయలోపం బాధితులకు శాపంలా మారింది. గుంటూరు, కృష్ణా, తూర్పుగోదావరి, విశాఖ, కర్నూలు జిల్లాల్లోని ప్రభుత్వాస్పత్రుల్లో మృతుల సంఖ్య ఎక్కువగా ఉంది. ఆ తర్వాత స్థానాల్లో చిత్తూరు, అనంతపురం, నెల్లూరు జిల్లాలున్నాయి. కాగితాలపైనే ‘దోమల దండయాత్ర’ దోమలపై దండయాత్ర అంటూ ప్రగల్భాలు పలికిన సర్కారు.. ఆచరణలో మాత్రం చతికిల పడింది. అన్ని శాఖలను సమన్వయపరుస్తూ దోమలపై దండయాత్ర సాగించడానికి చట్టాన్ని తీసుకొస్తామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడా ఊసే ఎత్తడంలేదు. ఇందుకోసం అప్పట్లో మంత్రివర్గ ఉపసంఘాన్ని సైతం ఏర్పాటుచేసింది. ఆ తర్వాత వర్షాకాలం వచ్చేసింది. గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో అపరిశుభ్ర వాతావరణం రాజ్యమేలుతోంది. అయినా ‘దండయాత్ర’ అతీగతీ లేకుండాపోయింది. జిల్లాల్లో పరిస్థితి ఘోరం ♦ శ్రీకాకుళం జిల్లాలో మలేరియా, డెంగీ కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. ఎక్కువ శాతం ఏజెన్సీ, గ్రామీణ ప్రాంతాల వారే విషజ్వరాల బారినపడ్డారు. ప్లేట్లెట్స్ తగ్గుముఖం పడుతున్నాయని, డెంగీ లక్షణాలు కనిపిస్తున్నాయని.. ఇదొక కొత్తరకం వైరస్ అని, ఇదేమిటో అంతుచిక్కడంలేదని వైద్యులు చెబుతున్నారు. గత నెలలో ఒక్క శ్రీకాకుళం రిమ్స్‌లోనే 51మంది బలయ్యారు. ♦ విజయనగరం జిల్లాలో ఈ ఏడాది ఒక్క సెప్టెంబర్ నెలలోనే వైద్య ఆరోగ్యశాఖ లెక్కల ప్రకారం విజయనగరం ప్రభుత్వాస్పత్రిలోనే 41మంది మరణించారు. ఇక జిల్లా వ్యాప్తంగా 35 మంది వరకు డెంగీతో చనిపోయారు. విషజ్వరాలతో అనేకమంది మరణించారు. వీరిలో గ్రామీణ ప్రాంత ప్రజలే అధికం. ఇంకా 5 వేల మంది వరకు జ్వరాలతో బాధపడుతూ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. ♦ విశాఖలో మురికివాడల్లో నివసిస్తున్న వారికి విష జ్వరాలు ఎక్కువగా సోకుతున్నాయి. ఇక్కడ కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న వారిలో అత్యధికులు గ్రామీణులే. నర్సీపట్నం, కోటవురట్ల, సబ్బవరం, చోడవరం, అనకాపల్లి, ఎస్‌కోట, లక్కవరం తదితర గ్రామాలకు చెందిన వారు ఉన్నారు. కేజీహెచ్ పీడియాట్రిక్స్ విభాగంలో మంగళవారం నాటికి 20 మంది చిన్నారులు జ్వరంతో చికిత్స పొందుతున్నారు. ఒక్క కేజీహెచ్‌లోనే ప్రభుత్వ రికార్డుల ప్రకారం 224 మంది చనిపోయారు. అంతేకాక.. జిల్లావ్యాప్తంగా వివిధ ఆస్పత్రుల్లో వందలాది మంది విషజ్వరాలతో బాధపడుతున్నారు. కోస్తాను కుదిపేస్తున్న డెంగీ, మలేరియా ♦ తూర్పుగోదావరి జిల్లాను గత నెల రోజులుగా డెంగీ వ్యాధి కుదిపేస్తోంది. దీనిబారిన పడినవారు ఆర్థికంగా కుదేలైపోతున్నారు. పేద, మధ్యతరగతి ప్రజలైతే ఖరీదైన వైద్యం చేయించుకోలేక మృత్యువాత పడుతున్నారు. వైద్యాధికారులు మాత్రం మరణాలేవీ లేవంటున్నారు. మరోవైపు.. జిల్లాను కలవరపెడుతున్న డెంగీ జ్వరాలను అధికార యంత్రాంగం అదుపు చేయలేకపోతోంది. అధికారికంగా 302 కేసులే నమోదైనా అనధికారికంగా రోగుల సంఖ్య పది వేలకుపైనే ఉంటుందని అంచనా. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు డెంగీ రోగులతో కిటకిటలాడుతున్నాయి. కాకినాడ జీజీహెచ్, రాజమండ్రి ప్రభుత్వాస్పత్రిలో ఒక్క సెప్టెంబరు నెలలోనే 360మంది మరణించడం పరిస్థితి తీవ్రతకు అద్దంపడుతోంది. ♦ పశ్చిమ గోదావరి జిల్లా కూడా విషజ్వరాల బారిన పడి మంచమెక్కింది. ఇక్కడ కూడా డెంగీ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. వైద్య అధికారులు, ప్రభుత్వం డెంగీ మరణాలు లేవని చూపించేందుకు ప్రయత్నిస్తోంది. గత మూడు నెలల్లో ఏలూరు ప్రభుత్వాస్పత్రికి 47 మంది డెంగీ రోగులు వచ్చారు. అనధికారికంగా జిల్లాలో డెంగీ మరణాలు సంభవించిన దాఖలాలు ఉన్నా.. అధికారులు వాటిని సాధారణ మరణాలుగా చూపిస్తున్నారు. వరదలు వచ్చి తగ్గడంతో ఏజెన్సీతోపాటు వరద పీడిత ప్రాంతాల్లో వైరల్ జ్వరాలు విజృంభిస్తున్నాయి. తాజాగా జిల్లాలో మలేరియా, డెంగీ కేసుల్లో అధిక శాతం ఏజెన్సీతోపాటు డెల్టా ప్రాంతాల్లో కూడా నమోదవుతున్నాయి. ఒక్క సెప్టెంబరు నెలలోనే ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో 56మంది మృత్యువాతపడ్డారు. ♦ కృష్ణా జిల్లాలో గ్రామీణ, పట్టణ ప్రాంతాలన్న భేదం లేకుండా డెంగీ, టైఫాయిడ్, మలేరియా విజృంభిస్తున్నాయి. అధికారిక లెక్కల ప్రకారం.. గత ఐదు నెలల్లో మలేరియా, డెంగీ, టైఫాయిడ్ లక్షణాలతో జిల్లా వ్యాప్తంగా 1,485 కేసులు నిర్ధారణకు వచ్చాయి. అయితే, అనధికారికంగా ఈ సంఖ్య ఇక వేల సంఖ్యలో ఉంటుందని చెబుతున్నారు. ఈ జిల్లాలోని విజయవాడ, మచిలీపట్నం ప్రభుత్వాస్పత్రుల్లో ఒక సెప్టెంబరులోనే మొత్తం 263మంది మృత్యువాత పడ్డారు. ♦ గుంటూరు జిల్లాలోని ఈమని, చుండూరు, ఫిరంగిపురం, కొల్లూరు, గణపవరం, ఫిరంగిపురం, మాచర్ల, మందపాడు, నరసరావుపేట, పెదపలకలూరు, నూతక్కి, సంగం జాగర్లమూడి, నూజెండ్ల, పెదవడ్లపూడి, తుళ్లూరు, తాడేపల్లి, గుంటూరు నగరంలో జ్వరాలు ఎక్కువగా నమోదవుతున్నాయి. రాష్ట్రంలోనే అత్యధికంగా గుంటూరు జీజీహెచ్‌లో ఒక్క సెప్టెంబరులో మొత్తం 293 మరణాలు సంభవించాయి. ♦ ప్రకాశం జిల్లాలోనూ డెంగీ, మలేరియా విజృంభిస్తున్నాయి. అయితే, అధికారులు మాత్రం వీటిని ఒప్పుకోవడం లేదు. సాధారణ జ్వరాలేనని చెబుతున్నప్పటికీ ఒక్క ఒంగోలు ప్రభుత్వాస్పత్రిలో 56మంది విషజ్వరాలకు బలయ్యారు. ♦ శ్రీపొట్టిశ్రీ రాములు నెల్లూరు జిల్లాలోనూ అనేకమంది డెంగీ, మలేరియా బారిన పడ్డారు. నెల్లూరు జీజీహెచ్‌లోనే సెప్టెంబరులో 88మంది మరణించారు. రాయలసీమలో జ్వరాలు, ఎండల తీవ్రత ఎక్కువే ♦ వైఎస్సార్ జిల్లాలో దోమల తీవ్రత, ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. దీంతో ఇప్పటివరకు 167 మలేరియా కేసులు, 12 డెంగీ కేసులు, 2552 టైఫాయిడ్ కేసులు నమోదయ్యాయి. జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. వర్షం జాడలేకపోవడంతో ఉష్ణోగత్రలు వేసవిని తలపిస్తున్నాయి. కడప రిమ్స్‌లో సెప్టెంబరు ఒక్క నెలలోనే 77మంది విష జ్వరాలకు బలయ్యారు. ♦ అనంతపురం జిల్లానూ మలేరియా వణికిస్తోంది. జ్వరాల బారినపడుతున్న వారిలో గ్రామీణులే అధికం. జిల్లాలోని 87 పీహెచ్‌సీలకు రోజూ దాదాపు 60 వేల మంది రోగులు వైద్యం కోసం వస్తుంటారు. వీరిలో 30 శాతం మంది జ్వరాలతో ఇబ్బంది పడుతున్నారు. అనంతపురం సర్వజనాస్పత్రికి రోజూ 2 వేల మంది రోగులు వస్తున్నారు. వీరిలో ఎక్కువమంది జ్వరపీడితులే. గత నెల అనంతపురంలోని జీజీహెచ్‌లో మొత్తం 98మంది జ్వరాల కారణంగా మరణించారు. ♦ కర్నూలు జిల్లాలోనూ మలేరియా కేసులు అధికంగానే నమోదయ్యాయి. నంద్యాల, కర్నూలు, ఆదోనిల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉంది. 146 అనుమానిత డెంగీ కేసులు నమోదయ్యాయి. అలాగే, ఒక్క కర్నూలు జీజీహెచ్‌లోనే సెప్టెంబరులో 147 మరణాలు సంభవించాయి. ♦ తిరుపతి రుయా ఆస్పత్రిలో 99మంది మృత్యువాత పడ్డారు. గత నెల రాష్ట్రంలోని ప్రధాన ఆస్పత్రుల్లో మృతి చెందిన వారి వివరాలు.. ఆస్పత్రి మృతుల సంఖ్య జీజీహెచ్, గుంటూరు 293 జీజీహెచ్, కాకినాడ 277 కేజీహెచ్, విశాఖపట్నం 224 జీజీహెచ్, విజయవాడ 210 జీజీహెచ్, కర్నూలు 147 రుయా, తిరుపతి 99 జీజీహెచ్, అనంతపురం 98 జీజీహెచ్, నెల్లూరు 88 డీహెచ్, రాజమండ్రి 83 రిమ్స్, కడప 77 డీహెచ్, ఏలూరు 56 రిమ్స్, ఒంగోలు 56 డీహెచ్, మచిలీపట్నం 53 రిమ్స్, శ్రీకాకుళం 51 డీహెచ్, విజయనగరం 41 -
కేరళకు మరో ముప్పు పొంచి ఉందా?
న్యూఢిల్లీ: భారీ వర్షాలు, వరదలకు అతలాకుతలం అవుతున్న కేరళకు మరో ముప్పు పొంచిఉందా? వరద తాకిడి క్రమంగా తగ్గుతున్న నేపథ్యంలో అక్కడ అంటువ్యాధులు విజృంభించే అవకాశం ఉందా? అంటే వైద్య నిపుణులు అవుననే జవాబిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఆసుపత్రుల్లో ఉన్న మందులు నీళ్లలో కొట్టుకుపోయిన నేపథ్యంలో అంటువ్యాధులు ప్రబలితే నిలువరించడం చాలా కష్టమవుతుందని హెచ్చరిస్తున్నారు. సరైన జాగ్రత్తలు తీసుకోకుంటే కలరా, డయేరియా, టైఫాయిడ్ వంటి వ్యాధులు ప్రబలి తీవ్ర నష్టం చేకూర్చే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. కేరళ ప్రజలు ఇప్పటికే చికున్‌గన్యా, డెంగ్యూ వాధులతో అల్లాడుతున్న విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. కాగా తమ రాష్ట్రానికి అత్యవసర మందుల్ని అందించి ఆదుకోవాలని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖకు, ప్రైవేటు ఆసుపత్రులకు కేరళ లేఖ రాసింది. జ్వరం, డయేరియా మందులు పంపండి కేరళలోని 481 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 137 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, 19 డిస్పెన్సరీల్లో మందులు నిండుకున్నాయని ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ అదనపు ముఖ్య కార్యదర్శి సదానందన్ కేంద్రానికి రాసిన లేఖలో పేర్కొన్నారు. వీలైనంత త్వరగా జ్వరం, దగ్గు, జలుబు, డయేరియా, హైపర్‌టెన్షన్ వంటి రోగాలకు అవసరమైన మందుల్ని అందించాలని కేంద్ర ఆరోగ్య శాఖ, ప్రైవేటు ఆసుపత్రులకు విజ్ఞప్తి చేశారు. కేరళ ప్రభుత్వ విజ్ఞప్తిపై కేంద్రం వెంటనే స్పందించింది. విజయన్ ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు కేరళకు కావాల్సిన అన్నిరకాల మందుల్ని వైమానిక మార్గం ద్వారా పంపిస్తున్నామని కేంద్ర ఆరోగ్యశాఖ అదనపు కార్యదర్శి మనోజ్ ఝలానీ తెలిపారు. అలాగే ప్రజలకు సాయం అందించేందుకు వైద్య బృందాలు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. మరోవైపు కేరళ ప్రభుత్వం పిలుపు మేరకు మెడిట్రినా ఆసుపత్రి సాయం చేసేందుకు ముందుకొచ్చింది. ప్రస్తుతం వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏర్పాటుచేసిన మెడికల్ క్యాంపులకు తమ వైద్యులను, మందులతో పంపుతున్నట్లు మెడిట్రినా గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ సీఈవో పీఎన్ మంజు తెలిపారు. ప్రైవేటు ఆసుపత్రులకు క్యూ.. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వరదల కారణంగా మందులు దెబ్బతినడంతో వైద్యులు రోగులకు ప్రైవేటు ఆస్పత్రులకు సిఫార్సు చేస్తున్నారు. దీంతో చాలా ప్రైవేటు ఆస్పత్రుల్లో భారీ క్యూలు దర్శనమిస్తున్నాయి. కొచ్చిలోని అమృత ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఏఐఎంఎస్) ఔట్ పేషంట్ సేవల్ని నిలిపివేస్తున్నట్లు ఆదివారం ప్రకటించింది. ఈ విషయమై అమృత ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ సంజీవ్ సింగ్ మాట్లాడుతూ..‘వైద్యులు, ఇతర సిబ్బంది ఆసుపత్రికి రాలేకపోతున్నారు. మా ఆసుపత్రి గ్రౌండ్ ఫ్లోర్ వరదనీటితో నిండిపోయింది. ఇప్పుడు ఆసుపత్రిలో 900 మంది రోగులు చికిత్స పొందుతుండగా, వీరిలో 150 మంది ఐసీయూలో ఉన్నారు. ఆసుపత్రిలో విద్యుత్, మంచినీటి సరఫరాను కొనసాగించేందుకు మేమంతా పోరాడుతున్నాం. అదనంగా మరో 300 మందిని ఆసుపత్రిలో చేర్చుకుని చికిత్స అందజేస్తున్నాం. వీరిలో 15 మంది పరిస్థితి విషమంగా ఉంది’ అని తెలిపారు. -
టైఫాయిడ్‌కు సరికొత్త వ్యాక్సిన్!
సాక్షి, హైదరాబాద్: టైఫాయిడ్ నుంచి ఏళ్లపాటు రక్షణ కల్పించే సరికొత్త వ్యాక్సిన్‌ను హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న భారత్ బయోటెక్ అభివృద్ధి చేసింది. సంప్రదాయ యాంటీబయాటిక్ మందులకు లొంగని టైఫాయిడ్‌ను కూడా నయం చేయగల ఈ మందు త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి రానుందని భారత్ బయోటెక్ సంస్థ చైర్మన్, ఎండీ డాక్టర్ కృష్ణ ఎల్లా తెలిపారు. అవకాశాలు కల్పిస్తే భారత్ ఎవరికీ తీసిపోదనేందుకు పూర్తిగా దేశీయ సాంకేతికతతో తయారైన ‘టైఫ్‌బార్–టీసీవీ’నిదర్శనమని పేర్కొన్నారు. తాజాగా అందరికీ పంపిణీ చేసేందుకు ఈ వ్యాక్సిన్ ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి అర్హత సాధించింది. ఈ సందర్భంగా బుధవారం వ్యాక్సిన్ వివరాలను కృష్ణ ఎల్లా వివరించారు. వివరాలు ఆయన మాటల్లోనే.. అంత సామాన్యమైనది కాదు.. టైఫాయిడ్ అంటే ఒకట్రెండు ఇంజెక్షన్లు వేసుకుని నాలుగు మాత్రలు వాడితే తగ్గిపోయే వ్యాధి అన్నది చాలామందిలో ఉన్న అభిప్రాయం. అయితే వాస్తవ పరిస్థితులు అలా లేవు. కలుషిత ఆహారం, తాగునీటిలోని సాల్మొనెల్లా టైఫీ బ్యాక్టీరియా ద్వారా ఈ వ్యాధి వస్తుంది. జ్వరం, తలనొప్పి, అతిసారం వంటి లక్షణాలుండే టైఫాయిడ్ సోకితే మూడు రోజుల నుంచి 25 రోజుల పాటు ఉంటుంది. వ్యాధి చికిత్సకు ప్రస్తుతం మూడు రకాల యాంటీబయాటిక్స్ వాడుతున్నారు. ఎస్.టైఫీ బ్యాక్టీరియా ఈ మూడింటితో పాటు కొత్తగా అభివృద్ధి చేసిన నాలుగో తరం యాంటీబయాటిక్ మందుకూ నిరోధకత పెంచుకున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. అంతర్జాతీయ సంస్థల లెక్కల ప్రకారం టైఫాయిడ్ కారణంగా 2016లో దాదాపు 1.3 లక్షల మంది మరణించారంటే పరిస్థితి తీవ్రత ఏమిటో అర్థం చేసుకోవచ్చు. భారత్ బయోటెక్ 2001లోనే సరికొత్త వ్యాక్సిన్ తయారీకి ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఐదేళ్ల తర్వాత ప్రపంచంలోనే మొదటి కాంజుగేట్ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసింది. అన్ని రకాల పరీక్షలు నిర్వహించి వ్యాక్సిన్ పనితీరు, సమర్థతను పూర్తిస్థాయిలో అంచనా వేసింది. పిల్లలు, పెద్దలను కలిపి దాదాపు 15 వేల మందిపై ఈ వ్యాక్సిన్‌ను ప్రయోగించి మెరుగైన ఫలితాలు సాధించాం. సొంతడబ్బుతో పరిశోధనలు.. టైఫ్‌బార్–టీసీవీ వ్యాక్సిన్ అభివృద్ధికి భారత్ బయోటెక్ సొంత డబ్బుతో పరిశోధనలు చేసిందని.. మొత్తం తాము రూ.150 కోట్ల వరకు ఖర్చు చేశామని కృష్ణ తెలిపారు. 6 నెలల పిల్లల నుంచి పెద్దల వరకు ఎవరైనా ఈ వ్యాక్సిన్ వాడొచ్చని.. దాదాపు 25 మైక్రోగ్రాముల డోసుతో టైఫాయిడ్‌కు దూరం కావొచ్చని చెప్పారు. ప్రస్తుతం ఒక్కో డోసుకు రూ.1,500 వరకు ఖర్చు అవుతుందని.. వాడకం పెరిగిన కొద్దీ ధరలు తగ్గుతాయని పేర్కొన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థకు సలహాలిచ్చే నిపుణుల బృందం కూడా ఈ వ్యాక్సిన్‌ను ప్రపంచ వ్యాప్తంగా పంపిణీ చేయాల్సిందిగా సూచించిందని వివరించారు. జనాభా మొత్తానికి వేర్వేరు వ్యాధుల నుంచి టీకాల ద్వారా రక్షణ కల్పించేందుకు ఉద్దేశించిన ‘గావీ’సంస్థ వచ్చే ఏడాది దాదాపు 8.5 కోట్ల డాలర్లతో టైఫాయిడ్ వ్యాక్సిన్‌ను పంపిణీ చేసేందుకు భారత్ బయోటెక్ యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్, టైఫాయిడ్ వ్యాక్సిన్ కన్సార్షియం, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, పాథ్, గేట్స్ ఫౌండేషన్ల భాగస్వామ్యంతో నేపాల్, మలావీ, బంగ్లాదేశ్‌లలో ఈ వ్యాక్సిన్‌పై మరిన్ని పరీక్షలు చేసేందుకు ప్రయత్నిస్తోందని వివరించారు. -
జల..'భద్రం'
బాత్రూమ్లో షవర్ ఆన్ చేసుకుందామంటే అలాంటి బాత్రూములు మనకెక్కడుంటాయ్? పోనీ... అలాంటి బాత్రూములు సంపాదించామే అనుకోండి! ట్యాంకులో నీళ్లెక్కడుంటాయ్? ఏ షవర్నైనా మైమరపించే మాన్సూన్ షవర్ వస్తుంటే జరభద్రం... కొంచెం జాగ్రత్త... అంటూ ఈ విసుర్లేంటి? ఇప్పటి వానలు... ఒకప్పటి వానల్లా కాదు. సేదదీర్చే వర్షంతో పాటు కుట్టే, కొరికే, అంటించే జబ్బులు వస్తాయి. అదిగో వాన వస్తోంది... ఇదిగో దోమ, ఈగ, ఎలుక వచ్చేశాయి. జర భద్రం... జల భద్రం! నీరు కలుషితం కావడం వల్ల ఈ సీజన్లో నీరు కలుషితం కావడం వల టైఫాయిడ్, కలరా, షిజెల్లోసిస్, ఈ–కొలై వంటి వ్యాధులు ప్రధానంగా వస్తుంటాయి. ఇలా నీరు కలుషితం కావడం వల్ల కనిపించే కొన్ని ప్రధాన వ్యాధులు... టైఫాయిడ్ సాల్మొనెల్లా టైఫీ అనే బ్యాక్టీరియా వల్ల ఈ వ్యాధి వస్తుంది. జ్వరం, తలనొప్పి, ఒళ్లు నొప్పులు, కడుపునొప్పి, వాంతులు, విరేచనాలు వంటి లక్షణాలు ఈ వ్యాధిలో ఎక్కువగా కనిపిస్తుంటాయి. బ్లడ్ కల్చర్, స్టూల్ కల్చర్, వైడాల్ టెస్ట్ వంటి పరీక్షలతో ఈ వ్యాధిని నిర్ధారణ చేయవచ్చు. సకాలంలో వైద్య చికిత్స అందించడం వల్ల దీనికి చికిత్స చేయవచ్చు. అయితే సరైన చికిత్స తీసుకోకపోతే ఈ సమస్య వల్ల పేగుల్లో పుండ్లు పడటం, సెప్టిసీమియా (ఒంటిలోని రక్తానికి ఇన్ఫెక్షన్ రావడం) వంటి కాంప్లికేషన్లకు దారితీయవచ్చు. కలరా ఇది విబ్రియో కలరా అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది. ఇందులో నీళ్ల విరేచనాలు, వాంతుల వల్ల డీహైడ్రేషన్ వస్తుంది. దాంతో బీపీ పడిపోవడం జరుగుతుంది. బియ్యం కడిగిన నీళ్లలా విరేచనం కావడం ఈ వ్యాధి ప్రధాన లక్షణం. ప్రత్యేకమైన ఈ లక్షణాన్ని రైస్ వాటర్ స్టూల్స్ అని కూడా వ్యవహరిస్తుంటారు. ఈ వ్యాధికి సకాలంలో వైద్యం అందకపోతే కిడ్నీలు పాడైపోయి, ప్రాణాంతకంగా కూడా పరిణమించవచ్చు. స్టూల్ కల్చర్, డార్క్ ఫీల్డ్ మైక్రోస్కోపీ వంటి పరీక్షలతో ఈ రోగనిర్ధారణ చేస్తారు. షిజెల్లోసిస్ జ్వరం, రక్త విరేచనాలు, వాంతులు, కడుపునొప్పి, ఈ వ్యాధి లక్షణాలు. పేగుల్లో ఇన్ఫెక్షన్ వచ్చే ‘టాక్సిక్ మెగా కోలన్’ అనే కాంప్లికేషన్‌తో పాటు రక్తంలో యూరియా పాళ్లు ఉండాల్సిన దానికంటే ఎక్కువగా పెరిగి, రక్తం కలుషితమయ్యే ‘కీటోలైటిక్ యురేమియా’ వంటి దుష్ప్రభావాలూ కనిపించవచ్చు. ఇలా జరిగినప్పుడు ఆ పరిస్థితి ప్రాణాంతకమయ్యే అవకాశమూ లేకపోలేదు. ఈ–కొలై నీళ్ల విరేచనాలకు దారితీసే ఈ కండిషన్‌కు ‘ఈ–కొలై’ అనే బ్యాక్టీరియా కారణమవుతుంది. ఇది పేగులతో పాటు కిడ్నీలు, ఊపిరితిత్తులు, మెదడు, చర్మం లాంటి భాగాల్లోనూ ఇన్ఫెక్షన్ కలిగించవచ్చు. రక్తం, మూత్ర కల్చర్ పరీక్షల ద్వారా ఈ వ్యాధి నిర్ధారణ చేయవచ్చు. వర్షాకాలం వ్యాధుల నివారణ ⇒ఈ సీజన్‌లోని దాదాపు అన్ని వ్యాధులకు కారణం కలుషితమైన నీరే. కాబట్టి నీటిని కాచి చల్లార్చి తాగడం అన్నిటికంటే ప్రధానం. ⇒కుండల్లో/బిందెల్లో ఎక్కువ రోజులు నిల్వ పెట్టుకోకండి. అలా నిల్వ ఉన్న నీరు తాగకండి. ⇒మరీ వీలుకానప్పుడు మినహా ఈ సీజన్లో బయట వండిన ఆహార పదార్థాలు తినకపోవడమే మేలు. ⇒తాజాగా వండుకున్న తర్వాత వేడిగా ఉండగానే తినండి. చల్లారిన ఆహారాన్ని మాటి మాటికీ వేడి చేసి తినవద్దు. ⇒మాంసాహారం కంటే శాకాహారానికి ప్రాధాన్యం ఇవ్వాలి. అయితే ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే... మాంసాహారం వల్ల వ్యాధులు వ్యాప్తిచెందవు. అయితే వ్యాధిని వ్యాప్తి చేసే ఈగల వంటి కీటకాలు ముసరడానికి మాంసం కారణమవుతుంది. శాకాహారంతో పోలిస్తే మాంసాహారం వల్లనే ఈ అవకాశం ఎక్కువ. ఇక మాంసాహార ప్రియులు గుర్తుపెట్టుకోవాల్సిందేమిటంటే... ఈ సీజన్లో మాంసాహారాన్ని సరిగ్గా ప్రాసెస్ చేయడం, పూర్తిగా ఉడికించడం. ⇒పరిసరాల పరిశుభ్రత పాటించాలి. నీళ్ల నిల్వకు అవకాశం ఇచ్చే, పాత టైర్లు, ఖాళీ కొబ్బరి చిప్పల వంటివి దోవుల పెరుగుదలకు ఉపకరిస్తాయి. నీటి నిల్వకు అవకాశం ఇచ్చే చిన్న చిన్న నీటి గుంటలు, పైపెచ్చులు ఊడిపోయిన సన్‌షేడ్‌కు పైన ఉండే ప్రదేశాల్లో దోమలు గుడ్లు పెట్టి బ్రీడింగ్ చేస్తాయి. కాబట్టి మీ ఇంటి వద్ద దోమలను వృద్ధి చేసే పరిస్థితులన్నింటినీ నివారించండి. దోమ తెరలు వాడటం మేలు. ⇒ఈ సీజన్లో దోవులతో వచ్చే వ్యాధుల నుంచి కాపాడుకోడానికి శరీరవుంతా కప్పే దుస్తులు వేసుకోవాలి. ⇒ఇంటి కిటికీలకు మెష్‌లు ఉపయోగించడం మేలు. కిటికీలకు మెష్‌లు ఉపయోగించడం కాస్త శ్రమతోనూ, ఖర్చుతోనూ కూడిన వ్యవహారమే. అయితే కిటికీలకు అంటించడానికి సంసిద్ధంగా ఉండే వెల్క్రో వంటి ప్లాస్టిక్ మెష్‌లు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. ⇒వేప ఆకులతో పొగవేయడం, మస్కిటో రిపల్లెంట్ ఉపయోగించడం వల్ల దోమలు దూరమవుతాయి. అయితే కొంతమందికి పొగ, మస్కిటో రిపల్లెంట్స్లోని ఘాటైన వాసనల వల్ల అలర్జీ ఉంటుంది. కుటుంబ సభుల్లో ఇలాంటి అలర్జీ ఉంటే జాగ్రత్తగా ఉండాలి. ⇒ఇంట్లో చెత్త వేసుకునే కుండీలను ఎప్పటికప్పుడు ఖాళీ చేయాలి. వీధిలో ఉండే కుండీలను సైతం సిబ్బంది తరచూ శుభ్రం చేసేలా జాగ్రత్త వహించాలి. త్వరగా కుళ్లేందుకు అవకాశం ఉన్న పదార్థాలను వెంటవెంటనే శుభ్రం చేసుకుంటూ ఉండాలి. ⇒వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి. వుల, వుూత్ర విసర్జనకు వుుందు, తర్వాత చేతులు శుభ్రంగా సబ్బుతో లేదా బూడిదతో కడుక్కోవాలి. ⇒కొందరు నేల మీది వుట్టితో పాత్రలు శుభ్రం చేస్తారు. అలా ఎప్పుడూ చేయవద్దు. పాత్రలు శుభ్రం చేయడానికి సబ్బు లేదా డిష్‌వాషింగ్ డిటర్జెంట్స్ వూత్రమే వాడాలి. ⇒అప్పటికే ఏవైనా ఇన్ఫెక్షన్లతో బాధపడేవారు... వానలో అతిగా తడిస్తే నిమోనియా వంటి సెకండరీ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశాలు ఎక్కువ. ఇలాంటి వారు సాధ్యమైనంత వరకు తల తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ⇒చేతులను ఎప్పటికప్పుడు హ్యాండ్‌వాష్‌తో గానీ, సబ్బుతోగాని కడుక్కోని శుభ్రంగా ఉంచుకోవాలి. పైన పేర్కొన్న జాగ్రత్తలతో వర్షాకాలంలో వచ్చే చాలా రకాల జబ్బులను నివారించుకోవచ్చు. ఈగలతో వచ్చే వ్యాధులు వర్షాల సీజన్ మొదలుకాగానే ఈగలు మూగడం మొదలవుతుంది. ఈగల కారణంగా వచ్చే వ్యాధుల సంఖ్య దాదాపు వందకు పైగానే ఉంటాయి. ఇవి సాధారణంగా పరిశుభ్రత లేని పరిసరాల్లోనే ఎక్కువ. ఇవి కొన్ని మైళ్ల దూరం ప్రయాణం చేయగలవు. ఈగ లార్వాలతో వృద్ధి చెందే వ్యాధులను మైయాలిస్ అంటారు. సాధారణంగా ఒంటిపై ఉండే గాయాలు, పుండ్ల ద్వారా ఒకరి నుంచి మరొకరికి ఈగల ద్వారా వృద్ధి అయ్యే వ్యాధులు వ్యాప్తి చెందుతుంటాయి. ఈగ లార్వాలు కొన్ని కంటిలోకి కూడా ప్రవేశించి, రెటీనాకు సైతం హాని చేయవచ్చు. నీళ్ల విరేచనాలకు కారణం అయ్యే ఎంటమీబా హిస్టలిటికా, జియార్డియా లాంబ్లియా వంటి ప్రోటోజోవన్ పరాన్న జీవులనూ, ఆస్కారిస్ లుంబ్రికాయిడ్స్, ఎంటరోబియస్ వర్మికులారిస్ వంటి నులిపురుగులనూ, పోలియో, వైరల్ హెపటైటిస్ (హెపటైటిస్ ఏ అండ్ ఈ) వంటి వైరస్‌లనూ ఈగ వ్యాప్తి చేస్తుంది. ఈగల ద్వారా వ్యాప్తి చెందే వ్యాధుల్లో కొన్ని... అమీబియాసిస్ ప్రోటోజోవాకు చెందిన సూక్ష్మక్రిములివి. వీటి వల్ల ఆహారం కలుషితమైనప్పుడు తీవ్రమైన కడుపునొప్పి, మలంలో రక్తం పడటం, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తాయి. మలపరీక్ష, ఎలైసా వంటి వైద్యపరీక్షలతో ఈ వ్యాధిని సులభంగా గుర్తించవచ్చు. అమీబియాసిస్ వల్ల జీర్ణ వ్యవస్థలోని పేగులతో పాటు కాలేయం, ఊపిరితిత్తులు, మెదడు వంటి కీలకమైన అవయవాలు సైతం దెబ్బతినవచ్చు. ముఖ్యంగా కాలేయంలో చీముగడ్డలు (లివర్ యాబ్సెస్) కనిపించే అవకాశాలు ఉన్నాయి. కాలేయంలోని ఈ చీముగడ్డలను అల్ట్రాసౌండ్ స్కానింగ్ పరీక్ష ద్వారా సులభంగా గుర్తించవచ్చు. జియార్డియాసిస్ ఈ వ్యాధి జియార్డియా లాంబ్లియా అనే ప్రోటోజోవా రకానికి చెందిన సూక్ష్మక్రిముల వల్ల వస్తుంది. ఈ జీవులు చిన్నపేగుల్లో నివాసం ఏర్పరచుకొని ఈ వ్యాధిని కలగజేస్తాయి. ఈ వ్యాధి వచ్చినవారిలో వికారం, వాంతులు, కడుపునొప్పి, కడుపు ఉబ్బరం వంటి లక్షణాలు ఉంటాయి. ఈ సూక్ష్మజీవులు రక్తంలోకి విస్తరించినప్పుడు ఒంటిపై దురద రావడం, అలా దురద వచ్చిన ప్రాంతమంతా నల్లబారడం వంటి చర్మసంబంధమైన లక్షణాలూ కనిపిస్తాయి. ఈ వ్యాధి వచ్చిన వారిలో ఆహారాన్నంతా జియార్డియా జీవులే తీసుకోవడం వల్ల ఆహారం ఒంటికి పట్టదు. దోమలతో వచ్చే వ్యాధులు మలేరియా ఇది అనాఫిలస్ దోమతో వ్యాప్తి చెందుతుంది. ఈ దోమలో వృద్ధి చెందే ప్లాస్మోడియమ్ అనే ప్రోటోజోవా ఈ వ్యాధిని కలిగిస్తుంది. ప్లాస్మోడియమ్లో ఒక్కో రకం (స్పీïసీస్) వల్ల ఒక్కోరకం మలేరియా వస్తుంది. అయితే వీటిన్నింటిలోనూ సెరిబ్రల్ మలేరియా తీవ్రమైనదీ, ప్రాణాంతకమైనది. దీని వల్ల ఒక్కోసారి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది (అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్–ఏఆర్డీఎస్), స్పృహ తప్పిపడిపోవడం, అపస్మారక స్థితిలోకి వెళ్లడం, మూత్రపిండాలు విఫలం కావడం (రీనల్ ఫెయిల్యూర్) వంటివి రావచ్చు. చికన్ గున్యా ఈ వ్యాధి ఎడిస్ ఈజిపై్ట అనే దోమ వల్ల వ్యాప్తి చెందే ఒక రకం వైరస్ కారణంగా వస్తుంది. ఏడిస్ ఈజిపై్ట దోమ సాధారణంగా పగటి వేళల్లోనే ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఈ దోమ కాటు వల్ల జ్వరంతో పాటు విపరీతమైన తలనొప్పి, తీవ్రస్థాయిలో కీళ్లనొప్పులు వస్తాయి. ఆ కీళ్లనొప్పులు కూడా సాధారణం కంటే చాలా ఎక్కువగా భరించలేనంతగా ఉంటాయి. డెంగ్యూ ఈ వ్యాధికి కూడా ఏడిస్ ఈజిపై్ట దోమలే కారణం. జ్వరం, తీవ్రమైన తలనొప్పితో పాటు ఎముకలు విరిచేసినంత తీవ్రమైన నొప్పి వస్తుంది. అందుకే దీన్ని ‘బ్రేక్ బోన్ ఫీవర్’ అని కూడా అంటారు. మామూలుగా వచ్చే డెంగ్యూవ్యాధిని క్లాసికల్ డెంగ్యూ అంటారు. ఈ వ్యాధిలోని మరో దశ అయిన డెంగ్యూ హేమరేజిక్ ఫీవర్‌లో అంతర్గత అవయవాల నుంచి రక్తస్రావం కూడా జరగవచ్చు. ఇలా జరిగినప్పుడు ఒక్కోసారి రోగి తీవ్రమైన షాక్‌కు గురికావచ్చు. దీన్ని ‘డెంగ్యూ షాక్ సిండ్రోమ్’ అంటారు. ఎలుకల వల్ల... వర్షాలకు బయటి ఎలుకలు ఇంట్లోకి రావడం వల్ల లెప్టో స్పైరోసిస్ అనే వ్యాధి వస్తుంది. ఎలుకలు వృద్ధి చేసే ఈ వ్యాధికి అసలు కారణం లెప్టోస్పైరోసిస్ అనే బ్యాక్టీరియా. ఎలుకల వల్ల ఆహారం కలుషితమైపోయి ఇది వ్యాప్తి చెందుతుంది. ఈ సీజన్లో నీళ్లలో నిత్యం తిరిగే వారికి ఈ వ్యాధి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. జ్వరం, తీవ్రమైన తలనొప్పి, కొన్నిసార్లు వాంతులు కావడం వంటి లక్షణాలు ఈ వ్యాధిలో ప్రధానంగా కనిపిస్తాయి. కొన్నిసార్లు కడుపునొప్పి, కళ్లు ఎర్రబారడం, కళ్లు పచ్చగా మారడం కూడా జరుగుతుంది. డా.ఎమ్. గోవర్థన్ సీనియర్ కన్సల్టెంట్ జనరల్ ఫిజీషియన్, కేర్ హాస్పిటల్స్, నాంపల్లి, హైదరాబాద్ -
మలేరియా, టైఫాయిడ్ తో విద్యార్థి మృతి
♦ హాస్టల్ అధికారుల నిర్లక్ష్యమే ♦ కారణమని గ్రామస్తుల మండిపాటు బషీరాబాద్: మలేరియా, టైఫాయిడ్‌తో గురువారం ఓ విద్యార్థి మృతిచెందాడు. మృతుడి కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. బషీరాబాద్ మండల పరిధిలోని నీళ్లపల్లికి చెందిన నర్సమ్మ, కిష్టప్ప దంపతులకు ఇద్దరు కూతుళ్లు, కుమారుడు బ్రహ్మానందం(15) ఉన్నా డు. బాల్యంలోనే అతడి తండ్రి చనిపోయాడు. నర్సమ్మ పిల్లలను పోషించుకుంటోంది. బాలుడు బషీరాబాద్‌లోని ఎస్సీ బాలుర వసతి గృహంలో ఉంటూ 10వ తరగతి చదువుతున్నాడు. వేసవి సెలవులు ముగియడంతో ఈనెల 18న అతడు హాస్టల్‌కు వచ్చాడు. గతనెల 28 నుంచి ఆ బాలుడికి జ్వరం రావడంతో స్కూల్‌కు వెళ్లకుండా వసతిగృహంలోనే ఉన్నాడు. జ్వరం తీవ్రమవడంతో స్వగ్రామానికి వెళ్దామని భావించాడు. చేతిలో డబ్బులు లేకపోవడంతో బుధవారం నడుచుకుంటూ బయలుదేరాడు. మార్గమధ్యంలో నవల్గ గ్రామం వద్ద గ్రామస్తులు ఆ బాలుడిని గమనించి విషయం ఆరా తీశారు. బ్రహ్మానందంను హాస్టల్‌కు తీసుకెళ్లగా వార్డెన్ అందుబాటులో లేకపోవడంతో స్వగ్రామానికి తీసుకెళ్లారు. కుటుంబీకులు బాలుడిని బుధవారం రా త్రి తాండూరులోని ఆస్పత్రికి తరలించా రు. వైద్యులు పరీక్షలు చేసి మలేరియా, టైఫాయిడ్ సోకిందని నిర్ధారించారు. నిరుపేద కుటుంబం కావడంతో నర్స మ్మ డబ్బులు సర్దుబాటు చేస్తుండగానే.. పరిస్థితి విషమించి గురువారం ఉద యం బ్రహ్మానందం మృతిచెందాడు. దీంతో మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. కొడుకుపైనే ఆశలు పెట్టుకొని జీవిస్తున్న నర్సమ్మ.. బ్రహ్మానందం మృతితో గుండెలుబాదుకుంటూ రోదించింది. హాస్టల్లో సరైన సదుపాయాలు లేకపోవడం, అధికారుల నిర్లక్ష్యంతోనే బాలు డు మృత్యువాత పడ్డాడని నీళ్లపల్లి సర్పంచ్ ఉమ సుధాకర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. -
గిరిజనం విలవిల
మన్యాన్ని వణికిస్తున్న జ్వరాలు పెరిగిన మలేరియా,టైఫాయిడ్ కేసులు సెరిబ్రల్ మలేరియాతో హుకుంపేట మండలంలో ఇద్దరి మృతి ఏజె న్సీలో వ్యాధులు విజృంభిస్తున్నాయి. ఏ గ్రామంలో చూసినా మలేరియా, టైఫాయిడ్ జ్వర బాధితులు కనిపిస్తున్నారు. పీహెచ్‌సీలు రోగులతో కిటకిటలాడుతున్నాయి. హుకుంపేట మండలంలో సెరిబ్రల్ మలేరియా లక్షణాలతో రెండు రోజుల వ్యవధిలోనే ఇద్దరు మహిళలు మృత్యువాత పడ్డారు. మరికొందరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రభుత్వం ముందు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఈ పరిస్థితి దాపురించిందని గిరిజనులు ఆవేదన వ్యక్యంచేస్తున్నారు. పాడేరు: మన్యంలో మలేరియా మహమ్మారి విజృంభిస్తోంది. గ్రామాల్లో గిరిజనులు జ్వరాల బారిన పడుతున్నారు. మన్యంలోని ఆస్పత్రుల్లో జ్వరబాధితుల తాకిడి పెరుగుతోంది. ఈనెల ఆరంభం నుంచి మన్యంలో వర్షాలు జోరుగా కురుస్తుండటంతో జ్వరాల తీవ్రత అధికమవుతోంది. ప్రస్తుతం మన్యమంతా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మలేరియా, టైఫాయిడ్ కేసులు నమోదవుతున్నాయి. తాగునీటి కాలుష్యం వల్ల, దోమల విజృంభణ వల్ల గ్రామాల్లో గిరిజనులను టైఫాయిడ్, మలేరియా వ్యాధులు చుట్టుముడుతున్నాయి. పాడేరు ఏరియా ఆస్పత్రిలో జూన్ 1 నుంచి మొదలుకొని ఈ 15 రోజుల వ్యవధిలో సుమారు 2 వేల మంది జ్వరబాధితులకు రక్తపరీక్షలు నిర్వహించగా 31 మలేరియా పాజిటివ్ కేసులు, 35 టైఫాయిడ్ కేసులు నమోదయ్యాయి. చింతపల్లి కమ్యూనిటీ ఆస్పత్రిలో 49 మలేరియా పాజిటివ్ కేసులు, జీకేవీధి ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో 15 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ జూన్ నెల 12 వరకు ఏజెన్సీ 36 పీహెచ్‌సీల్లోనూ ప్లాస్మోడియం వైవేక్స్ కేసులు 14, పాల్సీఫాం మలేరియా కేసులు 217 నమోదయ్యాయి. సెరిబ్రల్ మలేరియా కేసులు కూడా కొన్ని చోట్ల నమోదవుతున్నాయి. ఎక్కువగా మారుమూల ప్రాంతాల నుంచే జ్వరబాధితులు ఆస్పత్రులకు వస్తున్నారు. పాడేరు మండలంలోని ఈదులపాలెం, మినుములూరు పీహెచ్‌సీలు పరిధిలోని గ్రామాల నుంచి, చింతపల్లి మండలంలోని మొండిగెడ్డ, కొమ్మంగి, దామనపల్లి, రింతాడ ప్రాం తాల నుంచి, జీకేవీధి మండలంలో శివా రు గ్రామాల నుంచి వస్తున్న గిరిజనుల్లో వచ్చిన జ్వరబాధితులకు మలేరియా పాజిటివ్ నిర్ధారణ అవుతోంది. నివారణ చర్యలు అంతంత మాత్రమే మన్యంలో ఏటా మలేరియా జ్వరాలు తిరగబెడుతున్నాయి. నివారణ చర్యలు పటిష్టంగా అమలు జరగడం లేదు. మలేరియాతోపాటు ఏజెన్సీలో టైఫాయిడ్ జ్వరాలు కూడా అధికమవుతున్నాయి. గ్రామాల్లో రక్షిత మంచినీటి సౌకర్యాలు మెరుగుపడకపోవడంతోపాటు వైద్య ఆరోగ్య సేవల కల్పనలో నిర్దిష్టమైన చర్యలు చేపట్టకపోవడం వల్ల తరచూ గిరిజనులు జ్వరాల బారిన పడుతూ అనారోగ్యం పాలవుతున్నారు. తాగునీటి కొరత, పోషకాహార లోపం వల్ల జ్వరాల బారిన పడుతున్న గిరిజనులు త్వరగా కోలుకోలేకపోతున్నారు. సకాలంలో వైద్యసేవలు కూడా పొందలేని పరిస్థితి కొనసాగుతోంది. జ్వరాలు ప్రబలిన తర్వాత గ్రామాల్లో వైద్య శిబిరాలు నిర్వహించి పరిస్థితులను చక్కదిద్దుతున్నారు. మన్యంలో ఏటా ప్రబ లుతున్న మలేరియా నియంత్రణపై మా త్రం ప్రభుత్వం విఫలమవుతోంది. రెండేళ్లుగా దోమతెరల పంపిణీ ప్రతిపాదనలకే పరిమితమైంది. స్ప్రేయింగ్ పనుల్లోనూ అలసత్వం వల్ల మలేరియా నియంత్రణపై ముందస్తు చర్యలు ఎక్కడికక్కడ మలేరియా జ్వరాల తవ్రత అథికమవుతోంది. పాడేరులో డీఎంఓ ఆఫీసు నామమాత్రం పాడేరులో జిల్లా మలేరియా అధికారి కార్యాలయం నామమాత్రంగానే ఉంది. మన్యంలో ప్రాణాంతకమైన ఫాల్సీఫాం మలేరియా కేసులు నమోదవుతుండటం, గిరిజనుల మరణాలు సంభవిస్తుండటంతో దశాబ్దకాలం క్రిందట జిల్లా మలేరియా అధికారి కార్యాలయాన్ని పాడేరులోనే ఏర్పాటు చేశారు. ఏజెన్సీలో ఈ శాఖ సేవలు పూర్తిగా నిర్వీర్యమయ్యాయి. మలేరియా నియంత్రణ చర్యలపై పర్యవేక్షణ కొరవడింది. -
వేసవిలో పొంచిన వ్యాధుల ముప్పు
♦ కలుషిత నీటితో డయేరియా, అతిసారం, టైఫాయిడ్ ♦ ఇప్పటికే ఆసుపత్రుల్లో పెరుగుతున్న రోగుల సంఖ్య ♦ జాగ్రత్తలు తీసుకోకుంటే అనారోగ్యం తప్పదంటున్న వైద్యులు సాక్షి, హైదరాబాద్: భానుడి భగభగలకు జనం విలవిలలాడుతున్నారు. వడదెబ్బ బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. కూలీలు, వ్యాపారులు, ఉద్యోగులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరగడంతో అనేకచోట్ల 45 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తీవ్రమైన ఎండలో తిరిగేవారికి వాంతులు, విరేచనాలు, హైఫీవర్, చర్మం పొడిబారడం, డీహైడ్రేషన్, బీపీ పెరగడం, కిడ్నీ, గుండె వంటి ఫెయిల్యూర్, కోమాలోకి వెళ్లడం వంటివి సంభవిస్తాయని వైద్యులు అంటున్నారు. వేసవిలో నీటిఎద్దడి కారణంగా నీరు కలుషితమయ్యే అవకాశాలు ఎక్కువని, నిల్వ ఉంచిన ఆహారపదార్థాల్లో చేరిన బ్యాక్టీరియా స్వల్ప కాలంలోనే తమ సంఖ్యను రెట్టింపు చేసుకుంటుందని హెచ్చరిస్తున్నారు. ఎండల తీవ్రతతో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో చేరుతున్న రోగులసంఖ్య పెరిగిందని వైద్యులు తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఐవీ ప్లూయీడ్స్ పూర్తిస్థాయిలో అందుబాటులో లేకపోవడంతో వడదెబ్బ బాధితులు ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్తున్నారు. తక్షణమే వైద్య చికిత్స రోజుకు ఐదారుసార్ల కంటే ఎక్కువగా నీళ్ల విరేచనాలు రావడం, వాంతులు, వికారం, మెలిపెట్టినట్లుగా కడుపునొప్పి ఉండటం, 101 డిగ్రీల ఫారెన్‌హీట్ కంటే ఎక్కువ జ్వరం ఉండం, ఐదారు గంటలుగా మూత్రవిసర్జన నిలిచిపోవడం, చర్మం పొడిబారి, లాగితే సాగిపోతుండటం, బాగా నీరసించిపోవడం, నాలుక తడారిపోవడం, ఏడ్చినా కన్నీరు రానప్పుడు... ఇవన్నీ ఒంట్లోంచి నీరు గణనీయంగా తగ్గిపోయిందని గుర్తించే లక్షణాలు. అలాగే పిల్లల శరీరంపై దద్దుర్లు రావడం, నుదురు వేడిగా ఉండటం వంటి లక్షణాలు కూడా ఉంటాయి. ఇటువంటి పరిస్థితుల్లో వైద్యులను సంప్రదించాలి. ఐవీ ప్లూయీడ్స్ అందుబాటులో ఉంచాలి నాలుగైదు గంటలు ఎండల్లో తిరిగితే వడదెబ్బ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. వడదెబ్బతో ఆసుపత్రులకు వచ్చేవారికి అవసరమైన ఐవీ ప్లూయీడ్స్ను ఇవ్వాలి. వీటిని ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ విరివిగా అందుబాటులో ఉంచాలి. ఎండ నుంచి ఇంటికి రాగానే ఏమాత్రం నీరసంగా ఉన్నా ఒక గ్లాసుడు నీటిలో నాలుగు టీస్పూన్ల ఉప్పుతో నిమ్మకాయ రసం తాగాలి. మజ్జిగ, కొబ్బరిబొండాలు తాగించాలి. ఎక్కువ వడదెబ్బ తగిలితే చంకలు, మెడ భాగాల్లో ఐస్ ప్యాక్స్ పెట్టాలి. సాధారణ జిమ్‌లలో అతిగా ఎక్సర్సైజ్లు చేయకూడదు. - డాక్టర్ హరిచరణ్, సీనియర్ జనరల్సర్జన్,సన్‌షైన్ ఆసుపత్రి, సికింద్రాబాద్ -
టైఫాయిడ్‌తో బాలుడు మృతి
గుంటూరు: టైఫాయిడ్ జ్వరంతో బాలుడు మృతిచెందాడు. వివరాలు.. గుంటూరు జిల్లాలోని ఈపూరు మండలకేంద్రంలోని బీసీ కాలనీకి చెందిన మణికంఠ(7) అనే బాలుడు స్థానిక పాఠశాలలో రెండో తరగతి చదువుతున్నాడు. గత వారం రోజులుగా అనారోగ్యంతో బాదపడుతుండటంతో.. అతన్ని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందాడు. బాలుడి మృతితో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలముకున్నాయి. -
ఫీవర్రీ జిల్లాకు జ్వరమొచ్చింది
నగరంలో మలేరియా (పీవీ) ఆనవాళ్లు చల్లపల్లి, పెడన, తోట్లవల్లూరుల్లో డెంగీ కేసులు చిన్నారులపై ఫ్లూ పంజా జిల్లాలో వేగంగా వ్యాప్తి చెందుతున్న భయానక వ్యాధులు డెంగీ, మలేరియా, ఫ్లూ, వైరల్.. ప్రస్తుతం నగరంపై దండయాత్ర చేసిన భయానక వ్యాధులు. చిన్నాపెద్దా తేడా లేకుండా అందరిపై విరుచుకుపడుతున్న ఈ విషజ్వరాలు జిల్లావాసులను భయ కంపితులను చేస్తున్నాయి. కుటుంబంలో ఒకరికి సోకితే వరుసగా మిగతా వారినీ చుట్టుముడుతున్నాయి. వాతావరణ మార్పుల కారణంగా సంభవిస్తున్న ఈ జ్వర రక్కసి బారిన పడి ఊళ్లకు ఊళ్లు మంచాన పడుతున్నాయి. లేకుండా అవుట్ పేషెంట్లుగా చికిత్స అందిస్తున్నారు. జిల్లాలోని అవనిగడ్డ నియోజకవర్గంలోని కొత్తమాజేరు, తోట్లవల్లూరు తదితర ప్రాంతాల నుంచి వచ్చిన జ్వర బాధితులు నగరంలోని ఆస్పత్రిలో ఇన్పేషెంట్లుగా చేరి చికిత్స పొందుతున్నారు. నగ రంలో జ్వర బాధితుల నుంచి గత సోమవారం నుంచి శనివారం వరకూ మలేరియా సిబ్బందే 2,150 మంది నుంచి శాంపిల్స్ సేకరించారు. వారిలో ఆరుగురికి మలేరియా (పీవీ) పాజిటివ్ ఉన్నట్లు అధికారులు చెప్పారు. చిన్నారులకు ఫ్లూ ఫ్లూ జ్వరాలతో బాధపడుతున్న జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన చిన్నారులు నగరంలోని ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. దీంతో పిల్లల ఆస్పత్రిలన్నీ కిటకిటలాడుతున్నాయి. ప్రభుత్వాస్పత్రిలో సైతం రోజుకు 70 నుంచి 100 మంది చిన్నారులకు ఓపీలో పరీక్షలు నిర్వహిస్తుండగా, వారిలో 50 మందికిపైగా ఫ్లూ జ్వరాలతో బాధపడుతున్నవారే. ప్రైవేటు ఆస్పత్రులు కూడా ఈ జ్వర బాధితులతో నిండిపోతున్నాయి. ఈ జ్వరంతో వస్తున్న వారిలో జ్వరం, దగ్గు, జలుబు వంటి లక్షణాలు ఉంటున్నట్లు వైద్యులు చెబుతున్నారు. సాధారణంగా ఈ జ్వరాలు ఐదు నుంచి వారం రోజుల్లో తగ్గిపోతాయని, ఒకరి నుంచి వేరొకరికి వేగంగా వ్యాప్తి చెందుతాయని వారు పేర్కొంటున్నారు. హడలెత్తిస్తున్న డెంగీ, టైఫాయిడ్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో వైరల్ ఫీవర్‌తో పాటు డెంగీ, టైఫాయిడ్ కేసులు అధికంగా నమోదవుతున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ లెక్కలు చెబుతున్నాయి. ఇటీవల కాలంలో చల్లపల్లి మండలం కొత్తమాజేరులో తాగునీటిలో కొన్ని రకాల బ్యాక్టీరియాలు కలవడంతో వరుసగా జ్వరాల బారిన పడి 18 మంది మృత్యువాత పడిన విషయం తెలిసిందే. తోట్లవల్లూరులో ఒకే ప్రాంతానికి చెందిన ఆరుగురికి డెంగీ లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు. వారికి నగరంలో పరీక్షలు నిర్వహించగా, ముగ్గురికి ఎలీసా పాజిటివ్ వచ్చినట్లు నిర్ధారించారు. విస్సన్నపేట మండలం మృతరాజపాలెం, బందరు సమీపంలోని చిన్నాపురంలో కూడా ఇటీవల వైరల్ జ్వరాలు విజృంభించాయి. ఫ్లూ జ్వరాలే ఎక్కువ.. మా వద్దకు వస్తున్న చిన్నారుల్లో అధికశాతం ఫ్లూ జ్వరాలతో బాధపడుతున్నవారే. జ్వరం, జలుబు, దగ్గు వంటి లక్షణాలతో ఇక్కడికి వస్తున్నారు. ఇటువంటి వారికి ఐదు నుంచి ఏడు రోజుల్లోనే జ్వరం తగ్గిపోతోంది. ఇటీవల డెంగీ అనుమానిత కేసులు రెండు వచ్చాయి. డెంగీ, మలేరియా, టైఫాయిడ్ వంటి జ్వరాలకు నిర్లక్ష్యం చేయకుండా చికిత్స అందించాలి. డెంగీ సోకిన వారి శరీరంపై రాష్ వచ్చినా, మూత్రంలో, విరేచనంలో రక్తం పడుతున్నా సీరియస్‌గా ఉన్నట్లు భావించారు. ప్లేట్లెట్స్ పరీక్ష చేయించి అప్రమత్తంగా ఉండాడాలి. - డాక్టర్ చంద్రమోహన్, పిల్లల వైద్య నిపుణుడు, ప్రభుత్వాస్పత్రి -
ఇంటింటా జ్వరాలే..
మంచం పట్టిన ‘గుడివాడ’ టైఫాయిడ్, మలేరియా, కామెర్లు, కళ్ల కలకలతో సతమతం జ్వరపీడితులతో కిక్కిరిసిపోతున్న ఆస్పత్రులు వాతావరణ మార్పులే కారణమంటున్న వైద్యులు గుడివాడ మంచం పట్టింది. పట్టణంలో వ్యాధులు విజృంభిస్తున్నాయి. విషజ్వరాలు, టైఫాయిడ్, మలేరియా, కామెర్లు, కళ్ల కలక, పొంగు వంటి వ్యాధులతో ప్రజలు సతమతమవుతున్నారు. పట్టణంలోని దాదాపు ప్రతి కుటుంబంలోనూ ఏదో ఒక వ్యాధితో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. వాతావరణంలో వచ్చిన మార్పులే దీనికి కారణమని తెలుస్తోంది. దాదాపు 15 రోజులుగా వ్యాధుల ప్రభావం ఉండగా, వారం రోజుల నుంచి అంటువ్యాధులు విజృంభిస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. గుడివాడ : పట్టణ వాసులు వ్యాధులతో వణికిపోతున్నారు. వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా విషజ్వరాలతో పాటు వ్యాధులు విజృంభించాయి. ఏ ప్రాంతంలో చూసినా వ్యాధులతో బాధపడే కుటుంబాలు కనిపిస్తున్నాయి. అనేక వార్డుల్లో విషజ్వరాల ప్రభావం ఎక్కువగా ఉంది. వాతావరణం ఒక్కసారిగా వేడెక్కి.. వెనువెంటనే చల్లబడిపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని వైద్యులు చెబుతున్నారు. మిక్స్డ్ వైరస్ల కారణంగా వైరల్ జ్వరాలు వస్తున్నాయని పేర్కొంటున్నారు. విషజ్వరాలు, టైఫాయిడ్, మలేరియా, కామెర్లు, కళ్ల కలక, పొంగు వంటి వ్యాధులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పట్టణంలోని పెద ఎరుకపాడులో ప్రతి ఇంట్లో జ్వర బాధితులు ఉన్నారు. ఇంట్లో ఉన్న నలుగురికీ జ్వరాలు రావటంతో జనం ఆర్థికంగా కూడా చితికిపోతున్నారు. ఈ ప్రాంతంలో టైఫాయిడ్ రోగులు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. పెద ఎరుకపాడు దళితవాడలో దాదాపు 20 కుటుంబాల్లో ఇంట్లో ఉన్న వారంతా జ్వరంతో మంచం పట్టారు. దీనికితోడు కళ్ల కలకలు, పొంగు, మలేరియా వంటి వ్యాధులతో సతమతమౌతున్నారు. పట్టణంలోని గుడ్మేన్పేట, అరవ పేట, మందపాడు తదితర ప్రాంతాల్లో జ్వరాలతో బాధపడేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. దాదాపు 15 రోజుల నుంచి ఈ ప్రభావం ఉండగా వారం రోజులుగా అంటువ్యాధుల విజృంభణ మరింత పెరిగిందని వైద్యులు చెబుతున్నారు. ప్రభుత్వాస్పత్రికి వచ్చినవారు 370 మంది... అక్టోబర్‌లో జ్వరాలతో బాధపడుతూ ప్రభుత్వాస్పత్రికి వచ్చినవారు 370 మంది ఉన్నారని వైద్యాధికారులు చెబుతున్నారు. వారిలో టైఫాయిడ్‌కి గురైనవారే 165 మంది ఉన్నారని పేర్కొంటున్నారు. వీరుగాక ప్రైవేటు వైద్యశాలల్లో చికిత్స చేయించుకుంటున్న వారి సంఖ్య ఇంతకు పది రెట్లు అదనంగా ఉండవచ్చని అంచనా. ప్రతిరోజూ గుడివాడలోని ఒక్కో ఆస్పత్రికి నిత్యం వందమందికి పైగా జ్వరపీడితులు వస్తున్నారని చెబుతున్నారు. మారుతున్న వాతావరణం, తాగునీటి కాలుష్యం కారణంగా విషజ్వరాలు వ్యాప్తి చెందుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉంటేనే విషజ్వరాల వ్యాప్తిని తగ్గించగలమని అంటున్నారు. పరిసరాల పరిశుభ్రత సరిగా లేని కారణంగా కూడా వ్యాధులు వస్తున్నాయని పేర్కొంటున్నారు. ఇతర అంటువ్యాధులు ఇంట్లో ఒకరి తరువాత మరొకరికి రావటంతో ప్రజలు ఆర్థికంగా చితికిపోతున్నామని, విషజ్వరాలు వ్యాప్తి చెందకుండా ప్రభుత్వ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. వాతావరణంలో మార్పుల వల్లే వాతావరణంలో వస్తున్న మార్పుల వల్లే వ్యాధులు విజృంభిస్తున్నాయి. 18 ఏళ్ల లోపు వారికి ఎక్కువగా టైఫాయిడ్ వస్తోంది. జ్వరం వచ్చిందని బాలింతలు పిల్లలకు పాలివ్వటం మానరాదు. పాలు ఇచ్చి పిల్లల్ని దూరంగా వేరొకరికి ఇవ్వాలి. లేదంటే పిల్లల్లో వ్యాధి నిరోధక శక్తి తగ్గి రోగాల బారిన పడతారు. తల్లికి జ్వరం వచ్చినా పాలు ఇవ్వవచ్చు. జ్వరం వచ్చిందని పిల్లలకు ఆహారం పెట్టకుండా ఉంచరాదు. అలా చేయటం వల్ల బలహీనత ఏర్పడి రోగనిరోధక శక్తి తగ్గిపోయి ఇన్ఫెక్షన్లు పెరిగిపోతాయి. తినే ఆహారం, వాతావరణ పరిస్థితులు, పరిసరాల పరిశుభ్రత వంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటే వ్యాధుల వ్యాప్తిని అరికట్టవచ్చు. - డాక్టర్ సుదేష్బాబు, ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్, గుడివాడ -
మూడు వ్యాధులు..ముప్పేట దాడి!
సాక్షి, ముంబై : మూడురోగాలు కలిసి నగరవాసులపై ముప్పేట దాడిచేస్తున్నాయి. వెక్టర్ బార్న్ డిసీజ్‌గా నగరవాసులను, డాక్టర్లను కలవరపెడుతున్నాయి. ఇటీవల కాలంలో చాలా మంది నగర వాసులు డెంగీ, మలేరియా, టైఫాయిడ్ ఇన్ఫెక్షన్ల బారిన పడుతున్నారు. ఒక్కరికే ఈ మూడు వ్యాధులు సోకిన కేసులు కూడా కొన్ని చోటుచేసుకున్నాయి. ఈ వ్యాధుల సోకిన రోగులతో నగరంలోని వివిధ ఆస్పత్రులు కిక్కిరిసిపోతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో డెంగీ సోకడం ద్వారా అవయాలపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. పరిస్థితి విషమిస్తే రోగి మరణి స్తాడని, ఏ చిన్న జ్వరం వచ్చినావెంటనే వైద్యులను సంపద్రించాలని సూచిస్తున్నారు. ఈ మూడు వ్యాధులపై డాక్టర్ల సూచనలు వారి మాటల్లోనే.. రోగిలో తెల్లరక్తకణాల తగ్గుముఖం: డాక్టర్ భజన్ నాలుగు నుంచి ఐదు వరకు డెంగీ కేసులను పరిశీలించానని డాక్టర్ భజన్ చెప్పారు. వీరికి యాంటీ మల్లేరియా చికిత్స అందజేశామన్నారు. దీర్ఘకాలిక జ్వరంతో బాధపడుతూ చికిత్స నిమిత్తం వస్తున్నార ని, ఈ రోగులలో చాలా మందికి తెల్లరక్త కణాలు గణనీయంగా తగ్గిపోయి ఉన్నాయన్నారు. ప్లేట్లెట్లు భారీగా పడిపోతున్నాయని తెలిపారు. మిక్స్డ్ ఇన్ఫెక్షన్ : డాక్టర్ రాయ్ పటాన్‌కర్ డెంగీ, మల్లేరియాతోపాటు టైఫాయిడ్ కేసులు చాలా ఆస్పత్రులలో నమోదు అవుతున్నాయన్నాయని చెంబూర్‌లోని జాయ్ ఆస్పత్రి వైద్యుడు రాయ్ పటాన్‌కర్ తెలిపారు.గత వారం నుంచి జ్వరంతో బాధపడుతున్న ఓ బాలికకు టైఫాయిడ్, మలేరియా, డెంగీకి పరీక్షలు నిర్వహించామన్నారు. ఆ బాలికకు ‘మిక్స్డ్ ఇన్ఫెక్షన్’ సోకినట్లు తేలిందన్నారు. ఇటీవల ఇది నాలుగో కేసు అని చెప్పారు. ఒకే మాదిరిగా లక్షణాలు మల్లేరియా, టైఫాయిడ్, డెంగీ ఈ మూడు వ్యాధుల లక్షణాలు ఒకే రకంగా ఉంటాయని లీలావతి ఆస్పత్రి వైద్యుడు జలీల్ పార్కర్న్నారు. ఏ చిన్న జ్వరం వచ్చినా ఈ మూడు వ్యాధుల పరీక్షలు నిర్వహించాలన్నారు. జ్వరాన్ని నిర్లక్ష్యం చేయవద్దని సూచించారు. రోగుల చికిత్సలో జాప్యం చేయడం ద్వారా అవయవాలపై ప్రభావం చూపే ప్రమాదం ఉందని తెలిపారు. ఈ సారి డెంగీ సోకిన కేసుల్లోనూ లివర్, లంగ్స్, కిడ్నీలకు ప్రమాదం దాపురించిందని చెప్పారు. ఏ చిన్నపాటి జ్వరమైనా నిర్లక్ష్యం చేయవద్దని సూచించారు. -
ఆశల దీపం ఆరిపోయింది..!
బూర్జ: ఆ విద్యార్థి బూర్జ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ చదువుతున్నాడు.. ప్రథమ సంవత్సరం పరీక్షల్లో మండలానికే ప్రథముడిగా నిలిచాడు.. తమ పిల్లడు బాగానే చదువుతున్నాడన్న ఆ కుటుంబం ఆనందం ఎంతో కాలం నిలువలేదు.. టైఫాయిడ్ పుణ్యమా అని వారి ఆశల దీపం ఆరిపోయింది.. దీంతో తల్లిదండ్రుల ఆవేదన అంతా ఇంతా కాదు.. వివరాలిలా ఉన్నాయి... మండలంలోని తోటవాడ గ్రామానికి చెందిన కోనాడ కృష్ణ (17) శుక్రవారం అర్థరాత్రి టైఫాయిడ్ జ్వరంతో శ్రీకాకుళం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో తల్లిదండ్రులు కోనాడ జయమ్మ, త్రినాథరావు బోరున విలపిస్తున్నారు. మా ఆశల దీపం ఆరిపోయిందని వారు కన్నీరు మున్నీరయ్యారు. వారం రోజులుగా జ్వరంతో బాధపడుతున్న కృష్ణకు స్థానికంగా వైద్యసేవలందక ప్రైవేటు వైద్యం పొందలేక తమ కొడుకును చేతులారా చంపేసుకున్నామని వారు రోదిస్తున్న తీరు స్థానికులను కంట తడిపెట్టించింది. జ్వరంతో బాధపడుతున్న విద్యార్థి పరిస్థితి విషమించడంతో తప్పనిసరి పరిస్థితిలో ఈనెల 9న శ్రీకాకుళంలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. అయినా ఫలితం లేకపోయింది. అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు. కోనాడ జయమ్మ, త్రినాథరావులకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. వీరిలో రాముడు,లక్ష్మణ అనే ఇద్దరు కవ లలు మూగవారు కావడంతో మరో కుమారుడు కృష్ణపై వారు ఆశలు పెట్టుకున్నారు. తమతోపాటు మూగపిల్లలకు కూడా ఆదుకుంటాడని భావించిన ఆ తల్లిదండ్రుల ఆశలు అడియాశలయ్యాయి. కోనాడ కృష్ణ మృతి చెందిన విషయం తెలుసుకుని ఎంపీపీ బొడ్డేపల్లి సూర్యారావు ఆ విద్యార్థి కుటుంబ సభ్యులను పరామర్శించి వారిని ఓదార్చారు. పారిశుద్ధ్య లోపమే విద్యార్థిని బలితీసుకుంది ఆగ్రహం వ్యక్తం చేసిన ఎస్సీ కాలనీ వాసులు బూర్జ: గ్రామంలోని పారిశుద్ధ్య లోపమే అభం శుభం తెలియని విద్యార్థి కోనాడ కృష్ణను బలి తీసుకుందని తోటవాడ గ్రామానికి చెందిన ఎస్సీ కాలనీ వాసులు శనివారం పంచాయతీ కార్యదర్శి మల్లేశ్వరరావు, ఏఎన్ఎం అరుణలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గత నెల 12 నుంచి నెల రోజులుగా గ్రామంలో ప్రతి ఇంటిలో జ్వరాల బారిన పడి బాధపడుతున్నా పంచాయతీ అధికారులు గాని, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు గాని స్పందించలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కాలనీలో ఒక్క బోరు కూడా లేకపోవడంతో బావినీరే తాగుతున్నామని, ఆ నీరు కలుషితమైందని వైద్య సిబ్బంది పరీక్షలో నిర్థారణ అయినప్పటికీ బావి నీరు తాగవద్దని తమకు తెలియజేయకుండా తమ జీవితాలతో చెలగాటమాడుతున్నారని వారన్నారు. కాలనీకి వెళ్లే రోడ్డుపై పంట కుప్పలు, మలమూత్ర విసర్జనతో నిండి దుర్గంధం అలముకుంటోందని ఆవేదన చెందారు. పెంటకుప్పలను తొలగించాలని ఇటీవల గ్రామాన్ని సందర్శించిన జేసీ ఆదేశించినప్పటికీ ఆఆదేశాలు బేఖాతర్ చేశారని విమర్శించారు. ఆ కుటుంబానికి ఆధారమైన యువకుడు మరణించడంతో ఆ కుటుంబాన్ని ఎవరు ఆదుకుంటారని వారు అధికారులను నిలదీశారు. ఎంపీపీ బొడ్డేపల్లి సూర్యారావు, తహశీల్దార్ బాబ్జీరావు, వైఎస్ఆర్ సీపీ నాయకుడు గుమ్మిడి రాంబాబు అక్కడకు చేరుకొని ఆ కుటుంబాన్ని పరామర్శించారు. వెంటనే గ్రామంలో వైద్య సేవలందించాలని ఎంపీపీ సూర్యారావు డాక్టర్ ప్రనన్నకుమార్కు ఆదేశించారు. పెంటకుప్పలు తొలగించేందుకు చర్యలు తీసుకుంటామని తహశీల్దార్ హామీ ఇచ్చారు. దీంతో దళితులు శాంతించారు. -
వానొచ్చే.. వ్యాధులొచ్చే..!
ప్రబలుతున్న అంటురోగాలు - ఆస్పత్రులకు పరుగులుపెడుతున్న జనం - వాతావరణంలో మార్పు వల్లే వైరస్ వ్యాప్తి అంటున్న నిపుణులు - తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచన న్యూఢిల్లీ: కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో నగరంలో అంటువ్యాధులు ప్రబలుతున్నాయి. పలు లోతట్టు ప్రాంతాల వాసులు టైఫాయిడ్, వైరల్ జ్వరాల బారిన పడి ఆస్పత్రులకు పరుగులు పెడుతున్నారు. వర్షాకాలం మొదలైన తర్వాత నగరంలో సరైన వర్షాలు లేక నీటిఎద్దడి ప్రారంభమైంది. దానికితోడు విద్యుత్ కోతలు నగరవాసులకు నరకం చూపించాయి. కొన్ని ప్రాంతాల్లో మున్సిపల్ నీళ్లు రెండు, మూడు రోజులకొకసారి వదిలేవారు. నీళ్లు పట్టుకునే సమయంలో కొన్ని ఏరియాల్లో స్థానికుల మధ్య ఘర్షణలు కూడా చోటుచేసుకున్నాయి. ఇటువంటి సమయంలో గత కొన్ని రోజులుగా వర్షాలు వచ్చి పలకరించడంతో నగరవాసులు పులకరించిపోయారు. అయితే ఈ ఆనందం ఎంతో కాలం సాగలేదు. ఇన్నాళ్లుగా నీళ్లు లేక ఇబ్బందులుపడిన ప్రజలు ఇప్పుడు వర్షం నీటితో కలుషితమైన మంచినీటిని తాగి అనారోగ్యం పాలవుతున్నారు. దీంతోపాటు పలు మురికివాడలు, అనధికార కాలనీల్లో డయేరియా, టైఫాయిడ్, వైరల్ జ్వరాలు విజృంభిస్తున్నాయి. కాగా, మున్ముందు దోమలతో వృద్ధి చెందే వ్యాధులైన డెంగీ, మలేరియా వంటివి కూడా వ్యాప్తిచెందే అవకాశాలున్నాయని వైద్యులు చెబుతున్నారు. మూల్‌చంద్ మెడిసిటీలో సీనియర్ కన్సల్టెంట్‌గా పనిచేస్తున్న డాక్టర్ శ్రీకాంత్ శర్మ మాట్లాడుతూ..‘ మా ఆస్పత్రికి డెంగీ లక్షణాలతో ఇద్దరు రోగులు వచ్చారు. అదే సమయంలో టైఫాయిడ్, వైరల్ జ్వరాలతో డజనుకుపైగా రోగులు చికిత్స కోసం వచ్చారు.,’ అని చెప్పారు. వాతావరణంలో అనూహ్య మార్పులు, అధికతేమ వల్ల వైరల్ బాక్టీరియా త్వరితగతిన వ్యాప్తి చెందుతోందని ఆయన వివరించారు. సాకేత్ ప్రాంతంలో ఉన్న మ్యాక్స్ ఆస్పత్రిలో సీనియర్ కన్సల్టెంట్అయిన డాక్టర్ రోమెల్ టిక్కూ మాట్లాడుతూ వైరల్ జ్వరాలతో బాధపడుతున్న వారి సంఖ్య రోజురోజుకి పెరిగిపోతోందని చెప్పారు. కొన్ని కేసుల్లో ఈ జ్వరాలు రెండు, మూడు వారాల వరకు రోగిని పట్టిపీడించే అవకాశాలున్నాయని ఆయన తెలిపారు. రుతుపవనాల కారణంగా దోమలు ఎక్కువగా వ్యాప్తి చెందుతాయని, వాటి వల్ల ఈ వర్షాకాలంలో డెంగీ, మలేరియా వంటి వ్యాధులు కూడా విజృంభించే అవకాశం ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా మున్సిపల్ కార్పొరేషన్ గణాంకాల ప్రకారం.. ఈ ఏడాదిలో డెంగీ వ్యాధితో బాధపడుతున్న 33 మంది రోగులు చికిత్స నిమిత్తం ఆస్పత్రులకు వచ్చారు. అయితే వారిలో ఎవరూ మరణించిలేదు. వీటిలో కేవలం ఆగస్టు నెలలోనే 11 కేసులు నమోదయ్యాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది డెంగీ కేసులు పదోవంతు తగ్గాయి. ఇదిలా ఉండగా, మలేరియా కేసులు సైతం గత యేడాది కంటే ఈ ఏడాది తక్కువగా నమోదయ్యాయి. ‘ఓవర్ హెడ్ ట్యాంకులను, పూలకుండీలు, ఇతర నీరు నిలిచే అవకాశమున్న ప్రాంతాలను ఎప్పటికప్పుడు శుభ్రపరుచుకోవడంతో మలేరియా వ్యాధి వ్యాప్తిని నివారించవచ్చు.. అలాగే పరిపాలన విభాగం కూడా నగరవ్యాప్తంగా ఫాగింగ్ చేపట్టి దోమల వ్యాప్తిని అరికట్టేందుకు యత్నించింద’ని కార్పొరేషన్ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. డాక్టర్ అనూప్ మిశ్రా మాట్లాడుతూ.. వ్యాధినిరోధక శక్తి తక్కువగా ఉన్న వారే ఎక్కువగా వైరల్ వ్యాధుల బారిన పడతారని చెప్పారు. సరైన సమయంలో పౌష్టికాహారం తినడం వల్ల ఈ వ్యాధుల బారిన పడకుండా తప్పించుకోవచ్చని తెలిపారు. ‘దగ్గు, జలుబు ఉన్న వ్యక్తులు తుమ్మినప్పుడో, దగ్గినప్పుడో ఆ కణాలు గాలిలో కలిసి దగ్గర్లోనే ఉన్న ఇతరులకు ఆ జబ్బులు అంటుకుంటాయి. అలాంటి వ్యక్తులకు సాధ్యమైనంత మేర దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తే రోగాలబారిన పడకుండా మనలను మనం కాపాడుకోవచ్చ’ని ఆయన సలహా ఇచ్చారు. -
గూడేలు గజగజ
ఏటూరునాగారం : ములుగు నియోజకవర్గంలోని ఏడు మండలాల్లోని గిరిజన తండాలు, ఎస్సీ కాలనీలు, గొత్తికోయగూడేల్లో విషజ్వరాలు వణికిస్తున్నాయి. ఫలితంగా ఇంటికొకరు చొప్పున మంచంపట్టారు. సర్కారు వైద్యులు రోగులకు సరైన చికిత్స అందించకపోవడంతో బాధితులు ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. స్థానిక ప్రైవేటు ఆస్పత్రుల్లో రోజూ మలేరియా, టైఫాయిడ్, డెంగీ, చికున్‌గున్యా, పైలేరియా కేసులు నమోదవుతుండడంతో ప్రజలు భయంతో వణికిపోతున్నారు. ఆస్పత్రుల్లో జ్వర పీడితులు ఏటూరునాగారానికి చెందిన దేపాక నర్సయ్య, డొంగిరి రమాదేవి, కొల్ల సరోజన, సంతగాని రజిత, కోరం మానస, కోడి దుర్గు (విద్యార్థిని), చిదరపు సరోజన జ్వరంతో వారం రోజులుగా విలవిల్లాడుతున్నారు. వీరిని పరీక్షించాల్సిన వైద్యులు తమ వైపు కన్నెత్తి కూడా చూడడం లేదని సామాజిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు తెలిపారు. మంగపేట మండలంలోని శనిగకుంట గ్రామానికి చెందిన ఆక శ్రీనివాస్ (38) నాలుగు రోజులుగా జ్వరంతో బాధపడుతూ స్థానిక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఏటూరునాగారం మండలంలోని తాళ్లగడ్డకు చెందిన పానిగంటి శ్రీనివాస్ వారం రోజులగా డెంగీతో బా ధపడుతున్నారు. ప్రస్తుతం హన్మ కొండలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీనివాస్ ఇప్పటి వరకు వైద్యఖర్చు ల కోసం రూ.30వేలు ఖర్చుచేసినట్టు తెలిపారు. నిర్లక్ష్యపు నీడలో.. పంచాయతీల్లో పారిశుధ్య నిర్వహణకు సరిపడా నిధులున్నా పనులు చేపట్టకుం డా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహ రిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతు న్నాయి. గ్రామాల్లో ఎక్కడ చూసినా బురదగుంతలు, చెత్తాచెదారం, కుళ్లిన వ్యర్థాలే కనిపిస్తున్నాయి. వీటిని ఆవాసంగా చేసుకుంటున్న దోమలు విజృంభిస్తున్నా యి. ఇప్పటికైనా అధికారులు కళ్లు తెరిచి గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణతోపాటు క్లోరినేషన్ చేపట్టి జ్వరాలను అరికట్టాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. -
మంచం పట్టిన అనంత జనం
సాక్షి, అనంతపురం : జిల్లాలో జ్వరాలు విజృంభిస్తున్నాయి. మలేరియా, డెంగీ, టైఫాయిడ్, చికున్‌గున్యా తదితర జ్వరాలతో జనం విలవిలలాడుతున్నారు. ప్రతి గ్రామంలోనూ ఇదే పరిస్థితి. రోజుల తరబడి తగ్గకపోవడంతో చికిత్స కోసం వేలాది రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ఆర్థిక స్థితి బాగోలేని వారు మాత్రం మంచాలపైనే మగ్గిపోతున్నారు. కొంత మందికి రక్త పరీక్షలు చేసినా ఏ జ్వరమో తెలియక ఇబ్బందులు పడుతున్నారు. జ్వర పీడితులతో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి. కొన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులు అందుబాటులో లేకపోవడంతో రోగులు ప్రైవేటు ఆస్పత్రులకు పరుగులు తీస్తున్నారు. రాప్తాడు, పుట్టపర్తి, అనంతపురం నియోజకవర్గాల్లో డెంగీ లక్షణాలతో ఆస్పత్రులకు వెళ్లేవారి సంఖ్య ఎక్కువవుతోంది. జిల్లా వ్యాప్తంగా 50 మందికి పైగా డెంగీ లక్షణాలు కనిపించాయి. అయితే అధికారుల లెక్కలు మాత్రం భిన్నంగా ఉన్నాయి. పది కేసులు నమోదైనట్లు అనంతపురం వైద్య కళాశాల అధికారులు చెబుతుండగా, కాదు 15 కేసులు నమోద య్యాయంటూ డీఎంెహ చ్ఓ రామసుబ్బారావు సోమవారం ప్రకటించారు. ఈ లెక్కలు ఎలాగున్నా.. డెంగీ పేరు చెప్పగానే జిల్లా ప్రజలు మాత్రం బెంబేలెత్తిపోతున్నారు. గత ఏడాది కూడా విష జ్వరాల కారణంగా పదుల సంఖ్యలో మరణించారు. ప్రస్తుతం రోగుల పరిస్థితిని ఆసరాగా చేసుకుని ప్రైవేటు ఆస్పత్రులు పీల్చిపిప్పి చేస్తున్నాయి. మలేరియా బాధితుల నుంచి రోజుకు రూ.1000 నుంచి రూ.1,500 వరకు గుంజుతున్నాయి. విష జ్వరాల బాధితులు రూ.2,500 వరకు, టైఫాయిడ్ రోగులు రూ.800 నుంచి రూ.1,100 వరకు ఖర్చు చేయాల్సి వస్తోంది. దీనికి తోడు రక్త పరీక్షల కోసం మరో రూ.1000 వరకు అవుతోంది. వేధిస్తున్న సిబ్బంది కొరత జిల్లాలో 80 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్‌సీలు) ఉన్నాయి. దాదాపు 18 పీహెచ్సీలలో వైద్యులు, సిబ్బంది కొరత పట్టిపీడిస్తోంది. ఉరవకొండ నియోజకవర్గంలో మొత్తం ఎనిమిది పీహెచ్‌సీలు ఉండగా, ఇందులో పెద్ద కౌకుంట్లతో పాటు వుూడు 24 గంటల పీహెచ్‌సీలకు రెగ్యులర్ వైద్యాధికారులు లేరు. పీహెచ్సీలలో పనిచేసే వైద్యులు ఎక్కువగా పట్టణాల్లో కాపురముంటున్నారు. ప్రైవేటు ప్రాక్టీసుకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లు విమర్శలున్నాయి. కానరాని ముందస్తు చర్యలు సీజనల్ వ్యాధుల నివారణకు ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు ప్రతియేటా ప్రకటిస్తూనే ఉన్నారు. క్షేత్ర స్థాయిలో మాత్రం వ్యాధుల వ్యాప్తిని అరికట్టలేకపోతున్నారు. జనవరి నుంచి ఇప్పటి వరకు జిల్లాలో లక్షన్నరకు పైగా జ్వరాల కేసులు నమోదైనట్లు రికార్డులు చెబుతున్నాయి. ఇందులో మలేరియా కేసులు 300 వరకు ఉన్నాయి. గోరంట్ల మండలం మిషన్‌తండా, గార్లదిన్నె మండలం పెనకచర్ల డ్యాంలో మలేరియా వ్యాప్తి ఎక్కువగా ఉంది. పక్కదారి పడుతున్న పారిశుద్ధ్య నిధులు గ్రామాల్లో పారిశుద్ధ్య లోపం వల్లే సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయి. పారిశుద్ధ్యం మెరుగుదల కోసం ప్రభుత్వం నిధులిస్తున్నా.. వాటిని వైద్య, ఆరోగ్య శాఖలోని కొందరు ఉద్యోగులు పక్కదారి పట్టిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఇందులో ఓ ఉన్నతాధికారి పాత్ర కూడా ఉన్నట్లు తెలిసింది. ఆయన మరో రెండు, మూడేళ్లలో ఉద్యోగ విరమణ చేయనుండడంతో అందిన కాడికి దోచుకుని.. సొంత నర్సింగ్‌హోంను మరింత అభివృద్ధి చేసుకునే పనిలో ఉన్నట్లు సమాచారం. జిల్లాలోని 80 పీహెచ్‌సీలు, 14 సీహెచ్‌సీల (కమ్యూనిటీ హెల్త్సెంటర్లు) పరిధిలో 568 ఉప కేంద్రాలు ఉన్నాయి. పారిశుద్ధ్యం మెరుగుపరిచేందుకు 2013-14 ఆర్థిక సంవత్సరంలో ఒక్కో సబ్ సెంటర్‌కు రూ.10 వేల చొప్పున ప్రభుత్వం విడుదల చేసింది. ఆ నిధులను ఎక్కడా సద్వినియోగం చేసిన దాఖలాలు లేవు. ఎక్కువ శాతం నిధులను ఆ శాఖలోని ఓ ఉన్నతాధికారి భోంచేయగా, మిగిలినవి సిబ్బంది స్వాహా చేసినట్లు ఆరోపణలున్నాయి. ఈ లక్షణాలుంటే వైద్యున్ని సంప్రదించాలి ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి ఒక్కసారిగా విపరీతమైన జ్వరానికి లోనుకావడం, తీవ్ర తలనొప్పి, కండరాల నొప్పి ఉంటే డెంగీ లక్షణాలుగా అనుమానించాలి. పారాసిటమాల్ తప్ప మరే మందులూ వినియోగించకూడదు. రెండో రోజూ జ్వరం తీవ్రత అలాగే ఉంటే.. వెంటనే రక్త పరీక్షలు చేయించుకోవాలి. సర్పజన ఆస్పత్రితో పాటు ప్రైవేటు ల్యాబులలో ఈ సౌకర్యం ఉంది. నిర్లక్ష్యం చేస్తే తీవ్ర అనారోగ్యానికి దారి తీస్తుంది. ముఖ్యంగా చిన్నపిల్లల్లో డీ హైడ్రేషన్ (నీటిని కోల్పోవడం) వల్ల మరణాలు సంభవించే అవకాశాలున్నాయి. డెంగీ, ఇతర విష జ్వరాల్లో ప్లేట్లెట్స్ తగ్గిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటి సంఖ్య ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి.