వానొచ్చే.. వ్యాధులొచ్చే..!
ప్రబలుతున్న అంటురోగాలు
- ఆస్పత్రులకు పరుగులుపెడుతున్న జనం
- వాతావరణంలో మార్పు వల్లే వైరస్ వ్యాప్తి అంటున్న నిపుణులు
- తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచన
న్యూఢిల్లీ: కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో నగరంలో అంటువ్యాధులు ప్రబలుతున్నాయి. పలు లోతట్టు ప్రాంతాల వాసులు టైఫాయిడ్, వైరల్ జ్వరాల బారిన పడి ఆస్పత్రులకు పరుగులు పెడుతున్నారు. వర్షాకాలం మొదలైన తర్వాత నగరంలో సరైన వర్షాలు లేక నీటిఎద్దడి ప్రారంభమైంది. దానికితోడు విద్యుత్ కోతలు నగరవాసులకు నరకం చూపించాయి. కొన్ని ప్రాంతాల్లో మున్సిపల్ నీళ్లు రెండు, మూడు రోజులకొకసారి వదిలేవారు. నీళ్లు పట్టుకునే సమయంలో కొన్ని ఏరియాల్లో స్థానికుల మధ్య ఘర్షణలు కూడా చోటుచేసుకున్నాయి.
ఇటువంటి సమయంలో గత కొన్ని రోజులుగా వర్షాలు వచ్చి పలకరించడంతో నగరవాసులు పులకరించిపోయారు. అయితే ఈ ఆనందం ఎంతో కాలం సాగలేదు. ఇన్నాళ్లుగా నీళ్లు లేక ఇబ్బందులుపడిన ప్రజలు ఇప్పుడు వర్షం నీటితో కలుషితమైన మంచినీటిని తాగి అనారోగ్యం పాలవుతున్నారు. దీంతోపాటు పలు మురికివాడలు, అనధికార కాలనీల్లో డయేరియా, టైఫాయిడ్, వైరల్ జ్వరాలు విజృంభిస్తున్నాయి. కాగా, మున్ముందు దోమలతో వృద్ధి చెందే వ్యాధులైన డెంగీ, మలేరియా వంటివి కూడా వ్యాప్తిచెందే అవకాశాలున్నాయని వైద్యులు చెబుతున్నారు.
మూల్‌చంద్ మెడిసిటీలో సీనియర్ కన్సల్టెంట్‌గా పనిచేస్తున్న డాక్టర్ శ్రీకాంత్ శర్మ మాట్లాడుతూ..‘ మా ఆస్పత్రికి డెంగీ లక్షణాలతో ఇద్దరు రోగులు వచ్చారు. అదే సమయంలో టైఫాయిడ్, వైరల్ జ్వరాలతో డజనుకుపైగా రోగులు చికిత్స కోసం వచ్చారు.,’ అని చెప్పారు. వాతావరణంలో అనూహ్య మార్పులు, అధికతేమ వల్ల వైరల్ బాక్టీరియా త్వరితగతిన వ్యాప్తి చెందుతోందని ఆయన వివరించారు.
సాకేత్ ప్రాంతంలో ఉన్న మ్యాక్స్ ఆస్పత్రిలో సీనియర్ కన్సల్టెంట్‌అయిన డాక్టర్ రోమెల్ టిక్కూ మాట్లాడుతూ వైరల్ జ్వరాలతో బాధపడుతున్న వారి సంఖ్య రోజురోజుకి పెరిగిపోతోందని చెప్పారు. కొన్ని కేసుల్లో ఈ జ్వరాలు రెండు, మూడు వారాల వరకు రోగిని పట్టిపీడించే అవకాశాలున్నాయని ఆయన తెలిపారు. రుతుపవనాల కారణంగా దోమలు ఎక్కువగా వ్యాప్తి చెందుతాయని, వాటి వల్ల ఈ వర్షాకాలంలో డెంగీ, మలేరియా వంటి వ్యాధులు కూడా విజృంభించే అవకాశం ఉందని ఆయన వ్యాఖ్యానించారు.
ఇదిలా ఉండగా మున్సిపల్ కార్పొరేషన్ గణాంకాల ప్రకారం.. ఈ ఏడాదిలో డెంగీ వ్యాధితో బాధపడుతున్న 33 మంది రోగులు చికిత్స నిమిత్తం ఆస్పత్రులకు వచ్చారు. అయితే వారిలో ఎవరూ మరణించిలేదు. వీటిలో కేవలం ఆగస్టు నెలలోనే 11 కేసులు నమోదయ్యాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది డెంగీ కేసులు పదోవంతు తగ్గాయి. ఇదిలా ఉండగా, మలేరియా కేసులు సైతం గత యేడాది కంటే ఈ ఏడాది తక్కువగా నమోదయ్యాయి. ‘ఓవర్ హెడ్ ట్యాంకులను, పూలకుండీలు, ఇతర నీరు నిలిచే అవకాశమున్న ప్రాంతాలను ఎప్పటికప్పుడు శుభ్రపరుచుకోవడంతో మలేరియా వ్యాధి వ్యాప్తిని నివారించవచ్చు.. అలాగే పరిపాలన విభాగం కూడా నగరవ్యాప్తంగా ఫాగింగ్ చేపట్టి దోమల వ్యాప్తిని అరికట్టేందుకు యత్నించింద’ని కార్పొరేషన్ సీనియర్
అధికారి ఒకరు తెలిపారు.
డాక్టర్ అనూప్ మిశ్రా మాట్లాడుతూ.. వ్యాధినిరోధక శక్తి తక్కువగా ఉన్న వారే ఎక్కువగా వైరల్ వ్యాధుల బారిన పడతారని చెప్పారు. సరైన సమయంలో పౌష్టికాహారం తినడం వల్ల ఈ వ్యాధుల బారిన పడకుండా తప్పించుకోవచ్చని తెలిపారు. ‘దగ్గు, జలుబు ఉన్న వ్యక్తులు తుమ్మినప్పుడో, దగ్గినప్పుడో ఆ కణాలు గాలిలో కలిసి దగ్గర్లోనే ఉన్న ఇతరులకు ఆ జబ్బులు అంటుకుంటాయి. అలాంటి వ్యక్తులకు సాధ్యమైనంత మేర దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తే రోగాలబారిన పడకుండా మనలను మనం కాపాడుకోవచ్చ’ని ఆయన సలహా ఇచ్చారు.