కో–ఇన్ఫెక్షన్స్‌.. ఏకకాలంలో అనేక జ్వరాలు..! | Dr Aarathi Bellary Special Article On Co Infections | Sakshi
Sakshi News home page

కో–ఇన్ఫెక్షన్స్‌.. ఏకకాలంలో అనేక జ్వరాలు..!

Published Sun, Sep 18 2022 3:18 PM | Last Updated on Sun, Sep 18 2022 3:18 PM

Dr Aarathi Bellary Special Article On Co Infections - Sakshi

ఇటీవలి కాలంలో ప్రతి ఇంటా ఎవరో ఒకరు జ్వరంతో బాధపడటం కనిపిస్తోంది. మరీ ముఖ్యంగా ఈమధ్యకాలంలో వరసగా వర్షాలు అందరినీ బెంబేలెత్తించాయి. నిన్న మొన్నటి కరోనా కాలం తర్వాత... అదే సంఖ్యలో మూకుమ్మడి జ్వరాలు ఇటీవల నమోదయ్యాయి. అయితే ఇప్పటి జ్వరాల్లో ఓ ప్రత్యేకత ఉందంటున్నారు వైద్య నిపుణులు. కొందరిలో ఒకే సమయంలో రెండు రకాల జ్వరాలు నమోదవ్వడం ఇటీవల నమోదైన ధోరణి. ఇలా ఒకే సమయంలో అనేక ఇన్ఫెక్షన్లు రావడాన్ని వైద్యనిపుణులు తమ పరిభాషలో ‘కో–ఇన్ఫెక్షన్స్‌’గా చెబుతున్నారు. ఆ ‘కో–ఇన్ఫెక్షన్ల’పై అవగాహన కోసమే ఈ కథనం. 

ఓ కేస్‌ స్టడీ: ఇటీవల ఓ మహిళ జ్వరంతో ఆసుపత్రికి వచ్చింది. తొలుత ఆమెలో డెంగీ లక్షణాలు కనిపించాయి. పరీక్షలో ప్లేట్‌లెట్‌ కౌంట్‌ తగ్గడం డాక్టర్లు చూశారు. ఆ తర్వాత ఆమెకు ఆయాసంగా ఉండటం, ఊపిరి అందకపోవడం గమనించారు. అప్పుడు పరీక్షిస్తే ఆమెకు కోవిడ్‌ కూడా ఉన్నట్లు తేలింది. ఇలా ఒకేసారి రెండు రకాల జ్వరాలు (ఇన్ఫెక్షన్లు) ఉండటాన్ని ‘కో–ఇన్ఫెక్షన్స్‌ అంటారు. ఇలా రెండ్రెండు ఇన్ఫెక్షన్లు కలసి రావడం కాస్తంత అరుదు. కానీ ఇటీవల ఈ తరహా కేసులు పెద్ద ఎత్తున రావడం విశేషం. ఇక ఈ కేస్‌ స్టడీలో కోవిడ్‌ కారణంగా బాధితురాలిని నాన్‌–ఇన్వేజివ్‌ వెంటిలేషన్‌ మీద పెట్టి, ఆక్సిజన్‌ ఇస్తూ... రెండు రకాల ఇన్ఫెక్షన్లనూ తగ్గించడానికి మందులు వాడాల్సి వచ్చింది. 

వైరల్, బ్యాక్టీరియల్‌ జ్వరాలు కలగలసి... సాధారణంగా జ్వరాలతో బయటపడే ఇన్ఫెక్షన్లు రెండు రకాలుగా ఉంటాయి. వాటిల్లో మొదటివి బ్యాక్టీరియల్‌ జ్వరాలు. రెండోవి వైరల్‌ జ్వరాలు. అయితే ఇటీవల బ్యాక్టీరియల్‌ జ్వరాల్లోనే రెండు రకాలుగానీ లేదా ఒకేసారి రెండు రకాల వైరల్‌ ఇన్ఫెక్షన్లుగానీ... లేదంటే ఒకేసారి వైరల్‌తో పాటు బ్యాక్టీరియల్‌ జ్వరాలుగానీ కనిపిస్తున్నాయి. అంతేకాదు... ఒకే సమయంలో అనేక ఇన్ఫెక్షన్లతో పాటు ఒకే సమయంలో కుటుంబసభ్యుల్లో అనేక మంది జ్వరాల బారినపడటం అనేకమందికి ఆందోళన కలిగిస్తోంది.

బ్యాక్టీరియల్‌ జ్వరాలతో కలగలసి...  బ్యాక్టీరియల్‌ ఇన్ఫెక్షన్ల విషయానికి వస్తే కొందరిలో వైరల్‌ జ్వరాలతో పాటు టైఫాయిడ్‌ ఎక్కువగా కనిపిస్తోంది. మరికొందరిలో ఎలుకలతో వ్యాపించే బ్యాక్టీరియల్‌ జ్వరం ‘లెప్టోస్పైరోసిస్‌’ కనిపిస్తున్న దాఖలాలూ ఉన్నాయి. ఇటీవల రోజుల తరబడి వర్షాలు కురుస్తుండటంతో బొరియలు వాననీటిలో నిండిపోగా ఎలుకలు ఇళ్లలోకి రావడం పరిపాటిగా మారింది. లెప్టోస్పైరోసిస్‌ కనిపించడానికి ఇదే కారణం. ఇంకొందరిలో తొలుత జ్వరం రావడం... ఆ తర్వాత బ్యాక్టీరియల్‌ ఇన్ఫెక్షన్‌ తాలూకు రెండో పరిణామంగా (సెకండరీ ఇన్ఫెక్షన్‌ వల్ల) నిమోనియా కేసులూ కనిపిస్తు న్నాయి.  ఇక లక్షణాల తీవ్రత ఎక్కువగా లేని కోవిడ్‌ రకాలతో (ఒమిక్రాన్‌ వంటి వాటితో) కలిసి ఇతరత్రా జ్వరాలు రావడం చాలా ఎక్కువగా కనిపిస్తోంది. 

యాంటీబయాటిక్స్‌ వద్దు... జ్వరం వచ్చిన వెంటనే కొందరు పారాసిటమాల్‌తో పాటు యాంటీబయాటిక్స్‌ మొదలుపెడతారు. యాంటీవైరల్‌ జ్వరాలకు యాంటీబయాటిక్స్‌ పనిచేయకపోగా... అవసరం లేకపోయినా వాటిని తీసుకోవడం వల్ల కొన్ని కౌంట్లు మారుతాయి. విరేచనాల వంటివి అయ్యే ప్రమాదం ఉంటుంది. గ్యాస్ట్రైటిస్‌ వంటి అనర్థాలు వచ్చే ముప్పు ఉంటుంది. అందుకే జ్వరం వచ్చిన మొదటి రోజు నుంచే కాకుండా... మూడోనాడు కూడా జ్వరం తగ్గకపోతే... అప్పుడు మాత్రమే డాక్టర్‌ను సంప్రదించి, తగిన మోతాదులోనే యాంటీబయాటిక్స్‌ తీసుకోవాలి. 

ఇన్ఫెక్షన్లు కలగలసి రావడం ఇదే మొదటిసారి కాదు... గతంలోనూ కొన్ని సందర్భాల్లో డెంగీ, స్వైన్‌ ఫ్లూ, టైఫాయిడ్‌ లాంటివి కలసి వచ్చిన దాఖలాలు చాలానే ఉన్నాయి. అయితే ఇటీవల వర్షాలు సాధారణం కంటే ఎక్కువగా కురిశాయి. దాంతో దోమల కారణంగా మలేరియా, డెంగీ, చికున్‌గున్యా వంటివి కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 

నివారణ... వర్షాకాలంలో పరిసరాల్లో నీళ్లు పేరుకుపోవడంతో దోమలు వృద్ధి చెంది... ఈ జ్వరాలన్నీ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే ఇంటి పరిసరాల పారిశుద్ధ్య జాగ్రత్తలూ, వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ తగినంత అప్రమత్తంగా ఉండాలి. దోమలను ఇంట్లోకి రానివ్వకుండా మెష్‌ / మస్కిటో రెపల్లెంట్స్‌ వంటి ముందుజాగ్రత్త చర్యలను తీసుకోవాలి. పిల్లలు, వృద్ధుల ఆరోగ్యం పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలి. ఇక పెద్దవయసు వారు అప్పటికే మధుమేహం, అధిక రక్తపోటు వంటి వాటితో బాధపడే అవకాశాలున్నందున వాటి పట్ల మరింత అప్రమత్తత వహించాలి. మూత్రపిండాల వ్యాధితో బాధపడేవారిలో ఇన్ఫెక్షన్లు చాలా తేలిగ్గా సోకే అవకాశాలు ఎక్కువ. కాబట్టి మరింత జాగ్రత్తగా ఉండాలి. వెరసి అందరూ అప్రమత్తంగా ఉండటం చాలా అవసరం.

వైరల్‌ జ్వరాలివే.. వైరల్‌ జ్వరాల్లో ముఖ్యంగా డెంగీ ఇన్ఫెక్షన్‌ ఎక్కువగా వస్తోంది. సాధారణంగా అది కోవిడ్‌తో పాటు కలిసి రావడం చాలామందిలో కనిపిస్తోంది. మరికొందరిలో వైరల్‌ ఇన్ఫెక్షన్లయిన కోవిడ్, ఫ్లూ... ఈ రెండూ కలగలసి వచ్చాయి. ఇంకొందరిలో కోవిడ్, ఫ్లూ, స్వైన్‌–ఫ్లూ... ఈ మూడింటిలో ఏ రెండైనా కలసి రావడమూ కనిపించింది. 

లక్షణాలు... వైరల్‌ జ్వరాల విషయానికి వస్తే... వీటిల్లో జ్వరం తీవ్రత... బ్యాక్టీరియల్‌ ఇన్ఫెక్షన్ల కంటే ఎక్కువగా ఉంటుంది. కోవిడ్‌ వంటివి సోకినప్పుడు జ్వరం, దగ్గు కనిపిస్తుంటాయి. తీవ్రత కొంత తగ్గినప్పటికీ ఇటీవల కోవిడ్‌తో కలసి మరో ఇన్ఫెక్షన్‌ ఉంటే... ఆయాసం, ఊపిరి అందకపోవడం వంటి లక్షణాలూ ఉండవచ్చు. వెరసి... జ్వరం, స్వల్పంగా జలుబు/ఫ్లూ లక్షణాలు, కొందరిలో ఆయాసం, ఊపిరి సరిగా అందకపోవడం, నీరసం, ఒళ్లునొప్పులు వంటి లక్షణాలు ఎక్కువ. డెంగీ కేసుల్లో కొందరిలో ఒంటిపై ర్యాష్‌ వంటి లక్షణాలతో పాటు రక్తపరీక్షలు చేయించినప్పుడు... ప్లేట్‌లెట్స్‌ తగ్గడం వంటి లక్షణాలూ కనిపించవచ్చు.

నిర్ధారణ పరీక్షలు...  కోవిడ్‌ నిర్ధారణ కోసం ఆర్టీ–పీసీఆర్‌ అందరికీ తెలిసిన వైద్య పరీక్షే. డెంగీ నిర్ధారణ కోసం చేసే కొన్ని పరీక్షల్లో ఫలితాలు కొంత ఆలస్యంగా వచ్చే అవకాశం ఉంది. ఎలాగూ డెంగీలో లక్షణాలకే చికిత్స చేయాల్సి ఉన్నందున... ప్లేట్‌లెట్‌ కౌంట్‌తోనే దీన్ని అనుమానించి... తగిన చికిత్సలు అందించాలి. ఇక బ్యాక్టీరియల్‌ ఇన్ఫెక్షన్‌ అయిన టైఫాయిడ్‌ నిర్ధారణ కోసం వైడాల్‌ టెస్ట్‌ అనే వైద్య పరీక్ష చేయించాలి. అవసరాన్ని బట్టి కొన్ని ఇతర పరీక్షలూ చేయించాలి.

చికిత్స వైరల్‌ జ్వరాలకు నిర్దిష్ట చికిత్స లేనందున జ్వరానికి పారాసిటమాల్‌ ఇస్తూ... లక్షణాలను బట్టి సింప్టమాటిక్‌ ట్రీట్‌మెంట్‌ అందించాలి. ద్రవాహారాలు ఎక్కువగా ఇవ్వాలి. ఏవైనా దుష్ప్రభావాలు కనిపిస్తే... వాటిని బట్టి చికిత్సను మార్చాలి. (ఉదా. డెంగీలాంటి కేసుల్లో ప్లేట్‌లెట్స్‌ తగ్గినప్పుడు, వాటిని ఎక్కించడం). ఇక టైఫాయిడ్‌ వంటి బ్యాక్టీరియల్‌ జ్వరాలకు యాంటీబయాటిక్స్‌ పనిచేస్తాయి.

అయితే జ్వరం వచ్చిన రెండు, మూడు రోజుల వరకు అది వైరలా, బ్యాక్టీరియలా తెలియదు కాబట్టి కేవలం పారాసిటమాల్‌ తీసుకుంటూ... ఆ పైన కూడా జ్వరం వస్తూనే ఉంటే వైద్యుల వద్దకు వెళ్లి, పరీక్షలు చేయించి, తగిన  చికిత్సలు తీసుకోవాలి. ఇక లెప్టోస్పైరోసిస్‌ వంటివి కాలేయం, కిడ్నీ వంటి వాటిపై దుష్ప్రభావం చూపే అవకాశం ఉంది. సెకండరీ నిమోనియా మరింత ప్రమాదకారి. అందుకే ఈ కేసుల్లో మరింత అప్రమత్తంగా ఉండాలి. -డాక్టర్‌ ఆరతి బెల్లారి, కన్సల్టెంట్‌ ఫిజీషియన్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement