Viral infections
-
వాతావరణ మార్పులు.. ముసురుతున్న వ్యాధులు
సాక్షి, సిటీబ్యూరో: వాతావరణ మార్పులు నగరవాసులను వ్యాధుల బారిన పడేస్తున్నాయి. ముఖ్యంగా వైరల్ ఇన్ఫెక్షన్ల కారణంగా చెవి, ముక్కు, గొంతు సమస్యలతో బాధపడేవారి సంఖ్య పెరుగుతూనే ఉంది. నగరంలో ఈ సమస్యల విజృంభణతో కోఠిలోని ప్రభుత్వ ఈఎన్టీ ఆస్పత్రికి రోగులు పరుగులు పెడుతున్నారు. కోఠిలోని ఈఎన్టీ ఆసుపత్రికి గత కొన్ని రోజులుగా వేల సంఖ్యలో రోగులు వస్తుండటంతో రోజుకు 2 వేల మార్క్‌ను దాటుతున్న పరిస్థితి కనిపిస్తోంది. దీని ఫలితంగా ఆసుపత్రికి వచ్చిన వారిని పరీక్షించడానికి గంటల తరబడి ఆలస్యమవుతోంది. ఇక్కడకు రోగులు గొంతు, చెవి ఇన్ఫెక్షన్ల వంటి సాధారణ సమస్యలతోనే వస్తారు. వచ్చేవారిలో దాదాపు 80– 85 శాతం మందికి మందులతోనే సరిపోతుంది. అయినప్పటికీ గంటల తరబడి వేచి ఉండాల్సి రావడం రోగులకు ఇబ్బందికరంగా మారింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో మరిన్ని ఈఎన్టీ కేంద్రాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం స్పష్టంగా కనిపిస్తోంది. వాతావరణ మార్పులే కారణం.. శీతాకాలం ప్రారంభమయ్యే సమయంలో ఇలాంటి వ్యా«ధులు ప్రబలడం సహజమేనని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కోఠి ఈఎన్టీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.శంకర్ భరోసా కల్పిస్తున్నారు. చల్లని పదార్థాలకు దూరంగా ఉండడం వంటి జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందన్నారు. అయితే రోజుల తరబడి సమస్య ఇబ్బంది పెడితే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. తమ ఆసుపత్రి కరోనాకి ముందు పెద్ద సంఖ్యలో వచ్చేవారని, అదే విధంగా ఇప్పుడు కూడా రోగుల సంఖ్య పెరిగిందన్నారు. ఇక్కడికి వస్తున్న వారిలో జలుబు, దగ్గు తదితర సమస్యలే ఎక్కువగా ఉన్నాయన్నారు. రోగులను పరీక్షించేందుకు ఆలస్యం అవ్వడానికి కొత్తగా ప్రవేశపెట్టిన ఈహెచ్ఎస్ విధానం కొంత వరకూ కారణమవుతోందన్నారు. ప్రతీ రోగికి ఆధార్ తనిఖీతో పాటు రోగి ఆరోగ్య వివరాలను సమగ్రంగా నమోదు చేస్తుండడంతో స్వల్ప ఇబ్బందులు ఎదురైనా ఈ విధానం రోగులకు అనేక విధాలుగా ప్రయోజనకరంగా ఉందన్నారు. -
వైరస్ లోడింగ్.. జరభద్రం.. ప్రతి ఇద్దరిలో ఒకరు జ్వర బాధితులే
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సహా దేశవ్యాప్తంగా వైరల్ ఇన్ఫెక్షన్లు, ఇన్‌ఫ్లూయెంజా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఒమిక్రాన్ రూపంలో దేశంలోకి కోవిడ్ థర్డ్‌వేవ్ ప్రవేశించి ఏడాది దాటినా ఇంకా దాని రూపాంతరాలు వ్యాప్తిలోనే ఉంటున్నాయని వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు. తమ వద్దకు వస్తున్న ప్రతి ఇద్దరు రోగుల్లో ఒకరు దగ్గు, జలుబు, వైరల్ ఇన్ఫెక్షన్లతో బాధపడుతున్నారని డాక్టర్లు చెబుతున్నారు. బాధితుల్లో పిల్లలు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారే ఎక్కువగా ఉంటున్నారని వివరిస్తున్నారు. కోవిడ్ వ్యాప్తి తగ్గడంతో ప్రజలు మాస్క్‌ల వాడకాన్ని దాదాపుగా మర్చిపోయారని.. రద్దీ ప్రాంతాల్లోనూ ఎవరూ పెద్దగా మాస్క్‌లు వాడటంలేదని విశ్లేషిస్తున్నారు. అందుకే వైరల్ జ్వరాలు ఒకరి నుంచి మరొకరికి సులభంగా వ్యాపిస్తున్నాయని వైద్యులు అంటున్నారు. ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ♦ తరచూ సబ్బుతో శుభ్రంగా చేతులు కడుక్కోవాలి. ♦ మాస్క్ , శానిటైజర్ వాడాలి. ♦ కళ్లు, ముక్కు, నోటిని అధికంగా తాకడం, రుద్దడం వంటివి మానాలి. ♦ జనసమ్మర్థ ప్రాంతాల్లోకి మాస్క్ లేకుండా వెళ్లకూడదు. ♦ బట్టలు, తువ్వాళ్లు, వాటర్ బాటిళ్ల వంటి వ్యక్తిగత వస్తువులను ఇతరులతో పంచుకోకూడదు. బాధితుల్లో దగ్గు అధికం.. గత 2 నెలలుగా ఢిల్లీలో ఇన్ ఫ్లూయెంజా కేసుల పెరుగుద ల అధికంగా ఉంది. చాలా మందిలో దగ్గు ఎక్కువగా ఉంటోంది. ఆస్తమా, అలర్జీ, సీవో పీడీ, ఇతర ఊపిరితిత్తుల సమస్యలున్న వారిలో సమస్యలు మరింతగా పెరుగుతున్నా యి. ఈ వైరస్‌లకు వాయుకాలుష్యం తోడుకావడంతో సమస్య తీవ్రమవుతోంది. ఈ వైరస్ల బారినపడిన వారు అజిత్రోమైసిన్ వంటి యాంటీబయోటిక్స్‌ను ఎక్కువగా వాడరాదు. ఇలాంటి వారికి ఫ్లూ వ్యాక్సిన్లు రక్షణనిస్తాయి. – డాక్టర్ (ప్రొ) గోపీచంద్ ఖిల్నానీ, చైర్మన్, పీఎస్ఆర్ఐ ఇన్స్టిట్యూట్, ఢిల్లీ ఈ వైరస్ ఏమిటో అంతుబట్టట్లేదు చాలామంది బాధితుల్లో దగ్గు ఎక్కువై కళ్లెలో రక్తం పడటం, ఆయాసం, గొంతు బొంగురుపోవడం వంటి సమస్య లు పెరుగుతున్నాయి. ఒకట్రెండు రోజు లు జ్వరం, ఒళ్లునొప్పులు సైతం ఉంటు న్నాయి. ఇది ఇన్‌ఫ్లూయెంజాలో కొత్త వేరియెంటా లేక కొత్త మ్యు టేషన్ తీసుకున్న కోవిడ్ ఇన్ఫెక్షనా అనేది (ఆర్టీపీసీఆర్ గుర్తించని) స్పష్టంగా తెలియట్లేదు. దీర్ఘకాలిక ఊపిరితిత్తుల సంబంధిత సమస్యలతో బాధపడుతున్నవారు ఇన్‌ఫ్లూయెంజా ఫ్లూ షాట్, న్యూమోకోకల్ వ్యాక్సిన్ వేయించుకోవాలని సూచి స్తున్నాం. ఇవి ఇన్‌ఫ్లూయెంజా ఏ,బీ, స్వైన్‌ఫ్లూ నుంచి రక్షణనిస్తున్నాయి. – డాక్టర్ వీవీ రమణప్రసాద్, కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్, కిమ్స్ హాస్పిటల్ -
కో–ఇన్ఫెక్షన్స్.. ఏకకాలంలో అనేక జ్వరాలు..!
ఇటీవలి కాలంలో ప్రతి ఇంటా ఎవరో ఒకరు జ్వరంతో బాధపడటం కనిపిస్తోంది. మరీ ముఖ్యంగా ఈమధ్యకాలంలో వరసగా వర్షాలు అందరినీ బెంబేలెత్తించాయి. నిన్న మొన్నటి కరోనా కాలం తర్వాత... అదే సంఖ్యలో మూకుమ్మడి జ్వరాలు ఇటీవల నమోదయ్యాయి. అయితే ఇప్పటి జ్వరాల్లో ఓ ప్రత్యేకత ఉందంటున్నారు వైద్య నిపుణులు. కొందరిలో ఒకే సమయంలో రెండు రకాల జ్వరాలు నమోదవ్వడం ఇటీవల నమోదైన ధోరణి. ఇలా ఒకే సమయంలో అనేక ఇన్ఫెక్షన్లు రావడాన్ని వైద్యనిపుణులు తమ పరిభాషలో ‘కో–ఇన్ఫెక్షన్స్’గా చెబుతున్నారు. ఆ ‘కో–ఇన్ఫెక్షన్ల’పై అవగాహన కోసమే ఈ కథనం. ఓ కేస్ స్టడీ: ఇటీవల ఓ మహిళ జ్వరంతో ఆసుపత్రికి వచ్చింది. తొలుత ఆమెలో డెంగీ లక్షణాలు కనిపించాయి. పరీక్షలో ప్లేట్లెట్ కౌంట్ తగ్గడం డాక్టర్లు చూశారు. ఆ తర్వాత ఆమెకు ఆయాసంగా ఉండటం, ఊపిరి అందకపోవడం గమనించారు. అప్పుడు పరీక్షిస్తే ఆమెకు కోవిడ్ కూడా ఉన్నట్లు తేలింది. ఇలా ఒకేసారి రెండు రకాల జ్వరాలు (ఇన్ఫెక్షన్లు) ఉండటాన్ని ‘కో–ఇన్ఫెక్షన్స్ అంటారు. ఇలా రెండ్రెండు ఇన్ఫెక్షన్లు కలసి రావడం కాస్తంత అరుదు. కానీ ఇటీవల ఈ తరహా కేసులు పెద్ద ఎత్తున రావడం విశేషం. ఇక ఈ కేస్ స్టడీలో కోవిడ్ కారణంగా బాధితురాలిని నాన్–ఇన్వేజివ్ వెంటిలేషన్ మీద పెట్టి, ఆక్సిజన్ ఇస్తూ... రెండు రకాల ఇన్ఫెక్షన్లనూ తగ్గించడానికి మందులు వాడాల్సి వచ్చింది. వైరల్, బ్యాక్టీరియల్ జ్వరాలు కలగలసి... సాధారణంగా జ్వరాలతో బయటపడే ఇన్ఫెక్షన్లు రెండు రకాలుగా ఉంటాయి. వాటిల్లో మొదటివి బ్యాక్టీరియల్ జ్వరాలు. రెండోవి వైరల్ జ్వరాలు. అయితే ఇటీవల బ్యాక్టీరియల్ జ్వరాల్లోనే రెండు రకాలుగానీ లేదా ఒకేసారి రెండు రకాల వైరల్ ఇన్ఫెక్షన్లుగానీ... లేదంటే ఒకేసారి వైరల్‌తో పాటు బ్యాక్టీరియల్ జ్వరాలుగానీ కనిపిస్తున్నాయి. అంతేకాదు... ఒకే సమయంలో అనేక ఇన్ఫెక్షన్లతో పాటు ఒకే సమయంలో కుటుంబసభ్యుల్లో అనేక మంది జ్వరాల బారినపడటం అనేకమందికి ఆందోళన కలిగిస్తోంది. బ్యాక్టీరియల్ జ్వరాలతో కలగలసి... బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల విషయానికి వస్తే కొందరిలో వైరల్ జ్వరాలతో పాటు టైఫాయిడ్ ఎక్కువగా కనిపిస్తోంది. మరికొందరిలో ఎలుకలతో వ్యాపించే బ్యాక్టీరియల్ జ్వరం ‘లెప్టోస్పైరోసిస్’ కనిపిస్తున్న దాఖలాలూ ఉన్నాయి. ఇటీవల రోజుల తరబడి వర్షాలు కురుస్తుండటంతో బొరియలు వాననీటిలో నిండిపోగా ఎలుకలు ఇళ్లలోకి రావడం పరిపాటిగా మారింది. లెప్టోస్పైరోసిస్ కనిపించడానికి ఇదే కారణం. ఇంకొందరిలో తొలుత జ్వరం రావడం... ఆ తర్వాత బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ తాలూకు రెండో పరిణామంగా (సెకండరీ ఇన్ఫెక్షన్ వల్ల) నిమోనియా కేసులూ కనిపిస్తు న్నాయి. ఇక లక్షణాల తీవ్రత ఎక్కువగా లేని కోవిడ్ రకాలతో (ఒమిక్రాన్ వంటి వాటితో) కలిసి ఇతరత్రా జ్వరాలు రావడం చాలా ఎక్కువగా కనిపిస్తోంది. యాంటీబయాటిక్స్ వద్దు... జ్వరం వచ్చిన వెంటనే కొందరు పారాసిటమాల్‌తో పాటు యాంటీబయాటిక్స్ మొదలుపెడతారు. యాంటీవైరల్ జ్వరాలకు యాంటీబయాటిక్స్ పనిచేయకపోగా... అవసరం లేకపోయినా వాటిని తీసుకోవడం వల్ల కొన్ని కౌంట్లు మారుతాయి. విరేచనాల వంటివి అయ్యే ప్రమాదం ఉంటుంది. గ్యాస్ట్రైటిస్ వంటి అనర్థాలు వచ్చే ముప్పు ఉంటుంది. అందుకే జ్వరం వచ్చిన మొదటి రోజు నుంచే కాకుండా... మూడోనాడు కూడా జ్వరం తగ్గకపోతే... అప్పుడు మాత్రమే డాక్టర్‌ను సంప్రదించి, తగిన మోతాదులోనే యాంటీబయాటిక్స్ తీసుకోవాలి. ఇన్ఫెక్షన్లు కలగలసి రావడం ఇదే మొదటిసారి కాదు... గతంలోనూ కొన్ని సందర్భాల్లో డెంగీ, స్వైన్ ఫ్లూ, టైఫాయిడ్ లాంటివి కలసి వచ్చిన దాఖలాలు చాలానే ఉన్నాయి. అయితే ఇటీవల వర్షాలు సాధారణం కంటే ఎక్కువగా కురిశాయి. దాంతో దోమల కారణంగా మలేరియా, డెంగీ, చికున్‌గున్యా వంటివి కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నివారణ... వర్షాకాలంలో పరిసరాల్లో నీళ్లు పేరుకుపోవడంతో దోమలు వృద్ధి చెంది... ఈ జ్వరాలన్నీ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే ఇంటి పరిసరాల పారిశుద్ధ్య జాగ్రత్తలూ, వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ తగినంత అప్రమత్తంగా ఉండాలి. దోమలను ఇంట్లోకి రానివ్వకుండా మెష్ / మస్కిటో రెపల్లెంట్స్ వంటి ముందుజాగ్రత్త చర్యలను తీసుకోవాలి. పిల్లలు, వృద్ధుల ఆరోగ్యం పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలి. ఇక పెద్దవయసు వారు అప్పటికే మధుమేహం, అధిక రక్తపోటు వంటి వాటితో బాధపడే అవకాశాలున్నందున వాటి పట్ల మరింత అప్రమత్తత వహించాలి. మూత్రపిండాల వ్యాధితో బాధపడేవారిలో ఇన్ఫెక్షన్లు చాలా తేలిగ్గా సోకే అవకాశాలు ఎక్కువ. కాబట్టి మరింత జాగ్రత్తగా ఉండాలి. వెరసి అందరూ అప్రమత్తంగా ఉండటం చాలా అవసరం. వైరల్ జ్వరాలివే.. వైరల్ జ్వరాల్లో ముఖ్యంగా డెంగీ ఇన్ఫెక్షన్ ఎక్కువగా వస్తోంది. సాధారణంగా అది కోవిడ్‌తో పాటు కలిసి రావడం చాలామందిలో కనిపిస్తోంది. మరికొందరిలో వైరల్ ఇన్ఫెక్షన్లయిన కోవిడ్, ఫ్లూ... ఈ రెండూ కలగలసి వచ్చాయి. ఇంకొందరిలో కోవిడ్, ఫ్లూ, స్వైన్–ఫ్లూ... ఈ మూడింటిలో ఏ రెండైనా కలసి రావడమూ కనిపించింది. లక్షణాలు... వైరల్ జ్వరాల విషయానికి వస్తే... వీటిల్లో జ్వరం తీవ్రత... బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల కంటే ఎక్కువగా ఉంటుంది. కోవిడ్ వంటివి సోకినప్పుడు జ్వరం, దగ్గు కనిపిస్తుంటాయి. తీవ్రత కొంత తగ్గినప్పటికీ ఇటీవల కోవిడ్‌తో కలసి మరో ఇన్ఫెక్షన్ ఉంటే... ఆయాసం, ఊపిరి అందకపోవడం వంటి లక్షణాలూ ఉండవచ్చు. వెరసి... జ్వరం, స్వల్పంగా జలుబు/ఫ్లూ లక్షణాలు, కొందరిలో ఆయాసం, ఊపిరి సరిగా అందకపోవడం, నీరసం, ఒళ్లునొప్పులు వంటి లక్షణాలు ఎక్కువ. డెంగీ కేసుల్లో కొందరిలో ఒంటిపై ర్యాష్ వంటి లక్షణాలతో పాటు రక్తపరీక్షలు చేయించినప్పుడు... ప్లేట్లెట్స్ తగ్గడం వంటి లక్షణాలూ కనిపించవచ్చు. నిర్ధారణ పరీక్షలు... కోవిడ్ నిర్ధారణ కోసం ఆర్టీ–పీసీఆర్ అందరికీ తెలిసిన వైద్య పరీక్షే. డెంగీ నిర్ధారణ కోసం చేసే కొన్ని పరీక్షల్లో ఫలితాలు కొంత ఆలస్యంగా వచ్చే అవకాశం ఉంది. ఎలాగూ డెంగీలో లక్షణాలకే చికిత్స చేయాల్సి ఉన్నందున... ప్లేట్లెట్ కౌంట్తోనే దీన్ని అనుమానించి... తగిన చికిత్సలు అందించాలి. ఇక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అయిన టైఫాయిడ్ నిర్ధారణ కోసం వైడాల్ టెస్ట్ అనే వైద్య పరీక్ష చేయించాలి. అవసరాన్ని బట్టి కొన్ని ఇతర పరీక్షలూ చేయించాలి. చికిత్స వైరల్ జ్వరాలకు నిర్దిష్ట చికిత్స లేనందున జ్వరానికి పారాసిటమాల్ ఇస్తూ... లక్షణాలను బట్టి సింప్టమాటిక్ ట్రీట్మెంట్ అందించాలి. ద్రవాహారాలు ఎక్కువగా ఇవ్వాలి. ఏవైనా దుష్ప్రభావాలు కనిపిస్తే... వాటిని బట్టి చికిత్సను మార్చాలి. (ఉదా. డెంగీలాంటి కేసుల్లో ప్లేట్లెట్స్ తగ్గినప్పుడు, వాటిని ఎక్కించడం). ఇక టైఫాయిడ్ వంటి బ్యాక్టీరియల్ జ్వరాలకు యాంటీబయాటిక్స్ పనిచేస్తాయి. అయితే జ్వరం వచ్చిన రెండు, మూడు రోజుల వరకు అది వైరలా, బ్యాక్టీరియలా తెలియదు కాబట్టి కేవలం పారాసిటమాల్ తీసుకుంటూ... ఆ పైన కూడా జ్వరం వస్తూనే ఉంటే వైద్యుల వద్దకు వెళ్లి, పరీక్షలు చేయించి, తగిన చికిత్సలు తీసుకోవాలి. ఇక లెప్టోస్పైరోసిస్ వంటివి కాలేయం, కిడ్నీ వంటి వాటిపై దుష్ప్రభావం చూపే అవకాశం ఉంది. సెకండరీ నిమోనియా మరింత ప్రమాదకారి. అందుకే ఈ కేసుల్లో మరింత అప్రమత్తంగా ఉండాలి. -డాక్టర్ ఆరతి బెల్లారి, కన్సల్టెంట్ ఫిజీషియన్ -
టమాటో ఫ్లూపై కేంద్రం అలర్ట్.. రాష్ట్రాలకు కీలక సూచనలు
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో టమాటో ఫ్లూ వ్యాధి నాలుగు రాష్ట్రాలకు వ్యాపించింది. ఇప్పటివరకు కేరళ, తమిళనాడు, హర్యానా, ఒడిశాలో ఈ కేసులు వెలుగుచూశాయి. 100మందికిపైగా చిన్నారులు ఈ వ్యాధి బారినపడి ఉంటారని అంచనా. ఈ నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. వ్యాధిని నియంత్రించేందుకు రాష్ట్రాలకు కీలక సూచనలు చేసింది. ► హ్యాండ్, ఫుట్, మౌత్ డీసీజ్(హెచ్ఎఫ్ఎండీ) వ్యాధినే టమాటో ఫ్లూ అంటారు. ఇది 10 ఏళ్లలోపు చిన్నారులకు ఎక్కువగా వ్యాపిస్తుంది. పెద్దలకు కూడా వ్యాపించే అవకాశముంది. ► టమాటో ఫ్లూ వ్యాధి గురించి చిన్నారులకు అవగాహన కల్పించాలని కేంద్రం రాష్ట్రాలకు సూచించింది. దాని వల్ల కలిగే దుష్ప్రభావాలను కూడా వివరించాలని పేర్కొంది. ► టమాటో ఫ్లూ లక్షణాలు ఇతర వైరల్ ఇన్ఫెక్షన్లలాగే ఉంటాయి. ఈ వ్యాధి సోకిన చిన్నారుల్లో జ్వరం, అలసట, ఒంటి నొప్పులు, చర్మంపై దద్దుర్లు వంటి లక్షణాలు ఉంటాయి. ► టమాటో ఫ్లూకు కోవిడ్, మంకీపాక్స్, డెంగ్యూ, చికున్‌గున్యా వంటి వ్యాధులతో ఎలాంటి సంబంధం లేదు. ► అపరిశుభ్ర ఉపరితలాన్ని తాకడం, పండ్లు, వస్తువులను శుభ్రం చేయకుండా నేరుగా నోట్లో పెట్టుకోవడం వంటి కారణాలతో ఈ వ్యాధి సోకవచ్చు. ► టమాటో ఫ్లూ సోకిన, లక్షణాలు కన్పించిన చిన్నారులను ఐదు రోజుల పాటు ఐసోలేషన్‌లో ఉంచాలి. ► జ్వరం, దద్దుర్లు ఉన్న చిన్నారులు ఇతరులను తాకడం, కౌగిలించుకోవడం చేయవద్దని తల్లిదండ్రులు చెప్పాలి ► నోట్లో వేలు పెట్టుకునే అలవాటు ఉన్న పిల్లలకు దాన్ని మాన్పించాలి. ► ఎప్పుడూ వేడి నీటితోనే పిల్లలకు స్నానం చేయించాలి. పోషక పదార్థాలున్న ఆహారాన్నే ఇవ్వాలి. ► పిల్లలకు విశ్రాంతి, తగినంత నిద్ర ఉండేలా చూసుకోవాలి. చదవండి: దారుణం.. చావు ఇంట్లో నవ్వులు.. ఫ్యామిలీ ఫోటోపై ట్రోలింగ్.. -
చిన్నారుల అరచేతుల్లో చర్మం ఊడుతోందా?
కొందరు చిన్నారుల అరచేతులు, అరికాళ్లలో పొట్టు ఒలిచిన విధంగా చర్మం ఊడి వస్తుంటుంది. అంతేకాదు విపరీతమైన దురదతోనూ బాధపడుతుంటారు. ఇందుకు ప్రధాన కారణం ఎగ్జిమా. ఇలా చర్మం ఊడిపోతూ, దురదల వంటి లక్షణాలు ఎగ్జిమాతో పాటు హైపర్కెరటోటిక్ పాల్మార్ ఎగ్జిమా, కెరటోలైసిస్ ఎక్స్ఫోలియేటా, ఎస్.ఎస్.ఎస్. సిండ్రోమ్, కన్స్టిట్యూషనల్ డిసీజెస్, తీవ్రమైన మానసిక ఒత్తిడి ఉన్నప్పుడు కనిపిస్తుంటాయి. తగినంత పోషకాహారం దొరకని పిల్లల్లో విటమిన్ లోపాల వల్ల కూడా అరచేతుల్లో, అరికాళ్లలో దురదలు రావడంతో పాటు చర్మం పగలడం, ఊడిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇక పెద్దల్లో సైతం సోరియాసిస్, స్కార్లెట్ ఫీవర్ వంటి కారణంగా ఇవే లక్షణాలు కనిపిస్తాయి. ఏవైనా వైరల్ ఇన్ఫెక్షన్లు వచ్చి తగ్గిన తర్వాత కొందరు పిల్లల్లో ఈ లక్షణాలే కనిపిస్తుంటాయి. కాకపోతే మొదట్లో చాలా తీవ్రంగా కనిపించినా క్రమక్రమంగా తగ్గిపోతాయి. కొన్నిసార్లు ఇన్ఫెక్షన్ వచ్చి తగ్గాక ఇలా అరచేతులు, అరికాళ్లలో సెకండరీ ఇన్ఫెక్షన్లా వచ్చి... ఇవే లక్షణాలు కనిపిస్తాయి. దీన్ని ‘పోస్ట్ వైరల్ ఎగ్జింథిమా’ అంటారు. ఇది రెండు నుంచి మూడు వారాల్లో పూర్తిగా తగ్గిపోతుంది. చికిత్స: పిల్లల అరచేతులు, అరికాళ్ల అంచుల్లో చర్మం ఊడుతూ... దురదలు వస్తూ తీవ్రంగా అనిపించే ఈ సమస్య... దానంతట అదే పూర్తిగా తగ్గిపోతుంది. చాలావరకు ప్రమాదకరం కూడా కాదు. ఉపశమనం కోసం, చేతులు తేమగా ఉంచుకోవడం కోసం మాయిశ్చరైజింగ్ క్రీమ్స్ రాయవచ్చు. జింక్ బేస్డ్ క్రీమ్స్ రాయడం వల్ల కూడా చాలావరకు ప్రయోజనం ఉంటుంది. లక్షణాలు మరీ ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రం పిల్లల డాక్టర్ / డర్మటాలజిస్ట్ సలహా మేరకు తక్కువ మోతాదు స్టెరాయిడ్స్ (మైల్డ్ స్టెరాయిడ్స్) క్రీమ్ రావడం ద్వారా ఉపశమనం పొందవచ్చు. ఒకవేళ పైన పేర్కొన్న సూచనలు పాటించాక కూడా సమస్య తగ్గకపోయినా, చేతులు, కాళ్లకు ఇన్ఫెక్షన్ వచ్చినా, లక్షణాలు మరీ ఎక్కువవుతున్నా డెర్మటాలజిస్ట్‌ను కలిసి తగు సలహా, చికిత్స తీసుకోవాలి. -
సీజనల్ వ్యాధులు.. కిచెన్ ఫార్మసీతో చెక్ పెట్టండి
ఈ సీజన్ పిల్లలకు పరీక్ష కాలమనే చెప్పాలి. స్కూలు పరీక్షల కంటే ముందు వాతావరణం సీజనల్ టెస్టులతో ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. జలుబు, దగ్గు, వాటి తీవ్రత పెరిగితే ఒళ్లు వెచ్చబడడం తరచూ పలకరించే సమస్యలే. ఏది ఒమిక్రాన్ జలుబో తెలియని ఆందోళన కాలం. అందుకే కిచెన్ ఫార్మసీని సిద్ధంగా ఉంచుకోవాలి. ►జలుబు తగ్గాలంటే.. నీటిలో కొద్ది పరిమాణంలో వాము, తులసి ఆకులు వేసి మరిగించాలి. చిన్నారులకు ఆ ఆవిరిని పట్టిస్తే జలుబుతోపాటు దగ్గు తీవ్రత కూడా తగ్గుతుంది. ►పసుపు యాంటీబయోటిక్‌గా పనిచేస్తుంది. వైరల్ ఇన్ఫెక్షన్లపైనా ఇది సమర్థంగా పనిచేస్తుంది. వేడి పాలలో కొంచెం పసుపు వేసి జలుబు, దగ్గుతో బాధపడుతున్న పిల్లలకు రోజుకు రెండుసార్లు తాగించాలి. ►జలుబుతోపాటు గొంతునొప్పి ఉంటే... గ్లాసు వేడి నీటిలో టీస్పూను ఉప్పు కలిపి, ఆ నీటితో గార్గిలింగ్ చేయాలి. నొప్పి తీవ్రతను బట్టి రోజుకు రెండు – మూడు సార్లు చేయవచ్చు. ►పదేళ్లు నిండిన పిల్లలకు ముక్కులు బ్లాక్ అయిపోయి గాలి పీల్చడానికి ఇబ్బంది పడుతున్నప్పుడు వేడి నీటిలో యూకలిప్టస్ ఆయిల్ కలిపి 10–15 నిమిషాల పాటు ఆవిరి పట్టాలి. ►ఆరోగ్య సమస్య వచ్చిందంటే పిల్లలకు జీర్ణశక్తి మందగిస్తుంది. ఆహారం సరిగా తీసుకోలేకపోతారు. ఈ కారణంగా నీరసం దరి చేరకుండా ఉండాలంటే... రోజులో రెండు– మూడు సార్లు తేనె చప్పరించాలి. ►జలుబు తీవ్రంగా ఉన్నప్పుడు గాలిపీలుస్తుంటే ఊపిరితిత్తుల నుంచి గుర్...మనే శబ్దం వస్తుంది. అప్పుడు ఛాతీ మీద ఆవనూనె, వెల్లుల్లి కలిపి మసాజ్ చేయాలి. అలాగే దేహంలో నీటిశాతాన్ని తగ్గనివ్వకుండా ఎక్కువ సార్లు మంచినీరు తాగించాలి. -
బ్రేక్ ఫాస్ట్ మానేస్తున్నారా? ఈ సమస్యలు పొంచి ఉన్నట్లే!!
ఆధునిక జీవన శైలిలో భాగంగా రాత్రిళ్లు ఆలస్యంగా పడుకోవడం, ఉదయం పొద్దెక్కేదాకా నిద్రలేవక పోవడం మామూలు వ్యవహారమైపోయింది. ఉదయం హడావిడిగా ఆఫీసులకు వెళ్లే క్రమంలో చాలామంది అల్పాహారాన్ని నిర్లక్ష్యం చేస్తుంటారు. అలా ఖాళీ కడుపుతో ఉండటం వల్ల పనిమీద ఆసక్తి తగ్గిపోవడం, చిరాకు పెరగడం వంటి మానసిక సమస్యలు కూడా వస్తుంటాయి. కారణం.. శరీరానికి అవసరమైన పోషకాలు లోపించడం. ఈ పోషకాలు లోపించడానికి మూలం ఉదయం పూట అల్పాహారం తీసుకోకపోవడమే ప్రధాన కారణమని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ అధ్యయనంలో వెల్లడైంది. అందువల్ల ప్రతి రోజూ అల్పాహారం తప్పనిసరిగా తీసుకోవాలి. ఒకవేళ ఏవైనా ఇతర కారణాల వల్ల ఇడ్లీ, చపాతీ, పూరీ, దోసె వంటి వాటిని తీçసుకోవడం ఇష్టం లేకపోతే లేదా సమయం సరిపోకపోతే మొలకెత్తిన గింజలు, ఉడికించిన కోడిగుడ్లు, నూనె లేకుండా చపాతీలు, పండ్ల రసాలేకాక... ఐదు నానబెట్టిన బాదం పప్పులు, పండ్లు, కూరగాయలతో కలగలిపిన సలాడ్లు వంటివి తీసుకోవడం మంచిది. కనీసం ఇలా చేసినా కూడా అనారోగ్యాన్ని కలిగించే వైరల్ ఇన్ఫెక్షన్లు దాదాపు దరిచేరవని వైద్యులు చెబుతున్నారు. వీటితో పాటు.. అల్పాహారంలో కార్బోహైడ్రేట్లు సమృద్ధిగా ఉండే ఆహారపదార్థాలు తీసుకోవడం వల్ల ఒత్తిడిని అధిగమించడమే కాకుండా, జ్ఞాపకశక్తి పెంచుతాయని వైద్య నిపుణులు తెలుపుతున్నారు. అలాగే డైటింగ్ చేసే వారు నిర్లక్ష్యం చేయకుండా.. అల్పాహారం తీసుకోవడం మరువకూడదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. చదవండి: Mental Health: మంచి మ్యూజిక్, యోగా, డాన్స్, స్విమ్మింగ్.. వీటితో ఒత్తిడి హుష్!! -
Health Tips: ఈ హెర్బల్ టీతో మీ ఇమ్యునిటీని పెంచుకోండిలా..
ఓ వైపు కోవిడ్, మరోవైను డెంగ్యూ, ఫ్లూ, చికెన్‌గున్యా.. రోగాలు. ఎటునుంచి ఓ వ్యాధి సోకుతుందో తెలియని సందిగ్ధం. అదేంటో కొందరు దేనినైనా తట్టుకుని దృఢంగా నిలబడతారు. మరికొంతమందేమో చిన్న పాటి జలుబుకు కూడా బెంబేలెత్తిస్తారు. ఇమ్యునిటీ సిస్టంలో వ్యత్యాసాలే ఇందుకు బలమైన కారణం. వంటగదిలో దొరికే తేలికపాటి పదార్ధాలతో సింపుల్‌గా తయారు చేసుకునే ఈ హెర్బల్ టీ తో మీ రోగనిరోధకతను పెంచుకోవచ్చని డా. అంజలి శర్మ చెబుతున్నారు. దాన్ని తయారుచేసుకునే విధానం మీ కోసం.. కావల్సిన పదార్ధాలు ►2 కప్పుల నీళ్లు ►గళ్ల ఉప్పు (తగినంత) ►1/4 టీ స్పూన్ వాము (కరోమ్ సీడ్స్ లేదా అజ్వైన్) ►1/4 టీ స్పూన్ జీలకర్ర ►1/4 టీ స్పూన్ పసుపు ►లవంగం ఒకటి ►ఒక టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క పొడి ►అర టీస్పూన్ సోంపు గింజలు తయారీ విధానం ఒక గిన్నెలో నీళ్లు పోసి బాగా మరగనియ్యాలి. తర్వాత అన్నింటినీ మరిగే నీళ్లలో వేసి మూత పెట్టి 3 నుంచి 4 నిముషాలపాటు మరగనియ్యాలి. తర్వాత వేడి వేడిగా తాగాలి. ప్రయోజనాలు.. ఈ హెర్బల్ టీలోని వాము, జీలకర్ర, సోంపు గింజలు మీ రోగనిరోధకతను పెంచడమేకాకుండా జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్థాయి. తాపాన్ని నివారించడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి. అలాగే పసుపు శరీరంలోని ఇన్ఫెక్షన్లతో పోరాడి రక్షణ నిస్తుంది. ఈ టీ ప్రతి ఉదయం తాగితే మీ ఆరోగ్యం పదిలంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు డా. అంజలి శర్మ సూచిస్తున్నారు. చదవండి: చర్మసౌందర్యానికి మరింత మేలు చేసే విటమిన్ ‘ఎ’ ఆహారం.. -
వ్యాధుల ఉచ్చులో బాల్యం
పరకాలరూరల్ : చదువుపై శ్రద్ధపెట్టి బంగారు భవితకు బాటలు వేసుకోవాల్సిన వయస్సులో విద్యార్థులను ఆరోగ్య సమస్యలు వెంటాడుతున్నా యి. 18 సంవత్సరాలలోపు పిల్లలు తెలియకుం డానే పలు వ్యాధుల బారిన పడుతున్నారు. వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రీయ బాల స్వస్థ కార్యక్రమం(ఆర్బీఎస్కే)లో పలు ఆందోళనకర విషయాలు వెలుగు చూసాయి. ప్రధానంగా పుట్టుకతో వచ్చిన వ్యాధులను గుర్తిం చక పోవడం, వాటిపై తల్లిదండ్రులకు అవగాహన లేకపోవడమే కారణంగా తెలుస్తోంది. జిల్లా వ్యాప్తంగా పద్దెనమిదేళ్ల లోపు విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి వారు ఎదుర్కొం టున్న ఆరోగ్య సమస్యలను గుర్తించడంతోపాటు ప్రాథమిక దశలోనే వ్యాధి నివారణ చర్యలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా ఆర్‌బీఎస్‌కేను ఏర్పాటు చేసింది. అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో వైద్య శిబిరా లు నిర్వహించి విద్యార్థులకు ఉన్న ఆరోగ్య సమస్యలను నిర్ధారిస్తున్నా రు. ఏడాదిలో అంగన్వాడీ కేంద్రాల్లో రెండు సార్లు, ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల విద్యార్థులకు ఒకసారి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగాఆరు టీంలు జిల్లాలో పరకాల, నర్సంపేట, వర్ధన్నపేట క్లస్టర్లు ఉండగా ప్రతి క్లష్టర్‌కు రెండు టీంల చొప్పున మొత్తం ఆరు టీంలు ఉన్నాయి. ప్రతి టీంలో ఇద్దరువైద్యాధికారులు(మేల్, ఫిమేల్), ఒక ఫార్మసిస్ట్, ఇద్దరు ఏఎన్ఎమ్లు ఉంటారు. వీరు వాహనాల్లో పాఠశాలలు తిరుగుతూ విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. వారిలో అనారోగ్య సమస్యలను గుర్తించి వాటి తీవ్రత ఆధారంగా స్థానిక పీహెసీకి, సీహెచ్‌సీకి, డిస్ట్రిక్ ఎర్లీ ఇంటర్వెన్షన్(డీఈఐసీ)కు రిఫర్ చేస్తారు. 96,536 మంది విద్యార్థులకు వైద్య పరీక్షలు జిల్లా వ్యాప్తంగా గత ఏడాది 96,536 మంది విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అందులో 867 అంగన్వాడీ కేంద్రాల పరిధిలోని ఆరు వారాల నుంచి ఆరేళ్ల వయస్సు పిల్లలు 31,159 మంది, ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో చదువుకుంటున్న 18 ఏళ్లలోపు విద్యార్థులు 65,377 మంది ఉన్నారు. అంగన్వాడీ పిల్లల్లో 1,640, స్కూళ్లు, కళాశాలల్లో 3,895 విద్యార్థులు ఏదో ఒక ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఎక్కువగా చర్మ, దంత సమస్యలతోపాటు వినికిడి, నేత్ర, గుండె సం బంధ వ్యాధులతో బాధపడుతున్నారు. పిల్లలకు సరైన పోషకాహారం అందకపోవడం, పుట్టుకతో వచ్చిన వ్యాధులను గుర్తించకపోవడం, సమస్యలపై తల్లిదండ్రులకు అవగాహన లేకపోవడం ప్రధాన కారణాలుగా తెలుస్తున్నాయి. ఆర్బీఎస్కేతో విద్యార్థులకు ప్రయోజనం గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో చదువుకునే పిల్లలు పేద, మధ్య తరగతికి చెందినవారే కాబట్టి ఆరోగ్య సమస్యలపై అవగాహన చాలా తక్కువ. దీంతో సమస్యలు జఠిలమై తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అయితే ఆర్బీఎస్కే వైద్య సేవలలో భాగంగా వైద్య శిబిరాల ద్వారా ఆరోగ్య సమస్యలను గుర్తించడంతోపాటు చికిత్స సైతం ఉచితంగా అందిస్తున్నారు. దీంతో చాలా మంది విద్యార్థుల కు ప్రయోజనం చేకూరుతోంది. ఆదిలోనే చికిత్స.. ఆర్బీఎస్కే ద్వారా విద్యార్థుల ఆరోగ్య సమస్యల కు ఆదిలోనే చికిత్స అందిస్తున్నారు. ప్రతి ఏటా వైద్య పరీక్షలు నిర్వహించి వివరాలను నమోదు చేయడం వల్ల సమస్యలపై అవగాహన రావడంతోపాటు పలు జాగ్రత్తలు తీసుకునేందుకు వీలవుతోంది. ఈ విద్యా సంవత్సరానికి గాను త్వరలోనే వైద్య శిబిరాలు ప్రారంభిస్తాం. – డాక్టర్ సుధీర్, ఆర్బీఎస్కే జిల్లా ఇన్చార్జి -
రుమటాయిడ్ ఆర్థరైటిస్
శరీరంలోని రోగనిరోధక వ్యవస్థలో జీవక్రియల మార్పుల వలన, జన్యుపరమైన మార్పుల వలన వ చ్చే కీళ్ళజబ్బులలో రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఒకటి. ప్రపంచంలో 0.5 శాతం నుండి 1 శాతం వరకు ఈ జబ్బుతో బాధపడుతున్నారు. 15 సం॥వయసు గల వారిలో ఈ జబ్బు రావడం చాలా అరుదు. 20 సం॥నుండి 80 సం॥మధ్య వయసు వారిలో వచ్చే అవకాశం చాలా ఎక్కువ. పురుషులలో కంటే స్త్రీలలో మూడింతలు అధికంగా వచ్చే అవకాశం ఉంటుంది. కారణాలు: శరీరంలోని జీవక్రియల అసమతుల్యత వలన, రోగ నిరోధక వ్యవస్థలోని మార్పుల వలన జబ్బు వస్తుంది. దీనితోపాటు శారీరక, మానసిక ఒత్తిడి కూడా ఒక కారణం. మానసిక ఒత్తిడి వలన జన్యుపరమైన మార్పులు సంభవించి ఈ జబ్బు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సరైన ఆరోగ్య పద్ధతులు పాటించనివారు, ధూమపానం, మద్యపానం చేసేవారిలో ఈ జబ్బు వచ్చే అవకాశం ఎక్కువ. లక్షణాలు: ఈ కీళ్ళ జబ్బు వలన కీళ్లలో సైనవియల్ మెంబ్రేన్ దెబ్బతింటుంది. కీళ్ళలో అనవసరమైన ఫైబ్రస్ టిష్యూ పేరుకుపోతుంది. దానిని ఫ్యానస్ అంటారు. ఈ ప్యానస్ అనే చెడు పదార్థం వలన కీళ్ళలో కార్టిలేజ్ దెబ్బతింటుంది. కీళ్లలో వాపులు తరచు వస్తూ పోతూ ఉంటాయి. ఈ జబ్బుతో లక్షణాలు కొన్నిసార్లు అధికం అవడం, కొన్నిసార్లు తాత్కాలికంగా ఉపశమనం లభించడం జరుగుతుంటుంది. లక్షణాలు అధికం అయినపుడు జ్వరం, కీళ్లలో వాపులు, కీళ్ళు ఎరుపెక్కడం, కీళ్ళు బిగుసుకు పోవడం, తీవ్రమైన నొప్పితో కదలికలు తగ్గిపోతాయి. ఆకలి తగ్గినపుడు రుమాటాయిడ్ ఆర్థరైటిస్ చేతి మణికట్టుకీళ్ళు, చేతివేళ్ళు మోచేతికీళ్ళు, మోకాళ్ళు, ఎక్కువగా దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఈ ఆర్థరైటిస్ కేవలం కీళ్ళు దెబ్బతినడమే కాకుండా, శరీరంలో ఇతర అవయవాలు కూడా దెబ్బతింటాయి. ఊపిరితిత్తులలోని పైపొర, గుండె పైపొర దెబ్బతినే అవకాశం ఉంటుంది. తద్వారా గుండెనొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. తరచుగా ఊపిరితిత్తులలో నెమ్ము కారణంగా తుమ్ములు రావడం, దగ్గురావడం జరుగుతుంది. రక్తకణాల సంఖ్య పడిపోయి అనీమియాకి కారణం అవుతుంది. ప్లీహం వాపు వస్తుంది. కళ్లు, నోరు పొడిబారిపోతాయి. చర్మం కిందిభాగంలో గుళికల్లాంటి ఆకారాలు ఏర్పడతాయి. వీటిని రుమటాయిడ్ నాడ్యుల్స్ అంటారు. వ్యాధి నిర్ధారణ: రక్తంలోని యాంటీబాడిస్ కనుగొనే పరీక్ష రుమటాయిడ్ ఫ్యాక్టర్ పరీక్ష ద్వారా నిర్ధారించవచ్చు. అలాగే యాంటీ సీసీపీ యాంటి సిట్రులినేటెడ్, ఫెస్టైడ్ పరీక్ష ద్వారా నిర్ధారించవచ్చును. ఏఎన్ఏ పరీక్ష ద్వారా కూడా నిర్ధారించవచ్చును. కీళ్ళని ఎక్స్‌రే తీయించి, ఎముకలలో ఎరోషన్స్ గుర్తించి నిర్ధారించవచ్చును. సాధారణ పరీక్షలు సీబీపీ, ఈఎస్ఆర్, సీఆర్పీ పరీక్షలు కూడా వ్యాధిని నిర్ధారించడంలో సహాయపడతాయి. జాగ్రత్తలు: ఇలాంటి కీళ్ళజబ్బుల బారిన పడకుండా ప్రతిరోజు వ్యాయామం చేయాలి. సరైన పోషకాహారం తీసుకోవాలి. ఎలాంటి వైరల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. శారీరక, మానసిక ఒత్తిళ్లని తగ్గించుకోవడానికి ప్రతినిత్యం యోగా, ధ్యానం చేయాలి. హోమియో వైద్యం రోగి మానసిక, శారీరక లక్షణాలను అనుసరించి హోమియోవైద్యం ఇవ్వడం జరుగుతుంది. లెడంపాల్, బ్రయోనియా, రస్టాక్స్, డల్కెమరా, కాల్సికమ్, బెంజోయిక్ ఆసిడ్, కాలిమూర్, పల్సటిల్లా తదితర మందులు ఉపకరిస్తాయి. డాక్టర్ మురళి అంకిరెడ్డి, ఎం.డి (హోమియో), స్టార్ హోమియోపతి, సికింద్రాబాద్, దిల్సుఖ్నగర్, కూకట్పల్లి, విశాఖపట్నం, తిరుపతి, విజయవాడ, రాజమండ్రి, హనుమకొండ-వరంగల్, కర్ణాటక ఫోన్: 7416 107 107 / 7416 102 102 www.starhomeo.com E-mail: info@starhomeopathy.com -
వినికిడి సమస్యలకు వీడ్కోలు...
జ్ఞానేంద్రియాలలో కన్ను తర్వాత అంతటి ప్రాధాన్యత చెవిదే. అందుకే చెవులు సరిగా వినిపించకపోతే వచ్చే సమస్యలు అన్నీ ఇన్నీ కావు. ఇప్పుడు సరిగా వినిపించకపోవడం అన్నది ఒక సమస్యే కాదు. ఎందుకంటే... బయటకు కనిపించకుండా, కేవలం చెవుల లోపలి భాగాల్లో, చెవిలోకి శబ్దతరంగాలను తీసుకెళ్లే నాళం (కెనాల్) లో, వెంట్రుకల మాటున అమర్చగలిగే అనేక ఉపకరణాలు (హియరింగ్ ఎయిడ్స్) అందుబాటులో ఉన్నాయి. చిన్నప్పుడు, పెద్దయ్యాక వచ్చే అనేక వినికిడి సమస్యలు, కారణాలు, పరిష్కారాలు వంటి అనేక అంశాలపై అవగాహన కోసం ఈ కథనం. కొందరిలో వినికిడి సమస్యలు తల్లి కడుపులో ఉన్నప్పుడు మొదలుకొని ఏ దశలోనైనా రావచ్చు. పిల్లల్లో వినికిడి సమస్యలకు కారణాలు... గర్భవతిగా ఉన్నప్పుడు తల్లికి రుబెల్లా అనే వైరల్ఇన్ఫెక్షన్ సోకడం బిడ్డ కడుపులో ఉన్నప్పుడు తల్లి తీసుకునే అమైనోగ్లైకోసైట్స్ వంటి మందుల వల్ల బిడ్డ పుట్టగానే ఏడ్వకపోవడం (బర్త్ అనాక్సియా) బిడ్డ పుట్టగానే వచ్చే నియోనేటల్ జాండీస్ (కామెర్ల)లో బిలురుబిన్ పాళ్లు ఎక్కువగా ఉండటం నెలలు నిండకుండానే బిడ్డపుట్టడం (ప్రీ-మెచ్యూర్ బర్త్) పుట్టిన బిడ్డను నియోనేటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఎన్ఐసీయూ) లో 48 గంటలకు పైగా ఉంచి చికిత్స చేయాల్సి రావడం... మీజిల్స్, మంప్స్, మెనింజైటిస్ వంటి జబ్బులకు గురయ్యే పిల్లల్లో మేనరికపు వివాహాలు చేసుకున్న తల్లిదండ్రులకు పుట్టే పిల్లల్లో ... పెద్దల్లో వచ్చే వినికిడి సమస్యలకు కారణాలు: ప్రమాదాలలో తలకు/చెవికి దెబ్బతగిలిన వారిలో డయాబెటిస్ ఉన్నవారిలో రక్తపోటు ఉన్నవారిలో అత్యంత సన్నటి రక్తనాళాలు దెబ్బతినడం వల్ల వైరల్ ఇన్ఫెక్షన్స్ కారణంగా లోపలి చెవి దెబ్బతిన్న వారిలో (ఉదా: లాబ్రింథైటిస్) కొన్ని మందులు వాడిన వారిలో వాటి దుష్ర్పభావంతో (ఉదా: అమికాసిస్ అనే మందును కొద్దిరోజులు వాడిన వారిలో) కొన్నిరకాల జబ్బులు ఉన్నవారికి మూత్రవిసర్జన ఎక్కువగా అయ్యేందుకు ఇచ్చే మందుల (డై-యూరెటిక్స్)తో మధ్య చెవి సమస్యలు ఉన్నవారిలో మధ్య చెవిలో వినికిడికి ఉపయోగపడే మూడు ఎముకల్లో చివరిదైన స్టెపీస్ స్పందించకుండా ఫిక్స్ అయ్యే సమస్య అయిన ఆటో స్ల్కిరోసిస్ ఉన్నవారిలో. వయసు పైబడిన వారిలో... చాలామందిలో వయసు పైబడ్డ తర్వాత వినికిడి శక్తి తగ్గడం సాధారణం. విదేశాల్లో సాధారణంగా 60, 65 ఏళ్ల వయసు తర్వాత వచ్చే ఈ సమస్య మన దేశంలో మాత్రం చాలా త్వరగా కనిపిస్తోంది. పురుషుల్లో ఇది 52-55 ఏళ్లలో కనిపిస్తే, మహిళల్లో మరింత త్వరగా అంటే 48-50 ఏళ్ల వయసులోనే వస్తోంది. ఇలా వయసుతో పాటు కనిపించే ఈ సమస్యను ‘ప్రెస్బై ఎక్యూసిస్’ అంటారు. వినికిడి సమస్యలు ప్రధానంగా రెండు రకాలు. అవి.... కండక్టివ్ హియరింగ్ లాస్: శబ్దతరంగాలు చెవిని, చెవి లోపలి భాగాలను సరిగా చేరకుండా ఉండటంతో వచ్చే సమస్యను కండక్టివ్ హియరింగ్ లాస్ అంటారు. దీన్ని వైద్యచికిత్సతోనూ, శస్త్రచికిత్సలతోనూ సరిచేయవచ్చు. ఉదా: శబ్దతరంగాలు చెవి లోపలికి వెళ్లడానికి ఇబ్బందిగా ఉన్నప్పుడు టింపనోప్లాస్టీ, స్టేపిడెక్టమీ వంటి శస్త్రచికిత్సలతో మెరుగుపరచవచ్చు. సెన్సోరీ-న్యూరల్ డెఫ్నెస్: ఇవి జ్ఞానేంద్రియ పరమైన లేదా నరాలకు సంబంధించిన సమస్యలై ఉంటాయి. ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు పిల్లల్లోనూ, పెద్దల్లోనూ వాళ్లు వాడదగిన వినికిడి ఉపకరణాల (హియరింగ్ఎయిడ్స్) ద్వారా సమస్యను అధిగమించవచ్చు. ఉపకరణాలు... సెన్సోరీ-న్యూరల్ సమస్యలతో వినికిడి సమస్య వచ్చిన వారికి వినికిడి ఉపకరణాల (హియరింగ్ ఎయిడ్స్)తో మంచి ఫలితం ఉంటుంది. అయితే చెవిటి మిషిన్ పెట్టుకోవడం వల్ల కొందరికి తమ లోపాన్ని తెలియజెప్పినట్లుగా ఉండటంతో ఆత్మన్యూనతకు గురయ్యే అవకాశాలున్నాయి. అందుకే ఇప్పుడు ఇలాంటి వారికోసం బయటికి కనిపించకుండా చెవి లోపలి భాగంలో, చెవి నుంచి శబ్దతరంగాలను తీసుకెళ్లే కెనాల్లో అమర్చే డిజిటల్ హియరింగ్ ఎయిడ్స్ అందుబాటులోకి వచ్చాయి. ఇక కొందరిలో చెవి వెనక భాగంలో అమర్చుకునే తరహా వినికిడి ఉపకరణాలూ అందుబాటులో ఉన్నాయి. కొందరిలో వినికిడి శక్తి కాస్త తగ్గి... అది మరింతగా తగ్గకుండా అలా స్థిరంగా ఉన్న సందర్భాల్లో కొన్ని ఇంప్లాంటబుల్ హియరింగ్ ఎయిడ్స్ (శస్త్రచికిత్స ద్వారా లోపల అమర్చదగిన వినికిడి ఉపకరణాలు) కూడా వాడవచ్చు. ఇలాంటి సమయాల్లో దానికి అవసరమైన ప్రాసెసర్‌ను (తరంగాలను గ్రహించి పెద్దగా వినబడేలా చేసే బయటి ఉపకరణం) తలవెంట్రుకల భాగంలో కనిపించకుండా అమర్చడానికి అవకాశం ఉంది. ఈ ఉపకరణాన్ని శస్త్రచికిత్స ద్వారా ఈఎన్టీ సర్జన్లు అమర్చుతారు. - నిర్వహణ : యాసీన్ డాక్టర్ విష్ణుస్వరూప్ రెడ్డి, హెచ్ఓడీ, సీనియర్ ఈఎన్టీ నిపుణులు, కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్