
సాక్షి, సిటీబ్యూరో: వాతావరణ మార్పులు నగరవాసులను వ్యాధుల బారిన పడేస్తున్నాయి. ముఖ్యంగా వైరల్ ఇన్‌ఫెక్షన్ల కారణంగా చెవి, ముక్కు, గొంతు సమస్యలతో బాధపడేవారి సంఖ్య పెరుగుతూనే ఉంది. నగరంలో ఈ సమస్యల విజృంభణతో కోఠిలోని ప్రభుత్వ ఈఎన్‌టీ ఆస్పత్రికి రోగులు పరుగులు పెడుతున్నారు. కోఠిలోని ఈఎన్‌టీ ఆసుపత్రికి గత కొన్ని రోజులుగా వేల సంఖ్యలో రోగులు వస్తుండటంతో రోజుకు 2 వేల మార్క్‌ను దాటుతున్న పరిస్థితి కనిపిస్తోంది.
దీని ఫలితంగా ఆసుపత్రికి వచ్చిన వారిని పరీక్షించడానికి గంటల తరబడి ఆలస్యమవుతోంది. ఇక్కడకు రోగులు గొంతు, చెవి ఇన్ఫెక్షన్ల వంటి సాధారణ సమస్యలతోనే వస్తారు. వచ్చేవారిలో దాదాపు 80– 85 శాతం మందికి మందులతోనే సరిపోతుంది. అయినప్పటికీ గంటల తరబడి వేచి ఉండాల్సి రావడం రోగులకు ఇబ్బందికరంగా మారింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో మరిన్ని ఈఎన్‌టీ కేంద్రాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం స్పష్టంగా కనిపిస్తోంది.
వాతావరణ మార్పులే కారణం..
శీతాకాలం ప్రారంభమయ్యే సమయంలో ఇలాంటి వ్యా«ధులు ప్రబలడం సహజమేనని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కోఠి ఈఎన్‌టీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.శంకర్ భరోసా కల్పిస్తున్నారు. చల్లని పదార్థాలకు దూరంగా ఉండడం వంటి జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందన్నారు. అయితే రోజుల తరబడి సమస్య ఇబ్బంది పెడితే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. తమ ఆసుపత్రి కరోనాకి ముందు పెద్ద సంఖ్యలో వచ్చేవారని, అదే విధంగా ఇప్పుడు కూడా రోగుల సంఖ్య పెరిగిందన్నారు.
ఇక్కడికి వస్తున్న వారిలో జలుబు, దగ్గు తదితర సమస్యలే ఎక్కువగా ఉన్నాయన్నారు. రోగులను పరీక్షించేందుకు ఆలస్యం అవ్వడానికి కొత్తగా ప్రవేశపెట్టిన ఈహెచ్‌ఎస్ విధానం కొంత వరకూ కారణమవుతోందన్నారు. ప్రతీ రోగికి ఆధార్ తనిఖీతో పాటు రోగి ఆరోగ్య వివరాలను సమగ్రంగా నమోదు చేస్తుండడంతో స్వల్ప ఇబ్బందులు ఎదురైనా ఈ విధానం రోగులకు అనేక విధాలుగా ప్రయోజనకరంగా ఉందన్నారు.