
లండన్: వాతావరణ మార్పులు, అధిక ఉష్ణోగ్రతలతో సముద్రాలు వేడెక్కుతున్నాయి. మంచు కరిగిపోతోంది. సముద్ర మట్టాలు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ పరిణామం ఇలాగే కొనసాగితే మరికొన్ని దశాబ్దాల్లో సముద్ర తీర ప్రాంతాల్లోని నగరాలు జల సమాధి కావడం తథ్యమన్న హెచ్చరికలు ఇప్పటికే వినిపిస్తున్నాయి. అతిపెద్ద మంచు కొండలకు నిలయమైన అంటార్కిటికా సముద్రంలో వాతావరణ మార్పుల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది.
అంటార్కిటికా మంచు కొండలపైనా, అంతర్భాగంలో కరిగిన నీరు, మంచు మిశ్రమం(స్లష్) గతంలో అంచనా వేసిన దానికంటే అధికంగా ఉన్నట్లు బ్రిటన్‌లోని యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్ పరిశోధకులు తాజా అధ్యయనంలో గుర్తించారు. ఈ అధ్యయనం పూర్తి వివరాలను నేచర్ జియోసైన్స్ పత్రికలో ప్రచురించారు. కృత్రిమ మేధ(ఏఐ) సాంకేతికతతో స్లష్ పరిమాణాన్ని తేల్చారు.
అంటార్కిటికాలో వేసవి తీవ్రత అధికంగా ఉన్న సమయంలో కరిగిన నీరు 57 శాతం స్లష్ రూపంలో, మిగతా 43 శాతం చెరువులు, కుంటల పైభాగంలో ఉన్నట్లు గుర్తించారు. మంచు కొండలపై ఉన్న నీరంతా సముద్రంలోకి చేరితే అంటార్కిటికా నీటి మట్టం మరింత పెరుగుతుందని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి చెందిన స్కాట్ పోలార్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ప్రతినిధి డాక్టర్ రెబెక్కా డెల్ వివరించారు. ఇప్పుటిదాకా ఉన్న అంచనాల కంటే 2.8 రెట్లు అధికంగా స్లష్ ఉన్నట్లు తెలిపారు. ఉష్ణోగ్రతలు మరింత పెరిగితే మంచు కొండలపై కరిగిన నీటి పరిమాణం వేగంగా పెరుగుతుంది. దాంతో బరువు పెరిగి మంచు కొండలు కూలిపోవడం, ముక్కలు కావడం మొదలవుతుంది. నీరంతా సముద్రంలోకి చేరుతుంది.
Comments
Please login to add a commentAdd a comment