Antarctic sea
-
Nature Geoscience: అంటార్కిటికాలో ‘కరిగిన నీటి’ ముప్పు
లండన్: వాతావరణ మార్పులు, అధిక ఉష్ణోగ్రతలతో సముద్రాలు వేడెక్కుతున్నాయి. మంచు కరిగిపోతోంది. సముద్ర మట్టాలు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ పరిణామం ఇలాగే కొనసాగితే మరికొన్ని దశాబ్దాల్లో సముద్ర తీర ప్రాంతాల్లోని నగరాలు జల సమాధి కావడం తథ్యమన్న హెచ్చరికలు ఇప్పటికే వినిపిస్తున్నాయి. అతిపెద్ద మంచు కొండలకు నిలయమైన అంటార్కిటికా సముద్రంలో వాతావరణ మార్పుల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. అంటార్కిటికా మంచు కొండలపైనా, అంతర్భాగంలో కరిగిన నీరు, మంచు మిశ్రమం(స్లష్) గతంలో అంచనా వేసిన దానికంటే అధికంగా ఉన్నట్లు బ్రిటన్‌లోని యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్ పరిశోధకులు తాజా అధ్యయనంలో గుర్తించారు. ఈ అధ్యయనం పూర్తి వివరాలను నేచర్ జియోసైన్స్ పత్రికలో ప్రచురించారు. కృత్రిమ మేధ(ఏఐ) సాంకేతికతతో స్లష్ పరిమాణాన్ని తేల్చారు. అంటార్కిటికాలో వేసవి తీవ్రత అధికంగా ఉన్న సమయంలో కరిగిన నీరు 57 శాతం స్లష్ రూపంలో, మిగతా 43 శాతం చెరువులు, కుంటల పైభాగంలో ఉన్నట్లు గుర్తించారు. మంచు కొండలపై ఉన్న నీరంతా సముద్రంలోకి చేరితే అంటార్కిటికా నీటి మట్టం మరింత పెరుగుతుందని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి చెందిన స్కాట్ పోలార్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ప్రతినిధి డాక్టర్ రెబెక్కా డెల్ వివరించారు. ఇప్పుటిదాకా ఉన్న అంచనాల కంటే 2.8 రెట్లు అధికంగా స్లష్ ఉన్నట్లు తెలిపారు. ఉష్ణోగ్రతలు మరింత పెరిగితే మంచు కొండలపై కరిగిన నీటి పరిమాణం వేగంగా పెరుగుతుంది. దాంతో బరువు పెరిగి మంచు కొండలు కూలిపోవడం, ముక్కలు కావడం మొదలవుతుంది. నీరంతా సముద్రంలోకి చేరుతుంది. -
A23a: అతి పెద్ద ఐస్‌బర్గ్... 40 ఏళ్ల తర్వాత కదిలింది
అది ప్రపంచంలోనే అతి పెద్ద ఐస్‌బర్గ్. పేరు ఏ23ఏ. విస్తీర్ణం ఏకంగా 4,000 చదరపు కిలోమీటర్లు. మరోలా చెప్పాలంటే పరిమాణంలో గ్రేటర్ లండన్‌తో పోలిస్తే రెండింతలకు పై చిలుకే. అంతటి విస్తీర్ణంతో, ఏకంగా 400 మీటర్ల మందంతో భారీ సైజుతో అలరారుతూ చూసేందుకది ఓ మంచు ద్వీపకల్పంలా కని్పంచేది. అలాంటి ఐస్‌బర్గ్ దాదాపు 40 ఏళ్ల తర్వాత కదలడం మొదలు పెట్టింది. ఈ పరిణామం పర్యావరణ నిపుణులను ఆందోళన పరుస్తోంది. గ్లోబల్ వార్మింగ్ తాలూకు దుష్పరిణామాలకు దీన్ని తాజా సంకేతంగా వారు భావిస్తున్నారు... 1986 నుంచీ... ఏ23ఏ ఐస్‌బర్గ్ అప్పుడెప్పుడో 1985 చివర్లో అంటార్కిటికా తీరం నుంచి విడిపోయింది. అంటార్కటికా తాలూకు అతి పెద్దదైన ఫిల్‡్షనర్ మంచు ఫలకం నుంచి విడిపోయిన భారీ ఐస్బర్గ్ల్లోకెల్లా పెద్దదిగా ఇది రికార్డులకెక్కింది. అప్పటికే ఏ23ఏపై సోవియట్ యూనియన్ ఒక పరిశోధన కేంద్రం కూడా ఏర్పాటు చేసుకుంది! అందులోని సామగ్రినంతటినీ అది హుటాహుటిన తరలించడం మొదలు పెట్టింది. కానీ కొద్దిపాటి ప్రయాణం అనంతరం 1986కల్లా అంటార్కిటికా పరిధిలోని వెడెల్ సముద్రంలో ఐస్‌బర్గ్ నిశ్చలంగా నిలిచిపోయింది. ఒకరకంగా సముద్రం తాలూకు అడుగు భాగంతో కలిసిపోయి అలా నిలబడిపోయింది. కరిగిపోతోంది... ఇంతకాలం నిశ్చలంగా ఉన్నది కాస్తా ఏ23ఏ ఇప్పుడు మరోసారి కదులుతోంది. దీనికి కారణాలపై సైంటిస్టులంతా దృష్టి సారించగా, ఇది అంటార్కిటికా సముద్ర జలాల ఉష్ణోగ్రత క్రమంగా పెరుగుతున్న ఫలితమేనని తేలింది! ‘‘దాదాపు 40 ఏళ్ల కాలగమనంలో ఐస్‌బర్గ్ పరిమాణంలో కుంచించుకుపోయింది. దానికి గ్లోబల్ వార్మింగ్ తోడైంది’’ బ్రిటిష్ అంటార్కిటిక్ సర్వే రిమోట్ సెన్సింగ్ నిపుణుడు డాక్టర్ ఆండ్రూ ఫ్లెమింగ్ తెలిపారు. వాస్తవానికి ఏ23ఏలో 2020లోనే అతి తక్కువ స్థాయిలో కదలికలు మొదలయ్యాయని చెప్పుకొచ్చారు. సముద్ర పవనాల హోరు, ప్రవాహాల జోరుకు అదిప్పుడు వేగం పుంజుకుందన్నారు. ఇప్పుడది క్రమంగా అంటార్కిటిక్ ద్వీపకల్పపు ఉత్తరాగ్రంకేసి కదులుతోంది. చివరికది ఐస్‌బర్గ్‌ల క్షేత్రంగా పిలిచే అంటార్కిటికా దక్షిణ ప్రాంతానికి చేరేలా కని్పస్తోంది. ప్రమాద ఘంటికే...! ఎంత పెద్ద ఐస్‌బర్గ్‌లైనా కాలక్రమంలో చిక్కిపోవడం, క్రమంగా కనుమరుగవడం పరిపాటే. కానీ అందుకు వందలు, కొన్నిసార్లు వేలాది ఏళ్లు కూడా పడుతుంటుంది. అలాంటి ప్రస్తుతం ప్రపంచంలోకెల్లా అతి పెద్దదైన ఏ23ఏ ఐస్‌బర్గ్ ఇలా శరవేగంగా కరుగుతుండటం, కదిలిపోతుండటం ప్రమాద సూచికేనని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అది దక్షిణ జార్జియాకేసి సాగితే అక్కడి జీవావరణానికి పెద్ద సమస్యగా కూడా మారవచ్చని చెబుతున్నారు. దాని నుంచి కరిగే నీటితో పెరిగిపోయే సముద్ర మట్టం ఆ ద్వీపకల్ప తీరంలో లక్షలాది సీల్స్, పెంగ్విన్లు, సముద్ర పక్షుల పునరుత్పత్తి ప్రాంతాలను ముంచెత్తవచ్చన్నది వారి ఆందోళన. అయితే ఈ పరిణామంతో కొన్ని లాభాలూ లేకపోలేదట! ‘‘ఐస్‌బర్గ్‌లు జీవనప్రదాలు కూడా. కరిగే క్రమంలో వాటినుంచి విడుదలయ్యే ఖనిజ ధూళి సమీప సముద్ర జీవజాలానికి ప్రాణాధారంగా మారుతుంది’’ అని సైంటిస్టులు చెబుతున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
‘థ్వాయిట్స్ హిమానీనదం’.. కరిగిపోతే ప్రళయమే!
సాక్షి, నేషనల్ డెస్క్: థ్వాయిట్స్ హిమానీనదం. అంటార్కిటికా ఖండం పశ్చిమ భాగంలోని అత్యంత భారీ మంచు కొండ. వైశాల్యం ఎంతంటే.. అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్ర వైశాల్యంతో సమానం. శతాబ్దాలుగా స్థిరంగా నిలిచి ఉన్న థ్వాయిట్స్ కొంతకాలంగా వాతావరణ మార్పుల కారణంగా శరవేగంగా కరిగిపోతోందట. ఎంతలా అంటే ఇప్పుడిది మునివేళ్లపై నిలబడి ఉందట! అందుకే శాస్తవేత్తలు థ్వాయిట్స్కు ప్రళయకాల హిమానీనదం (డూమ్స్‌డే గ్లేసియర్) అని మరోపేరు పెట్టారు. ఈ గ్లేసియర్తోపాటు సమీప ప్రాంతాల్లోని మంచు మొత్తం కరిగిపోతే ప్రపంచమంతటా సముద్ర మట్టం ఏకంగా 3 మీటర్ల మేర పెరిగి, తీర ప్రాంతాలు చాలావరకు నీట మునిగి నామరూపాల్లేకుండా పోతాయని హెచ్చరిస్తున్నారు. థ్వాయిట్స్ తాజా స్థితిగతులపై అమెరికా, యూకే, స్వీడన్ సైంటిస్టులు సంయుక్తంగా అధ్యయనం చేశారు. గత 200 ఏళ్లలో కరిగిన దానికంటే ఇప్పుడు రెండింతలు ఎక్కువ వేగంగా కరిగిపోతున్నట్లు గుర్తించారు. ఈ అధ్యయనం వివరాలను ‘నేచర్ జియోసైన్స్’ పత్రికలో ప్రచురించారు. సైంటిస్టులు అత్యాధునిక పరికరాలతో థ్వాయిట్స్ గ్లేసియర్ పరిమాణాన్ని గణించారు. ప్రతిఏటా 1.3 మేళ్లకుపైగా(2.1 కిలోమీటర్ల) కరిగిపోతున్నట్లు తేల్చారు. ‘‘గ్లేసియర్ చివరి దశకు చేరుకుంటోందని చెప్పొచ్చు. సమీప భవిష్యత్తులో పెద్ద మార్పులను మనం అంచనా వేయొచ్చు’’ అని బ్రిటిష్ అంటార్కిటిక్ సర్వేకు చెందిన మెరైన్ జియోఫిజిసిస్ట్ రాబర్ట్ లార్టర్ చెప్పారు. ఐరాస సమాచారం ప్రకారం ప్రపంచ జనాభాలో 40 శాతం సముద్ర తీరాలకు 60 మైళ్ల పరిధిలోనే నివసిస్తున్నారు. సముద్ర మట్టం పెరిగితే సమీపంలోని ఆవాసాలు మునిగిపోతాయి. మనుషులకు, ఇతర జీవజాలానికి పెను ముప్పు తప్పదు. గ్రేట్ బ్రిటన్ అంత పెద్దది! ► పశ్చిమ అంటార్కిటికాలోని థ్వాయిట్స్ గ్లేసియర్ యునైటెడ్ కింగ్డమ్ (యూకే) మొత్తం పరిమాణం కంటే కొంత తక్కువ పరిమాణంలో ఉంటుంది. అమెరికాలోని వాషింగ్టన్ రాష్ట్రంతో దాదాపు సమాన పరిమాణంలో ఉంటుంది. ► గ్లేసియర్ మొత్తం చుట్టుకొలత 74,131 చదరపు మైళ్లు(1,92,000 చదరపు కిలోమీటర్లు). అంటే గ్రేట్ బ్రిటన్ చుట్టుకొలతతో సమానం. ► ఇక దీని మందం ఎంతంటే 4,000 మీటర్లు (13,100 అడుగులు). ప్రపంచవ్యాప్తంగా సముద్ర మట్టాల పెరుగుదలలో థ్వాయిట్స్ వాటానే అధికం. ► థ్వాయిట్స్ మొత్తం మందం 4 కిలోమీటర్లు కాగా, ఇందులో రెండు కిలోమీటర్లకు పైగా సముద్ర ఉపరితలం నుంచి దిగువ భాగాన ఉంది. ► థ్వాయిట్స్ హిమానీనదం పూర్తిగా కరిగిపోతే ప్రపంచవ్యాప్తంగా సముద్ర నీటిమట్టం దాదాపు మూడు మీటర్ల మేర(10 అడుగులు) పెరుగుతుందని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. ఇదీ చదవండి: 1.8 మిలియన్ల ఏళ్ల నాటి మానవ దంతం -
ఇదే తొలిసారి.. అంటార్కిటిక్ మహాసముద్రంలో ప్లాస్టిక్ కాలుష్యం
ప్లాస్టిక్.. ప్టాస్టిక్.. భూగోళాన్ని వణికిస్తున్న భూతం. మనిషి ఉనికి ఉన్న ప్రతి చోటా ప్లాస్టిక్ ఆనవాళ్లు విధిగా కనిపిస్తున్నాయి. నీటితోపాటు గాలిలోనూ కంటికి కనిపించని ప్లాస్టిక్ రేణువులు తిష్ట వేశాయి. దీనివల్ల పర్యావరణానికి, తద్వారా మానవాళి మనుగడకు పెను ముప్పు పెరుగుతోందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నా పరిస్థితిలో మార్పు రావడం లేదు. ప్రపంచమంతటా ప్లాస్టిక్ వాడకం నానాటికీ భారీగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆంటార్కిటిక్ మహాసముద్రంలో కొత్తగా కురిసిన మంచులో కూడా సూక్ష్మ ప్లాస్టిక్ రేణువులు బయటపడటంఆందోళన కలిగిస్తోంది. అక్కడి మంచులో, ఉపరితల జలంలో ప్లాస్టిక్‌ను గతంలోనే గుర్తించినా కొత్తగా కురిసిన మంచులోనూ ఆ రేణువులు బయట పడటం ఇదే తొలిసారని పరిశోధకులు చెప్పారు. దీనివల్ల మంచు కరిగే వేగం బాగా పెరుగుతుందని చెబుతున్నారు. ఫలితంగా సముద్ర తీర ప్రాంతాలు నీట మునిగి అక్కడి జనం నిరాశ్రయులవుతారు. తీర నగరాలకు ముంపు ప్రమాదం మరింత పెరుగుతుంది. మారుమూలల్లో ప్లాస్టిక్ కాలుష్యం న్యూజిలాండ్‌లోని యూనివర్సిటీ ఆఫ్ కాంటర్బరీకి చెందిన పీహెచ్డీ విద్యార్థిని అలెక్స్ అవెస్ ఈ పరిశోధన చేపట్టారు. 2019లో అంటార్కిటిక్‌లోని రాస్ ఐస్ షెల్ఫ్ నుంచి మంచు నమూనాలు సేకరించారు. వాటిని కెమికల్ అనాలిసిస్ టెక్నిక్‌తో అధ్యయనం చేయగా సూక్ష్మ ప్లాస్టిక్ రేణువులు కనిపించాయి. 19 నమూనాలను సేకరించగా ప్రతిదాంట్లోనూ ప్లాస్టిక్ ఆనవాళ్లున్నాయి. ఇది చాలా బాధాకరమైన విషయమని అవెస్ అన్నారు. మానవ సంచారం లేని అత్యంత మారుమూల ప్రాంతంగా భావించే రాస్ ఐస్ షెల్ఫ్లోనూ ప్లాస్టిక్ కోరలు చాస్తుండటం ఆందోళనకరమన్నారు. సముద్రంలో 13 రకాలు కరిగిన ప్రతి లీటర్ మంచులో సగటున 29 మైక్రోప్లాస్టిక్ రేణువులున్నట్లు తేలింది! ఇటాలియన్ హిమానీ నదాల్లో కంటే అంటార్కిటిక్‌లోని రాస్ ఐలాండ్, స్కాట్ బేస్‌ల్లో ప్లాస్టిక 3 రెట్లు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. అంటార్కిటిక్‌లో 13 రకాల ప్లాస్టిక్లున్నాయి. కూల్‌డ్రింక్ సీసాలు, వస్త్రాల తయారీకి వాడే పీఈటీ రకం ప్లాస్టిక్ ఎక్కువగా కన్పించింది. ఈ సూక్ష్మ ప్లాస్టిక్ వ్యాప్తికి ప్రధాన వాహకం గాలే. ప్లాస్టిక్ రేణువులు గాలి ద్వారా వేల కిలోమీటర్లు సులువుగా ప్రయాణిస్తాయి. అయితే పర్యాటకుల ద్వారానే ప్లాస్టిక్ అంటార్కిటిక్ దాకా చేరి ఉంటుందని పరిశోధకుల అంచనా. ప్లాస్టిక్‌తో భారీ నష్టం 85 లక్షల చదరపు కిలోమీటర్లలో విస్తరించిన అంటార్కిటిక్ మహాసముద్ర పర్యావరణ వ్యవస్థ ప్లాస్టిక్ వల్ల బాగా దెబ్బతింటోంది. సముద్ర జీవులు ఆహార పదార్థాలుగా భ్రమించి విషపూరిత ప్లాస్టిక్‌ను తిని మృత్యువాత పడుతున్నాయి. రొయ్యల జాతికి చెందిన క్రిల్ అనే జీవులకు ఈ ముప్పు అధికంగా ఉన్నట్లు గమనించారు. సౌందర్య ఉత్పత్తుల వల్ల గత పదేళ్లలో భారీ పరిమాణంలో మైక్రోప్లాస్టిక్, టూరిజం వల్ల 25.5 బిలియన్ సింథటిక్ ఫైబర్లు అంటార్కిటక్ సముద్రంలో చేరుతున్నట్టు లెక్కగట్టారు. వాస్తవానికి ఈ పరిమాణం ఎన్నోరెట్లు ఎక్కువగా ఉంటుందంటున్నారు. చేపల వేట తదితరాల వల్ల కూడా సముద్రంలోకి ప్లాస్టిక్ వచ్చి చేరుతోంది. సముద్ర ఉపరితలంలోనే గాక అన్ని పొరల్లోనూ మైక్రో ప్లాస్టిక్ విస్తరించింది. ఉపరితలం నుంచి 6 నుంచి 11 మీటర్ల లోతులో ప్రతి చదరపు మీటర్‌కు 766 మైక్రోప్లాస్టిక్ రేణువులు కనిపించాయి! అంటార్కిటిక్, పరిసరాల్లో ప్లాస్టిక్ బెడద, పర్యావరణంపై దాని ప్రభావంపై పూర్తిస్థాయి అధ్యయనం తక్షణావసరమని బ్రిటిష్ యూనివర్సిటీ ఆఫ్ హల్ మెరైన్ బయాలజిస్టు డాక్టర్ కేథరిన్ వాలర్ అంటున్నారు. -
హిమ ఫలకం కింద నగరమంత సరస్సు
ప్రపంచంలోనే అతి పెద్ద ఐస్ షీట్ అని రికార్డు ఉండగానే మరో రికార్డును తూర్పు అంటార్కిటికా హిమ ఫలకం సొంతం చేసుకుంది. దీని కింద ఓ నగరమంత వైశాల్యంలో ఓ పెద్ద సరస్సు ఉందని తేలింది. హిమ ఫలకం మీద దాదాపు మూడేళ్లు ఏరియల్ సర్వే చేసిన చైనా శాస్త్రవేత్తలు.. దీనికి దాదాపు 3.2 కిలోమీటర్ల కింద సరస్సు ఉన్నట్టు గుర్తించారు. ఈ సరస్సుకు ‘స్నో ఈగల్’అని పేరు పెట్టారు. దీని వైశాల్యం 370 చదరపు కిలోమీటర్లు, పొడవు 48 కిలోమీటర్లు, వెడల్పు 14.5 కిలోమీటర్లు, లోతు 198 మీటర్లు. ఈ సరస్సులో 3.4 కోట్ల ఏళ్ల నాటి నది అవక్షేపాలు ఉండొచ్చని భావిస్తున్నారు. ఇదే గనక తెలిస్తే అంటార్కిటికా మంచుమయం కాకముందు ఎలా ఉండేదో తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలకు వీలుకానుంది. చదవండి👉చేపా చేపా.. వాకింగ్‌కు వస్తావా? -
మాయమైపోతున్న సముద్రాల్లోని మంచు
వాషింగ్టన్: ఆర్కిటిక్, అంటార్కిటిక్ సముద్రాల్లోని మంచు ఎన్నడూ లేనంత వేగంగా కరిగిపోతోందని నాసా పరిశోధకులు చెప్పారు. సముద్రాల్లోని మంచు నిల్వలకు సంబంధించి 1979 నుంచి ఉన్న డేటాను అధ్యయనం చేసిన నాసాలోని గోడర్డ్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ పరిశోధకులు, ఈ ఏడాది అక్టోబర్‌లో ఎప్పుడూ లేనంతగా ఈ రెండు సముద్రాల్లోని మంచు కరిగిపోరుుందన్నారు. రికార్డు స్థారుులో మంచు కరిగిపోవడం ఆర్కిటిక్‌కు కొత్తేమి కాదని, కానీ అంటార్కిటిక్‌లో కరిగిపోవడమే ఆశ్చర్యానికి గురిచేసిందని శాస్త్రవేత్త వాల్ట్ మియర్ తెలిపారు. ఇంతలా మంచు కరిగిపోవడానికి వాతావరణంలో చోటుచేసుకుంటున్న పెనుమార్పులే కారణమన్నారు. ఈ రెండు ప్రాంతాల్లోని గాలి, నీరు కూడా చాలా వేడిగా ఉంటున్నాయని, మంచు కరిగేందుకు ఇవి కూడా ఓ కారణం కావచ్చని వారు అంటున్నారు.