ప్లాస్టిక్.. ప్టాస్టిక్.. భూగోళాన్ని వణికిస్తున్న భూతం. మనిషి ఉనికి ఉన్న ప్రతి చోటా ప్లాస్టిక్ ఆనవాళ్లు విధిగా కనిపిస్తున్నాయి. నీటితోపాటు గాలిలోనూ కంటికి కనిపించని ప్లాస్టిక్ రేణువులు తిష్ట వేశాయి. దీనివల్ల పర్యావరణానికి, తద్వారా మానవాళి మనుగడకు పెను ముప్పు పెరుగుతోందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నా పరిస్థితిలో మార్పు రావడం లేదు. ప్రపంచమంతటా ప్లాస్టిక్ వాడకం నానాటికీ భారీగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆంటార్కిటిక్ మహాసముద్రంలో కొత్తగా కురిసిన మంచులో కూడా సూక్ష్మ ప్లాస్టిక్ రేణువులు బయటపడటంఆందోళన కలిగిస్తోంది.
అక్కడి మంచులో, ఉపరితల జలంలో ప్లాస్టిక్‌ను గతంలోనే గుర్తించినా కొత్తగా కురిసిన మంచులోనూ ఆ రేణువులు బయట పడటం ఇదే తొలిసారని పరిశోధకులు చెప్పారు. దీనివల్ల మంచు కరిగే వేగం బాగా పెరుగుతుందని చెబుతున్నారు. ఫలితంగా సముద్ర తీర ప్రాంతాలు నీట మునిగి అక్కడి జనం నిరాశ్రయులవుతారు. తీర నగరాలకు ముంపు ప్రమాదం మరింత పెరుగుతుంది.
మారుమూలల్లో ప్లాస్టిక్ కాలుష్యం
న్యూజిలాండ్‌లోని యూనివర్సిటీ ఆఫ్ కాంటర్బరీకి చెందిన పీహెచ్‌డీ విద్యార్థిని అలెక్స్ అవెస్ ఈ పరిశోధన చేపట్టారు. 2019లో అంటార్కిటిక్‌లోని రాస్ ఐస్ షెల్ఫ్ నుంచి మంచు నమూనాలు సేకరించారు. వాటిని కెమికల్ అనాలిసిస్ టెక్నిక్‌తో అధ్యయనం చేయగా సూక్ష్మ ప్లాస్టిక్ రేణువులు కనిపించాయి. 19 నమూనాలను సేకరించగా ప్రతిదాంట్లోనూ ప్లాస్టిక్ ఆనవాళ్లున్నాయి. ఇది చాలా బాధాకరమైన విషయమని అవెస్ అన్నారు. మానవ సంచారం లేని అత్యంత మారుమూల ప్రాంతంగా భావించే రాస్ ఐస్ షెల్ఫ్‌లోనూ ప్లాస్టిక్ కోరలు చాస్తుండటం ఆందోళనకరమన్నారు.
సముద్రంలో 13 రకాలు
కరిగిన ప్రతి లీటర్ మంచులో సగటున 29 మైక్రోప్లాస్టిక్ రేణువులున్నట్లు తేలింది! ఇటాలియన్ హిమానీ నదాల్లో కంటే అంటార్కిటిక్‌లోని రాస్ ఐలాండ్, స్కాట్ బేస్‌ల్లో ప్లాస్టిక 3 రెట్లు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. అంటార్కిటిక్‌లో 13 రకాల ప్లాస్టిక్‌లున్నాయి. కూల్‌డ్రింక్ సీసాలు, వస్త్రాల తయారీకి వాడే పీఈటీ రకం ప్లాస్టిక్ ఎక్కువగా కన్పించింది. ఈ సూక్ష్మ ప్లాస్టిక్ వ్యాప్తికి ప్రధాన వాహకం గాలే. ప్లాస్టిక్ రేణువులు గాలి ద్వారా వేల కిలోమీటర్లు సులువుగా ప్రయాణిస్తాయి. అయితే పర్యాటకుల ద్వారానే ప్లాస్టిక్ అంటార్కిటిక్ దాకా చేరి ఉంటుందని పరిశోధకుల అంచనా.
ప్లాస్టిక్‌తో భారీ నష్టం
85 లక్షల చదరపు కిలోమీటర్లలో విస్తరించిన అంటార్కిటిక్ మహాసముద్ర పర్యావరణ వ్యవస్థ ప్లాస్టిక్ వల్ల బాగా దెబ్బతింటోంది. సముద్ర జీవులు ఆహార పదార్థాలుగా భ్రమించి విషపూరిత ప్లాస్టిక్‌ను తిని మృత్యువాత పడుతున్నాయి. రొయ్యల జాతికి చెందిన క్రిల్ అనే జీవులకు ఈ ముప్పు అధికంగా ఉన్నట్లు గమనించారు. సౌందర్య ఉత్పత్తుల వల్ల గత పదేళ్లలో భారీ పరిమాణంలో మైక్రోప్లాస్టిక్, టూరిజం వల్ల 25.5 బిలియన్ సింథటిక్ ఫైబర్లు అంటార్కిటక్ సముద్రంలో చేరుతున్నట్టు లెక్కగట్టారు. వాస్తవానికి ఈ పరిమాణం ఎన్నోరెట్లు ఎక్కువగా ఉంటుందంటున్నారు.
చేపల వేట తదితరాల వల్ల కూడా సముద్రంలోకి ప్లాస్టిక్ వచ్చి చేరుతోంది. సముద్ర ఉపరితలంలోనే గాక అన్ని పొరల్లోనూ మైక్రో ప్లాస్టిక్ విస్తరించింది. ఉపరితలం నుంచి 6 నుంచి 11 మీటర్ల లోతులో ప్రతి చదరపు మీటర్‌కు 766 మైక్రోప్లాస్టిక్ రేణువులు కనిపించాయి! అంటార్కిటిక్, పరిసరాల్లో ప్లాస్టిక్ బెడద, పర్యావరణంపై దాని ప్రభావంపై పూర్తిస్థాయి అధ్యయనం తక్షణావసరమని బ్రిటిష్ యూనివర్సిటీ ఆఫ్ హల్ మెరైన్ బయాలజిస్టు డాక్టర్ కేథరిన్ వాలర్ అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment