సాక్షి, అమరావతి బ్యూరో: మంచు దుప్పటి కప్పుకున్నట్లు ఉండి మనం మంచు ఖండంగా పిలుచుకునేది.. అంటార్కిటికా. దీని అంచున వేలాడదీసినట్లు 44,200 చ.కి.మీ విస్తీర్ణంలో భారీ మంచు ద్వీపకల్పం ఉంది. దీన్ని లారెన్స్–సి అని వ్యవహరిస్తుంటారు. దీని నుంచి ఈ ఏడాది జూలైలో ఐస్‌బర్గ్ ఏ–68 అనే భారీ మంచు ఫలక బద్దలై విడిపోయింది. ఇది సముద్రంలో తేలియాడుతూ నిదానంగా కరుగుతోంది. ఇది 5800 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో.. మన రాష్ట్రంలో శ్రీకాకుళం జిల్లా అంతటి వైశాల్యంలో ఉంది. ఈ నేపథ్యంలో ప్రపంచమంతా కలవరపడుతోంది. ఇంత భారీ మంచు ఫలక కరిగిపోతే సముద్ర జలాల మట్టం పెరిగిపోతుంది. సముద్రం ముందుకు చొచ్చుకు వస్తుంది. తీర ప్రాంతాలు దెబ్బతింటాయి. అంతేకాదు ఏకంగా కొన్ని ప్రాంతాల ఉనికే లేకుండా పోతుంది. అభివృద్ధి పేరిట విచక్షణ రహితంగా ప్రకృతిని విధ్వంసం చేయడం వల్లే ఇలా జరుగుతోందని పర్యావరణవేత్తలు అంటున్నారు.
కరుగుతున్న మంచు ఖండం
అంటార్కిటికాలో మంచు ఫలకలు 10 వేల ఏళ్ల నుంచి స్థిరంగా ఉంటున్నాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అడవుల నరికివేత, విపరీతమైన పారిశ్రామికీకరణ, వాయు కాలుష్యం, గ్రీన్‌హౌస్ ఎఫెక్ట్.. ఇలా అన్నీ తీవ్ర వాతావరణ కాలుష్యానికి దారితీస్తున్నాయి. దీంతో భూఉపరితల ఉష్ణోగ్రత అమాంతం పెరిగిపోతోంది. ఇది అంటార్కిటికా ఖండంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతోంది. అర్ధ శతాబ్దం కిందట నుంచి అంటార్కిటికాలో మంచు ఫలకలు కరగడం ప్రారంభించాయి. ప్రతి ఏటా ఇలా జరగడం ఎక్కువవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా అంటార్కిటికా ఖండం నుంచి విడిపడిన భారీ మంచు ఫలకతో పెనుముప్పు ముంచుకొస్తోంది.
పెనుముప్పు.. ఏదీ కనువిప్పు?
మంచు ఫలకలు కరగడం వల్ల సముద్ర జలాల మట్టాలు పెరిగి పెను ఉపద్రవం ఏర్పడుతుందని ఇంటర్ గవర్నమెంటల్ ప్యానల్ ఆన్ క్లైమేట్ ఛేంజెస్ (ఐపీపీసీ) హెచ్చరిస్తోంది. ఇప్పటికే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ వల్ల ఏటా సముద్ర జలాల మట్టం 3.40 మిల్లీ మీటర్లు పెరుగుతోంది. అంటే దాని దుష్పరిణామాలను ప్రపంచం ఎదుర్కొంటోంది.
- మన రాష్ట్రంలో విశాఖపట్నం, కాకినాడలలో సముద్రం ఏటా ముందుకు చొచ్చుకు వస్తుండటం తెలిసిందే. దీంతో విలువైన సారవంతమైన భూములు సముద్రంలో కలిసిపోతున్నాయి. ఈ రెండు చోట్లే కాకుండా రాష్ట్రంలోని దాదాపు 200 కి.మీ. తీర ప్రాంతం సముద్రం కోతకు గురవుతోంది. భూగర్భ జలాలు కలుషితమై పంటలు నాశనమవుతున్నాయి. ఇక పశ్చిమ తీరంలోనూ సముద్రం ముందుకు దూసుకొస్తూ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఇక అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర ఆందోళనకరంగా మారింది. ఏటా ప్రపంచంలో దాదాపు 2 లక్షల కి.మీ. తీర ప్రాంతం సముద్ర కోతకు గురవుతోందని శాస్త్రవేత్తలు అంచనా వేశారు.
- సముద్ర జలాల నీటిమట్టం పెరిగితే భారీ వర్షాలు, తుపానులు జన జీవనాన్ని అతలాకుతలం చేస్తాయి. తాజాగా అమెరికాలో హరికేన్ల ప్రళయం, మన దేశంలో ముంబై వంటి నగరాల్లో ఆకస్మిక భారీ వర్షాలు మొదలైనవి ఇందుకు సంకేతాలని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
- ఇదే పరిస్థితి కొనసాగితే భూమిపై కొన్ని ప్రాంతాల ఉనికే ప్రమాదంలో పడుతుంది. ఇప్పటికే కరేబియన్ దీవుల్లో కొన్ని ప్రాంతాలు పూర్తిగా సముద్ర గర్భంలో కలసిపోయాయి. హిందూ మహా సముద్రంలో ఉన్న అతి చిన్న దేశం మాల్దీవుల ఉనికే ప్రమాదంలో పడనుందని ఇప్పటికే శాస్త్రవేత్తలు తేల్చిచెప్పారు. దాంతో ఆ దేశ ప్రభుత్వం ప్రత్యామ్నాయ దీవుల కోసం అన్వేషిస్తోంది కూడా.
- ఎన్నో జీవజాతుల ఉనికి అంతర్ధానం అయ్యే ప్రమాదం ఏర్పడుతోంది. అంటే సముద్ర జలాల మట్టాలు పెరగడం ఎంతటి విపత్తుకు దారితీస్తుందో స్పష్టమవుతోంది.
గతంలో లారెన్స్– ఏ, బి
వేల టన్నుల బరువుతో ఉన్న ఐస్‌బర్గ్ ఏ–68 భారీ మంచు ఫలక పూర్తిగా కరిగితే సముద్ర జలాల మట్టం ఏడాదికి అదనంగా 0.10 మిల్లీమీటర్లు పెరుగుతుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. గతంలో 1995లో 2 వేల చ.కి.మీ వైశాల్యం కలిగిన లారెన్స్ –ఏ’ , 2002లో 3,250 చ.కి.మీ వైశాల్యం ఉన్న లారెన్స్–బి మంచు ఫలకలు వేరుపడి సముద్ర జలాల్లో కలిసిపోయాయి. ఇప్పుడు ఏకంగా 5,800 చ.కిమీ. వైశాల్యం కలిగిన ఐస్‌బర్గ్–68 వేరవడంతో సముద్ర జలాల మట్టం మరింతగా పెరగనుంది. ఏటా పెరుగుతున్న 3.40 మిల్లీమీటర్లకు అదనంగా మరో 0.10 మిల్లీ మీటర్లు సముద్ర జలాల మట్టం పెరుగుతుందన్నమాట. ఇంతటితోనే ప్రమాదం ముగిసిపోలేదు. అంటార్కిటికా ఖండంలో లారెన్స్ సి’ని ఆనుకుని మరో భారీ మంచు ఫలక ఉంది. ఏకంగా 22,600 చ.కి.మీ. వైశాల్యం కలిగిన దీనికి ‘లారెన్స్ డి’ అని పేరు పెట్టారు. ఉష్ణోగ్రతల పెరుగుదల ఇలాగే కొనసాగితే ఆ మంచు ఫలక కూడా త్వరలోనే వేరుపడి కరిగిపోవడం ఖాయమని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
వాతావరణ సమతౌల్యం కాపాడటం సమష్టి బాధ్యత
మంచు ఫలకల రూపంలో వస్తున్న ముప్పును ఎదుర్కోవడానికి అంతర్జాతీయ సమాజం వెంటనే సమష్టి కార్యాచరణ ప్రారంభించాలి. పర్యావరణ పరిరక్షణకు అత్యధిక ప్రాధాన్యమిచ్చి కాలుష్య నివారణ చర్యలు యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలి. అభివృద్ధి పేరుతో ప్రకృతి విధ్వంసానికి పాల్పడితే భవిష్యత్ తరాలకు తీవ్ర నష్టాన్ని కలిగించినవారమవుతాం.
– మనోజ్ నలనాగుల, వాతావరణ శాస్త్రవేత్త
Comments
Please login to add a commentAdd a comment