‘ముంచు’కొస్తున్న సముద్రం | Rapid melting of ice due to pollution worldwide | Sakshi
Sakshi News home page

‘ముంచు’కొస్తున్న సముద్రం

Published Thu, Apr 6 2023 5:02 AM | Last Updated on Thu, Apr 6 2023 6:50 AM

Rapid melting of ice due to pollution worldwide - Sakshi

సాక్షి, అమరావతి: సముద్ర నీటిమట్టాలు ఏటా పెరుగుతున్నాయని నాసా తాజాగా ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా 2021–­22లో  0.27 సెం.మీ మేర పెరిగిన సముద్రజలాలు తీరంలో అలజడిని సృష్టించాయని పేర్కొంది. సముద్రజలాలు కొద్దిగా పెరి­గినా తీరం వెంబడి ఆవాసాలు ఏర్పరుచు­కున్న వారికి ఆందో­ళన కలిగిస్తుందని వెల్ల­డిం­చింది.

ఉపగ్ర­హాల ద్వారా సముద్రజలాల­పై నాసా చేసిన అధ్య­యన నివేదికను ఇటీ­వల వెల్లడించడంతోపాటు గత 30 సంవ­త్సరాల సముద్ర మట్టా­లను విశ్లేషించింది. 1993 నుంచి ఇప్పటివరకు సముద్ర జలాల మట్టం 9.1 సెం.మీ పెరిగిందని పేర్కొంది. గతేడాదిలో 0.27 సెం.మీ పెరిగిన సముద్ర జలాలు ఇకపై ఏడాదికి సగ­టున 0.66 సెం.మీ చొప్పున పెరిగి 2050 నాటికి మొత్తం 17.82 సెం.మీకు చేరుతుందని వెల్లడించింది.

సముద్రాలపై ‘ఎల్‌నినో’ తీవ్రప్రభావం చూప­డం, వాతావరణ మార్పులతో ఇలాంటి పరిస్థితి తలె­త్తుతోందని, పెరుగు­తున్న గ్రీన్‌హౌస్‌ వాయు­వులు, వాయుకాలు­ష్యం వంటివాటిని తగ్గించుకోకపోతే తీరప్రాంతాల్లో నివ­సించే ప్రజలకు కష్టాలు తప్పవని హెచ్చరించింది. సముద్ర నీటిమట్టం పెరు­గుదలను పరి­శీ­లించేందుకు అమెరికా–ఫ్రెంచ్‌ ప్రభు­త్వాలు సంయుక్తంగా 1993లో ‘టోపెక్స్‌ మిషన్‌’­ను చేప­­ట్టాయి. ప్రత్యేక రాడార్లతో సముద్ర ఉపరి­తలంపైకి మైక్రోవేవ్‌ తరంగాలని పంపించి కచ్చితమైన సమాచారాన్ని సేకరిస్తు­న్నారు.

వేగంగా కరుగుతున్న అంటార్కిటిక్‌ మంచు
వాతావరణ మార్పులకు, సముద్ర మట్టం పెరుగుదలకు మానవ తప్పిదాలే ప్రధాన కారణమని నాసా విశ్లేషించింది. పరిమితికి మించిన కాలుష్యకారక వాయువుల కారణంగా వాతావరణంలో వేడి పెరిగి మంచు ప్రాంతాలు కరిగిపోయి హిమనీ నదాల్లో నీరు పెరుగుతోందని గుర్తించింది.

వేసవి ఉష్ణోగ్రతలకు 2022లో అంటార్కిటిక్‌ ఖండంలోని మంచు పలకలు సాధారణ సగటు కంటే ఎక్కువగా కరిగిపో­యి­నట్టు పేర్కొంది. దీనికి గ్రీన్‌ల్యాండ్‌ ఐస్‌ ప్యాక్‌ కరిగి అదనపు నీరు తోడవడంతో సముద్ర మట్టాలు వేగంగా పెరిగినట్లు ప్రకటించింది.

అర మీటర్‌ మునిగింది..
గతేడాది పెరిగిన సముద్ర జలాలతో మియామి, న్యూయార్క్, బ్యాంకాక్, షాంఘై, లిమా (పెరూ), కేప్‌టౌన్‌తో పాటు అనేక తీర ప్రాంతాలు అర మీటర్‌ మేర నీటమునిగినట్టు నాసా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఈ పెరుగుదల కష్టాలను కనీసం 800 మిలియన్ల మంది ఎదుర్కొంటారని వాతావరణ శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమెరికా దేశస్తుల్లో సగం మందికి పైగా తీరప్రాంతాల్లోనే ఉన్నారు. ప్రధాన సీపోర్టులు, వినోద ప్రాంతాలు, ఇతర సౌకర్యాలు తీరంలోనే ఉన్నాయి.

సముద్ర మట్టం పెరిగితే వీటిపై తీవ్రంగా ప్రభావం ఉంటుందని చెబుతున్నారు. ఈ ముంపు ప్రభావం అడవులు, వన్యప్రాణుల పైన కూడా పడుతుందని హెచ్చరిస్తున్నారు. నాసా వెల్లడించిన అంశాలు వాతావరణాన్ని ఏ స్థాయిలో కలుషితం చేస్తున్నామో.. గ్రీన్‌హౌస్‌ వాయువులను ఏస్థాయిలో విడుదల చేస్తున్నామో హెచ్చరికగా పేర్కొన్నారు. నాసా లెక్కల ప్రకారం 2050 నాటికి సముద్ర మట్టం 17.82 సెం.మీ పెరిగితే.. 300 నుంచి 500 మీటర్ల మేర తీర ప్రాంతం సముద్ర గర్భంలో కలిసిపోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement