భారత్‌లో కాస్తంత మెరుగైన వాయు నాణ్యత
వెల్లడించిన షికాగో వర్సిటీ ఎయిర్‌క్వాలిటీ లైఫ్ ఇండెక్స్ నివేదిక
న్యూఢిల్లీ: భారత్‌లో 2022 ఏడాదిలో గాలిలో సూక్ష్మ ధూళికణాల గాఢత 19.3 శాతం తగ్గడంతో వాయునాణ్యత స్వల్పంగా మెరుగుపడిందని అమెరికాలోని షికాగో విశ్వవిద్యాలయంలోని ఎనర్జీ పాలసీ ఇన్‌స్టిట్యూట్ (ఈపీఐసీ) ప్రకటించింది. ఈ మేరకు రూపొందించిన ‘వాయు నాణ్యతా జీవన సూచీ–2024’నివేదికను ఈపీఐసీ తాజాగా వెల్లడించింది. అయితే ఇప్పటికీ భారత్‌లో వాయుకాలుష్యం అధికంగా ఉందని, తగ్గించుకోకపోతే ప్రజల ఆయుర్దాయం తగ్గక తప్పదని హెచ్చరించింది. గాలిలో ఘనపు మీటర్‌కు 5 మైక్రోగ్రాముల మేరకే 2.5స్థాయి సూక్ష్మధూళి కణాలుండాలి. అంతకుమించి ఉండి, ప్రపంచ ఆరోగ్యసంస్థ ప్రమాణాలను అందుకోలేకపోతే భారత్‌లో ప్రజల ఆయుర్దాయం 3.6 ఏళ్లు తగ్గే ప్రమాదముందని నివేదిక హెచ్చరించింది.
2022లో 2.5స్థాయి సూక్ష్మధూళి కణాలు తగ్గడానికి అక్కడి వాతావరణ పరిస్థితులు, ఉష్ణ పరిస్థితులు కారణమని నివేదిక విశ్లేషించింది. పశి్చమబెంగాల్, జార్ఖండ్‌లలో ఈ వాయు కాలుష్య తగ్గుదల కనిపించింది. ‘‘భారత్ అంతటా వాయుకాలుష్యం తగ్గితే ఢిల్లీలో ప్రజల ఆయుర్దాయం 7.8 ఏళ్లు పెరగొచ్చు. డబ్ల్యూహెచ్‌ఓ ప్రమాణాలను అందుకోలేకపోతే మాత్రం ఢిల్లీ ప్రజల ఆయుర్దాయం 11.9 ఏళ్లు తగ్గవచ్చు.
కాలుష్యం ఇలాగే కొనసాగినా, భారత్ నిర్దేశించుకున్న 2.5 స్థాయి వాయు నాణ్యతా ప్రమాణాలను అందుకోలేకపోయినా 8.5 ఏళ్లు క్షీణిస్తుంది’’ అని నివేదిక పేర్కొనడం విశేషం. పశి్చమబెంగాల్‌లోని 24 పరగణాల జిల్లాలో వాయునాణ్యత పెరిగితే అక్కడి వారి ఆయుర్దాయం 3.6 ఏళ్లు ఎక్కువ అవుతుందని నివేదిక పేర్కొంది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్తాన్‌ల్లో వాయకాలుష్యం అధికంగా ఉంటే 2.9 ఏళ్ల ఆయుర్దాయం తగ్గనుంది.
నగరాల సమీప జిల్లాలతో పోలిస్తే దూరంగా ఉన్న జిల్లాల్లో 2017తో పోలిస్తే 2022లో కాలుష్యం 18.8 శాతం తగ్గింది. దీంతో 44.67 కోట్ల మంది ఆయుర్దాయం 10.8 నెలలు పెరిగింది. కాలుష్యాన్ని తగ్గించేందుకు భారత్ వినూత్న విధానాలను అవలంబిస్తోందని నివేదిక పేర్కొంది. 2019లో గుజరాత్ తొలిసారిగా వీటిని అమల్లోకి తెచ్చింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా సూరత్‌లో కాలుష్యం 20–30 శాతం తగ్గింది. నివాసప్రాంతాల్లో కాలుష్య ఉద్గారాలను తగ్గించేందుకు, వంటచెరకు వాడకం తగ్గించడానికి కేంద్రం ప్రధాన్‌మంత్రి ఉజ్వల యోజన పథకాన్ని అమలుచేస్తుండటాన్ని నివేదిక ప్రస్తావించింది.
Comments
Please login to add a commentAdd a comment