అమెరికా వాతావరణం కన్నా మేరా భారత్ మహాన్ ! | Climate And Environment Of The United States Compared To India | Sakshi
Sakshi News home page

US Climate: అమెరికా వాతావరణం కన్నా మేరా భారత్ మహాన్ !

Published Mon, Apr 15 2024 12:34 PM | Last Updated on Mon, Apr 15 2024 12:34 PM

Climate And Environment Of The United States Compared To India - Sakshi

మనకు ఆరు ఋతువులు వసంత ( spring ), గ్రీష్మ ( summer ), వర్ష ( monsoon ), శరద్ ( autumn ), హేమంత ( winter ), శిశిరాలు. ప్రకృతిపరంగా వచ్చే కాలాలు మూడు ఎండ, వాన, చలి. అమెరికా వాతావరణంలో మాత్రం కొంత తేడా ఉంటుంది.

స్ప్రింగ్ సీజన్‌ - ( మార్చ్ నుంచి మే వరకు)
సమ్మర్ సీజన్‌ - ( జూన్ నుంచి ఆగష్టు వరకు)
ఆటమ్‌/ ఫాల్ సీజన్‌ - ( సెప్టెంబర్ - నవంబర్‌ వరకు)
వింటర్ సీజన్‌ - ( డిసెంబర్ నుంచి ఫిబ్రవరి మధ్య)

నేను ఆగష్టులో అమెరికా వెళ్ళినప్పుడు, లాస్‌ ఎంజీల్స్‌ కొంతకాలం ఉన్నాను. సరదాగా క్రిస్మస్ సెలవులు పిల్లలతో గడుపుదామని మా అమ్మాయి ఉంటోన్న డల్లాస్‌కు వెళ్లాం. అందులోనూ తెలుగువాళ్ళు ఎక్కువగా ఉండే ఒక కమ్యూనిటీ రిచ్ వుడ్ కు వెళ్ళాం. టెక్సాస్‌ రాష్ట్రంలో నున్న పెద్ద నగరాల్లో డల్లాస్ ఒకటి. గతంలో స్పెయిన్, ఫ్రెంచ్, మెక్సికో పాలన చూసిన ఈ నగరం 1845 లో మాత్రమే అమెరికాలో భాగమైంది. దీని జనాభా సుమారు 12 నుంచి 13 లక్షల్లో ఉంటుంది. దాదాపు 10 శాతం జనాభా భారత ఉపఖండం నుండి వచ్చినవారే కావడం విశేషం. తీవ్రమైన ఎండలు, భరించరాని చలి, ఉరుములతో కూడిన వర్షాలు , టోర్నడో సుడిగాలులు డల్లాస్‌లో మామూలేనంటారు. అక్కడ డిసెంబర్ రెండో వారంలో వచ్చిన మంచు తుఫాను ( Ice storm )తో జనజీవనం పూర్తిగా స్థంభించి పోయింది.

డల్లాస్ ఫోర్ట్ వద్ద ఎయిర్‌పోర్టుకు వచ్చిపోయే విమానాలు చాలా వరకు రద్దయ్యాయి. నిత్యావసర, అత్యవసరాల వాహనాలే బయట రోడ్ల మీద తిరిగే పరిస్థితి ఏర్పడింది. మనదేశం హిమాలయాలకు సమీప రాష్ట్రాలు, జమ్మూ కశ్మీర్ ప్రాంతాల్లోనే ఇలాంటి వాటి గురించి వింటుంటాం. ఇంట్లో ఎంత సేపుంటాం? బయటకు వెళ్లలేని పరిస్థితి. డల్లాస్లో ఏక ధాటిగా కురుస్తున్న మంచుతో.. రోడ్లు ,ఇండ్ల కప్పులు నిండిపోయాయి. ఆకాశం నుంచి మేఘాలు నేలవాలినట్లు అనిపించింది. బయట అడుగు పెడితే జారిపడతామన్నట్లు ఉంది. కాస్త పెద్ద టైర్లున్న వాహనం అయితే గాని ఆ మంచు పలకల మీద స్లిప్ కాకుండా ఉండలేదు.

ఏ పనికోసమైనా.. సాయం లేకుండా వెళ్లే అవకాశం లేకపోవడం ఇబ్బందికర పరిస్థితి. ఇంటి పైకప్పు ,కిటికీ చూరుల నుంచి కిందికి జారుతున్న మంచు కాస్తా.. మనం పండగలకు కట్టుకున్న తోరణాల్లా, ప్రకృతి గీసిన మోడరన్ ఆర్ట్ లా అనిపించాయి. ఇక్కడి నుంచి వెళ్లిన వాళ్లకు ఇదంతా కొత్త. మరి అక్కడే ఉండే వారికి దాంట్లో కూడా వినోదం వెతుక్కుంటారు. అంతటి చలిలో కూడా పిల్లలు ఇండ్ల ముందు ఐస్తో ఆడుకోవడం, పెద్దలు వారికి కావాల్సిన ఏర్పాట్లు చేయడం చూస్తుంటే.. ఎక్కడి వారికి అక్కడ హాయిగానే ఉంటుందనిపించింది. వాతావరణాన్ని బట్టి అలవాట్లు మారతాయన్నది నాకు ఇక్కడ తెలిసిన మరో విషయం.

అమెరికాలో ఎక్కడికెళ్లినా.. టాయిలెట్లలో పేపర్లే వాడతారు. మన దగ్గర అందరూ టాయిలెట్‌కు వెళ్లినప్పుడు చక్కగా నీళ్లతో శుభ్రం చేసుకుంటారు. కానీ అమెరికాలో పేపర్‌ ఎందుకని మొదట్లో అర్థం కాలేదు. ఇప్పుడంటే టెక్నాలజీ వచ్చింది కానీ.. చలికాలంలో అక్కడ నల్లా పైపుల్లో నీరు గడ్డ కట్టుకుపోవడం సాధారణం. అందుకే అంతా టాయిలెట్‌ పేపర్లు అలవాటు చేసుకున్నారు. ఇక తాగేనీళ్ల కోసం ఎప్పటికప్పుడు వేడి చేసుకుంటే గానీ గొంతు తడుపుకోలేరు. అన్ని ఇళ్లు సెంట్రలైజ్డ్ ఏసి ఉంటాయి. చలికాలం వచ్చిందంటే రూం హీటర్ల వేడిలో గడిపేస్తారు. అలాగే ఎండాకాలంలో భరించలేనంత వేడి, ఉక్కపోత ఉంటుంది.

ఓ రకంగా అయితే అతివృష్టి.. లేదంటే అనావృష్టి. ఇక్కడ ఒక్కరోజు కరెంటు పోయినా.. పరిస్థితులు తారుమారే. ఏం చేస్తారో.. ఎలా చేస్తారో తెలియదు గానీ.. నేనున్నన్నీ రోజుల్లో ఒక్కసారి కూడా ఒక్క క్షణం కూడా కరెంటు పోలేదు. ఎంత పెద్ద ఐస్ స్టార్మ్ వచ్చిన పరిస్థితుల్లో కూడా నిరంతర విద్యుత్ సరఫరా ఉండడం గొప్ప విషయం. విమానాల రాకపోకలు మెరుగు అయ్యాయని తెలిసాక ముల్లె మూటా సర్దుకొని లాస్‌ఏంజీల్స్‌ బాట పట్టాం. పెనం మీది నుంచి పోయిలో పడ్డట్టు మంచు కురవకున్నా అప్పుడు లాస్‌ ఏంజీల్స్‌లో కూడా తీవ్రమైన చలి ఉంది. అందుకే అమెరికా ఎంత అభివృద్ధి చెందినా.. మేరా భారత్ మహాన్ అనుకున్నా మనసులోనే !
వేముల ప్రభాకర్‌

(చదవండి: ఔరా నయాగారా.. చూడరా లిబర్టీ స్టాచ్యూ.!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement