Pink Eye Conjunctivitis: Symptoms And Precautions, Prevention In Telugu - Sakshi
Sakshi News home page

Pink Eye Conjunctivitis : కండ్లకలక వచ్చిన వాళ్లను చూస్తే మనకూ వ్యాధి సోకుతుందా? ఏం చేయాలి?

Published Fri, Aug 4 2023 11:06 AM | Last Updated on Fri, Aug 4 2023 12:08 PM

Pink Eye Conjunctivitis : Symptoms and Precautions, Prevention - Sakshi

కండ్లకలక.. దీన్నే పింక్‌ ఐ లేదా ఐ ఫ్లూ అని అంటారు. కొంతకాలంగా తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్‌లో కండ్లకలక కేసులు కలవర పెడుతున్నాయి. ఇది తరచుగా బ్యాక్టీరియా లేదా వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది. అసలే వర్షకాలంలో జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలతో బాధపడే ప్రజలకు కండ్లకలక ఇప్పుడు మరో సమస్యగా మారింది.

ఐ ఫ్లూ కరోనాలా అంటువ్యాధిగా మారుతోంది. కండ్లకలక వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?  ఇన్‌ఫెక్షన్‌ ఉన్నవాళ్లను చూసినా ఈ వ్యాధి ఇతరులకు సోకుతుందా? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.

కంటిలో చిన్న నలక పడినా ఆ బాధ వర్ణనాతీతం. అందుకే కంటిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. దేశ వ్యాప్తంగా గత కొన్నాళ్లుగా కండ్లకలక కేసులు కలవర పెడుతున్నాయి. వైరస్‌ లేదా బ్యాక్టీరియా వల్ల వచ్చే కలకలు ఒకరి నుంచి ఒకరికి వేగంగా వ్యాప్తి చెందుతాయి. ముఖ్యంగా గుంపుగా ఉన్న ప్రదేశాల్లో ఈ వ్యాధి సొందరగా ఇతరులకు సోకుతుంది.

కండ్లకలక వచ్చిన రోగి నుంచి ఈజీగా ఎనిమిది మందికి వ్యాధి సోకే అవకాశం ఉంది.ఇంట్లో ఒకరికి వస్తే అందరికీ వస్తుంది. వ్యాధి నయం కావడానికి దాదాపు 10 రోజులు పడుతుంది.  సరైన జాగ్రత్తలు తీసుకోకుండా నిర్లక్ష్యం చేస్తే కంటిపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఒక్కోసారి చూపు కూడా దెబ్బతినే ప్రమాదం ఉంది.

 

కండ్లకలక లక్షణాలు
కళ్లు ఎరుపు లేదా గులాబీ రంగులోకి మారుతుంది.
కంటి నుంచి కంటిన్యూగా నీరు కారుతుంది, కంటిరెప్పలు ఉబ్బిపోతాయి.
సరిగా చూడలేకపోవడం, లైట్‌ వెలుతురును కూడా తట్టుకోలేకపోవడం దీని లక్షణాలు
కండ్లకలక వస్తే జ్వరం, తేలిపాటి గొంతునొప్పి కూడా బాధిస్తుంది. 

కండ్లకలక వస్తే ఏం చేయాలి?
కండ్లకలక సోకితే వెంటనే డాక్టర్లను సంప్రదించాలి.
కండ్లకు గోరువెచ్చటి కాపడాలు, మంట నుంచి ఉపశమనం పొందడానికి అనెల్జెసిక్స్‌ వాడొచ్చు. 
కంటి సమస్యలు రాకుండా ఉండేందుకు యాంటీ బయోటిక్‌ డ్రాప్స్‌ వాడాలి.
కండ్ల కలక వచ్చిన వ్యక్తులకు దూరంగా ఉండాలి. వాళ్లు వాడిన వస్తువులు వాడొద్దు. 
కంటిని తరచుగా నీటితో కడుక్కోవాలి. దీంతో తొందరగా తగ్గిపోతుంది.
నీళ్లు ఎక్కువగా తీసుకోవడంతో పాటు ఆరోగ్యకరమైన డైట్‌ను పాటించాలి.

కండ్లకలక వస్తే ఇలా అస్సలు చేయొద్దు
కండ్లకలక చిన్న సమస్యే అని సొంత వైద్యం చేసుకోవద్దు
కళ్లను తరచూ తాకొద్దు, దీనివల్ల సమస్య మరింత పెరుగుతంది
ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతున్నప్పడు జనంలోకి తిరగడం వంటివి చేయొద్దు
సమస్య చిన్నగా ఉన్నప్పుడే డాక్టర్‌ సలహా మేరకు చికిత్స తీసుకోవడం ఉత్తమం.

వాళ్లను చూస్తే కండ్లకలక వస్తుందా?
కండ్లకలక వచ్చినవారిని నేరుగా చూస్తే ఇతరులకు కూడా ఆ వ్యాధి సోకుతుందా? అంటే అది ఒట్టి అపోహ మాత్రమే అంటున్నారు వైద్యులు. వైరల్ కన్జక్టివిటిస్ ఉన్న వాళ్లను చూస్తే ఇది వ్యాపించదు. ఈ వ్యాధి ప్రధానంగా చేతుల ద్వారా ఇతరులకు సోకుంది.

కండ్లకలక వచ్చిన వాళ్లు వాడిన వస్తువులను తాకడం, ఉపయోగించడం వల్ల ఈ వ్యాధి అంటుకుంటుంది. అలాగే వాళ్లు మాట్లాడేటప్పుడు నోటి తుంపర్ల నుంచి కూడా ఇతరులకు సోకే ప్రమాదం ఉంది. అంతేకానీ కండ్ల కలక సోకిన వాళ్లు మరొకరిని చూసినంత మాత్రాన్నే వ్యాధి సోకే అవకాశమే లేదు.

ఇక సన్‌ గ్లాసెస్‌ లేదా ముదురు కళ్లద్దాలు ధరించడం వల్ల కండ్లకలక ఇతరులకు వ్యాపించదు అనే సందేహం చాలామందికి వెంటాడుతుంది. కానీ ఇందులో నిజం లేదు. కళ్లద్దాలు ధరించడం వల్ల అసౌకర్యాన్ని కొంతమేరకు అధిగమించే అవకాశం ఉంటుంది. కానీ వ్యాధిని నిరోధించే ఛాన్స్‌ లేదు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement