viral fevers
-
అద్దె ఇల్లు.. ఆరుబయటనే శవం
ఇబ్రహీంపట్నం: మూఢనమ్మకాలు ఇప్పటికీ ప్రజల మెదళ్లను శాసిస్తూనే ఉన్నాయి. నిన్నమొన్నటి వరకూ ఆ ఇంటి పరిసరాల్లోనే ఆడుకుంటూ ఉన్న ఆ బాలుడు.. మాయదారి వరద కారణంగా విషజ్వరానికి గురై ప్రాణాలు కోల్పోయాడు. దీంతో ఆ కుటుంబం అద్దెకుంటున్న ఇంటి యజమాని ఆ బాలుడి మృతదేహాన్ని ఇంట్లోకి రానీయకుండా అడ్డుకున్నాడు. దీంతో బిడ్డను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆ తల్లిదండ్రులు చేసేది లేక జాతీయ రహదారి పక్కనే ఓ టెంటు వేసి ఆ బాలుడి మృతదేహాన్ని ఉంచాల్సి వచ్చింది. ఈ హృదయ విదారక ఘటన ఇబ్రహీంపట్నం మండలంలోని ప్రసాద్‌నగర్‌లో సోమవారం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి.. విషజ్వరంతో.. కూలి చేసుకునే పాలపర్తి రాజేష్, రూతు దంపతులకు ఇద్దరు కుమారులు. జెడ్పీ పాఠశాలలో పెద్ద కుమారుడు ఏడో తరగతి, చిన్న కుమారుడు జాన్ వెస్లీ(12) ఆరో తరగతి చదువుతున్నాడు. ఇటీవల కాలంలో ప్రసాద్‌నగర్ వరద ముంపునకు గురికావడంతో పారిశుద్ధ్యలేమి, కలుషిత తాగునీరు, అందుబాటులో లేని వైద్య సదుపాయం వల్ల కొద్ది రోజుల క్రితం బాలుడు జాన్‌వెస్లీ జ్వరం బారిన పడ్డాడు. స్థానిక ఆర్ఎంపీ వైద్యుడితో వైద్యం చేయించారు. మరలా కడుపులో నొప్పి రావడంతో రెండురోజుల క్రితం మరో ప్రైవేట్ వైద్యశాలకు తీసుకెళ్లారు. వారు మెడికల్ టెస్ట్‌లు రాయగా.. తల్లిదండ్రుల వద్ద డబ్బులు లేక చేయించలేదు. దీంతో కడుపులో నొప్పి భరించలేక బాలుడు మృత్యువాత పడ్డాడని తల్లిదంద్రులు చెబుతున్నారు. మంటగలసిన మానవత్వం.. వారు ఉంటున్నది అద్దె ఇల్లు కావడంతో ఆ యజమాని బాలుడి మృతదేహాన్ని ఇంటికి తీసుకురావద్దని చెప్పారు. దీంతో 65వ నంబర్ జాతీయ రహదారి పక్కనే టెంట్‌వేసి బంధువుల కడసారి చూపుకోసం ఉంచారు. ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణప్రసాద్ బాలుడి మృతదేహాన్ని సందర్శించి నివాళులు అరి్పంచారు. తల్లిదండ్రులకు ధైర్యం చెప్పారు. ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. -
ముందు జాగ్రత్తే మందు!
సాక్షి, అమరావతి: ప్రస్తుతం వర్షాకాలం కావడంతో రాష్ట్రవ్యాప్తంగా మలేరియా, టైఫాయిడ్, డెంగీ, చికున్ గున్యా వంటి వైరల్ జ్వరాలు విజృంభిస్తున్నాయి. అతిసార (డయేరియా) వ్యాధి కూడా ఎక్కువగానే ఉంది. ప్రజారోగ్యం విషయంలో ప్రభుత్వం చేతులెత్తేయడంతో గత రెండు, మూడు నెలల నుంచి వైరల్ జ్వరాలతో ప్రజలు తల్లడిల్లుతున్నారు. కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందీ వీటి బారినపడుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులు జ్వరపీడితులతో కిటకిటలాడుతున్నాయి. కాగా ఇప్పుడు భారీ వర్షాలకు వరదలు కూడా తోడయ్యాయి. దీంతో వరద ప్రభావిత ప్రాంత ప్రజలను వ్యాధులు బెంబేలెత్తిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ముంపు ప్రాంత ప్రజలు వ్యాధుల బారినపడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. ముంపు నేపథ్యంలో తాగునీరు కలుíÙతమై అతిసార (డయేరియా), కలరా, టైఫాయిడ్, చర్మ సంబంధిత వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉందంటున్నారు. తాగే నీరు, ఆహారం విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. వీలైనంత వరకూ శుద్ధి చేసిన (ఆర్వో) నీటినే తాగాలని చెబుతున్నారు. లేకుంటే పంపు నీటిని కాచి చల్లార్చి తాగాలని పేర్కొంటున్నారు. కొద్ది రోజులుగా లోతట్టు ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండటంతో దోమల బెడద తీవ్రంగా ఉంటుందని.. ఈ నేపథ్యంలో ఇంట్లో, ఆరు బయట పరిశుభ్ర వాతావరణం ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు.వైద్య నిపుణుల జాగ్రత్తలు ఇవే.. » నీటిని నిల్వ చేసే పాత్రలు శుభ్రపరచి, వాటిపై మూతలు ఉంచాలి. »తాజా కాయగూరలు, వేడిగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. »నిల్వ ఉంచిన ఆహారాన్ని తీసుకోకూడదు. » తినడానికి ముందు తప్పనిసరిగా చేతులు శుభ్రం చేసుకోవాలి. »రోజుకు మూడు నుంచి నాలుగు లీటర్లు శుద్ధమైన నీటిని తాగాలి. »తడిచిన బట్టలతో ఎక్కువసేపు ఉండకూడదు. »శరీరం మొత్తాన్ని కప్పి ఉంచే దుస్తులు ధరించడంతో పాటు మాస్క్ పెట్టుకోవాలి. »దోమల నుంచి రక్షణ కోసం దోమ తెరలు వినియోగించాలి. »గర్భిణులు, చిన్న పిల్లలు తప్పనిసరిగా దోమతెరల రక్షణలో నిద్రించాలి. » నాలుగైదు రోజులపాటు జ్వరం ఉంటే వెంటనే అప్రమత్తమై వైద్యులను సంప్రదించాలి. డెంగీ వచ్చినప్పుడు నాలుగైదు రోజులు జ్వర లక్షణాలు ఉంటాయి. ప్లేట్లెట్స్ పడిపోవడం సంభవిస్తుంది.వైద్యులను సంప్రదించకుండా యాంటీబయోటిక్స్ వినియోగం వద్దు.. జ్వరం, ఒళ్లు, కీళ్ల నొప్పులు మొదలు కాగానే చాలామంది వైద్యులను సంప్రదించకుండా మందుల షాపుల్లో వాళ్లిచ్చే మందులు వాడుతుంటారు. ఇలా చేయొద్దని వైద్యులు సూచిస్తున్నారు. జలుబు, జ్వరం, ఒళ్లు నొప్పులు, నీరసం వంటి సమస్యలకు ఐబూప్రొఫెన్, డైక్లోఫెనాక్ వంటి యాంటీబయోటిక్స్‌ను మందుల షాపుల వాళ్లు ఇచ్చేస్తున్నారు.జలుబు, ఫ్లూ వంటి వాటికి ఇవి పనిచేయవని వైద్యులు చెబుతున్నారు. అవసరం లేకుండా ఈ మందులను వాడితే కొత్త అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. వ్యాధులతో పోరాడే మంచి బ్యాక్టీరియా శరీరంలో ఉంటుంది. యాంటీబయోటిక్స్ విచ్చలవిడి వాడకంతో మంచి బ్యాక్టీరియాపై ప్రభావం పడుతుంది. దీంతో పాటు జీర్ణకోశ, ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఇన్ఫెక్షన్ సంభవిస్తే మందులు కూడా పనిచేయని పరిస్థితులు వస్తాయి. జ్వరం మొదలుకాగానే ఆందోళన వద్దువిష జ్వర బాధితులు యాంటీబయోటిక్స్ వాడాల్సిన అవసరం లేదు.. సాధారణ చికిత్సలతోనే నయమవుతుంది. బీపీ, షుగర్, ఇతర దీర్ఘకాలిక సమస్యలు లేనివారు మూడు రోజులు ఇంటి వద్దే ఉండి విశ్రాంతి తీసుకోవాలి. జ్వరం, ఒళ్లు నొప్పులు తగ్గడానికి పారాసెటమాల్ వేసుకోవాలి. ముక్కు, కళ్లు కారడం, జలుబు వంటివి ఉంటే సిట్రిజెన్ వేసుకుంటే సరిపోతుంది. శరీరంలో నీటి శాతం తగ్గకుండా ద్రవ పదార్థాలు తీసుకోవాలి. ఈ జాగ్రత్తలు పాటించినా జ్వరం, ఇతర సమస్యలు తగ్గకపోతే వైద్యులను సంప్రదించాలి. – డాక్టర్ కళ్యాణ చక్రవర్తి, జ్వరాల వైద్య నిపుణులు, గుంటూరు అనవసరంగా యాంటీబయోటిక్స్ వాడొద్దు చిన్న పిల్లల్లో దగ్గు, జలుబు, జ్వరం వస్తే కంగారు పడొద్దు. మందుల దుకాణాల్లో వాళ్లిచ్చిన యాంటీబయోటిక్స్‌ను అనవసరంగా వాడొద్దు. పారాసిటమాల్, దగ్గు సిరప్‌లను రెండు రోజులు వాడి చూడాలి. అయినప్పటికీ సమస్య తగ్గకపోతే వైద్యుడిని సంప్రదించాలి. నిల్వ ఉన్న నీటిలో పిల్లలు ఆడకుండా చూడాలి. కలుíÙత నీటిలో పిల్లలు సంచరిస్తే చర్మ సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంటుంది. విరేచనాలయ్యే పిల్లలకు మసాలా ఆహారం పెట్టొద్దు. బాలింతలు కూడా ఈ జాగ్రత్తలు పాటించాలి. – డాక్టర్ విఠల్ రావు, పిల్లల వైద్య నిపుణుడు, విజయవాడ పరిశుభ్రత పాటించాలి వరదల నేపథ్యంలో ఇంట్లో, వాష్ రూముల్లో చేరిన బురదను పూర్తిగా శుభ్రం చేసుకోవాలి. ఇంట్లో జలుబు, దగ్గు, జ్వర బాధితులుంటే వారు ఒక గదికి పరిమితం కావడం ఉత్తమం. మాస్క్ ధరించాలి. ఎక్కడపడితే అక్కడ నీరు తాగొద్దు. వీలైనంత వరకూ నీరు, తిండి విషయంలో పరిశుభ్రత పాటించాలి. – డాక్టర్ రఘు, సూపరింటెండెంట్, గుంటూరు -
ఆస్పత్రుల్లో బారులు తీరుతున్న రోగులు
-
భాగ్యనగరవాసులకు అలర్ట్.. విషజ్వరాల కారణంగా రోగులతో దవాఖానాలు బిజీ (ఫొటోలు)
-
దడ పుట్టిస్తున్న ఇన్‌ఫ్లూయెంజా వైరస్.. వాళ్లకి రిస్క్ ఎక్కువ
ఆదిలాబాద్‌టౌన్: జిల్లాలో ఇన్‌ఫ్లూయెంజా (శ్వాసకోశ సంబంధిత వ్యాధి) దడ పుట్టిస్తోంది. ఏ ఇంటికెళ్లినా ఎవరో ఒకరు దగ్గు, జ్వరం, ఒళ్లు నొప్పులతో బాధపడుతూనే ఉన్నారు. ఈ వైరస్ కోవిడ్ మాదిరిగానే ఒకరి నుంచి మరొకరికి గాలి ద్వారా వ్యాప్తి చెందుతుంది. బాధితులు దాదాపు పది నుంచి పక్షం రోజుల వరకు జ్వరం బారిన పడతారు. జ్వరం తగ్గిన కూడా ఒళ్లు నొప్పులు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. అయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొంటున్నారు. ఐదేళ్లలోపు చిన్నారులు, 65 ఏళ్లు పైబడిన వృద్ధులు, గర్భిణులు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి ఎక్కువగా సోకుతోంది. దీర్ఘకాలిక శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్న వారికి తీవ్ర ప్రమాదం ఉందని సూచిస్తున్నారు. ప్రస్తుతం జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిలో ఎక్కువ మందికి ఇన్‌ఫ్లూయెంజా లక్షణాలే కనిపిస్తున్నాయి. చిల్డ్రన్ వార్డులో ఎక్కువ మంది చిన్నారులు శ్వాస సంబంధిత ఇబ్బందులతో అవస్థలు పడుతున్నారు. కొంత మంది మృత్యువాత పడిన ఘటనలు సైతం ఉన్నాయి. అతలాకుతలం.. ప్రస్తుతం జిల్లాలో వైరల్ జ్వరాలు విజృంభిస్తున్నాయి. ఏజెన్సీతో పాటు మైదాన ప్రాంతాల్లో వీటి బారిన పడి జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనికి తోడు డెంగీ కేసులు నమోదవుతున్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు అధికారిక లెక్కల ప్రకారం 104 కేసులు నమోదయ్యాయని పేర్కొంటుండగా, అనధికారికంగా 200కు పైగానే బాధితులు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రైవేట్‌తో పాటు జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రి, ఉట్నూర్, బోథ్ ఏరియా ఆస్పత్రులు జ్వర పీడితులతో కిక్కిరిసిపోతున్నాయి. ఈనెలలోనే 32 మంది డెంగీ బారిన పడినట్లు వైద్యారోగ్య శాఖ లెక్కలు చెబుతున్నాయి. కాగా ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నవారి లెక్క తేలడం లేదు. మరికొంత మంది బాధితులను హైదరాబాద్, నిజామాబాద్‌తో పాటు మహారాష్ట్రలోని యవత్మాల్, నాగ్‌పూర్ తదితర ప్రాంతాలకు తరలిస్తున్నారు. దోచుకుంటున్న ల్యాబ్‌లు.. సీజనల్ వ్యాధులను అదునుగా చేసుకొని కొంత మంది ల్యాబ్‌ల నిర్వాహకులు అందినకాడికి దండుకుంటున్నారు. జిల్లాలో డెంగీ, మలేరియా, టైఫాయిడ్ తదితర వ్యాధులతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ప్రైవేట్ ఆస్పత్రుల నిర్వాహకులు సంబంధిత ల్యాబ్‌లకు పంపి బాధితుల నుంచి డబ్బులు గుంజుతున్నారు. నిర్వాహకులకు 40 శాతం అందజేసి 60 శాతం వైద్యులు తీసుకుంటుండడంతో వీరి బిజినెస్ జోరుగా సాగుతోంది. అర్హతలు లేకున్నప్పటికీ చాలా మంది ల్యాబ్‌లను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. దీంతో వారు రోగుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నట్లు సమాచారం. ఇంకొంత మంది శిక్షణ పూర్తి కాకుండానే ప్రైవేట్ ల్యాబ్‌లలో పనిచేస్తూ సొంతంగా పరీక్షలు జరుపుతున్నారనే ప్రచారం ఉంది. ఈ తతంగమంతా వైద్యారోగ్య శాఖ అధికారులకు తెలిసినప్పటికీ చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు లేకపోలేదు. నిబంధనల ప్రకారం ప్యాథలాజిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్, మైక్రోబయాలజిస్ట్ కోర్సు పూర్తి చేసినవారు మాత్రమే ల్యాబ్ నిర్వహణ చేపట్టవచ్చు. అయితే దీనికి విరుద్ధంగా అనర్హులు ల్యాబ్‌లను ఏర్పాటు చేసి వైద్యులతో కలిసి అక్రమ దందా సాగిస్తున్నారు. కిక్కిరిసిన చిల్డ్రన్ వార్డు.. రిమ్స్ ఆస్పత్రి చిల్డ్రన్ వార్డు చిన్నారులతో కిక్కిరిసి కనిపిస్తోంది. నెలరోజులకు పైగా ఇదే పరిస్థితి. వార్డులో 70 బెడ్లు ఉంటే.. వందకు పైగా చిన్నారులు జ్వరాలతో చికిత్స పొందుతుండడం గమనార్హం. వీరిలో ఎక్కువగా ఇన్‌ఫ్లూయెంజా లక్షణాలు ఉన్నట్లు వైద్యాధికారులు చెబుతున్నారు. చాలా మంది శ్వాసకోశ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. పక్షం దాటిన జ్వరం వీడటం లేదు. అలాగే మహిళా వార్డు పరిస్థితి కూడా ఇ లాగే ఉంది. జ్వరాలకు సంబంధించి అన్ని వార్డులకు కలిపి దాదాపు 400 మంది వరకు చికిత్స పొందుతున్నారు. కొద్ది రోజులుగా రిమ్స్‌లో ఓపీ 1600 వరకు నమోదవుతుంది. ఆయా పీహెచ్‌సీల్లో జిల్లా వ్యాప్తంగా దాదాపు 500 వరకు ఓపీ ఉందని అధికారులు పేర్కొంటున్నారు. వ్యాధుల కట్టడికి చర్యలు.. జిల్లాలో వ్యాధుల నివారణకు చర్యలు చేపడుతున్నాం. వాతావరణ మా ర్పుల కారణంగా జ్వరపీడితుల సంఖ్య పెరుగుతోంది. ఎక్కువ మంది శ్వాసకోశ సమస్యతో బాధపడుతున్నారు. ఈ ఏడాది 104 డెంగీ కేసులు నమోదయ్యాయి. వారానికి రెండుసార్లు డ్రైడే పాటించాలని అవగాహన కల్పిస్తున్నాం. – మెట్పెల్లివార్ శ్రీధర్,జిల్లా మలేరియా నివారణ అధికారి -
జర జాగ్రత్త.. నెలలో రెండు లక్షల మందికి జ్వరాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. జలుబు, దగ్గు, జ్వరాల కేసులు విపరీతంగా నమోదవుతున్నాయి. డెంగీ, మలేరియా కేసులు కూడా భారీగా వెలుగుచూస్తున్నాయి. గత నెల రోజుల్లోనే రాష్ట్రంలో దాదాపు 2 లక్షల మంది జ్వరాల బారినపడినట్లు వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి. వాతావరణం మారడం, పారిశుద్ధ్య నిర్వహణ సరిగా లేకపోవడంతో దోమలు స్వైర విహారం చేస్తున్నాయి. దీంతో పట్టణం, పల్లె అనే తేడా లేకుండా జ్వరాలతో బాధపడుతున్నవారి సంఖ్య పెరిగినట్లుగా వైద్య యంత్రాంగం అంచనా వేసింది. వానాకాలమంతా జ్వరాలు కొనసాగే పరిస్థితి ఉందని హెచ్చరిస్తోంది. ఆస్పత్రుల్లో రోగుల క్యూ సీజనల్ వ్యాధులతో రోగులు ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. హైదరాబాద్‌లోని ఫీవర్ ఆస్పత్రి, ఉస్మానియా, గాంధీ సహా జిల్లాల్లోని ఆస్పత్రులకు వచ్చే రోగుల సంఖ్య పెరిగింది. ఓపీలో సగం మంది సీజనల్ వ్యాధులతో బాధపడుతున్నవారే. పీహెచ్‌సీల్లో కానరాని డాక్టర్లు కొన్ని చోట్ల వైద్య ఆరోగ్యశాఖ యంత్రాంగ నిర్లక్ష్యం బాధితులకు శాపంగా మారింది. అనేక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో డాక్టర్లు రావడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వాస్తవంగా ప్రభుత్వం వేసిన అంచనాలకు మించి జ్వరాలు, డెంగీ, మలేరియా కేసులున్నట్లు వైద్యులు చెబుతున్నారు. పగటి పూట కుట్టే దోమతో డెంగీ.. డెంగీ కారక ఈడిస్ ఈజిప్ట్ దోమ అన్ని దోమల్లాంటిది కాదు. పగటిపూటే కుడుతుంది. ఇళ్లు, కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలల్లో నిల్వ ఉంచే మంచినీటిలోనే పుట్టి పెరుగుతుంది. ఒక వారం రోజులు కదపకుండా దోసెడు నీరున్నా చాలు. అందులో పునరుత్పత్తి ప్రక్రియ కొనసాగిస్తుంది. ఎయిర్ కూలర్లలో, డ్రమ్ముల్లో నిల్వ ఉంచిన మంచినీటిలో, వాడకుండా పక్కన పడేసిన పాత టైర్లు, రేకు డబ్బాల్లో వాన నీరు కురిస్తే ఆ చిన్ననీటి గుంతల్లోనూ జీవనం కొనసాగిస్తుంది. అందుకే ఇంట్లో, కార్యాలయాల్లో ఎక్కడైనా కొద్దిపాటి నీటి నిల్వలున్నాయా అని పరిశీలించాలి. డెంగీ వస్తే ఉన్నట్టుండి తీవ్ర జ్వరం, భరించలేని తలనొప్పి వస్తుంది. కళ్లు తెరవడం కష్టంగా ఉంటుంది. చర్మంపై దద్దుర్లు అయినట్లు కనిపించడం, కండరాలు, కీళ్ల నొప్పులు ఉంటాయి. అధిక దాహంతో పాటు రక్తపోటు స్థాయిలు పడిపోతాయి. ఐజీఎం పరీక్షతోనే డెంగీ నిర్ధారణ డెంగీ నిర్ధారణలో వైద్య పరీక్షలే కీలకం. కేవలం ప్లేట్లెట్ కౌంట్, డెంగీ స్ట్రిప్ టెస్ట్, సీరమ్ టెస్ట్ వంటి వాటితో దీనిని నిర్ధారించడం శాస్త్రీయం కాదని వైద్య ఆరోగ్యశాఖ చెబుతోంది. విధిగా అందుబాటులో ఉండే ఐజీఎం పరీక్ష చేయించాలి. ప్లేట్లెట్లు 20 వేలలోపు పడిపోతే అది ప్రమాదకరంగా భావిస్తారు. 15 వేల కన్నా తగ్గితే డెంగీ షాక్, డెంగీ మరణాలు సంభవిస్తాయి. డెంగీ జ్వరం వస్తే తీవ్రతను తగ్గించేందుకు చల్లని నీటిలో స్పాంజీని ముంచి శరీరాన్ని తుడవాలి. ఎల్రక్టాల్ పౌడర్, పళ్లరసాలు రోగికి ఇవ్వాలి. దీనివల్ల జ్వర తీవ్రత తగ్గి ప్లేట్లెట్లు అదుపులోకి వస్తాయి. ఇంకా తగ్గకుంటే వైద్యుని వద్దకు తీసుకెళ్లాలని వైద్య ఆరోగ్యశాఖ సూచిస్తుంది. ఇక వైరల్ ఫీవర్ వస్తే విపరీతంగా మంచినీరు తాగాలి. పండ్ల రసాలు తీసుకుంటే ప్లేట్లెట్లు పడిపోకుండా కాపాడుతాయి. ఇది కూడా చదవండి: నిరుత్సాహపర్చిన బీసీలకు ‘లక్ష’ సాయం! -
కోవిడ్ మళ్లీ కోరలు చాస్తోంది! రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్: కోవిడ్–19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను అప్రమత్తం చేస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా చాలా చోట్ల వైరల్ ఫీవర్లు, శ్వాసకోశ సంబంధిత సమస్యలతో ఆస్పత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఇదే సమయంలో కోవిడ్–19 పరీక్షల్లో పాజిటివిటీ రేటు సైతం వేగంగా పెరుగుతున్నట్లు గుర్తించిన కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, రాష్ట్రాలకు జాగ్రత్త చర్యలను సూచిస్తూ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. ఇన్‌ఫ్లూయెంజా లైక్ ఇల్నెస్ (ఐఎల్ఐ), సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ ఇల్నెస్ (ఎస్ఏఆర్ఐ) సమస్యలపై ఇదివరకే రాష్ట్రాలను కేంద్రం అప్రమత్తం చేయగా.. ప్రస్తుతం కోవిడ్–19 కేసుల దృష్ట్యా జాగ్రత్త చర్యలను పాటించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు వివిధ అంశాలపై తీసుకోవాల్సిన చర్యలను వివరిస్తూ కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్, ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ రాజీవ్ భల్ దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేశారు. అలసత్వం వద్దు.. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో కోవిడ్–19 కేసుల నమోదు వేగంగా పెరుగుతోంది. కేరళలో 26.4 శాతం, మహారాష్ట్రలో 21.7 శాతం, గుజరాత్లో 13.9 శాతం, కర్ణాటకలో 8.6 శాతం, తమిళనాడులో 6.3 శాతం కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ఏమాత్రం అలస్వతంగా ఉండవద్దని కేంద్రం.. రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ఈ దిశగా టెస్టింగ్, ట్రాకింగ్, ట్రీట్మెంట్, వ్యాక్సినేషన్లను వేగవంతం చేయాలని స్పష్టం చేసింది. పరీక్షలను పెద్ద ఎత్తున పెంచుతూ కోవిడ్–19 జాగ్రత్తలను పాటించేలా చేయాలని, కేసుల సంఖ్య ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని ఆదేశించింది. కేసుల సంఖ్య పెరిగి ప్రమాదానికి దారితీయకుండా ముందస్తు జాగ్రత్తలు అవసరమని కేంద్రం వివరించింది. ఇదే సమయంలో అక్యూట్ రెస్పిరేటరీ ఇల్నెస్, ఇన్ఫ్లుయాంజా కేసులపైనా ప్రత్యేక దృష్టి సారించాలని సూచించింది. దేశంలో ఈ తరహా కేసులు జనవరి నుంచి మార్చి చివరి వరకు, ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు కనిపిస్తాయని, ఈ నేపథ్యంలో అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని కేంద్ర ప్రభుత్వం గుర్తు చేసింది. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.. కోవిడ్–19ను అరికట్టేందుకు ప్రజలు అన్ని రకాల జాగ్రత్త చర్యలు పాటించేలా రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరించాలని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆదేశించింది. ► వ్యక్తిగత పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని, బయటకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా మాస్కు ధరించాలని, క్రమం తప్పకుండా చేతులు శుభ్రపర్చుకోవాలని, శానిటైజర్ వినియోగించాలని సూచించింది. ► దీర్ఘకాలిక వ్యాధులున్న వారు వీలైనంత తక్కువగా బయటకు వెళ్లాలని స్పష్టం చేసింది. ► వైద్యులు, పారామెడిక్స్, ఇతర ఆరోగ్య సంరక్షణ సిబ్బంది మాస్క్‌లు ధరించాలని స్పష్టం చేసింది. ► రద్దీగా ఉండే ప్రాంతాల్లో, క్లోజ్డ్ సెట్టింగులున్న చోటఉండాల్సిన వారు తప్పకుండా మాస్క్‌లు ధరించాలి ► తుమ్మేటప్పుడు, దగ్గుతున్నప్పుడు ముక్కు, నోరు కప్పుకోవడానికి రుమాలు అందుబాటులో ఉంచుకోవాలి ► బయటకు వెళ్లిన ప్రతి ఒక్కరు తరచుగా చేతులు శుభ్రపర్చుకోవాలి ► బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయడాన్ని నిషేధించాలి ► కోవిడ్–19 నిర్ధారణ పరీక్షలను వీలైనంత ఎక్కువ సంఖ్యలో చేయాలి. లక్షణాలను గుర్తిస్తే వెంటనే ముందస్తు చర్యలకు ఉపక్రమించాలి ఆస్పత్రుల్లో ఏర్పాట్లు.. ఎలాంటి పరిస్థితులు వచ్చినా తట్టుకునే విధంగా రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని కేంద్రం సూచించింది. ఆస్పత్రుల్లో మందులను అందుబాటులో ఉంచాలని, వైద్య పరికరాల పనితీరును సరిచూసుకోవాలని తెలిపింది. అలాగే ఆక్సిజన్ వసతులను పునఃసమీక్షించుకోవాలని సంబంధిత అధికారులకు స్పష్టం చేసింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మొదలు అన్ని రకాల ఆస్పత్రులను సన్నద్ధం చేయాలని ఆదేశించింది. ఐసీయూ పడకలు, ఆక్సిజన్ పడకల తీరును నిరంతరం పరిశీలించాలని, ఆస్పత్రుల వారీగా సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలని స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా ఈనెల 27న కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించి తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది. -
వైరస్ లోడింగ్.. జరభద్రం.. ప్రతి ఇద్దరిలో ఒకరు జ్వర బాధితులే
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సహా దేశవ్యాప్తంగా వైరల్ ఇన్ఫెక్షన్లు, ఇన్‌ఫ్లూయెంజా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఒమిక్రాన్ రూపంలో దేశంలోకి కోవిడ్ థర్డ్‌వేవ్ ప్రవేశించి ఏడాది దాటినా ఇంకా దాని రూపాంతరాలు వ్యాప్తిలోనే ఉంటున్నాయని వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు. తమ వద్దకు వస్తున్న ప్రతి ఇద్దరు రోగుల్లో ఒకరు దగ్గు, జలుబు, వైరల్ ఇన్ఫెక్షన్లతో బాధపడుతున్నారని డాక్టర్లు చెబుతున్నారు. బాధితుల్లో పిల్లలు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారే ఎక్కువగా ఉంటున్నారని వివరిస్తున్నారు. కోవిడ్ వ్యాప్తి తగ్గడంతో ప్రజలు మాస్క్‌ల వాడకాన్ని దాదాపుగా మర్చిపోయారని.. రద్దీ ప్రాంతాల్లోనూ ఎవరూ పెద్దగా మాస్క్‌లు వాడటంలేదని విశ్లేషిస్తున్నారు. అందుకే వైరల్ జ్వరాలు ఒకరి నుంచి మరొకరికి సులభంగా వ్యాపిస్తున్నాయని వైద్యులు అంటున్నారు. ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ♦ తరచూ సబ్బుతో శుభ్రంగా చేతులు కడుక్కోవాలి. ♦ మాస్క్ , శానిటైజర్ వాడాలి. ♦ కళ్లు, ముక్కు, నోటిని అధికంగా తాకడం, రుద్దడం వంటివి మానాలి. ♦ జనసమ్మర్థ ప్రాంతాల్లోకి మాస్క్ లేకుండా వెళ్లకూడదు. ♦ బట్టలు, తువ్వాళ్లు, వాటర్ బాటిళ్ల వంటి వ్యక్తిగత వస్తువులను ఇతరులతో పంచుకోకూడదు. బాధితుల్లో దగ్గు అధికం.. గత 2 నెలలుగా ఢిల్లీలో ఇన్ ఫ్లూయెంజా కేసుల పెరుగుద ల అధికంగా ఉంది. చాలా మందిలో దగ్గు ఎక్కువగా ఉంటోంది. ఆస్తమా, అలర్జీ, సీవో పీడీ, ఇతర ఊపిరితిత్తుల సమస్యలున్న వారిలో సమస్యలు మరింతగా పెరుగుతున్నా యి. ఈ వైరస్‌లకు వాయుకాలుష్యం తోడుకావడంతో సమస్య తీవ్రమవుతోంది. ఈ వైరస్ల బారినపడిన వారు అజిత్రోమైసిన్ వంటి యాంటీబయోటిక్స్‌ను ఎక్కువగా వాడరాదు. ఇలాంటి వారికి ఫ్లూ వ్యాక్సిన్లు రక్షణనిస్తాయి. – డాక్టర్ (ప్రొ) గోపీచంద్ ఖిల్నానీ, చైర్మన్, పీఎస్ఆర్ఐ ఇన్స్టిట్యూట్, ఢిల్లీ ఈ వైరస్ ఏమిటో అంతుబట్టట్లేదు చాలామంది బాధితుల్లో దగ్గు ఎక్కువై కళ్లెలో రక్తం పడటం, ఆయాసం, గొంతు బొంగురుపోవడం వంటి సమస్య లు పెరుగుతున్నాయి. ఒకట్రెండు రోజు లు జ్వరం, ఒళ్లునొప్పులు సైతం ఉంటు న్నాయి. ఇది ఇన్‌ఫ్లూయెంజాలో కొత్త వేరియెంటా లేక కొత్త మ్యు టేషన్ తీసుకున్న కోవిడ్ ఇన్ఫెక్షనా అనేది (ఆర్టీపీసీఆర్ గుర్తించని) స్పష్టంగా తెలియట్లేదు. దీర్ఘకాలిక ఊపిరితిత్తుల సంబంధిత సమస్యలతో బాధపడుతున్నవారు ఇన్‌ఫ్లూయెంజా ఫ్లూ షాట్, న్యూమోకోకల్ వ్యాక్సిన్ వేయించుకోవాలని సూచి స్తున్నాం. ఇవి ఇన్‌ఫ్లూయెంజా ఏ,బీ, స్వైన్‌ఫ్లూ నుంచి రక్షణనిస్తున్నాయి. – డాక్టర్ వీవీ రమణప్రసాద్, కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్, కిమ్స్ హాస్పిటల్ -
తెలంగాణ లో డెంగ్యూ జ్వరాల డేంజర్ బెల్స్
-
పటిష్ట చర్యలతో విషజ్వరాలను కట్డడి చేశాం: మంత్రి రజనీ
సాక్షి, అమరావతి: విషజ్వరాలతో మరణాలు రాష్ట్రంలో సంభవించలేదని, విషజ్వరాలను సమర్థవంతంగా కట్టడి చేయగలిగామని వైద్యారోగ్య శాఖ మంత్రి విడదల రజనీ ప్రకటించారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మంగళవారం.. వైద్యారోగ్య శాఖల నాడు-నేడు స్వల్పకాలిక చర్చ సందర్భంగా ఆమె ప్రసంగించారు. గత ప్రభుత్వంలో(2015-19 మధ్య) 74 వేలకు పైగా మలేరియా కేసులు నమోదు అయ్యాయి. కానీ, ఈ ప్రభుత్వంలో నాలుగు వేల కేసులు మాత్రమే నమోదు అయ్యాయి. భారీ వర్షాలు, వరదలు పొటెత్తినా కూడా ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుని విషజ్వరాలను రికార్డు స్థాయిలో కట్టడి చేయగలిగామని విడదల రజనీ తెలియజేశారు. ప్రాణాంతకంగా మారుతున్న మలేరియా కట్టడి కోసం కూడా చర్యలు తీసుకున్నామని ఆమె తెలిపారు. వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామన్న ఆమె.. ఆరోగ్య శ్రీ పథకాన్ని గత ప్రభుత్వం నీరుగార్చిందని, కానీ.. జగనన్న ప్రభుత్వం మాత్రం డెంగ్యూ, మలేరియాలను ఆరోగ్యశ్రీలో చేర్చిందని చెప్పుకొచ్చారు. అదే విధంగా విష జ్వరాల నియంత్రణకు జిల్లా స్థాయిలో ప్రత్యేక అధికారులను నియమించడం, ప్రత్యేక బృందాల క్యాంపులను ఏర్పాటు చేసిన విషయాన్ని ఆమె లేవనెత్తారు. గత ప్రభుత్వం దోమలపై దండయాత్ర పేరుతో చాలా ఆర్భాటాలు.. ప్రజాధనాన్ని దుబారా చేసిందని మంత్రి రజనీ మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆనాడూ ‘దోమలపై దండయాత్ర’ సందర్భంగా చంద్రబాబు నాయుడు ఇచ్చిన ప్రకటనను సైతం ఆమె చదివి వినిపించారు. సంధ్య ఘటనపై స్పందిస్తూ.. చింతూరు మండలానికి చెందిన చిన్నారి సంధ్య మృతి ఘటన బాధాకరం. వాస్తవానికి.. వైరల్ డిసీజ్‌తో చిన్నారి మృతి చెందింది. ఈ విషయాన్ని వైద్యులు ఇచ్చిన రిపోర్టులతో పాటు ఉన్నతాధికారులు ఇచ్చిన నివేదికలు కూడా ఇచ్చారని ఆమె ప్రతులు చూపించారు. పొరుగు రాష్ట్రానికి సంధ్య కుటుంబం వెళ్లిందని టీడీపీ విమర్శిస్తోందని.. భద్రాచలం పరిధిలో అందుబాటులో ఉంది కాబట్టే సంధ్య కుటుంబం అక్కడికి వెళ్లిందని మంత్రి రజనీ తెలిపారు. ఈ ఘటనపై కూడా టీడీపీ సభ్యులు రాజకీయం చేయడం సరికాదని, ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి విడదల రజనీ మండిపడ్డారు. ఇదీ చదవండి: పారిశ్రామిక పరుగులపై సీఎం జగన్ ఏమన్నారంటే.. -
డెంగీ విజృంభణ.. ఆ జిల్లాలో రోజుకు 28 కేసులు!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: అధిక వర్షాలు.. వాతావరణ మార్పులు.. పెరుగుతున్న దోమలతో డెంగీ పంజా విసురుతోంది. ఉమ్మడి జిల్లాలో డెంగీ కేసులు అధికమవుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పల్లె, పట్టణం అనే తేడా లేకుండా విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. డెంగీ, టైఫాయిడ్, మలేరియా లాంటి ప్రమాదకర జ్వరాలు వ్యాపిస్తుండడంతో పల్లెలన్నీ మంచం పడుతున్నాయి. ప్రతీఇంట్లో ఒకరు జ్వరంతో బాధపడుతున్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో చెప్పవచ్చు. రెండు నెలలుగా జ్వర పీడితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూ ఆసుపత్రులన్నీ కిటకిటలాడుతున్నాయి. ఫలితంగా పీహెచ్‌సీలతో పాటు జిల్లా ప్రభుత్వ ప్రధానాసుపత్రులలో ఓపీ, ఐపీ కోసం రోగులు బారులు తీరుతున్నారు. ఆగస్టు, సప్టెంబర్‌లో విజృంభణ వరుసగా కురుస్తున్న వర్షాల కారణంగా అనారోగ్య వాతావరణం నెలకొంది. ఈ వాతావరణమే వైరల్ ఫీవర్ల వ్యాప్తికి కారకంగా మారుతోంది. గ్రామాల్లో, పట్టణాల్లో పారిశుధ్య లోపం కారణంగానే దోమలు వృద్ధి చెందుతున్నాయి. దీంతో జ్వరాల ప్రభావం పట్టణాలతో పాటు గ్రామాల్లోనూ విపరీతంగా పెరిగిపోయింది. ఆగస్టు, సెపె్టంబర్ నెలల్లోనే డెంగీ పాజిటివ్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఆగస్టులో 181 కేసులు, సెపె్టంబర్ (15 నాటికి)లో ఇప్పటి వరకే 422 కేసులు నమోదుతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. ఆసుపత్రులు కిటకిట సీజనల్ వ్యాధుల కారణంగా ఆస్పత్రులన్నీ రోగులతో కిటకిటలాడుతున్నాయి. ఇటీవల అనధికారికంగా పదుల సంఖ్యలో డెంగీ మరణాలు నమోదు కావడంతో జ్వరం అంటేనే ప్రజలు వణికిపోతున్నారు. జ్వరం వస్తే చాలు ప్రభుత్వ, ప్రైవేటు అనే తేడా లేకుండా రోగులు వైద్యం కోసం ఆసుపత్రులకు పరుగులు పెడుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఓపీ ప్రతి రోజు 2 వేలకుపైగా నమోదవుతుండగా, ఇన్‌పేషెంట్లకు సరిౖయెన సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీరిలో జ్వరాల బారినపడిన పిల్లల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ప్లేట్లెట్స్ పేరుతో దోపిడీ డెంగీ ప్రయివేటు ఆసుపత్రులకు కాసుల వర్షం కురిపిస్తుంది. కరోనా తర్వాత అంతటి సంపాదన తెచ్చే అస్త్రమైంది. డెంగీ జ్వరం వచ్చిందంటే ప్లేట్లెట్స్ తగ్గడం సర్వసాధారణం. ప్లేట్లెట్స్ సాకుగా చూపుతూ ప్రయివేటు ఆసుపత్రులు పేషెంట్లను వారి బం«ధువులను భయాందోళనకు గురిచేసి సొమ్ము చేసుకుంటున్నారు. అవసరం ఉన్నా లేకుండా ప్లేట్లెట్స్ పరీక్ష చేయడం, ప్లేట్లెట్స్ తక్కువగా ఉన్నాయంటూ తప్పుడు రిపోర్టులు ఇస్తూ పేషెంట్‌ను ఆసుపత్రికి పరిమితం చేస్తున్నారు. ఇక ఆంటిబయోటిక్స్, సెలాయిన్స్ పెట్టుకుంటూ రోజుల తరబడి ఆసుపత్రిలోనే ఉంచుతున్నారు. అవకాశం వచి్చందే తడవుగా సీజనల్ వ్యాధులను సొమ్ము చేసుకుంటున్నాయి. డెంగీకి మెరుగైన వైద్యసేవలు అందించాలని అందుకు ఖర్చు రూ.వేలల్లో ఉంటుందని ఆసుపత్రి నిర్వాహకులు చెబుతుండడంతో ప్రాణాలను కాపాడుకునేందుకు డబ్బులకు వెనుకాడకుండా పేదలు జేబులను గుల్ల చేసుకుంటున్నారు. రోజుకు 28 కేసులు ఉమ్మడి జిల్లాలో డెంగీ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గతంలో రోజుకు ఒకటి లేదా రెండుకు మించి కేసులు నమోదు కాలేదు. తాజాగా సెప్టెంబరులో డెంగీ కేసుల సంఖ్య అమాంతం పెరిగిపోయింది. ఒక్కసారిగా రోజుకు 28 కేసులు చొప్పున నమోదవడం పరిస్థితికి అద్ధం పడుతోంది. దోమల సంఖ్య పెరగడమే ఈ వైరల్, డెంగీ, మలేరియా జ్వరాలకు కారణమని వైద్యులు స్పష్టంచేస్తున్నారు. గతంతోపోలిస్తే ఇటీవల కురిసిన భారీ వర్షాలతో కాలువలు, చెరువులు, కుంటలు నిండాయి. ఈ కారణం వల్ల కూడా దోమలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కరీంనగర్ విషయానికి వస్తే.. చుట్టూ హారంలా జలాశయాలు, కాలువలు ఉండటంతో దోమల సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతోంది. ఇదీ చదవండి: వారం వారం.. ప్రగతి లక్ష్యం.. కొత్త విధానానికి శ్రీకారం -
కో–ఇన్ఫెక్షన్స్.. ఏకకాలంలో అనేక జ్వరాలు..!
ఇటీవలి కాలంలో ప్రతి ఇంటా ఎవరో ఒకరు జ్వరంతో బాధపడటం కనిపిస్తోంది. మరీ ముఖ్యంగా ఈమధ్యకాలంలో వరసగా వర్షాలు అందరినీ బెంబేలెత్తించాయి. నిన్న మొన్నటి కరోనా కాలం తర్వాత... అదే సంఖ్యలో మూకుమ్మడి జ్వరాలు ఇటీవల నమోదయ్యాయి. అయితే ఇప్పటి జ్వరాల్లో ఓ ప్రత్యేకత ఉందంటున్నారు వైద్య నిపుణులు. కొందరిలో ఒకే సమయంలో రెండు రకాల జ్వరాలు నమోదవ్వడం ఇటీవల నమోదైన ధోరణి. ఇలా ఒకే సమయంలో అనేక ఇన్ఫెక్షన్లు రావడాన్ని వైద్యనిపుణులు తమ పరిభాషలో ‘కో–ఇన్ఫెక్షన్స్’గా చెబుతున్నారు. ఆ ‘కో–ఇన్ఫెక్షన్ల’పై అవగాహన కోసమే ఈ కథనం. ఓ కేస్ స్టడీ: ఇటీవల ఓ మహిళ జ్వరంతో ఆసుపత్రికి వచ్చింది. తొలుత ఆమెలో డెంగీ లక్షణాలు కనిపించాయి. పరీక్షలో ప్లేట్లెట్ కౌంట్ తగ్గడం డాక్టర్లు చూశారు. ఆ తర్వాత ఆమెకు ఆయాసంగా ఉండటం, ఊపిరి అందకపోవడం గమనించారు. అప్పుడు పరీక్షిస్తే ఆమెకు కోవిడ్ కూడా ఉన్నట్లు తేలింది. ఇలా ఒకేసారి రెండు రకాల జ్వరాలు (ఇన్ఫెక్షన్లు) ఉండటాన్ని ‘కో–ఇన్ఫెక్షన్స్ అంటారు. ఇలా రెండ్రెండు ఇన్ఫెక్షన్లు కలసి రావడం కాస్తంత అరుదు. కానీ ఇటీవల ఈ తరహా కేసులు పెద్ద ఎత్తున రావడం విశేషం. ఇక ఈ కేస్ స్టడీలో కోవిడ్ కారణంగా బాధితురాలిని నాన్–ఇన్వేజివ్ వెంటిలేషన్ మీద పెట్టి, ఆక్సిజన్ ఇస్తూ... రెండు రకాల ఇన్ఫెక్షన్లనూ తగ్గించడానికి మందులు వాడాల్సి వచ్చింది. వైరల్, బ్యాక్టీరియల్ జ్వరాలు కలగలసి... సాధారణంగా జ్వరాలతో బయటపడే ఇన్ఫెక్షన్లు రెండు రకాలుగా ఉంటాయి. వాటిల్లో మొదటివి బ్యాక్టీరియల్ జ్వరాలు. రెండోవి వైరల్ జ్వరాలు. అయితే ఇటీవల బ్యాక్టీరియల్ జ్వరాల్లోనే రెండు రకాలుగానీ లేదా ఒకేసారి రెండు రకాల వైరల్ ఇన్ఫెక్షన్లుగానీ... లేదంటే ఒకేసారి వైరల్‌తో పాటు బ్యాక్టీరియల్ జ్వరాలుగానీ కనిపిస్తున్నాయి. అంతేకాదు... ఒకే సమయంలో అనేక ఇన్ఫెక్షన్లతో పాటు ఒకే సమయంలో కుటుంబసభ్యుల్లో అనేక మంది జ్వరాల బారినపడటం అనేకమందికి ఆందోళన కలిగిస్తోంది. బ్యాక్టీరియల్ జ్వరాలతో కలగలసి... బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల విషయానికి వస్తే కొందరిలో వైరల్ జ్వరాలతో పాటు టైఫాయిడ్ ఎక్కువగా కనిపిస్తోంది. మరికొందరిలో ఎలుకలతో వ్యాపించే బ్యాక్టీరియల్ జ్వరం ‘లెప్టోస్పైరోసిస్’ కనిపిస్తున్న దాఖలాలూ ఉన్నాయి. ఇటీవల రోజుల తరబడి వర్షాలు కురుస్తుండటంతో బొరియలు వాననీటిలో నిండిపోగా ఎలుకలు ఇళ్లలోకి రావడం పరిపాటిగా మారింది. లెప్టోస్పైరోసిస్ కనిపించడానికి ఇదే కారణం. ఇంకొందరిలో తొలుత జ్వరం రావడం... ఆ తర్వాత బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ తాలూకు రెండో పరిణామంగా (సెకండరీ ఇన్ఫెక్షన్ వల్ల) నిమోనియా కేసులూ కనిపిస్తు న్నాయి. ఇక లక్షణాల తీవ్రత ఎక్కువగా లేని కోవిడ్ రకాలతో (ఒమిక్రాన్ వంటి వాటితో) కలిసి ఇతరత్రా జ్వరాలు రావడం చాలా ఎక్కువగా కనిపిస్తోంది. యాంటీబయాటిక్స్ వద్దు... జ్వరం వచ్చిన వెంటనే కొందరు పారాసిటమాల్‌తో పాటు యాంటీబయాటిక్స్ మొదలుపెడతారు. యాంటీవైరల్ జ్వరాలకు యాంటీబయాటిక్స్ పనిచేయకపోగా... అవసరం లేకపోయినా వాటిని తీసుకోవడం వల్ల కొన్ని కౌంట్లు మారుతాయి. విరేచనాల వంటివి అయ్యే ప్రమాదం ఉంటుంది. గ్యాస్ట్రైటిస్ వంటి అనర్థాలు వచ్చే ముప్పు ఉంటుంది. అందుకే జ్వరం వచ్చిన మొదటి రోజు నుంచే కాకుండా... మూడోనాడు కూడా జ్వరం తగ్గకపోతే... అప్పుడు మాత్రమే డాక్టర్‌ను సంప్రదించి, తగిన మోతాదులోనే యాంటీబయాటిక్స్ తీసుకోవాలి. ఇన్ఫెక్షన్లు కలగలసి రావడం ఇదే మొదటిసారి కాదు... గతంలోనూ కొన్ని సందర్భాల్లో డెంగీ, స్వైన్ ఫ్లూ, టైఫాయిడ్ లాంటివి కలసి వచ్చిన దాఖలాలు చాలానే ఉన్నాయి. అయితే ఇటీవల వర్షాలు సాధారణం కంటే ఎక్కువగా కురిశాయి. దాంతో దోమల కారణంగా మలేరియా, డెంగీ, చికున్‌గున్యా వంటివి కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నివారణ... వర్షాకాలంలో పరిసరాల్లో నీళ్లు పేరుకుపోవడంతో దోమలు వృద్ధి చెంది... ఈ జ్వరాలన్నీ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే ఇంటి పరిసరాల పారిశుద్ధ్య జాగ్రత్తలూ, వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ తగినంత అప్రమత్తంగా ఉండాలి. దోమలను ఇంట్లోకి రానివ్వకుండా మెష్ / మస్కిటో రెపల్లెంట్స్ వంటి ముందుజాగ్రత్త చర్యలను తీసుకోవాలి. పిల్లలు, వృద్ధుల ఆరోగ్యం పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలి. ఇక పెద్దవయసు వారు అప్పటికే మధుమేహం, అధిక రక్తపోటు వంటి వాటితో బాధపడే అవకాశాలున్నందున వాటి పట్ల మరింత అప్రమత్తత వహించాలి. మూత్రపిండాల వ్యాధితో బాధపడేవారిలో ఇన్ఫెక్షన్లు చాలా తేలిగ్గా సోకే అవకాశాలు ఎక్కువ. కాబట్టి మరింత జాగ్రత్తగా ఉండాలి. వెరసి అందరూ అప్రమత్తంగా ఉండటం చాలా అవసరం. వైరల్ జ్వరాలివే.. వైరల్ జ్వరాల్లో ముఖ్యంగా డెంగీ ఇన్ఫెక్షన్ ఎక్కువగా వస్తోంది. సాధారణంగా అది కోవిడ్‌తో పాటు కలిసి రావడం చాలామందిలో కనిపిస్తోంది. మరికొందరిలో వైరల్ ఇన్ఫెక్షన్లయిన కోవిడ్, ఫ్లూ... ఈ రెండూ కలగలసి వచ్చాయి. ఇంకొందరిలో కోవిడ్, ఫ్లూ, స్వైన్–ఫ్లూ... ఈ మూడింటిలో ఏ రెండైనా కలసి రావడమూ కనిపించింది. లక్షణాలు... వైరల్ జ్వరాల విషయానికి వస్తే... వీటిల్లో జ్వరం తీవ్రత... బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల కంటే ఎక్కువగా ఉంటుంది. కోవిడ్ వంటివి సోకినప్పుడు జ్వరం, దగ్గు కనిపిస్తుంటాయి. తీవ్రత కొంత తగ్గినప్పటికీ ఇటీవల కోవిడ్‌తో కలసి మరో ఇన్ఫెక్షన్ ఉంటే... ఆయాసం, ఊపిరి అందకపోవడం వంటి లక్షణాలూ ఉండవచ్చు. వెరసి... జ్వరం, స్వల్పంగా జలుబు/ఫ్లూ లక్షణాలు, కొందరిలో ఆయాసం, ఊపిరి సరిగా అందకపోవడం, నీరసం, ఒళ్లునొప్పులు వంటి లక్షణాలు ఎక్కువ. డెంగీ కేసుల్లో కొందరిలో ఒంటిపై ర్యాష్ వంటి లక్షణాలతో పాటు రక్తపరీక్షలు చేయించినప్పుడు... ప్లేట్లెట్స్ తగ్గడం వంటి లక్షణాలూ కనిపించవచ్చు. నిర్ధారణ పరీక్షలు... కోవిడ్ నిర్ధారణ కోసం ఆర్టీ–పీసీఆర్ అందరికీ తెలిసిన వైద్య పరీక్షే. డెంగీ నిర్ధారణ కోసం చేసే కొన్ని పరీక్షల్లో ఫలితాలు కొంత ఆలస్యంగా వచ్చే అవకాశం ఉంది. ఎలాగూ డెంగీలో లక్షణాలకే చికిత్స చేయాల్సి ఉన్నందున... ప్లేట్లెట్ కౌంట్తోనే దీన్ని అనుమానించి... తగిన చికిత్సలు అందించాలి. ఇక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అయిన టైఫాయిడ్ నిర్ధారణ కోసం వైడాల్ టెస్ట్ అనే వైద్య పరీక్ష చేయించాలి. అవసరాన్ని బట్టి కొన్ని ఇతర పరీక్షలూ చేయించాలి. చికిత్స వైరల్ జ్వరాలకు నిర్దిష్ట చికిత్స లేనందున జ్వరానికి పారాసిటమాల్ ఇస్తూ... లక్షణాలను బట్టి సింప్టమాటిక్ ట్రీట్మెంట్ అందించాలి. ద్రవాహారాలు ఎక్కువగా ఇవ్వాలి. ఏవైనా దుష్ప్రభావాలు కనిపిస్తే... వాటిని బట్టి చికిత్సను మార్చాలి. (ఉదా. డెంగీలాంటి కేసుల్లో ప్లేట్లెట్స్ తగ్గినప్పుడు, వాటిని ఎక్కించడం). ఇక టైఫాయిడ్ వంటి బ్యాక్టీరియల్ జ్వరాలకు యాంటీబయాటిక్స్ పనిచేస్తాయి. అయితే జ్వరం వచ్చిన రెండు, మూడు రోజుల వరకు అది వైరలా, బ్యాక్టీరియలా తెలియదు కాబట్టి కేవలం పారాసిటమాల్ తీసుకుంటూ... ఆ పైన కూడా జ్వరం వస్తూనే ఉంటే వైద్యుల వద్దకు వెళ్లి, పరీక్షలు చేయించి, తగిన చికిత్సలు తీసుకోవాలి. ఇక లెప్టోస్పైరోసిస్ వంటివి కాలేయం, కిడ్నీ వంటి వాటిపై దుష్ప్రభావం చూపే అవకాశం ఉంది. సెకండరీ నిమోనియా మరింత ప్రమాదకారి. అందుకే ఈ కేసుల్లో మరింత అప్రమత్తంగా ఉండాలి. -డాక్టర్ ఆరతి బెల్లారి, కన్సల్టెంట్ ఫిజీషియన్ -
తెలంగాణకు ‘ఫుల్ ఫీవర్’.. డెంగీ, మలేరియాతో ఆస్పత్రులకు జనం...
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి జ్వరమొచ్చింది. ఇక్కడా, అక్కడా అని తేడా లేకుండా ఇంటింటా విషజ్వరాలు, సీజనల్ వ్యాధులతో జనం సతమతం అవుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో బాధితుల సంఖ్య పెరుగుతోంది. రాష్ట్ర వైద్యారోగ్యశాఖ నిర్వహిస్తున్న జ్వర సర్వేలోనే ఈ పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్సీ) నుంచి బోధనాస్పత్రుల దాకా రోజూ వేలాది మంది ఔట్ పేషెంట్లు క్యూకడుతున్నారు. ప్రైవేటు ఆస్పత్రులకు వెళుతున్నవారి సంఖ్య మరింత ఎక్కువగా ఉంటోంది. డెంగీ, మలేరియా, టైఫాయిడ్ వంటి కేసులూ నమోదవుతున్నాయి. వానలు.. దోమలతో.. ఈసారి తరచూ వానలు పడుతుండటం, మారిన వాతావరణ పరిస్థితులు, ఉష్ణోగ్రతలు తగ్గడం, అన్నిచోట్లా నీరు నిల్వ ఉండటం, పారిశుధ్య నిర్వహణ లోపం.. ఇవన్నీ కలిసి దోమలు స్వైర విహారం చేస్తున్నాయి. కలుషితాలు వ్యాపిస్తున్నాయి. దీనితో వైరల్ జ్వరాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. చాలా మంది గొంతు నొప్పి, జ్వరంతో ఆస్పత్రులకు వస్తున్నారని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులతో విష జ్వరాలు, సీజనల్ వ్యాధులు మరికొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. వాతావరణంలో మార్పుల కారణంగా న్యుమోనియా, దగ్గు, శ్వాస సంబంధ సమస్యలూ పెరుగుతున్నాయని అంటున్నారు. పెరుగుతున్న డెంగీ కేసులు అపరిశుభ్ర పరిస్థితులు, దోమల వ్యాప్తి కారణంగా డెంగీ, మలేరియా కేసుల సంఖ్య పెరుగుతోంది. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు 7 వేలకుపైగా డెంగీ కేసులు నమోదుకాగా.. ఇందులో ఒక్క ఆగస్టులోనే 3,602 కేసులు వచ్చినట్టు అధికారవర్గాలు చెబుతున్నాయి. ప్రైవేటు ఆస్పత్రుల్లో నమోదవుతున్న డెంగీ కేసుల వివరాలు సరిగా అందక ఈ సంఖ్య తక్కువగా కనిపిస్తోందన్న విమర్శలు కూడా ఉన్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో తీవ్రంగా.. విష జ్వరాలు, సీజనల్ వ్యాధుల తీవ్రత గ్రేటర్ హైదరాబాద్, చుట్టుపక్కల జిల్లాల్లో ఎక్కువగా కనిపిస్తోంది. ఉస్మానియా, గాంధీ, నల్లకుంట ఫీవర్ ఆస్పత్రులు సహా ఇతర ప్రభుత్వ ఆస్పత్రులు, బస్తీ దవాఖాలకు వచ్చే బాధితుల సంఖ్య బాగా పెరిగింది. పలు ఆస్పత్రుల్లో బెడ్లు రోగులతో నిండిపోయాయి. డెంగీ, మలేరియా, టైఫాయిడ్ కేసులూ నమోదవుతున్నాయి. ఒక్క మేడ్చల్ పరిధిలోనే 492 డెంగీ కేసులు వచ్చినట్టు జ్వర సర్వేలో వెల్లడైంది. ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకుని ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రులు దోపిడీకి తెరతీశాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మూడు నెలలుగా తీవ్రత గత ఐదు నెలల్లో ప్రభుత్వ ఆస్పత్రులకు 49.67 లక్షల మంది ఔట్ పేషెంట్లు వచ్చారని వైద్యారోగ్యశాఖ బుధవారం వెల్లడించిన నివేదిక తెలిపింది. సగటున నెలకు 9.93 లక్షల ఓపీ నమోదైనట్టు పేర్కొంది. ముఖ్యంగా జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో అధికంగా అనారోగ్యాల బాధితులు ఉన్నారని.. ఇందులో విష జ్వరాల కేసులు పెద్ద సంఖ్యలో ఉన్నాయని వైద్య వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఎక్కడ చూసినా జ్వర బాధితులే.. ► నల్లగొండ జిల్లాలో విష జ్వరాల బాధితులతో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు నిండిపోతున్నాయి. అధికారికంగానే 56 మందే డెంగీ బారినపడ్డట్టు వైద్యశాఖ అధికారులు తెలిపారు. ► కరీంనగర్ జిల్లాలో జనవరి నుంచి ఇప్పటివరకు 236 డెంగీ కేసులు వచ్చాయి. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధానాస్పత్రికి రోజూ 150 మంది వరకు విష జ్వరాల బాధితులు వస్తున్నట్టు వైద్యులు చెప్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో డెంగీ 38, వైరల్ జ్వరాలు 1,872 కేసులు నమోదయ్యాయి. జగిత్యాల జిల్లాలో ఈ ఒక్క నెలలోనే 188 డెంగీ కేసులు వచ్చాయి. పెద్దపల్లి జిల్లాలో రోజూ వందల్లో జ్వర బాధితులు ఆస్పత్రులకు వస్తున్నారు. ► ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలోనూ సీజనల్ వ్యాధుల కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. సిద్దిపేట ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి రోజూ 1,500 మందికిపైగా రోగులు వస్తున్నారని, అందులో విష జ్వరాల బాధితులు ఎక్కువగా ఉంటున్నారని వైద్యులు తెలిపారు. సంగారెడ్డి జిల్లాలో గత 15 రోజుల్లో 90 డెంగీ కేసులు వచ్చాయి. ► విష జ్వరాలు ఉమ్మడి ఖమ్మం జిల్లాను హడలెత్తిస్తున్నాయి. ప్రతీ ఇంట్లో ఒకరైనా మంచం పట్టి కనిపిస్తున్నారు. జ్వర పీడితులతో ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులు కిక్కిరిసిపోతున్నాయి. జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో బెడ్లు సరిపోక కింద పరుపులు వేసి చికిత్స అందిస్తున్నారు. జిల్లాలో ఈ ఏడాది ఇప్పటివరకు 547 డెంగీ కేసులు, 83 చికున్ గున్యా కేసులు వచ్చాయి. ► ఉమ్మడి నిజామాబాద్ పరిధిలోనూ విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. గత నాలుగు నెలల్లో 86 డెంగీ కేసులు నమోదుకాగా.. వేల మంది వైరల్ జ్వరాల బారినపడ్డారు. ► సీజనల్ వ్యాధులు, జ్వరాలతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి. వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి వస్తున్న వారిలో 10 శాతం మంది ఇన్ పేషెంట్లుగా చేరుతున్న పరిస్థితి ఉంది. పిల్లల వార్డులో బెడ్లు నిండిపోయాయి. ఒక్కో బెడ్‌పై ఇద్దరు, ముగ్గురు చిన్నారులను ఉంచి చికిత్స చేస్తున్నారు. జనగామ, మహబూబాబాద్, భూపాలపల్లి జిల్లాల్లో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లే బాధితుల సంఖ్య పెరుగుతోందని వైద్యవర్గాలు చెప్తున్నాయి. మూడు రోజులుగా జ్వరంతో.. మా బాబు మహేశ్ వయసు ఎనిమిదేళ్లు. మూడు రోజులుగా తీవ్రంగా జ్వరం, జలుబుతో బాధపడుతున్నాడు. బాగా నీరసంగా ఉంటే ఈ రోజు ఆస్పత్రికి తీసుకొచ్చాం. వైరల్ జ్వరంలా ఉంది.. పరీక్షలు చేయించాలని వైద్యులు అంటున్నారు. – మహేశ్ తల్లి, ఉప్పల్ ప్రభుత్వ ఆస్పత్రిలో తగ్గక ప్రైవేటుకు వెళ్లాం డెంగీ రావడంతో వారం రోజుల క్రితం ఫీవర్ ఆస్పత్రిలో చేరి ఐదు రోజులు చికిత్స తీసుకున్నాను. ప్లేట్ లెట్స్ తగ్గిపోతూనే ఉన్నాయి. మా ఇంట్లోవాళ్లు ఆందోళనతో ఫీవర్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేయించి ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. – సాయి కిరణ్ (20), బాగ్ అంబర్‌పేట ఇదీ చదవండి: ‘గులాబీ’ బాస్‌కు తలనొప్పిగా మారిన ‘డాక్టర్’! -
వైరల్ జ్వరాలకు ఆరోగ్యశ్రీ రక్ష
సాక్షి, అమరావతి: సీజనల్ జ్వరాల బారినపడుతున్న ప్రజలకు డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం అండగా నిలుస్తోంది. ఓ వైపు వ్యాధుల నియంత్రణకు ప్రభుత్వం సమర్థవంతంగా చర్యలు చేపడుతూనే.. మరోవైపు జ్వరాలబారిన పడిన వారికి ఉచిత వైద్య సేవలు అందిస్తోంది. ఈ ఏడాది జనవరి నుంచి ఆగస్టు వరకు రాష్ట్రంలో 1,237 మలేరియా, 2,174 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. ప్రభుత్వం తీసుకున్న చర్యలతో సీజనల్ వ్యాధుల బారినపడే వారికి ప్రైవేట్ నెట్వర్క్ ఆస్పత్రుల్లో ఉచితంగా చికిత్స లభిస్తోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైద్యం ఖర్చు రూ.వెయ్యి దాటే చికిత్సలన్నింటినీ ఆరోగ్యశ్రీ పరిధిలోకి చేర్చిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఆరోగ్యశ్రీ కింద చేసే చికిత్సల సంఖ్యను ప్రభుత్వం ఏకంగా 2,446కు పెంచింది. త్వరలో వీటిని 3,118కి పెంచనుంది. 7,032 మందికి చికిత్స ఈ ఏడాది జనవరి నుంచి ఆగస్టు వరకు రాష్ట్రవ్యాప్తంగా 689 మంది మలేరియా బాధితులు ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా చికిత్స పొందారు. వైరల్ జ్వరాల బారినపడిన వారిలో ప్లేట్లెట్స్ తగ్గుదల సమస్య ఉంటోంది. ఈ క్రమంలో ఎలీసా నిర్ధారణ పరీక్షతో సంబంధం లేకుండా వైరల్ జ్వరంతో బాధపడుతూ.. ర్యాపిడ్ కిట్‌లో పాజిటివ్ ఉన్నవారికి ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా డెంగ్యూ చికిత్స అందిస్తున్నారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా జనవరి నుంచి ఆగస్టు వరకు 6,343 మంది చికిత్స పొందారు. వీరిలో అత్యధికంగా అనంతపురం జిల్లా నుంచి 1,612 మంది ఉన్నారు. పరీక్షతో సంబంధం లేకుండా డెంగ్యూకి ఉచిత చికిత్స.. ఎలీసా పరీక్ష ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 2,174 డెంగ్యూ కేసులను మాత్రమే నిర్ధారించారు. ఎలీసా పరీక్షలో పాజిటివ్‌గా నిర్ధారణ అయితేనే డెంగ్యూ ఉన్నట్టు. అయితే కొన్ని రకాల వైరల్ జ్వరాల్లో ఎముక మజ్జ అణచివేత (బోన్‌మ్యారో సప్రెషన్)తో ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయి. ఈ క్రమంలో వైరల్ జ్వరాల బారినపడి.. ప్లేట్లెట్స్ తగ్గినవారికి ఎలీసా పరీక్షతో సంబంధం లేకుండా డెంగ్యూకు చికిత్స అందించాలని కేంద్రం సూచించింది. ఇలాంటి పరిస్థితులున్న బాధితులకు ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా చికిత్స అందిస్తున్నాం. – డాక్టర్ రామిరెడ్డి, ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ సంచాలకులు -
విజృంభిస్తున్న విషజ్వరాలు: డెంగీ..మలేరియా..టైఫాయిడ్!
అంబర్‌పేట: సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. దీంతో నియోజకవర్గంలో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఓపీకి వచ్చే రోగుల సంఖ్య పెరిగింది. నిత్యం 40 నుంచి 50 ఉండే ఓపీ.. ప్రస్తుత సీజన్లో 70 నుంచి 80కి పెరిగింది. నియోజకవర్గంలోని ఐదు ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో పాటు నాలుగు బస్తీ దవాఖానాలకు సామాన్య రోగుల సంఖ్య తాకిడి ఎక్కువైంది. ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు జ్వరాల భారిన పడిన ప్రజలు ప్రైవేట్ ఆసుపత్రులకూ పరుగులు తీస్తున్నారు. ఈ సీజన్లో డెంగీ, మలేరియా, చికున్‌గున్యా, టైఫాయిడ్ జ్వరాలు విజృంభిస్తున్నాయి. గత 20 రోజులుగా విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. దోమల నివారణ, పారిశుధ్య నిర్వహణలో జరుగుతున్న వైఫల్యంతోనే ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సీజనల్ వ్యాధులను అరికట్టేందుకు ప్రభుత్వ యంత్రాంగం సమన్వయంతో పని చేయాలని ప్రజలు కోరుతున్నారు. అండగా బస్తీ దవాఖానాలు సీజన్ వ్యాధులు ప్రబలుతుండటంతో బస్తీ దవాఖానాలు పేదలకు ఎంతో ఊరటనిస్తున్నాయి. ఉదయం 9 గంటల నుంచి 4 గంటల వరకు బస్తీ దవాఖానాల్లో వైద్యులు ఓపీ చూస్తున్నారు. సాధారణ జనంతో పాటు ఇతర జ్వరాలను గుర్తించి చికిత్స అందించడంతో పాటు మెరుగైన చికిత్సకు సిఫార్సు చేస్తున్నారు. నియోజకవర్గంలో అంబర్‌పేట మున్సిపల్ కాలనీ, బాగ్ అంబర్‌పేట అయ్యప్ప కాలనీ సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, నెహ్రూనగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ఫీవర్ ఆసుపత్రిలో వెనుకాల ఉన్న తిలక్‌నగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, విద్యానగర్ డీడీ ఆసుపత్రి ప్రాంగణంలో ఉన్న ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో ఓపీతో పాటు వైద్య పరీక్షల శాంపిళ్లు సేకరించి చికిత్స నిర్వహిస్తున్నారు. ఆయా డివిజన్లలో ఉన్న బస్తీ దవాఖానాల్లో సైతం వైద్య పరీక్షల కోసం రక్త నమూనాలు సేకరించి తెలంగాణ డయాగ్నోస్టిక్స్ కేంద్రానికి పంపిస్తున్నారు. వైద్య పరీక్షల్లో తేలిన ఫలితాన్ని బట్టి కోవిడ్‌కు చికిత్సను అందిస్తున్నారు. దోమల నియంత్రణలో విఫలం సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని తెలిసినా దోమలను నియంత్రించడంలో జీహెచ్ఎంసీ ఎంటమాలజీ విభాగం విఫలమవుతున్నది. దోమల లార్వా, దోమల విజృంభణలను నివారించడంలో ఎంటమాలజీ విభాగం నిర్లక్ష్యం చేస్తున్నదని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తూ.. తూ.. మంత్రంగా ఫాగింగ్ చేపట్టి చేతులు దులుపు కుంటున్నారే తప్ప వాటి నియంత్రణకు చర్యలు తీసుకోవడం లేదని మండిపడుతున్నారు. లార్వా నిర్మూలనలో సైతం పై పై చర్యలు తీసుకొని మిన్నకుండి పోతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. వైద్య విభాగాన్ని సమాయత్తం చేశాం సీజనల్ వ్యాధులను నియంత్రించేందుకు కృషి చేస్తున్నాం. నియోజకవర్గంలో ఉన్న అన్ని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, బస్తీ దవాఖానాల్లో సరిపడా మందులను అందుబాటులో ఉంచాం. సీజనల్ వ్యాధులను అరికడుతూనే విస్తృతంగా వ్యాక్సిన్ ప్రక్రియను చేపడుతున్నాం. సీజనల్ వ్యాధులపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య పరీక్షలు, చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. – డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ హేమలత -
కరీంనగర్ జిల్లాలో విజృంబిస్తున్న విష జ్వరాలు
-
తెలంగాణను వణికిస్తున్న విష జ్వరాలు
-
హైదరాబాద్: విజృంభిస్తున్న విషజ్వరాలు
-
మళ్లీ డెంగీ కాటు!
సాక్షి, హైదరాబాద్: గతేడాది వర్షాకాలంలో రాష్ట్రాన్ని గడగడలాడించిన డెంగీ... సీజన్ దాటినా ఇప్పటికీ కేసులు నమోదవుతున్నాయి. ప్రస్తుతం డెంగీతో కొందరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వైద్య ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం ఈ నెల ఒకటో తేదీ నుంచి సోమవారం వరకు అంటే 20 రోజుల్లో రాష్ట్రంలో 180 డెంగీ కేసులు నమోదయ్యాయి. సాధారణంగా వర్షాకాలంలో డెంగీ జ్వరాలు, వైరల్ ఫీవర్లు వస్తుంటాయి. సీజన్ దాటాక కూడా ఇప్పటికీ కేసులు నమోదవుతున్నాయంటే డెంగీకి కారణమయ్యే దోమ ఇంకా అక్కడక్కడా ఉండటం వల్లేనని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. అయితే వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు మాత్రం డెంగీ నివారణ చర్యలను దాదాపు నిలిపివేశాయి. ప్రస్తుత పరిస్థితుల్లో నివారణ చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. మరోవైపు స్వైన్‌ఫ్లూ కేసులు కూడా రాష్ట్రంలో నమోదవుతున్నాయి. గత 15 రోజుల్లోనే 30 కేసులు నమోదయ్యాయని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. స్వైన్‌ఫ్లూ నియంత్రణకు అన్ని జిల్లా ఆసుపత్రుల్లో స్వైన్‌ఫ్లూ ఐసొలేటెడ్ వార్డులను ఏర్పాటు చేశారు. ఆయా ఆసుపత్రుల్లో స్వైన్‌ఫ్లూ మందులు, మాస్కులు సిద్ధంగా ఉంచారు. జ్వరం, దగ్గు, జలుబు, ఆయాసం, తలనొప్పి, ఒంటి నొప్పులు, ఊపిరి తీసుకోలేకపోవడం, ఛాతీలో మంట వంటి లక్షణాలు ఉంటే వెంటనే ఆసుపత్రిలో చేరాలని డాక్టర్లు సూచిస్తున్నారు. గతేడాది 13,417 కేసులు ఎన్నడూ లేనంతగా గతేడాది డెంగీతో జనం విలవిలలాడిపోయారు. డెంగీతో అనేక మంది చనిపోయినా వైద్య, ఆరోగ్యశాఖ మాత్రం మరణాల సంఖ్యను తక్కువగా చూపించినట్లు విమర్శలు వచ్చాయి. 2019 జనవరి నుంచి డిసెంబర్ నెలాఖరు వరకు తెలంగాణలో 13,417 డెంగీ కేసులు నమోదైనట్లు వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు వెల్లడించాయి. అందులో కేవలం ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లోనే 10 వేల కేసుల వరకు నమోదైనట్లు అంచనా వేశారు. డెంగీ కేసుల్లో తెలంగాణ దేశంలోనే రెండో స్థానంలో ఉందని అప్పట్లో రాష్ట్రానికి వచ్చిన కేంద్ర బృందం ప్రకటించింది. రాష్ట్రంలో నమోదైన కేసుల్లో 40 నుంచి 50 శాతం వరకు హైదరాబాద్, ఖమ్మం జిల్లాలోనే నమోదయ్యాయని పేర్కొన్నారు. గతేడాది వర్షాకాల సీజన్లో అధిక వర్షాలు కురవడం వల్లే అధికంగా కేసులు నమోదయ్యాయి. సెప్టెంబర్‌లో 20 నుంచి 25 రోజులు, అక్టోబర్‌లో 25 రోజులకుపైగా వర్షాలు కురవడం వల్లే డెంగీ దోమల వ్యాప్తి పెరిగింది. -
తగ్గని జ్వరాలు
సాక్షి, హైదరాబాద్: వర్షాలు ఆగట్లేదు. వ్యాధులు తగ్గ ట్లేదు. జనానికి జ్వరాల బాధలు తప్ప ట్లేదు. జూలైలో ప్రారంభమైన జ్వరాలు ఇప్పటికీ తగ్గట్లేదు. ప్రతి ఇంట్లో ఒకరు జ్వరం బారిన పడ్డారు. డెంగీ, మలేరియా, చికున్‌గున్యా జ్వరాలు పట్టిపీడిస్తు న్నాయి. తలనొప్పి, ఒళ్లు నొప్పులు, వాం తులు, విరేచనాలతో భయాందోళనకు గురవుతున్నారు. సెప్టెంబర్ చివరి నాటికే వర్షాల తీవ్రత తగ్గిపోవాలి. కానీ అక్టోబర్ నెలాఖరుకు కూడా వర్షాలతో రాష్ట్రం తడిసిముద్దవుతోంది. ఇప్పటికీ సాయం త్రం అయిందంటే చాలు అనేకచోట్ల క్యుములోనింబస్ మేఘాలతో ఒక్క సారిగా కుండపోత వర్షాలు కురుస్తున్నా యి. ఈ వర్షాలు నవంబర్లోనూ కొద్ది రోజులు కొనసాగే పరిస్థితి ఉండటంతో దోమలు మరింత విజృంభించే ప్రమాదం పొంచి ఉంది. రాష్ట్రంలో అధికారిక లెక్కల ప్రకారం ఇద్దరే మృతి చెందినట్లు ఆరోగ్య శాఖ చెబుతున్నా అనధికారిక సమాచారం ప్రకారం డెంగీ కారణంగా కనీసం 150 మందికిపైగా చనిపోయారు. అందులో ఒక్క నిలోఫర్ ఆసుపత్రిలోనే ఏడుగురు పసి పిల్లలు డెంగీతో చనిపోయారని అక్కడి వైద్యులే ఆఫ్ ది రికార్డు సంభాషణల్లో చెబుతున్నారు. అంకెలను తక్కువ చూపిస్తూ అధికారులు ప్రభుత్వాన్ని పక్కదారి పట్టిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. దేశంలోనే డెంగీలో తెలంగాణ రెండో స్థానంలో ఉందని ఏకంగా కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ ప్రకటించిందంటే పరిస్థితి తీవ్రత అర్థం చేసుకోవచ్చు. ఒకేసారి రెండు వ్యాధుల విజృంభణ.. డెంగీ, చికున్‌గున్యా వానాకాలం సీజన్లో వచ్చేవి కాగా, శీతాకాలంలో స్వైన్‌ఫ్లూ పుంజుకుంటుంది. వర్షాల వల్ల వాతావరణం చల్లగా ఉండటంతో డెంగీ, స్వైన్‌ఫ్లూ రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. వానాకాలం, చలికాలంలో వేర్వేరుగా వచ్చే ఈ రెండు వ్యాధులు ఇప్పుడు ఒకేసారి రాష్ట్రంలో విజృంభిస్తున్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి ఈ నెల 20 వరకు తెలంగాణలో 1,319 స్వైన్‌ఫ్లూ కేసులు నమోదు కాగా, 21 మంది చనిపోయారు. దీంతో జ్వరం, తలనొప్పి వస్తేనే ప్రజలు డయాగ్నస్టిక్ సెంటర్లకు పరుగులు తీస్తున్నారు. మామూలు జ్వరానికీ పరీక్షల కోసం వేలు ఖర్చు చేస్తున్నారు. ఇదే అదనుగా డయాగ్నస్టిక్ సెంటర్లు, వైద్యులు దీన్ని వ్యాపారంగా మార్చేస్తున్నారు. హైదరాబాద్‌లో ఓ పేరొందిన ఆస్పత్రి వైద్యులు ప్రతి చిన్న దానికి రూ.5 వేలకు మించి పరీక్షలు చేయిస్తున్నారు. దాంతో పాటు వైరల్ జ్వరాలతో బాధపడుతున్న వారు మందులు విచ్చలవిడిగా మింగుతున్నారు. అది ఇతరత్రా ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుం దని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫాగింగ్ చర్యలు కరువు.. దోమలే డెంగీ, మలేరియా జ్వరాలకు కారణం. ఈ దోమలను నివారించడానికి ఇంట్లో పరిశుభ్రత, నీటిని నిల్వ ఉండకుండా చూడటం ముఖ్యం. చుట్టుపక్కల నీరు నిల్వ ఉంటే అక్కడా డెంగీ దోమలు వ్యాప్తి చెందుతాయి. దోమలను నిర్మూ లించాలంటే నిరంతరం మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలు ఫాగింగ్ చేయాలి. కానీ ఈ ఏడాది ఫాగింగ్ యంత్రాలు పూర్తిస్థాయిలో లేకపోవ డంతో దోమల నివారణ జరగలేదు. దీంతో దోమలు స్వైర విహారం చేస్తున్నాయి. ఆ తర్వాత తలెత్తిన పరిణామాలను ఎదుర్కోవడంలో వైద్య, ఆరోగ్య శాఖ విఫలమైంది. చాలాచోట్ల డెంగీ కిట్లను సకాలంలో అందించలేకపోయింది. దీంతో ప్రైవేటు ఆస్పత్రులు కిటకిటలాడాయి. రాష్ట్రంలో ప్రతి కుటుంబం సరాసరి రూ.50 వేల వరకు డెంగీ, చికున్‌గున్యా, ఇతర వైరల్ జ్వరాలకు ఖర్చు చేసినట్లు అంచనా. కొన్ని కుటుంబాలైతే రూ.2 నుంచి రూ.4 లక్షల వరకు ఖర్చు చేశారు. కొందరు ప్రత్యేకంగా డెంగీకి బీమా చేయించుకున్నారు. సాయంత్రం ఓపీకి బ్రేక్.. ఏరియా, జిల్లా, బోధనాస్పత్రుల్లో సాయంత్రం వేళల్లోనూ ఓపీ నిర్వహించాలన్న సర్కారు లక్ష్యం నీరుగారుతోంది. ఇప్పటికీ డెంగీ, వైరల్ ఫీవర్లు వస్తున్నా సాయంత్రం డాక్టర్లు ఓపీ చూడట్లేదు. అయితే దీనికి రోగులు రావట్లేదన్న కారణం చూపుతున్నారు. ఇక కీలకమైన వైరల్ ఫీవర్ల సీజన్ కావడంతో కొందరు ప్రభుత్వ వైద్యులు సొంత ప్రైవేటు ఆస్పత్రులకే ప్రాధాన్యం ఇస్తున్నారు. మళ్లీ దోమలు విజృంభించే చాన్స్ ఇప్పటికీ ఆస్పత్రులకు డెంగీ జ్వరాలతో జనం వస్తూనే ఉన్నారు. సీజన్ అయిపోయినా వర్షాల వల్ల ఈ పరిస్థితి నెల కొంది. వర్షాలు తగ్గాక మళ్లీ దోమలు విజృం భించే అవకాశముంది. కాబట్టి ఇళ్లలో పరిశు భ్రత పాటించాలి. –డాక్టర్ కృష్ణ భాస్కర్, పిజీషియన్, సిటీ న్యూరో, హైదరాబాద్ డెంగీలో ఖమ్మం రెండో స్థానం.. దగ్గు, జలుబు, తలనొప్పి తో ప్రజలు ఆస్పత్రులకు వస్తున్నారు. డెంగీ కేసుల్లో రాష్ట్రంలో ఖమ్మం జిల్లా రెండో స్థానంలో ఉంది. అంటే దోమలు ఇక్కడ ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. కార్పొరేషన్లో ఎక్కడి చెత్త అక్కడే ఉంది. దీంతో దోమలు పెరిగిపోతున్నాయి. – డాక్టర్ యలమంచిలి రవీంద్రనాథ్, ఖమ్మం -
అమ్మో.. జ్వరం
సాక్షి, గుంటూరు : ఇంటిల్లిపాదిని సందడి చేస్తూ ఉండాల్సిన పిల్లలు జ్వరాలతో మంచం పడుతున్నారు. స్నేహితులతో పాఠశాలలకు ఉల్లాసంగా వెళ్లాల్సిన చిన్నారులు ఆస్పత్రుల గడప తొక్కుతున్నారు. జిల్లా వ్యాప్తంగా పిల్లలు జ్వరాలతో బాధ పడుతుండడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. రెండు రోజుల క్రితం విష జ్వరాలతో ముప్పాళ్ల మండలం, నరసరావుపేట పట్టణాల్లో ఇద్దరు పిల్లలు మృత్యువాత పడ్డారు. జీజీహెచ్‌లో ప్రతి రోజూ 20 పిల్లలు గుంటూరు జీజీహెచ్‌లో ప్రతి రోజూ 20 మంది పిల్లలు వివిధ రకాల జ్వరాలతో చికిత్స పొందుతున్నారు. డెంగీ, మలేరియా, టైఫాయిడ్, వైరల్ ఫీవర్, నిమోనియా సమస్యలతో ఆస్పత్రిలో చేరుతున్నారు. గుంటూరు జిల్లాలో చిన్నపిల్లల వైద్య నిపుణులు 215 మంది ఉన్నారు. ప్రతి వైద్యుడి వద్దకు రోజూ 60 నుంచి 100 మంది పిల్లలను జ్వరాల చికిత్స కోసం తీసుకొస్తున్నారు. జ్వరాల లక్షణాలు చలి జ్వరం, జాయింట్ నొప్పులు, ఒళ్లు నొప్పులు, తలనొప్పి, శరీరంపై ఎర్రటి గుల్లలు, కడుపులో నొప్పి, బీపీ తగ్గిపోవటం, మూత్రం సక్రమంగా రాకపోవటం, నీరసం తదితర లక్షణాలు జ్వరాల బారిన పడిన పిల్లల్లో కనిపిస్తాయి. జ్వరం సోకిన పసి కందులు సరిగ్గా తల్లిపాలు తాగలేక ఏడుస్తుంటారు. మూత్ర సమస్య వస్తుంది. జ్వరం మూడు రోజులకు మించితే.. సాధారణంగా జ్వరం మూడు రోజులు ఉంటుంది. వైద్య పరీక్షలు జ్వరం వచ్చిన మూడు రోజుల తరువాత మాత్రమే చేయించాలి. ఎలాంటి జ్వరం వచ్చినా ప్లేట్లెట్స్ తగ్గుతాయి. సాధారణంగా 1.5 లక్షల నుంచి 4.5 లక్షల ప్లేట్లెట్స్ ఉంటాయి. వీటి సంఖ్య 40 వేలకన్నా తక్కువగా ఉన్నా ప్రమాదం ఉండదు. శరీరంపై ఎర్రటి దద్దుర్లు ఏర్పడి అవి పగిలి రక్తం రావడం, మూత్రంలో రక్తం కారడం, దగ్గుతున్నప్పుడు రక్తం పడడం, పళ్లు తోముకుంటున్నప్పుడు రక్తం రావడం, ముక్కులో నుంచి రక్తం కారడం వంటి లక్షణాలు కనిపిస్తే ప్లేట్లెట్స్ ఎక్కించాల్సి ఉంటుంది. జీజీహెచ్‌లో ఉచిత వైద్య సేవలు జ్వరాలు సోకిన పిల్లలకు జీజీహెచ్‌లో ఉచితంగా కార్పొరేట్ వైద్యం అందిస్తున్నాం పిల్లల వైద్య విభాగాధిపతి డాక్టర్ పెనుగొండ యశోధర తెలిపారు. ప్రతి రోజూ 20 మంది వరకు జ్వరాలు సోకిన పిల్లలు వస్తున్నారన్నారు. ఆగస్టులో 85 మందికి, సెప్టెంబర్‌లో 181 మంది జ్వరాలు సోకిన పిల్లలకు సేవలందించామని తెలిపారు. నాతోపాటు అసోసియేట్ ప్రొఫెసర్లు బీ దేవకుమార్, ఎలిజబెత్, రామిరెడ్డి, పేరం ఝాన్సీరాణి, అసిస్టెంట్ ప్రొఫెసర్లు శివరామకృష్ణ, చాందిని, వీరేష్, బ్రహ్మయ్య, కరిముల్లా, దీపక్, సునీత, వాణీభాయ్, పీజీ వైద్యులు 24 గంటలు అందుబాటులో ఉంటారన్నారు. జాగ్రత్తలు పాటించండి జ్వరం వారం రోజులపాటు ఉంటుంది. జ్వరం తగ్గినా 48 గంటల వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్లేట్లెట్లు, బీపీ తగ్గిపోవడం, మూత్రం రాకపోవడం వంటి లక్షణాలు జ్వరం తగ్గిన 48 గంటల తర్వాత బయటపడతాయి. కొబ్బరి నీరు, మజ్జిగ, పండ్ల రసాలు, ఓఆర్ఎస్ ద్రావణం పిల్లలకు తాగించాలి. జ్వరం వచ్చిన మూడు, లేదా నాలుగో రోజు మాత్రమే వైద్య పరీక్షలు చేయించాలి. వైద్యుల సలహా లేకుండా మందులు వాడకూడదు. ఇంట్లో, స్థానికంగా అందుబాటులో ఉండే అర్హత లేని వారితో సెలైన్లు పెట్టించి పిల్లల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టవద్దు. అందుబాటులో ఉన్న మెరుగైన వైద్యశాలలో మాత్రమే పిల్లలకు చికిత్స తీసుకోవాలి. – డాక్టర్ తిమ్మాపురం చంద్రశేఖరరెడ్డి, పిల్లల వైద్య నిపుణుల సంఘం సెక్రటరీ. దోమతెరలు వాడండి దోమల ద్వారా డెంగీ, మలేరియా, చికెన్‌గున్యా, వైరల్ జ్వరాలు, ఫైలేరియా లాంటి వ్యాధులు వస్తున్నాయి. దోమల పెరుగుదలకు అపరిశుభ్రమైన వాతావరణమే కారణం. ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. వ్యక్తిగత పరిశుభ్రత కూడా ముఖ్యం. మురుగు, వర్షపు నీరు నిల్వ లేకుండా చూసుకోవాలి. పనికిరాని వస్తువులు, వినియోగించని వాటిని బయటపడేయాలి. టైర్లు, కొబ్బరి బొండాలు దోమలు ఆవాసాలుగా ఉంటాయి. దోమ తెరలు వాడటం చాలా మంచిది. చేతులు పూర్తిగా కప్పి ఉండే వస్త్రాలను ధరించాలి. – డాక్టర్ జొన్నలగడ్డ యాస్మిన్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి -
డెంగీ డేంజర్ ; కిట్లకు కటకట..
సాక్షి, హైదరాబాద్ : ప్రభుత్వ ఆసుపత్రులకు ఇదో పరీక్ష. డెంగీ రోగులకు పరీక్షలు చేయడంలో విఫలమవుతున్నాయి. రాష్ట్రంలో డెంగీ నిర్ధారణ పరీక్షల నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి. సరిపడా డెంగీ నిర్ధారణ కిట్లు లేక పాట్లుపడుతున్నాయి. రెండు, మూడు రోజులు ఆగాలని వైద్య సిబ్బంది చెబుతుండటంతో జనం గగ్గోలు పెడుతున్నారు. ప్రభుత్వం డెంగీపై అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నా, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు మాత్రం కిట్లు సమకూర్చకుండా నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు. నివేదికలతో ప్రభుత్వాన్ని పక్కదారి పట్టిస్తున్నారు. అవసరం 10 లక్షలు...అందుబాటులో 1.35 లక్షల మందికే వైరల్ జ్వరాలు విజృంభిస్తుండటం, ఒక్కోసారి 103–104 డిగ్రీల జ్వరం వస్తుండటంతో రాష్ట్రవ్యాప్తంగా జనం ఆందోళన చెందుతున్నారు. వైరల్ జ్వరాలు, డెంగీ అనుమానిత కేసులు పెద్ద ఎత్తున నమోదవుతున్నాయి. వైద్యవిధాన పరిషత్ పరిధిలోని 31 జిల్లా, 87 ఏరియా ఆసుపత్రులకు రోజూ లక్షలాదిమంది తరలివస్తున్నారు. పడకలు కూడా దొరకని పరిస్థితి. ఉస్మానియా, వరంగల్ ఎంజీఎం, హైదరాబాద్‌లోని తెలంగాణ డయాగ్నొస్టిక్ సెంటర్‌కూ రోగులు పెద్దఎత్తున తరలివస్తున్నారు. వేలాది ప్రైవేటు ఆసుపత్రుల నుంచి కూడా డెంగీ నిర్ధారణ కోసం లక్షలాది మంది వస్తున్నారు. రాష్ట్రంలో దాదాపు 10 లక్షలమందికి డెంగీ నిర్ధారణ పరీక్షలు చేయాల్సి ఉండగా, వైద్య విధానపరిషత్ ఆసుపత్రులు, బోధనాసుపత్రుల్లో కేవలం 1.35 లక్షలమందికి మాత్రమే సరిపడా కిట్లున్నాయి. అందులో ప్రాథమిక నిర్ధారణ కోసం నిర్వహించే ర్యాపిడ్ టెస్టు కిట్లు 73 వేలుండగా, పూర్తిస్థాయి నిర్ధారణ కోసం నిర్వహించే ఎలీసా కిట్లు కేవలం 62 వేలమందికి సరిపోను మాత్రమే ఉన్నాయి. ఎలీసా పరీక్షల కోసం రెండు, మూడు రోజులపాటు ఆగాలని ప్రభుత్వ ఆసుపత్రుల సిబ్బంది చెబుతుండటంతో బాధితులు ఉస్సూరుమంటూ వెనుదిరుగుతున్నారు. వైద్య విధాన పరిషత్ యంత్రాంగం విఫలం వైద్య విధాన పరిషత్‌కు ఇన్చార్జి కమిషనర్‌గా హైదరాబాద్ కలెక్టర్ మాణిక్‌రాజ్ కొనసాగుతున్నారు. రెండు విధులతో ఆయన జిల్లా, ఏరియా ఆసుపత్రులపై దృష్టి సారించడంలేకపోతున్నారు. కనీసం ఆయా ఆసుపత్రుల యంత్రాంగంతో సమీక్ష నిర్వహించలేని పరిస్థితి. ఆయన కంటే కిందిస్థాయిలో ఉండే అధికారులు కూడా డెంగీ నిర్వహణ, పర్యవేక్షణలో విఫలమయ్యారన్న ఆరోపణలు ఉన్నాయి. ఎలీసా కిట్లు ఏడే.. ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాకూ అధికారులు డెంగీ నిర్ధారణ కిట్లు తక్కువగానే ఇచ్చారు. ర్యాపిడ్ టెస్టు కిట్లను గజ్వేల్ ఏరియా ఆసుపత్రికి 500, దుబ్బాక ఆసుపత్రికి 150, తూప్రాన్ ఆసుపత్రికి 250 మాత్రమే ఇచ్చారు. సిద్ధిపేట జిల్లా ఆసుపత్రికి కేవలం ఏడే ఎలీసా కిట్లు ఇచ్చారు. ర్యాపిడ్ పరీక్ష కిట్టు ద్వారా ఒక్కో యూనిట్ ఒక్కరికి, ఎలీసా కిట్టు ఒక్కోటి 96 మందికి పరీక్ష చేయడానికి వీలుంది. నీలోఫర్ ఆసుప త్రికి 70 ఎలీసా కిట్లు మాత్రమే ఇచ్చారు. అయితే, ఇక్కడికి రోజూ కనీసం 2 వేల మందికి పైగా పిల్లలు వస్తున్నారు. హైదరా బాద్‌లోని ఫీవర్ ఆసుపత్రికి రోజూ 2,500 మంది రోగులు వస్తుంటారు. అక్కడ కేవలం 3,936 మందికి సరిపోయే 41 ఎలీసా కిట్లు అందుబాటులో ఉన్నాయి. ఖమ్మం జిల్లా ఆసుపత్రికి ఐదు ఎలీసా కిట్లు మాత్రమే ఉన్నాయి. ఆలస్యానికి కారణమిదే.. డెంగీ పరీక్షలు నిర్వహించడంలో ఆలస్యానికి కారణం కిట్ల కొరత కాదు. అవసరమైనన్ని కిట్లు అందుబాటులో ఉంచుతున్నాం. అవసరమైనప్పుడు తెప్పిస్తున్నాం. అయితే, ఎలీసా పరీక్షకు నిర్వహించే ఒక్కో కిట్టు ధర రూ.25 వేలు. ఒక్కో కిట్టు ద్వారా 96 మందికి పరీక్షలు చేయడానికి వీలుంది. కొద్దిమంది కోసం ఒక్కసారి కిట్టు విప్పితే మిగతావారి కోసం దాన్ని దాచి ఉంచలేం. కాబట్టి 96 రక్త నమూనాలు వచ్చే వరకు ఆగుతున్నాం. -చంద్రశేఖర్‌రెడ్డి, ఎండీ,టీఎస్ఎంఎస్ఐడీసీ -
మాట్లాడే అవకాశం ఇవ్వట్లేదు: జగ్గారెడ్డి
సాక్షి, హైదరాబాద్: సంగారెడ్డి విష జ్వరాలతో తల్లడిల్లుతోందని, సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడదామంటే స్పీకర్ అవకాశం ఇవ్వట్లేదని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆరోపించారు. ఆదివారం అసెంబ్లీ ప్రాంగణంలోని మీడియా పాయింట్లో ఆయన మాట్లాడుతూ.. ప్రతిరోజూ వెయ్యి మంది ఔట్‌పేషెంట్లతో సంగారెడ్డి ప్రభుత్వాసుపత్రి కిటకిటలాడుతోందన్నారు. మంత్రి ఈటల ఒకసారి సంగారెడ్డికి వస్తే పరిస్థితి తీవ్రత తెలుస్తుందన్నారు. ఎంఐఎం, టీఆర్ఎస్ సభ్యులకు సభలో మాట్లాడే అవకాశం ఇచ్చి కాంగ్రెస్ సభ్యులకు ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. -
99 శాతం వైరల్ జ్వరాలే..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా జ్వరాలు ప్రబలుతున్నా ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. ఇప్పుడు ప్రబలిన జ్వరాల్లో 99 శాతం వైరల్ జ్వరాలేనని, డెంగీ చాలా తక్కువ మందికే సోకిందని శాసనసభకు తెలిపారు. 2007లో ప్రభావం చూపిన తరహాలో ఇప్పుడు డెంగీ తీవ్రత లేదని, అప్పటి కంటే బాధితుల సంఖ్య ఎక్కువగా కనిపిస్తున్నా, దాని తీవ్రత తక్కువే ఉందన్నారు. అప్పటి తరహాలో మృతుల సంఖ్య ఎక్కువ లేని విషయాన్ని గుర్తించాలన్నారు. ఆదివారం ప్రశ్నోత్తరాల సమయంలో కాంగ్రెస్ సభ్యులు భట్టి విక్రమార్క, అనసూయ (సీతక్క) ఈ విషయంపై ప్రభుత్వాన్ని నిలదీశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ప్రభుత్వం సరిగా స్పందించకపోవడం వల్లనే జ్వరాలు తీవ్రంగా ప్రబలి రాష్ట్రంలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయని నిలదీయగా, మంత్రి దానికి వివరంగా సమాధానమిచ్చారు. వైరల్ జ్వరాలే అయినందున పెద్దగా ఆందోళన చెందాల్సిన పని లేదని, మరో నెలరోజులు ఈ తరహా పరిస్థితి ఉంటుందని అంచనా వేస్తున్నట్టు పేర్కొన్నారు. ఇప్పటికీ పరిస్థితి గంభీరంగానే ఉన్నా, ఆందోళన అవసరం లేదని తెలిపారు. ప్రతిపక్షాలు కూడా జనానికి ధైర్యం చెప్పేలా వ్యవహరించాలని కోరారు. వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది సేవలు భేష్.. జ్వరాలు ప్రబలుతున్న ప్రస్తుత తరుణంలో వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది చొరవను శాసనసభ వేదికగా అభినందిస్తున్నట్లు ఈటల ప్రకటించారు. వారు చాలా అప్రమత్తంగా ఉండి సేవలందిస్తున్నారని పేర్కొన్నారు. మందుల కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. త్వరలో 9,381 పోస్టుల భర్తీ.. రాష్ట్రవ్యాప్తంగా 12,289 పోస్టుల భర్తీకి సీఎం ఆమోదం తెలిపారని, వీటిలో 9,381 పోస్టులు త్వరలో∙భర్తీ అవుతాయని ఈటల తెలిపారు. వీటి లో 2,917 మంది డాక్టర్లు, 4,268 మంది నర్సులు, మిగతావి పారా మెడికల్ పోస్టులని పేర్కొన్నారు. అత్యవసర పరిస్థితి ప్రకటించాలి: కాంగ్రెస్ రాష్ట్రం మొత్తం జ్వరాలతో బాధపడుతున్నందున ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించి చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరైన వసతులు లేకపోవడం, డాక్టర్ల కొరత తీవ్రంగా ఉండటంతో తీవ్ర ఆందోళనకర పరిస్థితి నెలకొందని ఆ పార్టీ సభ్యులు భట్టి విక్రమార్క, సీతక్క ఆరోపించారు. వాస్తవాలు దాచి మభ్యపెట్టే ప్రయత్నం చేయొద్దని, సమస్య తీవ్రంగా ఉందని ఆరోపించారు. -
బొప్పాయి..బాదుడేనోయి
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో డెంగీ, మలేరియా, డయేరియా వంటి విషజ్వరాలు ప్రబలుతున్న నేపథ్యంలో ఔషధగుణాలున్న బొప్పాయి పండ్లకు ఎన్నడూ లేనంత గిరాకీ పెరిగింది. మార్కెట్లో డిమాండ్‌కు తగ్గట్లు బొప్పాయి సరఫరా లేకపోవడంతో ధరలు అమాంతం పెరిగాయి. అన్ని జిల్లా, మండల ప్రధాన ఆస్పత్రులన్నీ డెంగీ, ఇతర విష జ్వరాల బాధితులతో నిండిపోతున్నాయి. దీనికితోడు వర్షాల సీజన్ కావడంతో కలుషిత నీటితోనూ ఇతర వ్యాధులు ప్రబలుతున్నాయి. ఈ నేపథ్యంలో రోగులు బొప్పాయి పండ్లను ఎక్కువగా తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. ఇంకా పలు రకాల మేలు కలుగుతుందని చెబుతున్నారు. ఎక్కడ నుంచి సరఫరా... రాష్ట్రంలో పెద్ద సైజు బొప్పాయి పండ్లు అధికంగా ఖమ్మం, జహీరాబాద్, కల్వకుర్తి, అచ్చంపేట, ఒంగోలు నుంచి, చిన్నసైజు బొప్పాయిలు నల్లగొండ, వరంగల్, కర్ణాటకలోని గుల్బర్గా, ఏపీలోని నూజివీడుల నుంచి హైదరాబాద్‌కు వస్తోంది. ధర.. దడదడ గత ఏడాది ఇదే సమయానికి గడ్డిఅన్నారం మార్కెట్లో హోల్‌సేల్ వ్యాపారులు పెద్దరకం బొప్పాయి కిలో రూ.8 నుంచి రూ.10కి విక్రయించారు. అది కాస్త ప్రస్తుతం రూ.30 నుంచి రూ.40కి పెరిగింది. దీన్ని రిటైల్ వ్యాపారులు కిలో రూ.80కి అమ్ముతున్నారు. సూపర్ మార్కెట్లలో కిలో రూ.100కి అమ్ముతున్నారు. ఇక జిల్లాల్లో పెద్దరకం బొప్పాయిలు అందుబాటులో లేవు. చిన్నసైజు బొప్పాయి ధర సైతం జిల్లాలో కిలో రూ.80కి తక్కువగా లేదు. అయితే, గడ్డిఅన్నారం మార్కెట్‌కు శుక్రవారం 80 టన్నుల మేర బొప్పాయి పండ్లు వచ్చినట్లు మార్కెటింగ్ వర్గాలు చెబుతున్నారు. ఇదే రీతిన మార్కెట్లో బొప్పాయి వస్తేనే ధరలు దిగొచ్చే అవకాశం ఉంది. మేలు ఇలా.. శరీరంలో హాని కలిగించే టాక్సిన్లను నివారిస్తుంది. జీర్ణవ్యవస్థ చక్కగా పనిచేసేందుకు, శరీరంలోని కొవ్వును తగ్గించడానికి దోహదపడుతుంది. గుండెపోటు నివారణకు, జలుబు, జ్వరంతో బాధపడేవారికి మంచి ఔషధం.. బొప్పాయి ఆకుల జ్యూస్ తాగడం వల్ల శరీరంలోని ప్లేట్లెట్ల సంఖ్య పెరుగుతుంది. కాలేయాన్ని శుభ్రం చేస్తుంది. ∙లివర్ సిరోసిస్ వంటి కాలేయ సంబంధ వ్యాధులు రాకుండా నివారిస్తుంది.