ప్లేట్‌లెట్స్ తగ్గడంతో మంచం పట్టిన సగరపు లక్ష్మి
లావేరు: మండల కేంద్రంలోని లావేటిపాలేంలో విష జ్వరాలు విజృంభించాయి. డెంగీ, మలేరియా వంటి విష జ్వరాల బారిన పడి పలువురు ఆస్పత్రుల పాలయ్యారు. గ్రామానికి చెందిన ఇనపకుర్తి రమణ, లంకలపల్లి కాసులమ్మ డెంగీ లక్షణాల కారణంగా తీవ్ర అస్వస్థతకు గురికావడంతో కుటుంబసభ్యులు మెరుగైన చికిత్స కోసం విశాఖపట్నంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. సగరపు లక్ష్మీ, ఇనపకుర్తి ఎల్లారావులను శ్రీకాకుళంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. గ్రామంలో మరికొంత మంది కూడా జ్వరాలతో బాధపడుతున్నట్లు తెలిసింది. జ్వరాలు విజృంభిస్తున్నా గ్రామంలో ఎలాంటి వైద్యసేవలు అందడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
క్షీణించిన పారిశుద్ధ్యం
లావేటిపాలేంలో పారిశుద్ధ్యం క్షీణించడం వల్లే జ్వరాలు వ్యాప్తి చెందుతున్నాయని గ్రామస్తులు చెబుతున్నారు. గ్రామంలో ఎక్కడ చూసినా చెత్తాచెదారాలే కనిపిస్తున్నాయని, తాగునీటి వనరుల వద్ద మురుగునీరు నిల్వ ఉంటోందని వాపోతున్నారు. అధికారులు చోద్యం చూస్తున్నారే తప్ప పట్టించుకోవడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు పెంట కుప్పలు కుళ్లిపోయి దుర్గంధం వెదజల్లుతున్నాయని చెబుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పారిశుద్ధ్యం మెరుగుకు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.