మన్యంలో ముసురుతున్న జ్వరాలు | Tribal Agencies Suffering Viral Fever Srikakulam District | Sakshi
Sakshi News home page

మన్యంలో ముసురుతున్న జ్వరాలు

Published Wed, Aug 28 2019 8:55 AM | Last Updated on Wed, Aug 28 2019 8:56 AM

Tribal Agencies Suffering Viral Fever Srikakulam District - Sakshi

సీతంపేట ఆస్పత్రిలో రోగులు

సాక్షి, సీతంపేట: మన్యం నూటొక్క డిగ్రీల జ్వరంతో మూలుగుతోం ది. తాజాగా కురుస్తున్న వానలకు గెడ్డల్లో కొత్త నీరు చేరి కలుషితమవుతోంది. ఈ నీటినే గిరిజనులు తాగడానికి ఉపయోగిస్తుండడంతో వారు జ్వరాల బారిన పడుతున్నారు. ప్రస్తుతం మన్యం పరిధిలోని ఏ పీహెచ్‌సీ చూసినా వైరల్, టైఫాయిడ్‌ వంటి జ్వరాల బాధితులే కనిపిస్తున్నారు. గిరిజన ప్రాంతాల్లో ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు ఊటబావుల్లో, గెడ్డల్లో నీరు చేరింది. ఈ నీటినే కొన్ని గ్రామాల్లో వినియోగించాల్సిన పరిస్థితి ఉంది. దీంతో టైఫాయిడ్‌ వంటి వ్యాధులు వస్తున్నాయి. దీనికి తోడు కొన్ని గిరిజన గ్రామాల్లో పారిశుద్ధ్యం కూడా క్షీణించడంతో వ్యాధులు వ్యాప్తి చెందుతున్నాయి.

ఆస్పత్రులు కిటకిట..
ఐటీడీఏ పరిధిలో 27 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. ప్రాథమిక ఉప ఆరోగ్య కేంద్రాలు మరో 15 ఉన్నాయి. ఏరియా ఆస్పత్రులు 2, సీహెచ్‌సీలు 10 ఉన్నాయి. హైరిస్క్‌ ప్రాంతమైన సీతంపేట ఏజెన్సీలో సీతంపేట, దోనుబాయి, కుశిమి, మర్రిపాడు గ్రామాల్లో పీహెచ్‌సీలు ఉన్నాయి. రోజుకు ఒక్కో పీహెచ్‌సీలో 50 నుంచి 100 మంది వరకు ఓపీ వస్తుండగా వారపు సంత రోజుల్లో ఆ సంఖ్య 200ల వరకు ఉంటుందని వైద్య సిబ్బంది చెబుతున్నారు. రోజుకు ఒక్కో పీహెచ్‌సీకి సుమారు 30 నుంచి 40 వరకు ఓపీలో జ్వరాల కేసులే నమోదవుతుండగా సీహెచ్‌సీల్లో మాత్రం 60 కేసుల వరకు జ్వర పీడితులు చేరుతున్నారు. సీతంపేటలో సోమవారం, బుధవారం మర్రిపాడు, గురువారం దోనుబాయి, శనివారం కుశిమి సంతలు జరుగుతాయి. ఆ యా సంతలకు వచ్చినప్పుడు వైరల్‌ జ్వరాలు వంటి వాటికి పీహెచ్‌సీలకు వెళ్లి ట్రీట్‌మెంట్‌ తీసుకుంటారు. ఆ సమయంలో పీహెచ్‌సీల్లో ఎక్కువ కేసులు నమోదవుతుంటాయి.

తగ్గుముఖం పట్టిన మలేరియా..
ప్రాణాంతకమైన మలేరియా పాజిటివ్‌ కేసులు ఈ ఏడాది ఐటీడీఏ పరిధిలోని 20 సబ్‌ప్లాన్‌ మండలాల్లో తగ్గాయి. గత ఏడాది ఇదే సీజన్‌లో ఆగస్టు నెల వరకు 137 మలేరియా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా ఈ ఏడాది ఇప్పటివరకు 67 కేసులు మాత్రమే నమోదవ్వడం గమనా ర్హం. 20 ట్రైబల్‌ సబ్‌ప్లాన్‌ మండలాల్లో 1256 గిరిజన గ్రామాలున్నాయి. వీటిలో హైరిస్క్‌ మలేరియా గ్రామాలు జిల్లాలో గత ఏడాది 584 గుర్తించారు. ఈ గ్రామాల్లో అత్యధికంగా మలేరియా కేసులు నమోదవుతున్నట్టు గుర్తించి మలేరియా నిర్మూలనా కార్యక్రమాలు చేపట్టగా ఆ సంఖ్య 445కు తగ్గింది. ప్రభుత్వం మలేరియా నిర్మూలనకు చర్యలు తీసుకుంటోంది.

ఇప్పటికే ఐటీడీఏ పరిధిలో 2 లక్షలకు పైగా దోమతెరలను పంపిణీ చేశారు. ఈ సంవత్సరం మరో 40 వేల దోమ తెరలు అవసరమని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. అలాగే లక్షా 50వేలకు పైగా గంబూషియా చేపలను మురికి కుంటల్లో వేశారు. 225 గ్రామాలకు ఇప్పటికే సింథటిక్‌ ఫైరాత్రిన్‌ అనే దోమల నివారణా మందును ఇళ్లల్లోనూ, ఆరుబయట స్ప్రే చేస్తున్నారు. అలాగే మురికి కాలువలు, చిన్నచిన్న చెరువుల్లో దోమల కారక లార్వాను నాశనం చేసే గంబూషియా చేపలను పెంచుతున్నారు. ఇవి దోమ లార్వాను తినేస్తాయి. దీంతో దోమలు వృద్ధి చెందకుండా చేయడానికి చర్యలు తీసుకుంటున్నారు. అలాగే ఆరోగ్య కేంద్రాల్లో లక్షకు పైగా ఆర్డీడీ కిట్లు మలేరియా నిర్ధారణ కిట్లు అందుబాటులో ఉంచారు. ఏసీటీ అనే మలేరియా నివారణ మాత్రలు కూడా ఉంచారు.

అప్రమత్తంగా ఉన్నాం..
ఏజెన్సీలో వ్యాధులపై అప్రమత్తంగా ఉన్నాం. జ్వర పీడిత కేసులు ఎక్కువగా ఉన్నాయి. ఎలాంటి వ్యాధులు వ్యాప్తి చెందినా మెడికల్‌ క్యాంపులు పెట్టడం జరుగుతుంది. టైఫాయిడ్, వైరల్‌ జ్వరాల వంటి కేసులు అధికంగా వస్తున్నాయి. వీటికి ట్రీట్‌మెంట్‌ ఇస్తున్నాం. వైద్య సిబ్బంది కొరత లేకుండా చూస్తున్నాం. మందులన్నీ అందుబాటులో ఉన్నాయి. 
– ఈఎన్‌వీ నరేష్‌కుమార్,  డిప్యూటీ డీఎంహెచ్‌ఓ

మలేరియా తీవ్రత తగ్గింది..
మలేరియా నిర్మూలనా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతోంది. ఇప్పటికే మొదటి రౌండు సింథటిక్‌ ఫైరాత్రిన్‌ స్ప్రేయింగ్‌ జరిగింది. రెండో రౌండు కూడా విస్తృతంగా చేస్తున్నాం. ఆవాస గ్రామాలతో పాటు వసతి గృహాల్లో సైతం స్ప్రేయింగ్‌ నిర్వహిస్తున్నాం. గత ఏడాదితో పోలిస్తే మలేరియా తగ్గుముఖం పట్టింది.
– శ్రీకాంత్, మలేరియా నివారణ కన్సల్టెంట్‌   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement