tribal agencies
-
ఈ పుట్టగొడుగు పొడిని మహిళలు ప్రసవసమయంలో తింటే..
ప్రస్తుతం ప్రపంచమంతా పెనిస్ మష్రూమ్స్ గురించే మాట్లాడుకుంటున్నారు. దీని శాస్త్రీయనామం ఫాలస్ రూబికండస్. ఇది స్టిన్క్హాన్ కుటుంబానికి చెందిన ఫంగస్. దీనిని 1811లో కనిపెట్టారు. భారత్, ఆస్ట్రేలియా, అమెరికా, చైనా, జపాన్, కొరియా, థాయ్‌లాండ్, ఘనా, కాంగో, కెన్యా, దక్షిణాఫ్రిక వంటి ఉష్ణమండల దేశాల్లో ఇవి ఎక్కువగా కనిపిస్తాయి. ఐతే దీనికి సంబంధించిన ఇమేజ్ను తాజాగా సైన్స్ అలర్ట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. ఏమిటి ఈ పుట్టగొడుగుల ప్రత్యేకత పెనిస్ పుట్టగొడుగులు ఎటువంటి మట్టిలోనైనా బతుకుతాయి. ఐతే మధ్యప్రదేశ్‌లోని ఆదివాసీలు మాత్రం ఈ పుట్టగొడుగులను జిరి-ఫిరి అని పిలుస్తారు. భరియా, బైగా ఆదివాసీల సంప్రదాయ ఔషధాల్లో ఇది ప్రముఖమైనది. ఈ పుట్టగొడుగులను టైఫాయిడ్, పేగు జ్వరాల నివారణకు ఔషధంగా వినియోగిస్తారు. చక్కెరతో ఈ పుట్టగొడుగులను బాగారుద్ది, ఎండబెట్టి పొడిచేస్తారు. ఈ పొడిని ప్రసవ సమయంలో మహిళలకు టీ స్పూను చొప్పున అందిస్తే సుఖ ప్రసవం జరుగుతుందట. అలాగే టైఫాయిడ్‌తో బాధపడుతున్నవారికి రోజుకు మూడు స్పూనుల చొప్పున పట్టిస్తే నయం అవుతుంది. ఈ విధంగా గిరిజనులు వివిధ రోగాలను నయంచేయడానికి పెనిస్ పుట్టగొడుగులను ఉపయోగిస్తుంటారు. చదవండి: ఐదేళ్లుగా వెతుకులాట.. దొరికిన గోల్డ్ ఐలాండ్.. లక్షల కోట్ల సంపద! మన దేశంలోనేకాకుండా, ఆస్ట్రేలియాలోని స్థానిక ఆదివాసీలు లైంగిక శక్తిని పెంచే ఔషధంగా దీనిని ఉపయోగిస్తారు. ఐతే దాని వాసన చాలా ప్రమాదకరమైనది. ఈ పుట్టగొడుగుల వాసన కీటకాలను ఆకర్షిస్తుంది. సాధారణంగా వర్షాల తర్వాత చాలా దేశాలలో పెరుగుతోంది. చదవండి: అందుకే కార్డియాక్ అరెస్ట్ సంభవిస్తుందట..! ఇలా చేస్తే ప్రాణాలు నిలుపుకోవచ్చు.. -
అడవిని హత్తుకున్న సంక్షేమం!
సాక్షి, అమరావతి: మారుమూల గిరిజన ప్రాంతంలో నివసించే బిడ్డిక అన్నాజీరావు గతంలో ప్రభుత్వ పథకం పొందాలంటే వ్యయ ప్రయాసలకు ఓర్చి 40 కి.మీ. వెళ్లి ధ్రువీకరణ పత్రాలు తెచ్చుకోవాల్సిందే. సచివాలయాల వ్యవస్థ ఏర్పాటుతో ఇప్పుడా దుస్థితి తప్పింది. ఒక్క వంతెన నిర్మాణంతో దాదాపు 160 గిరిజన గూడేలకు రహదారి అందుబాటులోకి వచ్చిందని సాలూరు మండలం మావుడి గ్రామ సర్పంచ్ పీడిక సుదర్శనదొర సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సచివాలయాలు, రైతు భరోసా కేంద్రం, నూతన పీహెచ్‌సీల ఏర్పాటుతో తమ గూడెం అభివృద్ధి వైపు పరుగులు తీస్తోందన్న సంతృప్తి కొట్టాలచెర్వు చెంచుగూడేనికి చెందిన పులిచర్ల ఈళ్లయ్య కళ్లలో కనిపిస్తోంది. తన కాఫీ తోటకు ఇన్నేళ్లకు ఆర్వోఎఫ్ఆర్ కింద భూమి పట్టా ఇచ్చారని పాడేరు మండలం కోట్లగరువు గ్రామానికి చెందిన ఒంటరి మహిళ, గిరిజనురాలైన జన్ని రాజులమ్మ కృతజ్ఞతలు తెలియచేస్తోంది. ఒక్క విజయనగరం, విశాఖ జిల్లాలోనే కాదు రాష్ట్రవ్యాప్తంగా గిరిజన ఏజెన్సీలన్నిటిలోనూ పట్టణాలకు ధీటుగా ఆదివాసీలకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయి. 2019 జూన్ నుంచి ఈ ఏడాది మే వరకు రెండేళ్లలో గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ప్రభుత్వం ఏకంగా రూ.14,658 కోట్లు ఖర్చు చేయడంతో వాటి ఫలితాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలోని 9 సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ(ఐటీడీఏ)ల పరిధిలో 16,068 గిరిజన జనావాసాలున్నాయి. పలు నగదు బదిలీ పథకాల ద్వారా 29.71 లక్షల మంది గిరిజనుల ఖాతాల్లోకి రూ.4,915 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం నేరుగా జమ చేసింది. నగదేతర బదిలీ పథకాల ద్వారా 17.11 లక్షల మందికి రూ.1,731 కోట్ల మేర లబ్ధి చేకూర్చింది. మొత్తం రూ.6,646 కోట్ల మేర ప్రయోజనం కలిగింది. గిరిజన ఉప ప్రణాళిక ద్వారా రూ.8,012 కోట్ల అభివృద్ధి పనులు చేపట్టడం గమనార్హం. గిరిజనోద్ధరణలో ప్రధానమైవి... గిరిజన ప్రాంతాల్లో వైద్య సదుపాయాలను మెరుగుపరిచేందుకు వైద్య కళాశాలల నిర్మాణంతోపాటు మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రుల ఏర్పాటుకు ప్రభుత్వం రూ.746 కోట్లు మంజూరు చేసింది. గిరిజనుల పాలిట శాపంగా మారిన డోలీల సమస్యకు శాశ్వత పరిష్కారంగా బైక్ అంబులెన్సులు తెస్తోంది. 2,652 మంది గిరిజన కమ్యూనిటీ హెల్త్ వర్కర్లకు (సీహెచ్‌డబ్ల్యూ) కేవలం రూ.400 మాత్రమే ఉన్న జీతాన్ని ఏకంగా రూ.4 వేలకు పెంచింది. ఉమ్మడి రాష్ట్రం నుంచి ఎస్సీ, ఎస్టీలకు కలిపి ఒకే కమిషన్ ఉండటంతో పూర్తి న్యాయం జరగడంలేదని గుర్తించి ప్రత్యేకంగా ఎస్టీ కమిషన్‌ను ఏర్పాటు చేసి ఛైర్మన్‌గా కుంబా రవిబాబును నియమించింది. గిరిజన రైతులకు భూ యాజమాన్య హక్కులను కల్పించేందుకు ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ (ఆర్వోఎఫ్ఆర్) ద్వారా 2.28 లక్షల ఎకరాలకు పట్టాలను పంపిణీ చేసి చరిత్ర సృష్టించింది. 165 కొత్త గిరిజన పంచాయతీలను ఏర్పాటు చేసి ప్రజాప్రతినిధులుగా వారే ఎన్నికయ్యేలా రిజర్వ్ చేస్తూ జీవో నెంబర్ 560 తెచ్చింది. 4,76,206 గిరిజనుల కుటుంబాలకు గృహావసరాలకు ఉచిత విద్యుత్ అందిస్తూ జీవో నెంబర్ 94 జారీ చేసింది. సాంకేతిక విద్యను అందుబాటులోకి తెస్తూ కురుపాంలో రూ.153 కోట్లతో ట్రైబల్ ఇంజనీరింగ్ కళాశాలకు శంకుస్థాపన జరిగింది. విశాఖలో ట్రైబల్ రీసెర్చ్ మిషన్ భవనం కరోనా కష్టకాలంలో గిరిజనులకు అండగా నిలిచిన జీసీసీకి కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇటీవల 5 అవార్డులను ప్రకటించింది. రెండేళ్లలో రూ.450 కోట్లతో విద్యా సంస్థల భవనాలు, గిరిజన ప్రాంతాల్లో రహదారులు నిర్మాణాన్ని ప్రభుత్వం చేపట్టింది. విశాఖ జిల్లా తాజంగిలో రూ.35 కోట్లతో గిరిజన సమరయోధుల మ్యూజియం, కాపులుప్పాడలో రూ.45 కోట్లతో అల్లూరి స్మారక మ్యూజియంను నిర్మించనున్నారు. విశాఖలో రూ.10 కోట్లతో ట్రైబల్ రీసెర్చ్ మిషన్ (టీఆర్ఎం) భవన నిర్మాణం పూర్తైంది. మన్యంలో బాక్సైట్ తవ్వకాలకు గత సర్కారు ఇచ్చిన అనుమతిని పూర్తిగా రద్దు చేసి ఆదివాసీలకు ఇచ్చిన మాటను సీఎం వైఎస్ జగన్ నిలబెట్టుకున్నారు. గర్వంగా చెప్పుకుంటాం.. ఆదివాసీల హక్కులు, రక్షణ కోసం పునరంకితమయ్యేలా ఆగస్టు 9వతేదీని అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవంగా 1994లో ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. ఏపీలో రెండేళ్లలో సాధించిన గిరిజనాభివృద్ధిని అంతర్జాతీయ గిరిజన దినోత్సవం రోజే కాదు.. ఎప్పుడైనా గర్వంగా చెప్పగలం. సీఎం జగన్ దార్శనికతతో గిరిజన ప్రాంతాలు కళకళలాడుతున్నాయి. – పాముల పుష్ప శ్రీవాణి, ఉప ముఖ్యమంత్రి -
మన్యంలో ముసురుతున్న జ్వరాలు
సాక్షి, సీతంపేట: మన్యం నూటొక్క డిగ్రీల జ్వరంతో మూలుగుతోం ది. తాజాగా కురుస్తున్న వానలకు గెడ్డల్లో కొత్త నీరు చేరి కలుషితమవుతోంది. ఈ నీటినే గిరిజనులు తాగడానికి ఉపయోగిస్తుండడంతో వారు జ్వరాల బారిన పడుతున్నారు. ప్రస్తుతం మన్యం పరిధిలోని ఏ పీహెచ్సీ చూసినా వైరల్, టైఫాయిడ్ వంటి జ్వరాల బాధితులే కనిపిస్తున్నారు. గిరిజన ప్రాంతాల్లో ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు ఊటబావుల్లో, గెడ్డల్లో నీరు చేరింది. ఈ నీటినే కొన్ని గ్రామాల్లో వినియోగించాల్సిన పరిస్థితి ఉంది. దీంతో టైఫాయిడ్ వంటి వ్యాధులు వస్తున్నాయి. దీనికి తోడు కొన్ని గిరిజన గ్రామాల్లో పారిశుద్ధ్యం కూడా క్షీణించడంతో వ్యాధులు వ్యాప్తి చెందుతున్నాయి. ఆస్పత్రులు కిటకిట.. ఐటీడీఏ పరిధిలో 27 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. ప్రాథమిక ఉప ఆరోగ్య కేంద్రాలు మరో 15 ఉన్నాయి. ఏరియా ఆస్పత్రులు 2, సీహెచ్‌సీలు 10 ఉన్నాయి. హైరిస్క్ ప్రాంతమైన సీతంపేట ఏజెన్సీలో సీతంపేట, దోనుబాయి, కుశిమి, మర్రిపాడు గ్రామాల్లో పీహెచ్‌సీలు ఉన్నాయి. రోజుకు ఒక్కో పీహెచ్సీలో 50 నుంచి 100 మంది వరకు ఓపీ వస్తుండగా వారపు సంత రోజుల్లో ఆ సంఖ్య 200ల వరకు ఉంటుందని వైద్య సిబ్బంది చెబుతున్నారు. రోజుకు ఒక్కో పీహెచ్‌సీకి సుమారు 30 నుంచి 40 వరకు ఓపీలో జ్వరాల కేసులే నమోదవుతుండగా సీహెచ్‌సీల్లో మాత్రం 60 కేసుల వరకు జ్వర పీడితులు చేరుతున్నారు. సీతంపేటలో సోమవారం, బుధవారం మర్రిపాడు, గురువారం దోనుబాయి, శనివారం కుశిమి సంతలు జరుగుతాయి. ఆ యా సంతలకు వచ్చినప్పుడు వైరల్ జ్వరాలు వంటి వాటికి పీహెచ్‌సీలకు వెళ్లి ట్రీట్మెంట్ తీసుకుంటారు. ఆ సమయంలో పీహెచ్‌సీల్లో ఎక్కువ కేసులు నమోదవుతుంటాయి. తగ్గుముఖం పట్టిన మలేరియా.. ప్రాణాంతకమైన మలేరియా పాజిటివ్ కేసులు ఈ ఏడాది ఐటీడీఏ పరిధిలోని 20 సబ్‌ప్లాన్ మండలాల్లో తగ్గాయి. గత ఏడాది ఇదే సీజన్లో ఆగస్టు నెల వరకు 137 మలేరియా పాజిటివ్ కేసులు నమోదు కాగా ఈ ఏడాది ఇప్పటివరకు 67 కేసులు మాత్రమే నమోదవ్వడం గమనా ర్హం. 20 ట్రైబల్ సబ్‌ప్లాన్ మండలాల్లో 1256 గిరిజన గ్రామాలున్నాయి. వీటిలో హైరిస్క్ మలేరియా గ్రామాలు జిల్లాలో గత ఏడాది 584 గుర్తించారు. ఈ గ్రామాల్లో అత్యధికంగా మలేరియా కేసులు నమోదవుతున్నట్టు గుర్తించి మలేరియా నిర్మూలనా కార్యక్రమాలు చేపట్టగా ఆ సంఖ్య 445కు తగ్గింది. ప్రభుత్వం మలేరియా నిర్మూలనకు చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే ఐటీడీఏ పరిధిలో 2 లక్షలకు పైగా దోమతెరలను పంపిణీ చేశారు. ఈ సంవత్సరం మరో 40 వేల దోమ తెరలు అవసరమని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. అలాగే లక్షా 50వేలకు పైగా గంబూషియా చేపలను మురికి కుంటల్లో వేశారు. 225 గ్రామాలకు ఇప్పటికే సింథటిక్ ఫైరాత్రిన్ అనే దోమల నివారణా మందును ఇళ్లల్లోనూ, ఆరుబయట స్ప్రే చేస్తున్నారు. అలాగే మురికి కాలువలు, చిన్నచిన్న చెరువుల్లో దోమల కారక లార్వాను నాశనం చేసే గంబూషియా చేపలను పెంచుతున్నారు. ఇవి దోమ లార్వాను తినేస్తాయి. దీంతో దోమలు వృద్ధి చెందకుండా చేయడానికి చర్యలు తీసుకుంటున్నారు. అలాగే ఆరోగ్య కేంద్రాల్లో లక్షకు పైగా ఆర్డీడీ కిట్లు మలేరియా నిర్ధారణ కిట్లు అందుబాటులో ఉంచారు. ఏసీటీ అనే మలేరియా నివారణ మాత్రలు కూడా ఉంచారు. అప్రమత్తంగా ఉన్నాం.. ఏజెన్సీలో వ్యాధులపై అప్రమత్తంగా ఉన్నాం. జ్వర పీడిత కేసులు ఎక్కువగా ఉన్నాయి. ఎలాంటి వ్యాధులు వ్యాప్తి చెందినా మెడికల్ క్యాంపులు పెట్టడం జరుగుతుంది. టైఫాయిడ్, వైరల్ జ్వరాల వంటి కేసులు అధికంగా వస్తున్నాయి. వీటికి ట్రీట్మెంట్ ఇస్తున్నాం. వైద్య సిబ్బంది కొరత లేకుండా చూస్తున్నాం. మందులన్నీ అందుబాటులో ఉన్నాయి. – ఈఎన్‌వీ నరేష్కుమార్, డిప్యూటీ డీఎంహెచ్ఓ మలేరియా తీవ్రత తగ్గింది.. మలేరియా నిర్మూలనా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతోంది. ఇప్పటికే మొదటి రౌండు సింథటిక్ ఫైరాత్రిన్ స్ప్రేయింగ్ జరిగింది. రెండో రౌండు కూడా విస్తృతంగా చేస్తున్నాం. ఆవాస గ్రామాలతో పాటు వసతి గృహాల్లో సైతం స్ప్రేయింగ్ నిర్వహిస్తున్నాం. గత ఏడాదితో పోలిస్తే మలేరియా తగ్గుముఖం పట్టింది. – శ్రీకాంత్, మలేరియా నివారణ కన్సల్టెంట్ -
మంచం పట్టిన మన్యం
సాక్షి, పలాస(శ్రీకాకుళం) : పలాస మండలం తర్లాకోట పంచాయతీలోని పలు గ్రామాల్లో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. పంచాయతీలోని కొఠారింగ్ తాళభద్ర గ్రామంతో పాటు పొత్రియ, దానగొర, హిమగిరి, గట్టుమీద ఊరు, అలాగే లొత్తూరు పంచాయతీలోని చినపల్లియా, పెద్ద పల్లియా, లొత్తూరు తదితర గ్రామాల్లో ఏ ఇంటికి వెళ్లినా విష జ్వరాలతో బాధపడుతున్న వారే కనిపిస్తున్నారు. మందస మండలంలోని పుట్టూరు, సాభకోట, కిల్లోయి, రామరాయి తదితర గ్రామాల్లో కూడా గిరిజనులు తరుచూ జ్వరాల బారిన పడుతున్నారు. బిక్కుబిక్కుమంటున్న గిరిబిడ్డలు పలాస మండల కేంద్రానికి సుమారు 10 కి.మీ దూరంలో ఉన్న తర్లకోట పంచాయతీలోని కొఠారింగ్ తాళభద్రలో దాదాపు అందరూ జ్వర పీడుతులే ఉన్నారు. వీరు తినడానికి తిండి లేక, తాగడానికి గుక్కెడు మంచి నీరు లేక అల్లాడుతున్నారు. గ్రామంలో తాగునీటి బోర్లు పనిచేయక నేల బావుల నీటినే తాగుతున్నారు. ఈ గ్రామానికి దగ్గరలో రెంటికోటలో ఉన్నటువంటి మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లేందుకు కూడా ఇక్కడి నుంచి రహదారి సదుపాయం లేదు. గత వారం రోజులుగా గ్రామంలో జ్వరాలు విజృంభిస్తున్నా కనీసం ఇంతవరకు ప్రభుత్వ వైద్యులు గ్రామానికి రాలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్న గ్రామం..సమస్యల గ్రామం మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి కొఠారింగ్ తాళభద్ర గ్రామంలో మొత్తం 45 ఇళ్లు, సుమారు 200 జనాభా ఉంటారు. ఈ గ్రామానికి తగిన రహదారి సదుపాయం లేదు. గ్రామంలో మౌలిక వసతులు గురించి ఎంత తక్కువగా మాట్లాడుతకుంటే అంత మంచిది. ప్రభుత్వ పాఠశాల, అంగన్వాడీ కేంద్రాలు లేవు. విద్యుత్ సదుపాయం అంతంతమాత్రం గానే ఉంది. గతేడాది వచ్చిన తిత్లీ తుఫాన్‌కు ప్రభావంతో ఇళ్లు మొత్తం ఎగిరిపోయినా కనీస సాయం అందలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి గ్రామానికి మౌలిక వసతులు కల్పిచాలని కోరుతున్నారు. సంచి డాక్టర్లే శరణ్యం ఈ గ్రామానికి ప్రభుత్వ వైద్యులు రాకపోవడం వల న ప్రస్తుతం ప్రైవేటు ఆర్ఎంపీలు వైద్య సేవలందిస్తున్నారు. అయితే ప్రైవేటుగా వైద్యం చేయిస్తుం డడం వలన అధికంగా ఖర్చులు అవుతున్నాయని గ్రామస్తులు వాపోతున్నారు. రెక్కాడితే గాని డొక్కాడని బతుకుల్లో అంత మొత్తంలో ఖర్చు పెట్టదెలా అంటూ నిట్టూరుస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందిం చి ప్రభుత్వ వైద్య సేవలందించాలని కోరుతున్నారు. పస్తులుండాల్సి వస్తోంది కూలి పనులు చేసుకొని బతికే కుటుంబం మాది. గత వారం రోజులుగా నేను నా పి ల్లలు తీవ్రమైన జ్వరంతో ఉండటం వలన ఉపాధి పనులకు వెళ్లలేక ఇంటికే పరిమితం అయ్యాము. దీనికి తోడు ప్రైవేటు డాక్టర్ వద్ద మందులు వాడడం వలన ఇప్పటివరకు రూ.4000 ఖర్చు అయ్యింది. అయినా జ్వరం తగ్గడం లేదు. వారం రోజులుగా పనులకు వెళ్లకపోవడం వలన పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. – సవర చెంచల, కొఠారి తాళభద్ర -
గిరిజన నిర్వాసితులకు ఇళ్ల కేటాయింపు
కుక్కునూరు: పోలవరం నిర్వాసిత గ్రామాలైన రామన్నగూడెం, అర్వపల్లి, మొద్దులగూడెం తదితర గ్రామాల గిరిజన నిర్వాసితుల కుటుంబాలకు, ఏ కుటుంబానికి ఏ ఇళ్లు ఇస్తున్నారో, ఆ ఇళ్లను మంగళవారం అధికారులు చూపించారు. రామన్నగూడెం గ్రామానికి చెందిన 93, అర్వపల్లి గ్రామానికి చెందిన 202, మొద్దులగూడెం గ్రామానికి చెందిన 41 గిరిజన కుటుంబాలకు రావికుంట గ్రామంలో పునరావాస కాలనీలను నిర్మిస్తున్నారు. అయితే ఆయా కుటుంబాల్లో ఎవరికి ఏ ఇళ్లు ఇస్తున్నారో చూపించాలని గిరిజన నిర్వాసితులు పలుమార్లు అధికారులను అడిగిన నేపథ్యంలో, మంగళవారం ఎవరికి ఏ ఇళ్ల స్థలాన్ని ఇస్తున్నారో రెవెన్యూ అధికారులు చూపించారు. దీంతో గిరిజనులు సంతోషం వ్యక్తం చేశారు. ఆర్ఐ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
పూర్తికాని తాగునీటి పథకాలు
► పూర్తికాని తాగునీటి పథకాలు ► గిరిజన తండాల్లో నీటిఎద్దడి ► పట్టించుకోని అధికారులు ► అవస్థలు పడుతున్న ప్రజలు ఏటూరునాగారం : ప్రజల దాహర్తిని తీర్చేందుకు తాగునీటి పథకాల కోసం ప్రభుత్వం లక్షలాది రూపాయలు వెచ్చిస్తున్నా అవి ఎందుకు పనికిరాకుండా పోతున్నాయి. తాగునీటి పథకాల పనులు పూర్తికాకపోవడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. 13వ ఆర్థిక సంఘం కోయగూడ ఎల్లాపురం గ్రామ పంచాయతీ పరిధిలోని రాంనగర్, లంబాడీ తండాల్లో రూ. 40 లక్షలు వెచ్చించి రెండు మంచినీటి ట్యాంకులను నిర్మించారు. లంబాడీతండాలో నిర్మించిన ట్యాంక్ నిర్మాణం పూర్తయినప్పటకీ దాని నుంచి నీరు నల్లాలకు సరఫరా కావడం లేదు. రాంనగర్లో చేపట్టిన ట్యాంకు పనులు అసంపూర్తిగా మిగిలిపోయాయి. తాగునీటి పథకాల ద్వారా ప్రజలందరికీ తాగునీరు అందిస్తున్నామని ఆర్డబ్ల్యూఎస్ అధికారులు చెబుతున్నా వాటి అమలు సవ్యంగా లేదు. ట్యాంకుల నిర్మాణం పూర్తయినా నల్లాల నుంచి తాగునీరు సరఫరా కాకపోవడంపై కాంట్రాక్టర్లు, అధికారుల పర్యవేక్షణ కరువైంది. కాంట్రాక్టర్లు చేపట్టిన పనులను పర్యవేక్షించకుండానే అధికారులు బిల్లులు మంజూరు చేశారు. సర్పంచ్ నివాసం ఉండే గ్రామమైన లంబాడీతండాలో సైతం సమస్యలు పేరుకుపోయి గ్రామస్తులు అవస్థలు పడుతున్నారు. శాశ్వత రోడ్లు లేకపోవడం, నిరుపయోగంగా మారిన తాగునీటి నల్లాలు, పనిచేయని చేతి పంపులతో మురుగు కాల్వల నిర్వహణ లేకపోవడం లాంటి సమస్యలతో లంబాడీతండా వాసులు నిత్యం అవస్థలు పడుతున్నారు. మారుమూల గ్రామాల అభివృద్ధిపై నాయకులు హామీలు హామీలుగానే నిలిచిపోతున్నాయని ఇప్పటికైనా అధికారులు పట్టించుకొని లంబాడీతండా, రాంనగర్ గ్రామాల్లోని సమస్యలను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు. తాగునీటికి తిప్పలు పడుతున్నాం నల్లాల నుంచి నీరు రాకపోవడంతో చేతి పంపుల వద్దకు గంటల తరబడి వేచి చూస్తున్నాం. ట్యాంకులు నిర్మించినా అవి ఒక్కటి కూడా పనిచేయడం లేదు. నాయకులను అడిగితే పట్టించుకోవడం లేదు. త్వరగా సమస్యలు పరిష్కరించి నీటి సరఫరా చేపట్టాలి – కోడికట్ల నాగమ్మ, రాంనగర్ అధ్వానంగా మారిన రోడ్లు చెత్తాచెదారంతో రోడ్లన్నీ అధ్వానంగా మారుతున్నాయి. రోడ్లు పెంటకుప్పలుగా మారి దుర్వాసన వెదజల్లుతున్నాయి. డ్రెయినేజీలు సరిగా లేకపోవడంతో వర్షాకాలం రోడ్లన్నీ బురదమయంగా మారుతున్నాయి. వీది దీపాలు వెలుగకపోవడంతో ఇబ్బంది అవుతోంది. దోమల మందు పిచికారి చేయడం లేదు – పోరిక శ్రీనివాస్