వైద్యం కోసం ఎదురుచూస్తున్న జ్వర పీడితులు
సాక్షి, పలాస(శ్రీకాకుళం) : పలాస మండలం తర్లాకోట పంచాయతీలోని పలు గ్రామాల్లో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. పంచాయతీలోని కొఠారింగ్ తాళభద్ర గ్రామంతో పాటు పొత్రియ, దానగొర, హిమగిరి, గట్టుమీద ఊరు, అలాగే లొత్తూరు పంచాయతీలోని చినపల్లియా, పెద్ద పల్లియా, లొత్తూరు తదితర గ్రామాల్లో ఏ ఇంటికి వెళ్లినా విష జ్వరాలతో బాధపడుతున్న వారే కనిపిస్తున్నారు. మందస మండలంలోని పుట్టూరు, సాభకోట, కిల్లోయి, రామరాయి తదితర గ్రామాల్లో కూడా గిరిజనులు తరుచూ జ్వరాల బారిన పడుతున్నారు.
బిక్కుబిక్కుమంటున్న గిరిబిడ్డలు
పలాస మండల కేంద్రానికి సుమారు 10 కి.మీ దూరంలో ఉన్న తర్లకోట పంచాయతీలోని కొఠారింగ్ తాళభద్రలో దాదాపు అందరూ జ్వర పీడుతులే ఉన్నారు. వీరు తినడానికి తిండి లేక, తాగడానికి గుక్కెడు మంచి నీరు లేక అల్లాడుతున్నారు. గ్రామంలో తాగునీటి బోర్లు పనిచేయక నేల బావుల నీటినే తాగుతున్నారు. ఈ గ్రామానికి దగ్గరలో రెంటికోటలో ఉన్నటువంటి మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లేందుకు కూడా ఇక్కడి నుంచి రహదారి సదుపాయం లేదు. గత వారం రోజులుగా గ్రామంలో జ్వరాలు విజృంభిస్తున్నా కనీసం ఇంతవరకు ప్రభుత్వ వైద్యులు గ్రామానికి రాలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
చిన్న గ్రామం..సమస్యల గ్రామం
మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి కొఠారింగ్ తాళభద్ర గ్రామంలో మొత్తం 45 ఇళ్లు, సుమారు 200 జనాభా ఉంటారు. ఈ గ్రామానికి తగిన రహదారి సదుపాయం లేదు. గ్రామంలో మౌలిక వసతులు గురించి ఎంత తక్కువగా మాట్లాడుతకుంటే అంత మంచిది. ప్రభుత్వ పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రాలు లేవు. విద్యుత్ సదుపాయం అంతంతమాత్రం గానే ఉంది. గతేడాది వచ్చిన తిత్లీ తుఫాన్‌కు ప్రభావంతో ఇళ్లు మొత్తం ఎగిరిపోయినా కనీస సాయం అందలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి గ్రామానికి మౌలిక వసతులు కల్పిచాలని కోరుతున్నారు.
సంచి డాక్టర్లే శరణ్యం
ఈ గ్రామానికి ప్రభుత్వ వైద్యులు రాకపోవడం వల న ప్రస్తుతం ప్రైవేటు ఆర్‌ఎంపీలు వైద్య సేవలందిస్తున్నారు. అయితే ప్రైవేటుగా వైద్యం చేయిస్తుం డడం వలన అధికంగా ఖర్చులు అవుతున్నాయని గ్రామస్తులు వాపోతున్నారు. రెక్కాడితే గాని డొక్కాడని బతుకుల్లో అంత మొత్తంలో ఖర్చు పెట్టదెలా అంటూ నిట్టూరుస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందిం చి ప్రభుత్వ వైద్య సేవలందించాలని కోరుతున్నారు.
పస్తులుండాల్సి వస్తోంది
కూలి పనులు చేసుకొని బతికే కుటుంబం మాది. గత వారం రోజులుగా నేను నా పి ల్లలు తీవ్రమైన జ్వరంతో ఉండటం వలన ఉపాధి పనులకు వెళ్లలేక ఇంటికే పరిమితం అయ్యాము. దీనికి తోడు ప్రైవేటు డాక్టర్ వద్ద మందులు వాడడం వలన ఇప్పటివరకు రూ.4000 ఖర్చు అయ్యింది. అయినా జ్వరం తగ్గడం లేదు. వారం రోజులుగా పనులకు వెళ్లకపోవడం వలన పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.
– సవర చెంచల, కొఠారి తాళభద్ర
Comments
Please login to add a commentAdd a comment