తెలంగాణకు ‘ఫుల్‌ ఫీవర్‌’.. డెంగీ, మలేరియాతో ఆస్పత్రులకు జనం... | Toxic Fevers And Seasonal Diseases Are Increased In Telangana | Sakshi
Sakshi News home page

తెలంగాణకు ‘ఫుల్‌ ఫీవర్‌’.. డెంగీ, మలేరియాతో ఆస్పత్రులకు జనం...

Published Thu, Sep 15 2022 1:32 AM | Last Updated on Thu, Sep 15 2022 1:32 AM

Toxic Fevers And Seasonal Diseases Are Increased In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రానికి జ్వరమొచ్చింది. ఇక్కడా, అక్కడా అని తేడా లేకుండా ఇంటింటా విషజ్వరాలు, సీజనల్‌ వ్యాధులతో జనం సతమతం అవుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో బాధితుల సంఖ్య పెరుగుతోంది. రాష్ట్ర వైద్యారోగ్యశాఖ నిర్వహిస్తున్న జ్వర సర్వేలోనే ఈ పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్‌సీ) నుంచి బోధనాస్పత్రుల దాకా రోజూ వేలాది మంది ఔట్‌ పేషెంట్లు క్యూకడుతున్నారు. ప్రైవేటు ఆస్పత్రులకు వెళుతున్నవారి సంఖ్య 
మరింత ఎక్కువగా ఉంటోంది. డెంగీ, మలేరియా, టైఫాయిడ్‌ వంటి కేసులూ నమోదవుతున్నాయి. 

వానలు.. దోమలతో.. 
ఈసారి తరచూ వానలు పడుతుండటం, మారిన వాతావరణ పరిస్థితులు, ఉష్ణోగ్రతలు తగ్గడం, అన్నిచోట్లా నీరు నిల్వ ఉండటం, పారిశుధ్య నిర్వహణ లోపం.. ఇవన్నీ కలిసి దోమలు స్వైర విహారం చేస్తున్నాయి. కలుషితాలు వ్యాపిస్తున్నాయి. దీనితో వైరల్‌ జ్వరాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. చాలా మంది గొంతు నొప్పి, జ్వరంతో ఆస్పత్రులకు వస్తున్నారని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులతో విష జ్వరాలు, సీజనల్‌ వ్యాధులు మరికొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. వాతావరణంలో మార్పుల కారణంగా న్యుమోనియా, దగ్గు, శ్వాస సంబంధ సమస్యలూ పెరుగుతున్నాయని అంటున్నారు. 

పెరుగుతున్న డెంగీ కేసులు 
అపరిశుభ్ర పరిస్థితులు, దోమల వ్యాప్తి కారణంగా డెంగీ, మలేరియా కేసుల సంఖ్య పెరుగుతోంది. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు 7 వేలకుపైగా డెంగీ కేసులు నమోదుకాగా.. ఇందులో ఒక్క ఆగస్టులోనే 3,602 కేసులు వచ్చినట్టు అధికారవర్గాలు చెబుతున్నాయి. ప్రైవేటు ఆస్పత్రుల్లో నమోదవుతున్న డెంగీ కేసుల వివరాలు సరిగా అందక ఈ సంఖ్య తక్కువగా కనిపిస్తోందన్న విమర్శలు కూడా ఉన్నాయి. 

గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో తీవ్రంగా.. 
విష జ్వరాలు, సీజనల్‌ వ్యాధుల తీవ్రత గ్రేటర్‌ హైదరాబాద్, చుట్టుపక్కల జిల్లాల్లో ఎక్కువగా కనిపిస్తోంది. ఉస్మానియా, గాంధీ, నల్లకుంట ఫీవర్‌ ఆస్పత్రులు సహా ఇతర ప్రభుత్వ ఆస్పత్రులు, బస్తీ దవాఖాలకు వచ్చే బాధితుల సంఖ్య బాగా పెరిగింది. పలు ఆస్పత్రుల్లో బెడ్లు రోగులతో నిండిపోయాయి. డెంగీ, మలేరియా, టైఫాయిడ్‌ కేసులూ నమోదవుతున్నాయి. ఒక్క మేడ్చల్‌ పరిధిలోనే 492 డెంగీ కేసులు వచ్చినట్టు జ్వర సర్వేలో వెల్లడైంది. ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకుని ప్రైవేటు, కార్పొరేట్‌ ఆస్పత్రులు దోపిడీకి తెరతీశాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

మూడు నెలలుగా తీవ్రత 
గత ఐదు నెలల్లో ప్రభుత్వ ఆస్పత్రులకు 49.67 లక్షల మంది ఔట్‌ పేషెంట్లు వచ్చారని వైద్యారోగ్యశాఖ బుధవారం వెల్లడించిన నివేదిక తెలిపింది. సగటున నెలకు 9.93 లక్షల ఓపీ నమోదైనట్టు పేర్కొంది. ముఖ్యంగా జూలై, ఆగస్టు, సెప్టెంబర్‌ నెలల్లో అధికంగా అనారోగ్యాల బాధితులు ఉన్నారని.. ఇందులో విష జ్వరాల కేసులు పెద్ద సంఖ్యలో ఉన్నాయని వైద్య వర్గాలు అంచనా వేస్తున్నాయి. 

ఎక్కడ చూసినా జ్వర బాధితులే.. 
నల్లగొండ జిల్లాలో విష జ్వరాల బాధితులతో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు నిండిపోతున్నాయి. అధికారికంగానే 56 మందే డెంగీ బారినపడ్డట్టు వైద్యశాఖ అధికారులు తెలిపారు. 

► కరీంనగర్‌ జిల్లాలో జనవరి నుంచి ఇప్పటివరకు 236 డెంగీ కేసులు వచ్చాయి. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధానాస్పత్రికి రోజూ 150 మంది వరకు విష జ్వరాల బాధితులు వస్తున్నట్టు వైద్యులు చెప్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో డెంగీ 38, వైరల్‌ జ్వరాలు 1,872 కేసులు నమోదయ్యాయి. జగిత్యాల జిల్లాలో ఈ ఒక్క నెలలోనే 188 డెంగీ కేసులు వచ్చాయి. పెద్దపల్లి జిల్లాలో రోజూ వందల్లో జ్వర బాధితులు ఆస్పత్రులకు వస్తున్నారు. 

► ఉమ్మడి మెదక్‌ జిల్లా పరిధిలోనూ సీజనల్‌ వ్యాధుల కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. సిద్దిపేట ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ ఆస్పత్రికి రోజూ 1,500 మందికిపైగా రోగులు వస్తున్నారని, అందులో విష జ్వరాల బాధితులు ఎక్కువగా ఉంటున్నారని వైద్యులు తెలిపారు. సంగారెడ్డి జిల్లాలో గత 15 రోజుల్లో 90 డెంగీ కేసులు వచ్చాయి. 

► విష జ్వరాలు ఉమ్మడి ఖమ్మం జిల్లాను హడలెత్తిస్తున్నాయి. ప్రతీ ఇంట్లో ఒకరైనా మంచం పట్టి కనిపిస్తున్నారు. జ్వర పీడితులతో ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్పత్రులు కిక్కిరిసిపోతున్నాయి. జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో బెడ్లు సరిపోక కింద పరుపులు వేసి చికిత్స అందిస్తున్నారు. జిల్లాలో ఈ ఏడాది ఇప్పటివరకు 547 డెంగీ కేసులు, 83 చికున్‌ గున్యా కేసులు వచ్చాయి.  

► ఉమ్మడి నిజామాబాద్‌ పరిధిలోనూ విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. గత నాలుగు నెలల్లో 86 డెంగీ కేసులు నమోదుకాగా.. వేల మంది వైరల్‌ జ్వరాల బారినపడ్డారు. 

► సీజనల్‌ వ్యాధులు, జ్వరాలతో ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి. వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రికి వస్తున్న వారిలో 10 శాతం మంది ఇన్‌ పేషెంట్లుగా చేరుతున్న పరిస్థితి ఉంది. పిల్లల వార్డులో బెడ్లు నిండిపోయాయి. ఒక్కో బెడ్‌పై ఇద్దరు, ముగ్గురు చిన్నారులను ఉంచి చికిత్స చేస్తున్నారు. జనగామ, మహబూబాబాద్, భూపాలపల్లి జిల్లాల్లో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లే బాధితుల సంఖ్య పెరుగుతోందని వైద్యవర్గాలు చెప్తున్నాయి.

మూడు రోజులుగా జ్వరంతో.. 
మా బాబు మహేశ్‌ వయసు ఎనిమిదేళ్లు. మూడు రోజులుగా తీవ్రంగా జ్వరం, జలుబుతో బాధపడుతున్నాడు. బాగా నీరసంగా ఉంటే ఈ రోజు ఆస్పత్రికి తీసుకొచ్చాం. వైరల్‌ జ్వరంలా ఉంది.. పరీక్షలు చేయించాలని వైద్యులు అంటున్నారు. 


– మహేశ్‌ తల్లి, ఉప్పల్‌

ప్రభుత్వ ఆస్పత్రిలో తగ్గక ప్రైవేటుకు వెళ్లాం 
డెంగీ రావడంతో వారం రోజుల క్రితం ఫీవర్‌ ఆస్పత్రిలో చేరి ఐదు రోజులు చికిత్స తీసుకున్నాను. ప్లేట్‌ లెట్స్‌ తగ్గిపోతూనే ఉన్నాయి. మా ఇంట్లోవాళ్లు ఆందోళనతో ఫీవర్‌ ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేయించి ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేర్పించారు. 


– సాయి కిరణ్‌ (20), బాగ్‌ అంబర్‌పేట

ఇదీ చదవండి: ‘గులాబీ’ బాస్‌కు తలనొప్పిగా మారిన ‘డాక్టర్‌’!

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement