వరద బాధితులు వ్యాధుల బారినపడకుండా చూసుకోవాలి
జ్వరం, ఒళ్లు నొప్పులు ఉంటే వెంటనే యాంటీబయోటిక్స్ వేసుకోవద్దు
జ్వర బాధితులు తొలి మూడు రోజులు పారాసెటమాల్, డోలో వాడాలి
వారంలో వైరల్ జ్వరాలు తగ్గిపోతాయి
శరీరంలో నీటి శాతం తగ్గకుండా ద్రవ పదార్థాలు తీసుకోవాలి
వైద్య నిపుణుల సూచనలు
సాక్షి, అమరావతి: ప్రస్తుతం వర్షాకాలం కావడంతో రాష్ట్రవ్యాప్తంగా మలేరియా, టైఫాయిడ్, డెంగీ, చికున్ గున్యా వంటి వైరల్ జ్వరాలు విజృంభిస్తున్నాయి. అతిసార (డయేరియా) వ్యాధి కూడా ఎక్కువగానే ఉంది. ప్రజారోగ్యం విషయంలో ప్రభుత్వం చేతులెత్తేయడంతో గత రెండు, మూడు నెలల నుంచి వైరల్ జ్వరాలతో ప్రజలు తల్లడిల్లుతున్నారు. కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందీ వీటి బారినపడుతున్నారు.
ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులు జ్వరపీడితులతో కిటకిటలాడుతున్నాయి. కాగా ఇప్పుడు భారీ వర్షాలకు వరదలు కూడా తోడయ్యాయి. దీంతో వరద ప్రభావిత ప్రాంత ప్రజలను వ్యాధులు బెంబేలెత్తిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ముంపు ప్రాంత ప్రజలు వ్యాధుల బారినపడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. ముంపు నేపథ్యంలో తాగునీరు కలుíÙతమై అతిసార (డయేరియా), కలరా, టైఫాయిడ్, చర్మ సంబంధిత వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉందంటున్నారు.
తాగే నీరు, ఆహారం విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. వీలైనంత వరకూ శుద్ధి చేసిన (ఆర్వో) నీటినే తాగాలని చెబుతున్నారు. లేకుంటే పంపు నీటిని కాచి చల్లార్చి తాగాలని పేర్కొంటున్నారు. కొద్ది రోజులుగా లోతట్టు ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండటంతో దోమల బెడద తీవ్రంగా ఉంటుందని.. ఈ నేపథ్యంలో ఇంట్లో, ఆరు బయట పరిశుభ్ర వాతావరణం ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
వైద్య నిపుణుల జాగ్రత్తలు ఇవే..
» నీటిని నిల్వ చేసే పాత్రలు శుభ్రపరచి, వాటిపై మూతలు ఉంచాలి.
»తాజా కాయగూరలు, వేడిగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి.
»నిల్వ ఉంచిన ఆహారాన్ని తీసుకోకూడదు.
» తినడానికి ముందు తప్పనిసరిగా చేతులు శుభ్రం చేసుకోవాలి.
»రోజుకు మూడు నుంచి నాలుగు లీటర్లు శుద్ధమైన నీటిని తాగాలి.
»తడిచిన బట్టలతో ఎక్కువసేపు ఉండకూడదు.
»శరీరం మొత్తాన్ని కప్పి ఉంచే దుస్తులు ధరించడంతో పాటు మాస్క్ పెట్టుకోవాలి.
»దోమల నుంచి రక్షణ కోసం దోమ తెరలు వినియోగించాలి.
»గర్భిణులు, చిన్న పిల్లలు తప్పనిసరిగా దోమతెరల రక్షణలో నిద్రించాలి.
» నాలుగైదు రోజులపాటు జ్వరం ఉంటే వెంటనే అప్రమత్తమై వైద్యులను సంప్రదించాలి. డెంగీ వచ్చినప్పుడు నాలుగైదు రోజులు జ్వర లక్షణాలు ఉంటాయి. ప్లేట్‌లెట్స్ పడిపోవడం సంభవిస్తుంది.
వైద్యులను సంప్రదించకుండా యాంటీబయోటిక్స్ వినియోగం వద్దు..
జ్వరం, ఒళ్లు, కీళ్ల నొప్పులు మొదలు కాగానే చాలామంది వైద్యులను సంప్రదించకుండా మందుల షాపుల్లో వాళ్లిచ్చే మందులు వాడుతుంటారు. ఇలా చేయొద్దని వైద్యులు సూచిస్తున్నారు. జలుబు, జ్వరం, ఒళ్లు నొప్పులు, నీరసం వంటి సమస్యలకు ఐబూప్రొఫెన్, డైక్లోఫెనాక్ వంటి యాంటీబయోటిక్స్‌ను మందుల షాపుల వాళ్లు ఇచ్చేస్తున్నారు.
జలుబు, ఫ్లూ వంటి వాటికి ఇవి పనిచేయవని వైద్యులు చెబుతున్నారు. అవసరం లేకుండా ఈ మందులను వాడితే కొత్త అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. వ్యాధులతో పోరాడే మంచి బ్యాక్టీరియా శరీరంలో ఉంటుంది. యాంటీబయోటిక్స్ విచ్చలవిడి వాడకంతో మంచి బ్యాక్టీరియాపై ప్రభావం పడుతుంది. దీంతో పాటు జీర్ణకోశ, ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఇన్‌ఫెక్షన్ సంభవిస్తే మందులు కూడా పనిచేయని పరిస్థితులు వస్తాయి.
జ్వరం మొదలుకాగానే ఆందోళన వద్దు
విష జ్వర బాధితులు యాంటీబయోటిక్స్ వాడాల్సిన అవసరం లేదు.. సాధారణ చికిత్సలతోనే నయమవుతుంది. బీపీ, షుగర్, ఇతర దీర్ఘకాలిక సమస్యలు లేనివారు మూడు రోజులు ఇంటి వద్దే ఉండి విశ్రాంతి తీసుకోవాలి.
జ్వరం, ఒళ్లు నొప్పులు తగ్గడానికి పారాసెటమాల్ వేసుకోవాలి. ముక్కు, కళ్లు కారడం, జలుబు వంటివి ఉంటే సిట్రిజెన్ వేసుకుంటే సరిపోతుంది. శరీరంలో నీటి శాతం తగ్గకుండా ద్రవ పదార్థాలు తీసుకోవాలి. ఈ జాగ్రత్తలు పాటించినా జ్వరం, ఇతర సమస్యలు తగ్గకపోతే వైద్యులను సంప్రదించాలి. – డాక్టర్ కళ్యాణ చక్రవర్తి, జ్వరాల వైద్య నిపుణులు, గుంటూరు
అనవసరంగా యాంటీబయోటిక్స్ వాడొద్దు
చిన్న పిల్లల్లో దగ్గు, జలుబు, జ్వరం వస్తే కంగారు పడొద్దు. మందుల దుకాణాల్లో వాళ్లిచ్చిన యాంటీబయోటిక్స్‌ను అనవసరంగా వాడొద్దు. పారాసిటమాల్, దగ్గు సిరప్‌లను రెండు రోజులు వాడి చూడాలి.
అయినప్పటికీ సమస్య తగ్గకపోతే వైద్యుడిని సంప్రదించాలి. నిల్వ ఉన్న నీటిలో పిల్లలు ఆడకుండా చూడాలి. కలుíÙత నీటిలో పిల్లలు సంచరిస్తే చర్మ సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంటుంది. విరేచనాలయ్యే పిల్లలకు మసాలా ఆహారం పెట్టొద్దు. బాలింతలు కూడా ఈ జాగ్రత్తలు పాటించాలి. – డాక్టర్ విఠల్ రావు, పిల్లల వైద్య నిపుణుడు, విజయవాడ
పరిశుభ్రత పాటించాలి
వరదల నేపథ్యంలో ఇంట్లో, వాష్ రూముల్లో చేరిన బురదను పూర్తిగా శుభ్రం చేసుకోవాలి. ఇంట్లో జలుబు, దగ్గు, జ్వర బాధితులుంటే వారు ఒక గదికి పరిమితం కావడం ఉత్తమం. మాస్క్ ధరించాలి. ఎక్కడపడితే అక్కడ నీరు తాగొద్దు. వీలైనంత వరకూ నీరు, తిండి విషయంలో పరిశుభ్రత పాటించాలి. – డాక్టర్ రఘు, సూపరింటెండెంట్, గుంటూరు
Comments
Please login to add a commentAdd a comment