మంత్రి సత్యకుమార్ యాదవ్
కూల్‌డ్రింక్ తాగి ఒకరు, కిడ్నీ సమస్యతో మరొకరు చనిపోయారన్న మంత్రి
మరోవైపు కాలనీలో కలుషిత తాగునీటి వల్ల డయేరియా వచ్చిందని వెల్లడి
డయేరియా వల్ల ఇద్దరు మృతిచెందారని గురువారం చెప్పిన అధికారులు
మంత్రి ప్రకటనపై బాధిత కుటుంబాల ఆగ్రహం
వెంకటేష్ మృతికి డయేరియానే కారణమన్న తల్లిదండ్రులు
అంజనాపురం కాలనీలో మృతుల ఇళ్లకు వెళ్లకుండానే మంత్రి పర్యటన
సాక్షి, నరసరావుపేట/దాచేపల్లి: ప్రజాసమస్యలు వెలుగులోకి రాకుండా ఏదోవిధంగా మాయచేయాలనే కూటమి సర్కారు పెద్దల ప్రయత్నాలు దారుణంగా మారాయి. మరణాలకు కారణాలను కూడా మార్చి చెప్పి ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. డయేరియా ప్రబలి ప్రజల ప్రాణాలు గాలిలో కలుస్తుంటే నివారణ చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం అందుకు భిన్నంగా అబద్ధాలతో మోసం చేయాలని చూస్తోంది.
పల్నాడు జిల్లా దాచేపల్లి నగరపంచాయతీ అంజనాపురం కాలనీలో డయేరియాతో బుధవారం రాత్రి ఇద్దరు మరణించారు. పదుల సంఖ్యలో ఆస్పత్రుల పాలయ్యారు. ఈ కాలనీలో ఇద్దరు డయేరియాతో మరణించలేదని శుక్రవారం అక్కడ పర్యటించిన రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ చెప్పడం అందరినీ ఆశ్చర్య పరిచింది. కాలనీలో మరణించిన తమ్మిశెట్టి వెంకటేశ్వర్లు అలియాస్ వెంకటేష్ అనే యువకుడు కూల్‌డ్రింక్ తాగి వికటించి మరణించాడని, వృద్ధుడు చినవీరయ్య కిడ్నీ సమస్యతో బాధపడి చనిపోయాడని మంత్రి చెప్పారు.
మరోవైపు అంజనాపురం కాలనీలో కలుషిత తాగునీటి కారణంగా డయేరియా ప్రబలిందన్నారు. 17 కేసులు నమోదయ్యాయని చెప్పారు. డయేరియా కారణంగానే ఇద్దరు మరణించారని గురువారం గుర్తించిన అధికారులు.. శుక్రవారం మంత్రి మాట మార్చడంతో అవాక్కయ్యారు.
వాంతులు, విరేచనాలతోనే చనిపోయాడు..
రోజూ కాలేజీకి వెళ్లే తమ కుమారుడికి అనారోగ్యం ఏమీ లేదని, వాంతులు, విరేచనాలతోనే చనిపోయాడని మృతుడు వెంకటేశ్వర్లు తల్లిదండ్రులు కృష్ణంరాజు, శివకుమారి చెప్పారు. తమ బిడ్డ కూల్‌డ్రింక్ తాగి చనిపోయాడని మంత్రి సత్యకుమార్ చెప్పడం దారుణమని వారు శుక్రవారం మీడియా ముందు అవేదన వ్యక్తం చేశారు. వాంతులు, విరేచనాలతో చనిపోతే కూల్‌డ్రింక్ తాగి చనిపోయాడని ఏలా చెబుతారని ప్రశ్నించారు.
తమ ఇంటికి వచ్చి తమతో మాట్లాడకుండానే ఈ విధంగా అబద్ధాలు చెప్పడం సరికాదన్నారు. తమ కుమారుడు బుధవారం రాత్రి 9 గంటలకు వాంతులతో బాధపడుతుంటే ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించామని, అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో విరేచనాలు కావటంతో నీరసించి కాళ్లు పట్టుకుపోయాయని చెప్పారు. నారాయణపురం ఆస్పత్రి నుంచి పిడుగురాళ్ల తీసుకెళితే ఆస్పత్రిలో చేర్చుకోలేదని, అక్కడినుంచి నరసరావుపేట వెళుతుండగా తమ కుమారుడు చనిపోయాడని కన్నీటితో తెలిపారు.
కేవలం వాంతులు, విరేచనాల కారణంగానే తమ బిడ్డను పొగొట్టుకున్నామన్నారు. చికిత్సకి సంబంధించిన పేపర్లను తీసుకెళ్లిన అధికారులు వాటిని తిరిగి ఇవ్వలేదని తెలిపారు. చనిపోయిన తమ బిడ్డపై నిందలు వేయవద్దని, న్యాయం చేయాలని వారు వేడుకున్నారు.
ఇల్లు ఇస్తామని ఆశపెడుతున్నారు..
తన కుమారుడి చావును ప్రభుత్వం తప్పుదోవపట్టించి ఇంటిని నిర్మించి ఇస్తామని ఆశపెడుతున్నారని, తన బిడ్డ చావుకు న్యాయం కావాలని మీడియా ముందు కృష్ణంరాజు వాపోయిన వీడియో వైరల్ అవుతోంది.
మృతుల ఇళ్లకు వెళ్లని మంత్రి
ఎమ్మెల్యేలు యరపతినేని శ్రీనివాసరావు, అరవింద్బాబుతో కలిసి కాలనీలో పర్యటించిన మంత్రి మృతుల ఇళ్లకు మాత్రం వెళ్లలేదు. ప్రభుత్వ వైఫల్యంపై బాధిత కుటుంబాల వారు ప్రశ్నిస్తారనే భయంతోనే వారి ఇళ్లకు వెళ్లలేదని తెలిసింది. మరణాలకు కారణాల గురించి తమను అడక్కుండానే మంత్రి ఇష్టం వచ్చినట్లు మీడియాతో వ్యాఖ్యానించి వెళ్లిపోయారని బాధితులు ఆవేదన చెందుతున్నారు. కలుషితమైన బోరుని పరిశీలించిన అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు.
గత ప్రభుత్వ పాపాలే తమకు శాపాలుగా మారాయన్నారు. జగన్ తన సొంత మీడియాలో ప్రచారం చేసుకున్నట్లుగా డయేరియా మరణాలు సంభవించలేదని చెప్పారు. గత ఐదేళ్లలో 10,30,575 మంది అతిసారం బారినపడగా గత ప్రభుత్వంలో ఒక్కరు కూడా బాధితులను పరామర్శించలేదన్నారు. విజయనగరం జిల్లా గుర్లలో అతిసారవ్యాధి వ్యాప్తి చెందితే తాము ఒక్క మరణం కూడా జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment