వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి..
ఎన్నికల హామీ మేరకు అన్ని కుటుంబాలకు వర్తింపజేయలేం
వైద్య శాఖ మంత్రి సత్యకుమార్
సాక్షి, అమరావతి: ఆరోగ్య బీమా(Health insurance) పథకాన్ని వచ్చే ఆర్థిక సంవత్సరంలో ప్రారంభిస్తామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. రూ.2.50 లక్షల వరకు వైద్య సేవలను బీమా పరిధిలోకి తెస్తామని చెప్పారు. ఇందుకోసం ఒక్కో కుటుంబానికి ప్రభుత్వం తరఫున రూ.2,500 చొప్పున ప్రీమియం చెల్లిస్తామన్నారు. శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో మంత్రి సత్యకుమార్ మీడియాతో మాట్లాడారు. ఎన్టీఆర్ వైద్య సేవ పథకంలోని 1.43 కోట్ల కుటుంబాలకు మాత్రమే ఆరోగ్య బీమా వర్తిస్తుందని చెప్పారు. ఎన్నికల హామీ మేరకు రాష్ట్రంలోని అన్ని కుటుంబాలకు బీమా వర్తింపజేస్తే ప్రైవేటు ఆస్పత్రులు మనుగడ సాగించడం కష్టమన్నారు.
మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల్లో విఫలమైన బీమా విధానాన్ని రాష్ట్రంలో ఎందుకు అమలు చేయాలనుకుంటున్నారని మీడియా ప్రశ్నించగా.. ఆయా రాష్ట్రాల్లో నిర్వహణ లోపాల వల్లే బీమా విధానం విఫలమైందని మంత్రి చెప్పారు. ఆ సమస్యలు ఇక్కడ తలెత్తకుండా చూస్తామని ధీమా వ్యక్తం చేశారు. రూ.2.50 లక్షల పైబడిన చికిత్సలను ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ ద్వారా అందిస్తామన్నారు. ఆరోగ్య ఆసరా పథకాన్ని కొనసాగించాలో, లేదో పరిశీలిస్తున్నామని చెప్పారు. కొత్త మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో ముందుకు తీసుకెళ్లడానికి ట్రాన్సాక్షన్ అడ్వైజర్‌ను ఎంపిక చేయాల్సి ఉందన్నారు. వచ్చే విద్యా సంవత్సరం కొత్త మెడికల్ కాలేజీల ప్రారంభం కోసం నేషనల్ మెడికల్ కమిషన్‌కు దరఖాస్తులు చేయబోమని మంత్రి స్పష్టం చేశారు. చైనాలో కొత్త వైరస్ గురించి వార్తలు వస్తున్నాయని.. అయితే అధికారికంగా ధ్రువీకరణ కాలేదన్నారు.
జేసీ.. నోరు అదుపులో పెట్టుకో!
టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి బీజేపీ నాయకులపై చేసిన వ్యాఖ్యలపై మంత్రి సత్యకుమార్ స్పందించారు. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని హెచ్చరించారు. ఆయనకు వైఎస్ జగన్‌పై అంత ప్రేమ ఉంటే.. ఆయన పంచనే చేరాలని సూచించారు. బీజేపీ ప్రభుత్వం తన బస్సులు తగలబెట్టిందని జేసీ ప్రభాకర్‌రెడ్డి చేసిన ఆరోపణలు
అర్థరహితమన్నారు.
వచ్చే వారంలో పింఛన్ లబ్ధిదారులకు స్క్రీనింగ్..
అనర్హులైన పింఛన్ లబ్ధిదారులను ఏరివేయడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోందని వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు పింఛన్ లబ్ధిదారులకు స్క్రీనింగ్ చేపట్టడానికి ప్రణాళిక రూపొందించామన్నారు. వచ్చే వారంలో వైద్యులు బృందాలుగా ఏర్పడి.. కదల్లేని స్థితిలో ఉన్న పింఛన్ లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి స్క్రీనింగ్ చేస్తారని తెలిపారు. ప్రతి బృందంలో ఆర్థో, జనరల్ మెడిసిన్, పీహెచ్‌సీ వైద్యుడు ఉంటారని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment